‘అరకు మనది కాదా’.. రైల్వే స్టేషన్ ఒడిశా పరిధిలోకి వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చ

అరకు రైల్వే స్టేషన్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్‌లో భాగమైన కేకే లైన్ (కొత్తవలస-కిరండోల్), అందులో భాగమైన అరకు రైల్వే స్టేషన్‌ను కొత్తగా ఏర్పడిన ఒడిశాలోని రాయగడ రైల్వే డివిజన్‌లో విలీనం చేసింది రైల్వేశాఖ. దాంతో పాటు వాల్తేరు రైల్వే డివిజన్ పేరును కూడా విశాఖ డివిజన్‌గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కేకే లైన్ ఇప్పటివరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్ పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈ వాల్తేరు డివిజన్ కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మారింది.

ఇందులో భాగంగా కేకే లైన్‌ను కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌లోకి బదిలీ చేశారు.

దీంతో తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్ ఉన్న కేకే లైన్‌లో భాగమైన అరకు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్‌లో చేరినట్లు అయింది.

ఈ కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్‌కి అత్యధిక ఆదాయం తెచ్చేది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్లే రైలు

కేకే లైన్ చరిత్ర

కేకే అత్యధిక ఆదాయం తెచ్చే రైల్వే లైన్. ఇప్పుడు ఈ లైన్ విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్/విశాఖ డివిజన్ నుంచి ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్‌కు మారింది.

పర్యాటకులు, గూడ్స్ రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైల్వే లైన్ కావడంతో దీనిని వదలుకోవడం వాల్తేరు రైల్వే డివిజన్‌కు ఆర్థికంగా నష్టమే.

కేకే లైన్ మూడు రాష్ట్రల పరిధిలో ఉంది. అవి ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్. ఏపీలో విజయనగరం జిల్లాలోని కొత్తవలస రైల్వే స్టేషన్ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిరండోల్ వరకు ఉన్న 446 కిలోమీటర్ల మేర కేకే లైన్ ఉంది.

కేకే లైన్ నిర్మాణం 1960లో మొదలై 1968కి పూర్తయ్యింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస, చత్తీస్‌గఢ్‌లోని కిరండోల్ స్టేషన్ల వరకు విస్తరించిన దీనిని ఈ రెండు స్టేషన్ల పేర్లతో కేకే లైన్ అని అంటారు.

ఈ లైన్‌లో విశేషమేంటంటే 58 చోట్ల కొండలను తవ్వి గుహల్లోంచి రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ లైన్లలో 48 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

ఈ డివిజన్ 2003 వరకు ఆగ్నేయ రైల్వే పరిధిలో ఉండగా... 2003లో తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటయ్యాక అందులో విలీనమైంది.

గూడ్స్ రైలు

కేకే లైన్ ద్వారా చత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి... విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓర్ రోజుకు 10 నుంచి 12 వ్యాగన్ల రవాణా జరుగుతుంది.

ఈ రవాణాయే తూర్పు కోస్తా జోన్‌కు ప్రధాన ఆదాయ వనరు. అలాగే పర్యాటక కేంద్రం అరకు కూడా ఇదే లైన్‌లో ఉండటంతో... రైళ్ల ద్వారా అరకు చేరుకునే ప్రయాణికుల నుంచి ఈ జోన్‌కు మంచి ఆదాయమే వచ్చేది.

గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా కేకే లైన్‌లో విశాఖ నుంచి మూడు, రాయగడ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి.

"వాల్తేరు డివిజన్‌కు ఏటా సమకూరే దాదాపు రూ.9,500 కోట్ల ఆదాయంలో... ఈ లైన్ ద్వారానే రూ.4,500 కోట్లు వస్తుంది. ఇకపై ఇది రాయగడ డివిజన్‌కు వెళ్తుంది. అంతే కానీ, ఇది రైల్వేశాఖకు చెందే ఆదాయమే." అని రైల్వే జోన్ అఖిల భారత సాధన సమితి కన్వీనర్, రైల్వే ఉద్యోగ సంఘం నాయకులు చలసాని గాంధీ బీబీసీతో చెప్పారు.

అరకు

'అరకు రైల్వే స్టేషన్'ను కోల్పోయిన ఏపీ

అరకు రైల్వే స్టేషన్ రాయగడ డివిజన్‌లో కలవడంతో... "అయితే అరకు మనది కాదా" అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. సాంకేతికంగా అది కేంద్రం పరిధిలో నడిచే రైల్వేశాఖది.

పర్యాటకంగా ఆంధ్రా ఊటీగా పేరు పొందిన అరకు, అరకు రైల్వే స్టేషన్ ఎమోషనల్‌గా తెలుగు ప్రజలకు బాగా కనెక్టైన అంశాలు.

