చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడిచేసిన రాఘవ రెడ్డి గురించి పోలీసులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Rama Rajyam
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి చేసిన 'రామరాజ్యం' రాఘవ రెడ్డి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
''తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి మద్దతు పొందడమే లక్ష్యంగా రాఘవ రెడ్డి తిరుగుతున్నాడు, తన భావజాలాన్ని అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని తన వారితో రాఘవ రెడ్డి ప్రతిజ్ఞ చేయించాడు'' అని చెప్పారు సైబరాబాద్ పోలీసులు.
రాఘవరెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కేసులున్నాయి. పది నెలల క్రితమే రంగరాజన్‌ను రాఘవ రెడ్డి కలిసినా, రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవడం దాడికి ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు.
చిలుకూరు ఆలయ పూజారిపై దాడి ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ స్టేషన్‌లో కేసు నెంబర్ 76 నమోదైంది.
రాఘవ రెడ్డి హైదరాబాద్ షేక్ పేటలోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు, అదే రోజు ఆయన్ను పట్టుకున్నారు.
విచారణలో రాఘవరెడ్డి తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులకు, విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. రాజేంద్రనగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలు పొందుపరిచారు. ఇంతకూ రాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది?

"రాఘవ రెడ్డి ఉద్దేశం అదే"
''ఆంధ్ర, తెలంగాణల్లోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని, బెదిరించి, భౌతిక దాడులు చేస్తున్నాడు రాఘవ రెడ్డి. అతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి'' అని పోలీసులు తమ రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.
''ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. కోర్టులు, పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలి'' అనేది రాఘవ రెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్పారు.
"ఆ దిశగానే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ఎన్జీవో కూడా రిజిస్టర్ చేశాడు. దానికి ఆయన భార్య చైర్మన్‌గా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్‌సైట్ డిజైన్ చేశాడు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో పూజారులను కలసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు" అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Rangarajan chilkur twitter/rangareddy.telangana.gov.in
రంగరాజన్‌పై దాడికి కారణమేంటి?
"2020లో గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తిని హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఆర్ఎస్ఎస్ సంస్కృతి భవన్‌లో కలిశాడు రాఘవ రెడ్డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకూ సవరించాలని ఆయనతో చర్చించాడు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ ప్రకారం, నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్నే ప్రభుత్వం ప్రోత్సహించకుండా లేదా వ్యతిరేకించకుండా ఉండడం, విద్యాలయాల్లో మత ప్రాధాన్యం తగ్గించడం, మైనార్టీల హక్కుల పరిరక్షణ వంటి నిబంధనలు ఉన్నాయి.
వీటిని తొలగించాలని రాఘవ రెడ్డి రాఘవేంద్రతో చర్చించాడు.
అప్పటి నుంచి రాఘవేంద్ర, రాఘవ రెడ్డితో టచ్‌లో ఉన్నాడు. పది నెలల క్రితం రాఘవ రెడ్డి, రాఘవేంద్రతో కలసి రంగరాజన్‌ను కలసి, తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని, రామదండు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దానికి రంగరాజన్ తిరస్కరించారు" అని పోలీసులు తమ నివేదికలో రాశారు.
"అడ్డొచ్చిన వారిని తొలగించుకుందాం"
"జనవరి 25 నుంచి మళ్లీ తిరగడం ప్రారంభించాడు రాఘవరెడ్డి. తనతో పాటు మరో 21మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవీ కన్యకాపరమేశ్వరి గుడికి వెళ్లి, అక్కడే సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4న ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో కలిశారు.
తాము వెళ్లి కలిసిన పూజారులంతా తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని వారు చర్చించుకున్నారు.
ఫిబ్రవరి 6న మరోసారి ఆ 22 మంది సమావేశం అయ్యారు. నల్ల యూనిఫాం వేసుకుని ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు.
'రామరాజ్యం భావజాలానికి అందరు పూజారులను మద్దతు అడగాలి, ఎవరు వ్యతిరేకిస్తే వారి అడ్డు తొలగించుకోవాలి' – ఇది వారి ప్రమాణం.
ఆ ప్రణాళికలో భాగంగానే శుక్రవారం ఫిబ్రవరి 7 ఉదయం వీరంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో ఉన్నారా అని అడిగి, తరువాత ఇంటి వెనుక నుంచి బలవంతంగా లోపలికి చొచ్చుకెళ్లారు'' అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు.

