‘తండేల్’లో ప్రేమికులు వీరే.. ఈ జంట కథే ఆ సినిమా

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లా కె. మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆ చిత్ర యూనిట్ చెప్పుకుంది.
కె. మత్స్యలేశం గ్రామస్థులు కొందరు వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీకి చిక్కడం, 14 నెలల తర్వాత రిలీజ్ కావడం, వారి కుటుంబాలు పడిన ఆవేదన అంతా ఈ చిత్రంలో చూపించారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ సినిమాతో తమ గ్రామం పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందని, ఇందులో ప్రధాన పాత్రలన్నీ కూడా తమ గ్రామస్థులవే కావడంతో ఇప్పుడు తమ గ్రామం, తాము చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయామని కె. మత్స్యలేశం గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.

తండేల్ సినిమాతో కె. మత్స్యలేశం గ్రామాన్ని తండేల్ గ్రామమంటూ అంతా చెప్పుకుంటున్నారు.
తండేల్ సినిమా మూల కథకు ఆధారమైన ఈ గ్రామంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.
అలాగే ఈ సినిమా, గ్రామంలో కొద్దిపాటి రాజకీయ వివాదాన్ని కూడా లేపింది.
ఇంతకీ తండేల్ అనే పదానికి అర్థమేంటి? తండేల్ గ్రామంగా పేరు పొందిన కె.మత్స్యలేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
గ్రామస్థులు తండేల్ సినిమా కథపై ఏమంటున్నారు? తండేల్ సినిమాతో రేగిన రాజకీయ వివాదమేంటో కూడా చూద్దాం.

తండేల్ అంటే...
తండేల్ సినిమా తర్వాత 'తండేల్' అంటే ఏంటని చాలా మంది తెలుసుకోవాలని అనుకున్నారు. ఇది తెలుగు పదం కాదు. గుజరాతీ పదం.
గుజరాత్‌కు చెందిన మత్స్యకారుల్లోని ఒక వర్గానికి చెందినదే తండేల్ అనే పదం. సముద్రంలో వేటకు వెళ్లే బృందానికి వీళ్లు నాయకత్వం వహిస్తుంటారు. వీరిని తండేల్ అని పిలుస్తుంటారు.
ఇలా తండేల్ అని పిలుచుకునే మత్స్యకారుల వద్దకే కె. మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు పనికి వెళ్తుంటారు. దాంతో ఈ తండేల్ అనే పదం ఈ గ్రామస్థులకు పరిచయమైంది. శబ్ధం కూడా ఆసక్తికరంగా ఉండటంతో వేటకు వెళ్లే తెలుగు మత్స్యకారులు కూడా తమ బృందానికి నాయకత్వం వహించే వ్యక్తిని 'తండేల్' అని పిలవడం అలవాటు చేసుకున్నారు.
ఇందులో జూనియర్ తండేల్, సీనియర్ తండేల్ అని కూడా ఉంటారు. వయసు, వేటకు వెళ్లే అనుభవం ఆధారంగా పిలుస్తుంటామని గత ఇరవై ఏళ్లుగా గుజరాత్‌లోని వేరావల్ తీరానికి వేటకు వెళ్తున్న సీనియర్ తండేల్ రామారావు బీబీసీతో చెప్పారు.
"గుజరాత్‌లో తండేల్ అంటే బోటుకి, అందులోని సభ్యులకు నాయకత్వం వహించేవాడు. వారి బాధ్యత మొత్తం ఆయనదే. గుజరాత్‌లోనే ఎక్కువ ఉండటంతో మాకు ఆ పదం అలవాటైపోయింది. ఇక్కడైనా అక్కడైనా నన్ను తండేల్ అనే అంటారు'' అని చెప్పారు తండేల్ రామారావు.
తండేల్ సినిమాలో ఈ రామారావు నిజ జీవిత పాత్రనే నాగచైతన్య, రామారావు భార్య నూకమ్మ పాత్రని సాయిపల్లవి పోషించినట్లు సినిమా బృందం ప్రకటించింది.

