ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం తరువాత హంపిని వీడుతున్న విదేశీ పర్యటకులు

హంపి, కర్ణాటక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంపి 1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది.
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హంపీలో గతవారం పర్యటకులపై జరిగిన దాడి అక్కడి విదేశీ పర్యటకులలో భయం నింపింది. దీంతో వారంతా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.

ఈ నెల 6 రాత్రి ఇజ్రాయెల్ పర్యటకురాలు, ఒక హోమ్ స్టే నిర్వాహకురాలిపై కర్ణాటకలోని హంపిలో అత్యాచారం జరిగింది.

వారితో ఉన్న ముగ్గురు పురుషులపైనా దాడి జరగడంతో అందులో ఒకరు చనిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు మార్చి 6న రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలు చూడటానికి బయటికి వెళ్లారు. అదేసమయంలో అక్కడికి, ముగ్గురు దుండగులు వచ్చారు. పర్యటకులను డబ్బులు అడిగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ చోటుచేసుకుంది.

ఈ కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్‌గా మారింది. అంతేకాదు, దేశంలోని పర్యటకులలో భయాన్ని కలిగించింది.

ఒకప్పుడు విజయనగర రాజ్యానికి రాజధానిగా ఉన్న హంపి, తుంగభద్ర నది వెంబడి అందమైన రాతి శిథిలాలతో కూడిన ఓపెన్-ఎయిర్ మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది.

దీన్ని 1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

హంపి ప్రధాన శిథిలాల నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న సనపూర్ గ్రామంలో ఈ దాడి జరిగింది.

హంపి నుంచి నదికి అవతల ఉన్న సనపూర్ మిగతా ఊళ్లకు దూరంగా ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, యూరప్ నుంచి వచ్చిన చాలామంది పర్యటకులు సనాపూర్‌లోనే ఉంటారు. ఇక్కడ భారీ శిథిలాలు, ప్రసిద్ధ హిందూ ఆలయం కూడా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుంగభద్ర కాల్వ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ముగ్గురు పురుషులను తుంగభద్ర కాల్వలోకి తోసేశారని పోలీసులు తెలిపారు.

'రాజస్థాన్ వెళ్తున్నా'

ప్రతి సంవత్సరం దాదాపు లక్షకు పైగా విదేశీ పర్యటకులు హంపిని సందర్శిస్తారని కర్ణాటక టూరిస్ట్ గైడ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విరూపాక్ష వి హంపి చెప్పారు.

అయితే, ఘటన తర్వాత చాలామంది పర్యటకులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారని విరూపాక్ష చెప్పారు.

దాదాపు 90 శాతం మంది పర్యటకులు, ఎక్కువగా ఇజ్రాయెల్ వారు గురువారం నుంచి వెళ్లిపోయారని టూర్ గైడ్ సయ్యద్ ఇస్మాయిల్ బీబీసీతో చెప్పారు. బస చేసిన వారు గ్రూపులుగా ప్రయాణించాలని, ఒంటరిగా దూరంగా వెళ్లవద్దని ఆయన సూచించారు.

ఇజ్రాయెల్‌కు చెందిన తాలియా జిల్బర్(19) వంటి కొంతమంది పర్యటకులు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

''ఈ సంఘటన నిజంగా భయానకంగా ఉంది, మా భద్రతపై ఆందోళన చెందుతున్నాం. హోలీ పండుగ కోసం హంపిలో బస చేయాలనుకున్నాం. కానీ, ఇపుడు రాజస్థాన్‌కు బయలుదేరాలని నిర్ణయించుకున్నాం'' అని జిల్బర్ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాసంస్థకు చెప్పారు.

జిల్బర్ ఆదివారం తన ఐదుగురు స్నేహితులతో కలిసి బస చేసిన గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారు.

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి కూడా ప్రజలు ఆ ప్రాంతంలో రాత్రిపూట ప్రయాణించవద్దని హెచ్చరించారు.

హంపి, అత్యాచారం

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, రాత్రిపూట నక్షత్రాలను చూడటానికి పర్యటకులు బయటికి వచ్చారు.

అసలేం జరిగింది?

ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితులు ఐదుగురు కలిసి నక్షత్రాల వెలుగులు చూసేందుకు బయటికి వెళ్లారు.

అదే సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని వారిని అడిగారు. పెట్రోల్ దొరికే ప్రాంతానికి పర్యటకులు దారి చూపారు. తర్వాత, వంద రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దుండగులు.

వాళ్లెవరో తెలియకపోవడంతో మొదట ఇవ్వడానికి నిరాకరించారు. తర్వాత, ఒక పురుష టూరిస్టు వారికి 20 రూపాయలు ఇచ్చారు. అయినా కూడా ఆ దుండగులు గొడవకు దిగారు.

అనంతరం, ముగ్గురు పురుషు పర్యటకులను నది కాలువలో పడేసి, ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారని కొప్పల్ జిల్లా ఎస్పీ రామ్. అరసిద్ధి తెలిపారు.

ఇద్దరు పురుషులు సురక్షితంగా ఈదుకుంటూ బయటికి రాగలిగారు. కానీ, ఒడిశాకు చెందిన వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం అభియోగాలు నమోదు చేశారు. శనివారం ఇద్దరు అనుమానితులను అరెస్టు చేయగా, ఆదివారం తమిళనాడులో మూడో వ్యక్తిని అరెస్టు చేశారు.

కఠిన చట్టాలున్నా..

కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, దేశంలో మహిళలపై హింసాత్మక నేరాలు కొనసాగుతున్నాయి. 2012లో దిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య నిరసనలకు దారితీసింది.

2013లో కఠినమైన అత్యాచార చట్టాలకు దారితీసింది. అయితే, దేశంలో ఏటా పదివేల అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2022లో దాదాపు 32,000 అత్యాచారాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.

2023లో ఝార్ఖండ్ రాష్ట్రంలో బ్రెజిలియన్-స్పానిష్ పర్యటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.

బాధితురాలు, ఆమె భర్త వారి కథనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అయితే, తరువాత వారి పోస్ట్‌లను తొలగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)