పుస్తకంలో రివాల్వర్ పెట్టుకొచ్చి, గ్యాంగ్ లీడర్‌పై కోర్టులోనే కాల్పులు

శ్రీలంక, కొలంబో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్యాంగ్ లీడర్ సంజీవ కుమారను కేసు విచారణ నిమిత్తం పోలీసులు కొలంబోలోని కోర్టుకు తీసుకొచ్చారు.
    • రచయిత, కో ఇవే
    • హోదా, బీబీసీ న్యూస్

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిపిన కాల్పుల్లో పేరుమోసిన గ్యాంగ్ లీడర్‌ సంజీవ కుమార సమరరత్నే చనిపోయారని, లాయర్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి కోర్టు హాలులోనే రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్‌ను పుస్తకంలోని పేజీలను చింపి, అందులో పెట్టుకుని ఓ మహిళ కోర్టు లోపలికి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నామని, ఆమె పరారీలో ఉన్నట్లు చెప్పారు.

గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార సమరరత్నేను కేసు విచారణ నిమిత్తం పోలీసులు భద్రత నడుమ కొలంబోలోని కోర్టుకు తీసుకొచ్చారు. సంజీవ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రివాల్వర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దేశంలో గత కొద్దికాలంగా కొన్ని గ్యాంగుల మధ్య జరుగుతున్న వరుస హత్యల్లో ఇదొకటి. గ్యాంగ్ వార్‌ను అదుపులోకి తెస్తామని పోలీసులు గట్టిగా చెబుతున్నప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి.

గణేముల్లె సంజీవ‌గా పేరుమోసిన గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార సమరరతన్నే 2023 సెప్టెంబర్‌లో అరెస్టయినప్పటి నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నారు.

డజనుకి పైగా పోలీసు అధికారుల భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన సంజీవనను పోలీసులు ఆస్పత్రికి తరలించారని, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు చెప్పారు.

కాల్పులు జరిపిన వ్యక్తి కోర్టు హాలు నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి అధికారుల ద్వారా, స్థానికి మీడియాలో వేర్వేరు పేర్లు బయటికొచ్చాయి. అయితే, ఆ వ్యక్తి వేర్వేరు పేర్లతో చెలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పుస్తకంలో రివాల్వర్ పెట్టి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్న మహిళను 25 ఏళ్ల పిన్‌పురా దెవాగే ఇషారా సెవ్వండిగా పోలీసులు గుర్తించారు. ఆమె గురించిన సమాచారం తెలియజేసిన వారికి రివార్డు ప్రకటించారు.

అనుమానితులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఒక పోలీస్‌తో పాటు వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ గ్యాంగుల హింసపై బుధవారం పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దీనిని 'ప్రధాన భద్రతా సమస్య'గా ప్రతిపక్ష ఎంపీ ఒకరు పేర్కొన్నారు.

అండర్ వరల్డ్ గ్యాంగ్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెల్త్, మాస్ మీడియా మంత్రి నలింద జయతిస్స అన్నారు. ఈ హింసను అరికడతామని మంత్రి నలింద డిసెంబర్‌లో హామీ ఇచ్చారు.

కాల్పుల ఘటనతో కోర్టు వద్ద భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో అధికారులు భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.

కాల్పుల నేపథ్యంలో, అలాంటి వ్యక్తులను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు సాయుధులైన గార్డులు రక్షణగా ఉండడంతో పాటు పలు భద్రతా చర్యలు చేపట్టేలా నిబంధనలు తీసుకొచ్చారు. సాధారణంగా సాయుధ భద్రతను కోర్టులోకి అనుమతించరని న్యాయశాఖ మంత్రి హర్షనా ననాయక్కర గురువారం చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో ఈ ఏడాది తొమ్మిది మంది మరణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)