తండేల్ సినిమాకి ఆధారమైన కథ ఇక్కడ ఎలా మొదలైందంటే...
శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తుంటారు.
వేట సమయంలో జీపీఎస్ పని చేయకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో సముద్రంలో దారి తప్పి అప్పుడప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డర్లలో ప్రవేశించి అక్కడి కోస్ట్ గార్డు, నేవీలకు చిక్కి జైళ్ల పాలవుతుంటారు.
శ్రీకాకుళం జిల్లాలోని డి. మత్స్యలేశం పంచాయతీలోని కె. మత్స్యలేశం గ్రామంలో తండేల్ సినిమా కథ మొదలైంది.
ఇక్కడ నుంచి ఏటా ఫిషింగ్ సీజన్ (జులై-ఫిబ్రవరి) లో వందల మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరంలోని వేరావల్‌కు వలస వెళ్తుంటారు.
ఈ ఏడెనిమిది నెలలు కుటుంబాలకు దూరంగా అక్కడే ఉంటారు.
కె. మత్స్యలేశానికి చెందిన మత్స్యకారులు 2018 నవంబర్‌లో చేపల వేటకు గుజరాత్ వెళ్లారు. అక్కడి నుంచి అనుకోని పరిస్థితుల్లో 22 మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కారు.
ఇది గమనించిన కొందరు మత్స్యకారులు విషయాన్ని భారత అధికారులకు, వారి కుటుంబసభ్యులకు తెలిపారు.
పాకిస్తాన్ కోస్ట్ గార్డు అధికారులు తమకు చిక్కిన మత్స్యకారులను కరాచీ జైలుకి తరలించారు.
"మా ఆధార్ కార్డులు, సెల్‌ఫోన్లు తీసుకున్నారు. 14 నెలలు అక్కడి జైల్లోనే ఉన్నాం. తిరిగి వస్తామని అనుకోలేదు. ఎట్టకేలకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో 14 నెలల తర్వాత భారతదేశంలో అడుగుపెట్టాం. ఆ సమయంలో మా కుటుంబాలు, మేం పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. అదంతా సినిమాలో చూపించారు. జెట్టీలు కడితే ఇలా వలసకు వెళ్లి కష్టాలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉండవని ఈ సినిమా ద్వారా మరోసారి చెప్పారు. ప్రభుత్వాలు పట్టించుకుంటాయో లేదో మరి" అని మత్స్యకారుడు వి. రాము బీబీసీతో చెప్పారు.

తండేల్ తర్వాత గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే...
ఈ సినిమా షూటింగ్ జరుగకముందే కె. మత్స్యలేశం మత్స్యకారులతో మాట్లాడేందుకు హీరో నాగచైతన్య, చిత్ర బృందం ఇక్కడికి రావడంతో కె. మత్స్యలేశం గ్రామం ఫోకస్‌లోకి వచ్చింది.
సినిమా విడుదల తర్వాత కె. మత్స్యలేశం గ్రామంలో కాస్త హుషారైన వాతావరణం కనిపించింది.
అక్కడక్కడ నాగచైతన్యతో మత్స్యకారులున్న బ్యానర్లు కనిపించాయి. ఈ సినిమా ద్వారా తమ గ్రామం అందరికీ తెలిసిందంటూ దాదాపు గ్రామంలోని మత్స్యకారులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"సినిమా చూసి నేను హ్యపీగా ఫీలయ్యాను. మా మత్స్యకారుల రియల్ స్టోరీ. మా మారుమూల గ్రామం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా వచ్చిదంటే గ్రేట్ కదా" అని బీబీసీతో నూకమ్మ చెప్పారు. తండేల్ సినిమాలో ఈమె పాత్రనే సాయిపల్లవి పోషించారు.
"మా చుట్టుపక్కల గ్రామాలతో పాటు, శ్రీకాకుళం వెళ్లినా కూడా రియల్ తండేల్, రియల్ సాయిపల్లవి అంటున్నారు. మాతో పాటు పాకిస్తాన్‌లో చిక్కుకున్న మత్స్యకారులందర్నీ హీరోలంటూ మాట్లాడుకుంటున్నారు" అని నూకమ్మ చెప్పారు.