అరకుకు వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.

సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున కొండలపై నుంచి కిందనున్న లోయలను చూస్తూ... అక్కడక్కడ ఆకస్మాత్తుగా వచ్చే టన్నెల్స్‌లలో చేసే రైలు ప్రయాణం భలే కిక్ ఇస్తుంది.

దీంతో అరకు వచ్చే పర్యాటకులు ఎవరైనా ఒక వైపు కార్లు, బస్సులలో వచ్చినా... మరో వైపు మాత్రం కచ్చితంగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు.

విశాఖ నుంచి అరకు బయలుదేరే కిరండోల్ రైలు... ప్రకృతి అందాల మధ్య కొండలు, లోయలు, టన్నెల్స్ దాటుకుంటూ అరకు తీసుకుని వెళ్తుంది.

ఈ ప్రయాణాన్ని కెమెరాల్లో బంధిస్తూ అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అరకులోని ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆ జ్ఞాపకాలతో తిరిగి అరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్

'వాల్తేరు' పేరు మారింది

వాల్తేరు రైల్వే డివిజన్‌ది దాదాపు 130 ఏళ్ల చరిత్ర. అయితే వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌‌గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ.

నిజానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించినప్పుడు అందులో వాల్తేరు డివిజన్‌ ఉండదని కేంద్రం పేర్కొంది.

వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగించాల్సిందేనంటూ జోన్ ప్రకటించిన 2019 నాటి నుంచి కూడా ఉద్యోగులు, రైల్వే జోన్ సాధన కమిటీలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు రైల్వేశాఖకి విన్నపాలు చేస్తూనే ఉన్నారు.

పైగా ఈ ఏడాది జనవరి 8న ప్రధాని మోదీ విశాఖ వచ్చి దక్షిణ కోస్తా జోన్ పనులకు శంకుస్థాపన చేసినప్పుడు కూడా వాల్తేరు రైల్వే డివిజన్‌పై ఏం మాట్లాడలేదు. దీంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటైన కొత్త డివిజన్‌‌లో వాల్తేరు డివిజన్ కలిసిపోయినట్లే అనుకున్నారంతా.

కానీ జనవరి 10న 'వాల్తేరు డివిజన్' పేరును 'విశాఖపట్నం డివిజన్' అని మారుస్తూ...దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోనే ఈ డివిజన్ కొనసాగిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ తోపాటు విశాఖపట్నం డివిజన్లతో కలిపి నాలుగు డివిజన్లు ఉండనున్నాయి.

విశాఖపట్నం రైల్వే స్టేషన్

విశాఖ, రాయగడ డివిజన్‌లో ఏముంటాయంటే...

వాల్తేరు డివిజన్‌లోని ఒక భాగాన్ని పలాస- విశాఖపట్నం- దువ్వాడ, విజయనగరం, నౌపడ జంక్షన్-పర్లాఖిముండి, బొబ్బిలి జంక్షన్-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్-జగ్గయ్యపాలెం సెక్షన్లతో 410 కి.మీల మేర విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు.

అలాగే మరో భాగాన్ని కొత్తవలస-కిరండోల్, కూనేరు-తెరువలి జంక్షన్, సింగపూర్ రోడ్-కోరాపుట్ జంక్షన్, పర్లాఖిముండి- గుణుపూరు మధ్య 680 కి.మీల మేర తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌లో విలీనం చేశారు.

మరోవైపు సికింద్రాబాద్ డివిజన్‌లోని కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌లోని 46 కి.మీలను విజయవాడ డివిజన్‌లోకి మార్పు చేసింది.

అలా...ఏపీలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కూడా తీసుకువచ్చి విశాఖ కేంద్రంగా నడిచే దక్షిణ కోస్తా జోన్‌‌లో కలిపారు. దీనివల్ల దాదాపు రాష్ట్రం అంతటికీ ఒకే జోన్‌, దానికి విశాఖపట్నం కేంద్రంగా ఉంది.

అరకు ఎంపీ తనుజారాణి

ఫొటో సోర్స్, Tanujarani

ఫొటో క్యాప్షన్, అరకు ఎంపీ తనుజారాణి

'అరకు' విలీనం వద్దు: ఎంపీ తనుజారాణి

అరకు రైల్వే స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో విలీనం చేయవద్దని, విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరుతూ అరకు ఎంపీ తనుజారాణి ఆయనకు వినతి పత్రం అందజేశారు.

విశాఖ డివిజన్‌తో అరకు ప్రాంతం ముడిపడి ఉందని ఆమె అన్నారు. ఒడిశా రాష్ట్రంలో ఉన్న రాయగడ డివిజన్‌‌లో విలీనం చేయడాన్ని తమ ప్రాంతవాసులు అంగీకరించబోరని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)