జ్యోతి, వహీద్‌ల ప్రేమ కథ: మతాంతర వివాహం చేసుకుంటే చంపేస్తానన్న కుటుంబమే ఎలా దగ్గరైంది?

- రచయిత, గౌతమి ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1992. బాబ్రీ మసీదు కేంద్రంగా మత ఘర్షణలు తీవ్రంగా నడుస్తున్న సమయం. అప్పటివరకు అన్నదమ్ముల్లా మెలిగిన హిందూ ముస్లింలు కూడా ఒకరిపై ఒకరు అకారణంగా ద్వేషం పెంచుకుంటున్న రోజులు.అలాంటి సమయంలో పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, వహీద్.
జ్యోతి రెడ్డి కులానికి చెందినవారు. వహీద్ ముస్లిం అబ్బాయి. జ్యోతి , వహీద్ కుటుంబాలు తరతరాల నుంచే స్నేహితులు. ఇద్దరి స్వస్థలం నల్లగొండే అయినా ఇద్దరూ పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే.
జ్యోతి కుటుంబం ఎల్ బీ నగర్‌లో ఉండేది. వహీద్ ఫ్యామిలీ పాతబస్తీలో ఉండేది. వహీద్ కుటుంబం రెండేళ్లపాటు ఎల్‌బీనగర్‌లో జ్యోతి వాళ్ల ఇంటి పక్కనే ఉన్నారు. ముందు నుంచి ఒకరికొకరు తెలిసినా, ఆ రెండేళ్లలో వారి పరిచయం మంచి స్నేహంగా మారింది. అప్పటికి జ్యోతికి 18ఏళ్లు. వహీద్‌తో మాట్లాడుతూ సమసమాజం గురించి తెలుసుకుంటున్న రోజులవి.


జ్యోతి, వహీద్ పరిచయం, ప్రేమ
జ్యోతి వాళ్ల ఇంట్లో పద్ధతులు, పట్టింపులు కాస్త ఎక్కువే. కానీ ఆమె మాత్రం స్వతంత్ర భావాలుగల అమ్మాయి. సాధారణ హిందూ కుటుంబాలలానే వాళ్ల ఇంట్లో ఉండే కాలం చెల్లిన సంప్రదాయాలు, పద్ధతుల పట్ల ఆమెలో కొంత వ్యతిరేకత ఉండేది. సమాజం ఈ కట్టుబాట్ల నుంచి ఎప్పుడు బయటపడుతుందో అనే ఆలోచన తనని వెంటాడేది.
ఎప్పడూ ఎంతో గంభీరంగా కనిపించే నాన్న.. అక్క పెళ్లిలో తన కన్నా వయసులో ఎంతో చిన్నవాడైన వ్యక్తి కాళ్లు కడుగుతుంటే చూసి చాలా చిరాకుపడ్డారు జ్యోతి. ''ఎప్పుడూ ఎవరికీ తలవంచని నాన్న ఇలా అల్లుడి కాళ్లు కడగడమేమిటి? నేను మాత్రం ఇలాంటి పెళ్లి చేసుకోను, చేసుకుంటే రిజిస్టర్ వివాహమే చేసుకుంటా'' అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నారామె.
వహీద్ ముస్లిం అయినా, చదువుకునే క్రమంలో నాస్తికునిగా మారారు. కులమతాల కన్నా సైన్స్‌ను, శాస్త్రీయ భావాలను నమ్మారు.
తను పుట్టిపెరిగిన మతం పేరులోనే తప్ప వహీద్ ఆలోచనలలో, ఆచరణలో ఎప్పుడూ లేదు. మతం కన్నా మనుషులు ముఖ్యమనేది బలంగా నమ్మారు వహీద్.
ఈ అభిప్రాయాలు కలవడం వల్లనే జ్యోతి వహీద్‌ను ఇష్టపడ్డారు. సంప్రదాయాలకు ప్రాణం పెట్టే జ్యోతి ఇంట్లో వాళ్ల ప్రేమని అంగీకరించడం అంత ఆషామాషీ కాదని ఆమెకు బాగా తెలుసు.
కానీ ఆమె తన ఆలోచనలకు, స్వంతంత్ర భావాలకు సరిపోయే వ్యక్తి వహీద్ అని ఆమె నిర్ణయించుకున్నారు.
సోషలిజం, కమ్యూనిజం, మానవ సంబంధాలు అంటూ ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకుంటున్న సమయంలో.. జ్యోతి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగారు వహీద్. సమాధానంగా..త్వరలోనే అన్నారు జ్యోతి.