సినిమాతో వెలుగులోకి...
ఈ సినిమా ద్వారా గ్రామానికి, తమకు కాస్త పేరు వచ్చిందని కొందరు మత్స్యకారులు అన్నారు. అయితే, తమకు కావాల్సింది అది కాదని వారు అంటున్నారు. అప్పన్న అనే మహిళ బీబీసీతో మాట్లాడుతూ ఏమన్నారంటే...
"పాకిస్తాన్‌కు చిక్కినప్పుడు, విడుదలైనప్పుడు ప్రభుత్వాలు... ఇప్పుడు సినిమా కోసం నటులు ఎంతో కొంత సాయం చేశారు. కానీ, అసలు వేట కోసం గుజరాత్ లేదా వేరే దేశం ఎందుకు వెళ్లాలి? జెట్టీలు కడితే మా ఊరిలోనో, పక్కనో వేట చేసుకుంటాం కదా?
సినిమా తీశారని మీరంతా మా ఊరు వస్తున్నారు. కానీ, మా ఊర్లో ఏముందసలు? మీరు చూశారు కదా... మూడు పూటలు తిని, మంచి బట్ట కట్టినోళ్లు బాగా ఉన్నోళ్ల కిందే లెక్క ఇక్కడ. కానీ, ఆ పరిస్థితి మా ఊర్లో లేదు. పేద బతుకులు మావి'' అన్నారు అప్పన్న.
''సినిమా పక్కన పెట్టండి. జెట్టీలు నిర్మించి వలసలు ఆరికడతామని గతంలో చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ అందరూ మాటిచ్చారు. ఎవరైనా కనికరించి, జెట్టీలు కడితే ఇక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని'' మత్స్యకారుడు రామారావు అన్నారు.

'తండేల్' తో రాజకీయం
కె. మత్స్యలేశం మత్స్యకారులు పాకిస్తాన్‌కు చిక్కినప్పుడు (2018 నవంబర్) టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారు విడుదలైనప్పుడు (2020 జనవరి) వైసీపీ అధికారంలో ఉంది.
ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తమ విడుదలకు ఎంతో సహాయం చేశాయని, అలాగే కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నాయని మత్స్యకారులు చెప్తున్నారు.
కానీ, వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసేందుకు కృషి చేసిందని, దానిని సినిమాలో చూపించలేదని కొందరు గ్రామస్థులు అంటున్నారు.
అప్పుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే వీరి విడుదల సాధ్యమైందని మరి కొందరు అంటున్నారు.
ఈ విషయంలో మాత్రం గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడటం కనిపించింది. ఇదే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అసలు జెట్టీ అంటే ఏంటి?
జెట్టీ అనేది తీరప్రాంతాన్ని అలల ప్రవాహం, అటుపోట్ల నుంచి రక్షించే ఒక నిర్మాణం. మత్స్యకారుల బోట్లను లంగరు వేసుకునేందుకు నిర్మించే జెట్టీలు సాధారణంగా రాయి లేదా కాంక్రీటుతో నిర్మిస్తారు. అవి తీరం నుంచి సముద్రపు నీటిలోకి నిర్మిస్తారు.
గుజరాత్, కేరళ, తమిళనాడులోని తీరప్రాంతాల్లో ప్రతి 20, 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉంటుందని, శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే విశాఖపట్నం దాటిన తర్వాత మళ్లీ ఎక్కడ జెట్టీ లేదని మత్స్యకారులు చెప్పారు.
"జెట్టీ లేకపోతే అలలు, ఆటుపోట్ల వల్ల వేటలో ఉన్న పడవలు తిరగబడి, చనిపోయిన సంఘటనలు చాలా చూశాం. జెట్టీ ఉంటే అలాంటి పరిస్థితి రాదు. వానొచ్చినా, తుపానొచ్చినా మా పడవలు అన్నింటిని జెట్టీ దగ్గరే కట్టేసుకొవచ్చు. అది లేకపోవడం వల్ల తుపాన్ల సమయంలో మా బోట్లు ధ్వంసమైపోతున్నాయి. గుజరాత్‌లో అయితే ఎక్కడికక్కడ జెట్టీలుంటాయి" అని మత్స్యకారుడు నూకరాజు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














