నల్గొండ: అమృత - ప్రణయ్ కేసు దోషులకు శిక్షలు ఖరారు చేసిన కోర్టు, మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌తో సహా..

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
''కేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా, ఏ3 నుంచి ఏ8గా ఉన్న వారికి జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది'' అని పబ్లిక్ ప్రాసిక్యుటర్ దర్శనం నరసింహ మీడియాకు చెప్పారు.
కేసులో ప్రధాన నిందితుడు, ఏ1గా ఉన్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు.


ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
అసలేం జరిగింది?
పెరుమాళ్ల ప్రణయ్ కుమార్, తిరునగరు అమృత ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినవారు. ప్రణయ్ పదో తరగతి, అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. వారి పరిచయం తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ఇద్దరూ బీటెక్ పూర్తి చేశారు.
ప్రణయ్‌ది షెడ్యూల్డ్ కులానికి (మాల) చెందిన మధ్యతరగతి కుటుంబం. అమృతది వైశ్య సామాజిక వర్గం. ఇరువురి పెళ్లికి అమృత కుటుంబం ఒప్పుకోలేదు.
దీంతో 2018 జనవరి 31న హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు.
తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు ప్రయత్నాలు చేసినా ఆమె అందుకు అంగీకరించలేదు.
అమృత గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం ప్రణయ్, ఆయన తల్లి కలిసి అమృతను 2018 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత 1.30 ప్రాంతంలో ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో ప్రణయ్‌ను హత్య చేశాడు. ఇదంతా ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. హంతకుడు కత్తిని సమీపంలోనే పడేసి పరారయ్యాడు.
అంతకుముందు ,ఆగస్టు 22న కూడా ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కీ నిర్వహించినట్టు ప్రణయ్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల నుంచి తీసుకున్న ఫుటేజీలో గుర్తించారు.
ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
అమృత తండ్రి ఆదేశాలతోనే..
కులాంతర వివాహం చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించారని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.
కేసుకు సంబంధించి దాదాపు తొమ్మిది నెలల పాటు విచారణ చేసి, 2019 జూన్‌లో, దాదాపు 1600 పేజీలతో చార్జీషీటు దాఖలు చేశారు నల్గొండ పోలీసులు.
ఆ సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్న ఎ.వి.రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కేసులో తీర్పు వెల్లడైన తర్వాత మీడియాతో మాట్లాడారు.
''సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్, ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరాల ఎవిడెన్స్.. ఇలా అన్ని రకాల ఆధారాలతో ప్రణయ్ హత్య కేసులో చార్జీషీటు దాఖలు చేశాం. దాదాపు పది సార్లు చార్జీషీటు మెరుగుపరిచి పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించాం'' అని చెప్పారు రంగనాథ్.
పోలీసు చార్జీషీటు ప్రకారం, ఈ కేసులో ఏ1గా అమృత తండ్రి మారుతీరావును చేర్చారు పోలీసులు.
తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకుని, ప్రణయ్‌ను పథకం ప్రకారమే మారుతీరావు హత్య చేయించారని పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు.
అలాగే, ఈ కేసులో ఏ2గా సుభాష్ కుమార్ శర్మ, ఏ3గా అస్గర్ అలీ, ఏ4గా అబ్దుల్ బారి, ఏ5గా ఎంఏ కరీం, ఎ6గా తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ7గా సముద్రాల శివ, ఏ8గా నిజాంను చేర్చారు పోలీసులు.
ప్రణయ్‌పై సుభాష్ కుమార్ శర్మనే దాడి చేసి చంపినట్లుగా సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఏ3గా ఉన్న అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
శ్రవణ్ కుమార్ మారుతీరావు తమ్ముడు కాగా, శివ.. మారుతీరావు కారు డ్రైవర్‌గా పనిచేసేవారు.

ఫొటో సోర్స్, UGC
మారుతీరావు ఆత్మహత్య
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావును హత్య జరిగిన కొన్ని రోజులకే పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీరావు.. 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు ఆరేళ్లపాటు ప్రణయ్ హత్య కేసు విచారణ సాగింది.
పోలీసులు సమర్పించిన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షులు, ఇతర అన్ని ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది.
2025 మార్చి 10న నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు చెప్పింది.
హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించగా.. మిగిలిన నిందితులైన అస్గర్ అలీ, అబ్దుల్ బారి, ఎంఏ కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాంలకు జీవితఖైదు విధించినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ చెప్పారు.
''కులంతో కొట్టుమిట్టాడుతున్న వారికి తీర్పు ఒక చెంపపెట్టు'' అని అన్నారాయన.
అలాగే, ఈ తీర్పుపై నిందితులు ఎగువ కోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు. ఈ తీర్పు తర్వాత ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి ఆయన తల్లిదండ్రులు, బంధువులు నివాళులర్పించారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