ఇంట్లో చంపేస్తామని బెదిరింపులు
కొద్ది రోజులకే విషయం ఇంట్లో తెలిసింది. అసలే బాబ్రీ మసీదు గొడవలు తీవ్రంగా జరుగుతున్న సమయం. ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలుసు. అయినా ప్రయత్నించి చూశారు జ్యోతి. వహీద్ మీద తనకున్న ఇష్టాన్ని చెప్పడంతోనే ఆమె ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది.
అల్లారుముద్దుగా పెంచిన నాన్న తనపై మొదటిసారి చెయ్యెత్తారు. బాగాకొట్టారు. ఆయనకు బాబాయి కూడా జతకలిశారు. రెండు నెలలపాటు ఇంట్లోనే బంధించారు. కనీసం రోడ్డు మొహం కూడా చూడనివ్వకుండా ఖైదు చేశారు. ఈ పెళ్లి చచ్చినా జరగదని కరాఖండిగా చెప్పేశారు.
అంతేకాదు, జ్యోతికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. మాట వినకపోతే వహీద్‌ను చంపేస్తామని బెదిరించారు.
వహీద్ కుటుంబంతో ఆమె కుటుంబానికున్న స్నేహ సంబంధాలు క్షణాల్లో మాయమయ్యాయి. వీరి ప్రేమ... కుటుంబాల మధ్య ఓ అడ్డుగోడ కట్టింది.
జ్యోతి కుటుంబం అప్పటికే ఆర్థికంగా బలమైన కుటుంబం. దీంతో వహీద్ కుటుంబం కూడా భయపడింది. అందరూ ప్రశాంతంగా బతకాలంటే జ్యోతిని మర్చిపోవాలంటూ వహీద్‌పై ఒత్తిడి తెచ్చారు.
కానీ వహీద్‌కు మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గి తనను ఇష్టపడిన అమ్మాయిని వదిలేయడం సరికాదనిపించింది.
అటు జ్యోతికి ఇంట్లో కూడా వేధింపులు ఎక్కువయ్యాయి. ఓ సందర్భంలో ఇంత బాధ పడేకన్నా అమ్మానాన్నలు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచిది కదా అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా వహీద్‌ను మర్చిపోవడం తన వల్ల కాలేదంటారు జ్యోతి.

కమ్యూనిస్టు,బీజేపీ మిత్రుల సాయం
రెండు నెలల తర్వాత ఓ తెల్లవారు జామున జ్యోతి ఇంట్లోంచి బయటపడ్డారు. కొన్నాళ్లు స్నేహితుల ఇంట్లో తలదాచుకున్నారు. జ్యోతి తల్లిదండ్రులు వారి జాడ కనిపెట్టే ప్రయత్నంలో ఉండటంతో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతూ పెళ్లి ప్రయత్నాలు చేశారు.
రిజిస్టర్డ్ మ్యారేజ్ కోసం రెండు సార్లు ప్రయత్నించినా ముందే తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వెనకడుగు వేశారు. మూడు విఫలయత్నాల తర్వాత కుల నిర్మూలన సంఘం సాయంతో పోలీసు రక్షణ మధ్యన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు జ్యోతి, వహీద్.
వాళ్లిద్దరూ ఒక్కటి కావడానికి వాళ్ల కమ్యూనిస్టు స్నేహితులతో పాటు అప్పట్లో బీజేపీలో పనిచేస్తున్న కొందరు స్నేహితులు కూడా అండగా నిలిచారన్నారని గుర్తుచేసుకున్నారు జ్యోతి. అప్పటి వరకు ఇద్దరినీ చంపేస్తామన్న కుటుంబం వీళ్ల పెళ్లి విషయం తెలిసిన తర్వాత జ్యోతి ఇక తమకు లేదనుకుని నీళ్లొదిలింది.
అప్పటికి వహీద్ఆ ర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. అరకొర జీతం. తినీతినకుండా గడిపిన రోజులు. అయినా ఒకరి చేయి మరొకరు వదలలేదు. కష్టమైనా నష్టమైనా కలిసి ముందడుగేశారు. వచ్చిన ప్రతి కష్టాన్ని కలిసి ఎదుర్కొన్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడటానికి అడుగు ముందుకేశారు. పెళ్లి కారణంగా జ్యోతి ఇంటికే పరిమితం కాకూడదనుకున్నారు వహీద్. రోజు గడవడానికి కష్టంగా ఉన్న సమయంలో ఓ 500 రూపాయలు అప్పు చేసి స్క్రీన్ ప్రింటింగ్ ప్రారంభించారు.
శ్రామిక విద్యాపీఠ్‌లో డీటీపీ నేర్చుకున్నారు. తరువాత సొంతంగా డీటీపీ చేయడం ప్రారంభించారు జ్యోతి. అదే సమయంలో ఓ ప్రైవేట్ పబ్లిషర్ దగ్గర ఆమెకి ఉద్యోగం దొరికింది. ఓ మూడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత లక్ష రూపాయల లోన్‌తో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు.
ఇద్దరు చిన్నపిల్లలు, ఇంటిపనులు, కొత్తగా ప్రారంబించిన పబ్లిషింగ్‌తో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు జ్యోతి, వహీద్. ఈ క్రమంలో వహీద్ ఆర్టీసీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి పబ్లిషింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర పాఠ్య పుస్తకాల ప్రచురణతో రూ. 500 నుంచి మొదలై నాలుగు కోట్ల యూనిట్‌ను స్థాపించగలిగామని చెప్పారు జ్యోతి.