ఫొటో సోర్స్, Rama Rajyam
"రంగరాజన్‌ను చంపాలనుకున్నారు"
''వీరంతా కలసి రంగరాజన్‌కు ఉగాది వరకూ సమయం ఇచ్చారు. కానీ రంగరాజన్ వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. దీంతో రాఘవ రెడ్డికి కోపం వచ్చింది.58 ఏళ్ల వయసున్న రంగరాజన్‌ను కిందకు తోశాడు. మిగిలిన వాళ్లను పిలిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు'' అని పోలీసులు తెలిపారు.
చంపడానికే రంగరాజన్‌ను అదుపులోకి తీసుకోవాలనుకున్నాడని పోలీసులు అభియోగం మోపారు.
"రాఘవ రెడ్డి రంగరాజన్ ముఖం మీద గుద్దాడు. మిగిలిన వాళ్లు కూడా ఆయన శరీరంపై పిడిగుద్దులు గుద్దారు. ఈలోపు కొందరు భక్తులు అటు రావడం గమనించి వారంతా వెళ్లిపోయారు" అని పోలీసులు పేర్కొన్నారు.
చిలుకూరు బాలాజీ గుడి పూజారి రంగరాజన్ గుడి వెనుకే నివాసం ఉంటారు. ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగినట్టు ఆయన తన ఫిర్యాదులో రాశారు.
''రాఘవ రెడ్డితో పాటు మరో ముగ్గురు, నలుగురు నన్ను ముఖంపై, శరీరంపై కొట్టారు. రాఘవ రెడ్డి తనను తాను శివుడి అవతారంగా చెప్పుకున్నాడు. అదంతా వారు వీడియో తీశారు. ఆర్థికంగా సహకరించాలి అన్నారు. అలాగే తన రామదండు కోసం జనాన్ని (రిక్రూట్‌మెంట్) పంపాలని కోరారు. నేను సమాధానం చెప్పబోతే... నువ్వు మాట్లాడకు, చెప్పేది విను అన్నారు. ఇలాంటి వ్యక్తులు రామసేన పేరుతో సొంతంగా నక్సల్స్ వలె సైన్యాలను తయారు చేస్తే అది చాలా ప్రమాదం. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోగలరు'' అని రంగరాజన్ తన ఫిర్యాదులో రాశారు.
ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. రంగరాజన్‌ను వైద్య పరీక్షలకు పంపారు.
రంగరాజన్‌కు తేలికపాటి గాయాలైనట్లు వైద్యులు నిర్థరించారు.

ఫొటో సోర్స్, UGC
అరెస్టయింది వీరే
1. కొవ్వూరి వీర రాఘవ రెడ్డి, 45 ఏళ్లు, వృత్తి - సంగీత ఉపాధ్యాయుడు, షేక్ పేట తాత్కాలిక నివాసం, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సొంత ఊరు.
2. నాగనపల్లి సాయన్న, 44 ఏళ్లు, వృత్తి - మందుల షాపు, నిజామాబాద్ జిల్లా బోధన్ సొంతూరు
3. భూక్యా గోపాల రావు, 22 ఏళ్లు, వృత్తి - కూలీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకట్రాములు తండా సొంతూరు
4. భూక్యా శ్రీను, 47 ఏళ్లు, వృత్తి - టైలర్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం సొంతూరు
5. అంకోలు శిరీష, 33 ఏళ్లు, వృత్తి - కూలీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం సొంతూరు
6. బానోత్ బేబీ రాణి, 30 ఏళ్లు, వృత్తి - కూలీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరయబంజార్ సొంతూరు
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నవారు:
అంకుశ్ పవార్, రాజ్య లక్ష్మి, జనపాల గోవింద రావు, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి వీర బాబు, మూర్తి, రమణ, శివ, లక్ష్మణ్, జగదీశ్, రమా దేవి, మూకాంబిక, శివయ్య, తాత బాబు, గురు ప్రసాద్, సేన, ఇతరులు.
ఏం కేసులు పెట్టారు?
అక్రమంగా సమావేశం కావడం, గాయం చేయడానికి ప్రణాళిక వేసుకుని ఇంట్లోకి చొరబడడం, అవమానించడం ద్వారా శాంతికి భంగం కలిగించడం, హాని కలిగిస్తామని బెదిరించడం, చంపుతాం లేదా గాయపరుస్తామని బెదిరించి వసూళ్లు చేయడం, హత్యకు లేదా తీవ్ర గాయాలు చేయడానికి ప్రయత్నించడం అనే నేరాల కింద ప్రస్తుతం కేసులు పెట్టారు. (U/S 189(2), 333, 115(2), 352, 351(3), 308 (5), 109 R/w 190 BNS.)
రాఘవ రెడ్డిపై ఆబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులున్నాయి. అందులో లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. పదేళ్ల క్రితం తెలంగాణలో ఆంధ్రుల సంఘం పేరుతో ఒక సంఘం కూడా పెట్టారు రాఘవ రెడ్డి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














