తెలంగాణ: ఆ బోర్ల నుంచి సలసల కాగే నీరు, 40 ఏళ్లుగా ఈ జలధారలు ఎందుకిలా వస్తున్నాయి?

పగిడేరులో బావుల నుంచి ధారగా వస్తోన్న వేడి నీరు
ఫొటో క్యాప్షన్, పగిడేరులో బావుల నుంచి ధారగా వస్తోన్న వేడి నీరు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఎక్కడైనా బావుల నుంచి తాగేందుకు మంచినీళ్లు వస్తాయి. లేదంటే ఉప్పు నీళ్లు వస్తాయి. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిలేరు గ్రామంలోని కొన్ని బోరుబావుల నుంచి మాత్రం పొగలు కక్కే వేడి నీళ్లు వస్తున్నాయి.

మోటార్లు లేకుండా, ఎవరూ తోడకుండానే సుమారు 40 ఏళ్లుగా 365 రోజులూ ధారగా వేడి నీళ్లు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

''మాది సింగరేణి ప్రభావిత ప్రాంతం. కింద మైన్స్‌ ఉండటం వల్ల నలభై ఏళ్ల కిందట సింగరేణి వాళ్లు టెస్టింగ్‌ కోసం బోర్‌వెల్స్‌ వేశారు. అందులో భాగంగా కొన్ని బోర్‌వెల్స్‌ వెయ్యి, 2 వేల మీటర్ల లోతున తవ్వితే వేడి నీళ్లు ఉబికి వచ్చాయి. వ్యవసాయానికో, మరొక విధంగానో ఉపయోగపడతాయని వాటిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి 24 గంటలూ నీళ్లు వస్తూనే ఉన్నాయి' అని గ్రామస్థుడు కోరెం రాంపండు తెలిపారు.

''ఆ బోరు ద్వారా వేడి నీళ్లు వాటంతట అవే బయటకు వస్తున్నాయి. కరెంటు, మోటారు, ఆయిల్‌ ఇంజన్‌ లేకుండా వాటంతట అవే భూమి నుంచి బయటకు వస్తున్నాయి '' అని పగిడేరు గ్రామ మాజీ సర్పంచ్‌ తాడి భిక్షం చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పగిడేరులో బావుల నుంచి ధారగా వస్తోన్న వేడి నీరు
ఫొటో క్యాప్షన్, పగిడేరులో బావుల నుంచి ధారగా వస్తోన్న వేడి నీరు

దాదాపు 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో..

''పగిడేరు గ్రామం సమీపంలో దాదాపు నలభై ఏళ్ల కిందట జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) వాళ్లు 8 బోర్లు వేశారు. కిలోమీటరు లోతు వరకు బోర్లు వేశారు. అప్పట్లో ఈ ఏరియాలో జియో థర్మల్‌ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో ఈ బావులు తవ్వారు. తవ్విననాటి నుంచి ఆ బోరు బావి నుంచి ప్రెషర్‌తో వేడి నీరు వస్తూనే ఉంది. ఆ వాటర్‌ 60 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉంటుంది. ఆ నీటిలో గంధకం (సల్ఫర్‌) శాతం ఎక్కువగా ఉంటుంది'' అని సింగరేణి జనరల్‌ మేనేజర్‌ దుర్గం రాంచందర్‌ బీబీసీకి చెప్పారు.

సింగరేణి జనరల్‌ మేనేజర్‌ దుర్గం రాంచందర్‌
ఫొటో క్యాప్షన్, సింగరేణి జనరల్‌ మేనేజర్‌ దుర్గం రాంచందర్‌

అక్కడే ఎందుకంటే..

సహజంగా భూమి లోపలి పొరల్లో ఎక్కువ వేడి ఉంటుంది. పగిడేరులో వేడి నీరు రావడానికి భూమి అంతర్భాగంలో ఎక్కువ పగుళ్లు ఉండటం, ఒకటి రెండు కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉండటం కారణంగా భావిస్తున్నామని, అందుకే దీన్ని అరుదైన గ్రామంగా భావిస్తున్నామని రాంచందర్‌ అన్నారు.

అయితే, దీనికి ఖచ్చితమైన కారణం ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయని రాంచందర్‌ చెప్పారు.

పంటలు
ఫొటో క్యాప్షన్, వేడి నీటిని ఒకరోజు కుంటల్లో ఆరబెట్టి మరుసటి రోజు పొలాల్లోకి వదిలి సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

ఆ నీళ్లతో పంటలు

పగిడేరు గ్రామంలోని దాదాపు 200 ఎకరాల పంట భూములను ఆ బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటి ద్వారానే సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

బావుల నుంచి వచ్చే వేడి నీటిని ఒకరోజు కుంటల్లో ఆరబెట్టి మరుసటి రోజు పొలాల్లోకి వదిలి సాగు చేస్తున్నామని తెలిపారు.