మతం ఎప్పుడూ సమస్య కాలేదు
మతాలు వేరైనా ఎప్పుడూ ఒకరి అభిప్రాయాలు మరొకరి మీద రుద్దే ప్రయత్నం చేయలేదు. వహీద్ నాస్తికుడు కావడంతో సైన్స్ తప్ప మరే నమ్మకాలు లేవు. దేవుడిని నమ్మినా తనకు మితిమీరిన విశ్వాసాలు, మూఢనమ్మకాలు లేవన్నారు జ్యోతి.
అత్తింటి వారినుంచి కొన్ని సార్లు మతం మార్చుకోమంటూ, ముస్లిం మతాన్ని ఆచరించడం నేర్చుకోవాలంటూ ఒత్తిడి వచ్చినా వహీద్ మాత్రం సమాజం కోసం కాకుండా తనకి నచ్చినట్టు తనని బతకమని చెప్పేవారు.
మొదట్లో ఇవన్నీ కష్టంగా అనిపించినా తర్వాత పరిస్థితులు మెల్లగా సర్దుకున్నాయి. అత్తింటివారు కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారని చెప్పారు జ్యోతి.
అప్పటికి జ్యోతికి పాప పుట్టి నాలుగేళ్లు. పుట్టింటితో ఎలాంటి సంబంధాలు లేవు. తన తల్లిదండ్రులకు వహీద్ మీదున్న వ్యతిరేకత తెలుసు కనుక జ్యోతి కూడా ఎప్పడూ ఇంటికి వెళ్లాలనుకోలేదు.
ఓ రోజు అమ్మకి అరోగ్యం పాడైందని, వచ్చి ఒకసారి చూసి వెళితే బాగుంటుందని దగ్గరి బంధువు ఒకరు చెప్పడంతో జ్యోతి పెళ్లయిన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్లారు. అమ్మ మనసు కరిగింది. ఇన్నాళ్లు నీకు నేను గుర్తురాలేదా అంటూ తల్లి జ్యోతిని పట్టుకుని ఏడ్చారు.
జ్యోతి వాళ్ల నాన్న కూడా కూతురిని చూసి సంతోషించారు. కానీ నాన్న తన బిడ్డను కాబట్టి నన్ను మాత్రమే దగ్గరికి తీసుకోగలిగారు అంటారు జ్యోతి.
తన పిల్లలను మాత్రం మనవలుగా అంగీరించలేకపోయారని, ఏ రోజూ తన పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దాడలేదని చెబుతారు. కారణం కేవలం మతం మాత్రమే.
తన కుటుంబం వహీద్‌ను ఎంతగా ఇష్టపడినా ముస్లిం కావడంతో ఆ ఇష్టాన్ని బంధంగా మార్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారంటారు జ్యోతి.
తల్లి మనసు కరిగినా తండ్రి మనసు మాత్రం చివరి క్షణం వరకు మతం పట్ల తనకున్న వ్యతిరేకతను అలాగే ఉంచుకుంది.