''ఇంతకు ముందు వరి పంట వేయాలంటే నీళ్లకు ఇబ్బంది అయ్యేది. ఉడుకు నీళ్లు పడ్డాకే వాటిని చల్లబరిచి రెండు ఎకరాలు సాగు చేస్తున్నాను. రెండు పంటలు వేస్తున్నాను. అంతకు ముందు ఒక పంటకే నీళ్లకు ఇబ్బంది అయ్యేది. మూడు నాలుగేళ్లుగా సాగు బాగానే ఉంది. ఉడుకు నీళ్లు ఒకరోజు కుంటల్లో ఆర బెట్టిన తర్వాత పొలాలకు పంపిస్తాం.'' అని భద్రయ్య తెలిపారు.

రైతు గార సోమ నర్సయ్య
ఫొటో క్యాప్షన్, రైతు గార సోమ నర్సయ్య

గతేడాది డిసెంబర్‌లో వచ్చిన భూకంపంతో రెండు బోర్లు ఆగిపోయాయని, మళ్లీ వేడి నీళ్ల బోర్లను తవ్వించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

''డిసెంబర్‌ 4వ తేదీన భూకంపం వచ్చినప్పుడు రెండు బోర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతాంగానికి ఉపయోగపడే బోర్లు పోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి ఆ బోర్లకు మళ్లీ కేసింగ్‌ చేసి వాటర్‌ తెప్పించాలని కోరుకుంటున్నాం'' అని రైతు గార సోమ నర్సయ్య కోరారు.

ఆ బోర్లే తమకు జీవనాధారమని, పోయిన బోర్లతో పాటు కొత్త బోర్లు వేయాలని గ్రామస్థులు పి.నాగమ్మ, వేలేటి సుగుణ విజ్ఞప్తి చేశారు.

పగిడేరు మాజీ సర్పంచ్‌ తాడి భిక్షం
ఫొటో క్యాప్షన్, పగిడేరు మాజీ సర్పంచ్‌ తాడి భిక్షం

బోర్ల వల్ల ఊరికి పేరు

ఆ బోర్ల వల్ల పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలుస్తోంది. ఇప్పుడు వేడి నీళ్ల బావులను చూసేందుకు పర్యటకులు వస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

''ఎక్కడా లేనట్టుగా మా ఊళ్లో బావుల నుంచి వేడి నీరు వస్తుండటంతో మా పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలిచింది. చాలామంది మా ఊరు చూసేందుకు వస్తున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఉంది'' అని గ్రామ మాజీ సర్పంచ్‌ తాడి భిక్షం, గ్రామ యువతి కుంజా రేవతిలు బీబీసీ వద్ద ఆనందం వ్యక్తం చేశారు.

వేలేటి సుగుణ
ఫొటో క్యాప్షన్, వేలేటి సుగుణ

అయితే, స్థానికులు వేసుకున్న బోర్ల నుంచి మామూలు నీళ్లే వస్తుంటాయని, ఊరిలో 300 అడుగుల లోతు వరకు బోరు వేస్తే చాలని, నీరు ధారాళంగా వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు.

సింగరేణి
ఫొటో క్యాప్షన్, వేడి నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేయాలని సింగరేణి భావించింది.

ఆ వేడి నీళ్లతో కరెంటు

నిరంతరం బోర్ల నుంచి దాదాపు 55 నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌ వేడితో నీళ్లు వస్తుండటంతో ఆ నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేయాలని సింగరేణి భావిస్తోందని సింగరేణి జీఎం డి.రాంచందర్‌ చెప్పారు.

''థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో కూడా బొగ్గును మండించి, వాటర్‌ను హీట్‌ చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాం. అదే విధంగా ఇక్కడ జియో థర్మల్‌ ఎనర్జీ పొటెన్షియల్‌ ఉంది కాబట్టి, ఈ నీటి ఉష్ణోగ్రతను ఉపయోగించి మనం కరెంటు ఎందుకు తయారు చేయకూడదు.. అనే కాన్సెప్ట్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాజెక్టు కింద దిల్లీలో శ్రీరామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వాళ్లకి అప్పగించాం'' అని ఆయన అన్నారు.

పగిడేరు సర్పంచ్‌ సావిత్రి
ఫొటో క్యాప్షన్, పగిడేరు సర్పంచ్‌ సావిత్రి

‘5 కేవీ ఉత్పత్తి చేశాం..’

దిల్లీలోని లేబరేటరీలో 5 కిలోవాట్‌ ప్లాంట్‌ తయారు చేసి సక్సెస్‌ అయ్యారనీ, ఇక్కడ పగిడేరులో కూడా 5 కిలోవాట్‌ ఎగ్జిబిట్‌ చేశారని, దీంతో ఇప్పుడు 20 కిలోవాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పగిడేరులో జియో థర్మల్‌ పైలట్‌ పవర్‌ ప్రాజెక్టును నెలకొల్పారని సింగరేణి జీఎం రాంచందర్ వెల్లడించారు.

''కొన్ని ఇష్యూస్‌ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. 20 కిలోవాట్‌ పవర్‌ ఉత్పత్తి విజయవంతమైతే, ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్టు అవుతుంది'' అని ఆయన అన్నారు.

జియో థర్మల్‌ ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అయ్యాక ముందుగా తమ గ్రామంలోని వీధి లైట్లకు ఆ కరెంటును వినియోగించాలని పగిడేరు సర్పంచ్‌ సావిత్రి కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).