జ్యోతి కుటుంబం వైఖరిలో మార్పు
జ్యోతి వహీద్‌ల పెళ్లైన పద్నాలుగేళ్లకు జ్యోతి తండ్రి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఇక చివరిరోజులు అనుకుంటున్న సమయంలో వహీద్ తన మామగారిని ఓసారి చూడాలని అనుకున్నారు. ఆసుపత్రికి వచ్చి ఓ సారి నాన్నని చూసి వెళ్లనా అని జ్యోతిని అడిగారు. సరే అనడానికి ఆమె కాస్త తటపటాయించారు. కారణం అప్పటికి కూడా కుటుంబంలో ముస్లింల పట్ల కొనసాగుతున్న వ్యతిరేకత.
‘‘నువ్వు వచ్చాక ఇక్కడ ఎవరు మాట్లాడతారో తెలీదు. అవన్నీ వినేకన్నా దూరంగా ఉండటమే మంచిది’’అన్నారు జ్యోతి. కానీ వహీద్ మాత్రం ఇలాంటి పరిస్థితులలో కూడా అయినవారికి దూరంగా ఉండటంలో అర్థం లేదనుకున్నారు. తెగించి అడుగు ముందుకేసి మామగారిని చూడటానికి వెళ్లారు.
ఆసుపత్రి మంచంపై ఉన్న ఆయనను ఎలా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు అంటూ పలకరించారు. అప్పుడు నాన్న మాట్లాడిన మాటలు తనకి ఇప్పటికీ గుర్తే అంటారు జ్యోతి. వారిద్దరూ మాట్లాడుకున్న ఆ కొద్దిసేపు గతం నిజం కాదనిపించిందని, అసలు మా మధ్య ఎలాంటి విభేధాలు లేనట్టు ఇద్దరూ ఎంతో హాయిగా మాట్లాడుకున్నారని చెప్పారు జ్యోతి.
జ్యోతి వహీద్ ప్రేమ వ్యవహారం తెలిసిన సమయంలో తన బాబాయి అన్నమాటలు జ్యోతికి బాగా గుర్తు. ‘‘మన బిడ్డను వలలో వేసుకున్న ఆ వహీద్‌ను చంపేయడం ఖాయం.. నేను జైలుకు వెళితే నా కుటుంబం బాధ్యత నీదే అన్నా‘‘ అంటూ జ్యోతి తండ్రికి చెప్పిన బాబాయి ఇప్పుడు వాళ్లింట్లో జరిగే ఏ శుభకార్యం అయినా ముందుగా ఆహ్వానించేది వహీద్‌నే.
జ్యోతి ప్రేమ విషయం ఇంట్లో తెలిసినపుడు జ్యోతి అక్క పద్మ కూడా ఆమెను పూర్తిగా వ్యతిరేకించారు. కొన్నేళ్ల పాటు ఆమెతో మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఆమె కూతురు చైతన్యకి వహీద్ బాబాయి చెప్పిందే వేదం.
ఆయన మాట లేకుండా ఏ పనీ చేయనంత ప్రేమ. పెళ్లి విషయంలో కూడా బాబాయి సరే అంటే తప్ప ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది చైతన్య. పద్మ కూడా కూతురుకి కులాంతర వివాహం..అది కూడా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు వారిలో వచ్చిన ఈ మార్పుకు సంతోషిస్తున్నారు జ్యోతి, వహీద్ దంపతులు.
వీళ్లకి ఇద్దరు పిల్లలు. రౌష్మి, రేష్మ. పెద్ద కూతురు రౌష్మి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. మంగుళూరుకి చెందిన ఓ బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించి ఇరువైపులా పెద్దల అంగీకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ బెల్జియంలో స్థిరపడ్డారు.

మతాంతర వివాహాలు
ప్రస్తుతం వహీద్ కుల నిర్మూలన సంఘం అధ్యక్షునిగా ,జ్యోతి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కుల నిర్మూలన కోసం పాటు పడుతూ, కులాంతర మతాంతర జంటల గెట్ టుగెదర్స్ జరుపుతూ, ఈ పెళ్లిళ్లను సాధారణీకరించడానికి కృషి చేస్తున్నారు.
ఇప్పటికి జ్యోతి, వహీద్ ఒక్కటై 32 ఏళ్లు. ప్రేమించినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ ఎప్పుడూ ఐ లవ్ యూ అనే మాట మాత్రం చెప్పుకోలేదంటారు వహీద్.
ప్రేమించిన వారికి కష్ట సుఖాలలో తోడుండటం, కలసి ముందడుగేయటం కన్నా పెద్ద ప్రపోజల్ మరొకటి లేదని అందుకే తమ ప్రేమ ఇప్పటికీ 32 యేళ్ల కిందటి లాగే తాజాగా ఉందని నవ్వుతూ చెప్పారు వహీద్..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).














