‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి కూడా సరిగా లేదు.’

మల్లుదొర విగ్రహం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి మొట్టమొదటి ఎంపీగా ఎవరు పని చేశారో తెలుసా?

విశాఖ మన్యం ప్రాంతంలో ఉన్న కొయ్యూరు మండలంలోని బట్టిపనుకుల గ్రామం లంకవీధిలో జన్మించిన గాం మల్లుదొర విశాఖ తొలి ఎంపీగా పని చేశారు.

మల్లుదొర సోదరుడు గాం గంటందొర. వీరిద్దరు అల్లూరి సీతారామరాజుతో కలిసి పని చేశారు.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మల్లుదొర, గంటందొరలు గాం సోదరులుగా పేరుగాంచారు.

వాట్సాప్
మల్లుదొర
ఫొటో క్యాప్షన్, మల్లుదొర (ఫైల్ ఫోటో)

మల్లు దొర ఎవరు?

అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో 1922 ఆగస్ట్ నుంచి ఉద్ధృతంగా సాగిన మన్యం పోరాటాన్ని ముందుడి నడిపించింది బగత తెగకు చెందిన గాం సోదరులే.

వీరు అల్లూరి సీతారామరాజుకు ప్రధాన అనుచరులుగా వ్యవహరించేవారు.

ఆదివాసీ నాయకులైన గాం గంటం దొర, గాం మల్లుదొరలు బ్రిటిష్ వారిని ఎదుర్కొనడం, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సేకరించడంలో అల్లూరికి తోడుగా నిలిచారని చరిత్ర చెబుతోంది.

‘మునసబుగా పనిచేస్తున్న గాం గంటందొరను అప్పటి (1922) చింతపల్లి తహసిల్దార్ సెబాస్టియన్ ఆ పదవి నుంచి తొలగించమే కాకుండా అతడి భూమి, ఆదివాసీల భూములను బ్రిటిష్ ప్రభుత్వ పరం చేశారు. మన్యంలో విప్లవానికి దారి తీసిన కారణాల్లో ఇది ప్రధానమైనది’ అని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

సోదరులైన గంటందొర, మల్లుదొరలు అల్లూరి సీతారామరాజు సహాయం కోరగా... 1922 ఆగస్టు నుంచి మన్యంలో బ్రిటిష్ వారిపై అల్లూరి ఆధ్వర్యంలో గిరిజనుల పోరాటాలు తీవ్రమయ్యాయి. బ్రిటిష్ వారిని ఎదిరించేందుకు 150 మంది గిరిజనులకు శిక్షణ ఇవ్వడంలో గాం సోదరుల కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని కొల్లూరి సూర్యనారాయణ అన్నారు.

1922 ఆగస్ట్ నుంచి 1923 ఏప్రిల్ మధ్య కాలంలో వరుసగా చింతపల్లి, కేడీ పేట, రాజఒమ్మంగి, మాడుగుల, అడ్డతీగల, రంప చోడవరం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై దాడి చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొందరు ఖైదీలను కూడా ఈ విప్లవ బృందం విడిచి పెట్టింది.

మల్లుదొర, అల్లూరి, గంటందొర విగ్రహాలు

అండమాన్ జైలుకు మల్లు దొర

అల్లూరి సీతారామరాజుపై, ఆనాటి మన్యం పోరాటాలపై పరిశోధనలు చేసిన గుమ్మడి లక్ష్మీనారాయణ ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు.

‘పోలీస్ స్టేషన్లపై దాడిచేసిన వారిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతులను ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటిష్ వారి నుంచి తప్పించుకుంటూ మల్లుదొర 1923 సెప్టెంబర్ 17న నడింపాలెం చేరుకుని, అక్కడే తలదాచుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే మల్లుదొర బ్రిటిష్ వారికి పట్టుబడ్డారు.

అల్లూరి ఆచూకీ కోసం మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఆయన ఏ వివరాలూ బయట పెట్టలేదు. కానీ అనుకోని విధంగా అల్లూరి అచూకీ 1924 మే నెలలో బ్రిటిష్ వారికి చిక్కడంతో ఆయనను మే 7న చంపేశారు. కొన్ని రోజులకే గంటం దొర కూడా బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

అయితే, అప్పటికే పట్టుబడిన మల్లుదొరకు మరణశిక్ష విధిస్తూ 1924 అక్టోబర్ 28న తీర్పు వచ్చింది. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చి అండమాన్ జైలుకు తరలించారు.

13 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో మల్లుదొర క్షమాభిక్షపై జైలు నుంచి 1937లో విడుదలయ్యారు. విడుదల అనంతరం మళ్లీ మన్యంలో గిరిజన నాయకుడిగానే వ్యవహరించారు.

ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం రావడంతో 1952లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి లంక సుందరంతో పాటు మల్లుదొర కూడా ఎంపీగా ఎన్నికయ్యారు.

విశాఖ సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విశాఖపట్నం

ఒక పార్లమెంట్ స్థానానికి ఇద్దరు ఎంపీలు

దేశంలోని తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ అటు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు ఇద్దరేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇలా ఇద్దరు ఉన్న నియోజకవర్గాలను ద్విసభ్య నియోజకవర్గాలు అనేవారు.

ఆ సందర్భంలోనే 1952లో విశాఖ మన్యం ప్రాంతంలో ఆదివాసీల కోసం ద్విసభ నియోజకవర్గ విధానంలో ఎస్టీ ఎంపీ కావాల్సి వచ్చింది.

అప్పటికే పేరు ప్రఖ్యాతులు బాగా ఉండి, ఉద్యమంలో సీతారామరాజుతో నడిచి, దేశవ్యాప్తంగా పేరు పొందిన మల్లు దొరకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విశాఖపట్నానికి తొలి ఎంపీగా ఎన్నికయ్యారు.

న్యాయకోవిదుడిగా పేరు పొంది, అనేక పుస్తకాలు రచించిన లంక సుందరం కూడా మల్లుదొరతో పాటు విశాఖపట్నానికి మరో ఎంపీగా చేశారని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

అసలు ఒక పార్లమెంట్ లేదా అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎందుకు ఉండేవారనే విషయాన్ని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. లీలా వరప్రసాద్ బీబీసీతో చెప్పారు.

“1952 సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యే నాటికి ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించలేదు. దీంతో ఆయా వర్గాలు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేకుండా పోతుండటంతో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ద్విసభ్య నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో 1952, 1955 ఎన్నికల్లో పలు శాసనసభ స్థానాలు, లోక్‌సభ స్థానాలు ద్విసభ నియోజవర్గాలుగా ఉండేవి. 1962 నుంచి జనాభా ప్రాతిపదికన ఆయా స్థానాలను రిజర్వు కేటగిరి వారికి కేటాయిస్తూ వస్తున్నారు” అని డాక్టర్ లీలా వరప్రసాద్ తెలిపారు.

మల్లుదొర వారసులు

మల్లుదొర బంధువులు ఏమంటున్నారు?

అండమాన్ జైలు నుంచి వచ్చిన తర్వాత మల్లు దొర తాను పుట్టిన కొయ్యూరు మండలం బట్టిపనుకుల గ్రామంలోని లంకవీధిలో ఒక మిద్దె ఇంట్లో నివాసం ఉన్నారు.

అది ఇప్పుడు మట్టి దిబ్బగా మారింది. ఆ ఇంటిలోనే అల్లూరి, గంటందొర, మల్లు దొర ఇతర ముఖ్య నాయకులు సమావేశాలు నిర్వహించేవారని గాం సన్యాసమ్మ బీబీసీతో చెప్పారు. గాం మల్లు దొరకు సన్యాసమ్మ ముని మనమరాలు.

మల్లుదొర ఎంత పేదరికం అనుభవించినా ప్రభుత్వ సహకారం లేదా సాయం తీసుకునేందుకు నిరాకరించేవారని తమ పెద్దలు చెప్పారని ఆమె అన్నారు.

సన్యాసమ్మ
ఫొటో క్యాప్షన్, మల్లుదొర మునిమనుమరాలు సన్యాసమ్మ

“మల్లుదొర తినడానికి తిండి లేక, ఇల్లు లేక అష్టకష్టాలు పడుతుండేవారట. మా కుటుంబానికి లంకవీధిలో ఒక మిద్దె ఇల్లు ఉంది. అక్కడే ఉండేవారు. ఇప్పుడు అది పూర్తిగా శిథిలమైపోయింది. నాడు ప్రభుత్వం ఇల్లు కట్టి ఇస్తామన్నా దానికి ఆశపడలేదు. మట్టితో నిర్మించుకున్న చిన్న మిద్దె ఇంటిలోనే ఉండేవారట. మల్లుదొర 1969లో చనిపోయారు” అని సన్యాసమ్మ తెలిపారు.

మల్లుదొర కుటుంబం
ఫొటో క్యాప్షన్, మల్లుదొర కుటుంబం

ఎంపీగా మల్లుదొర ఏం చేశారు?

అల్లూరి సీతారామరాజుతో కలిసి బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మల్లుదొర పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనా ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా పెద్దగా తన మార్కు వేయలేకపోయారని చరిత్రకారులు చెబుతున్నారు.

మల్లుదొరది ఆదివాసీ ప్రాంతంలో ఉద్యమాలు చేసిన నేపథ్యం. ఆయన ఎంపీ అయ్యే నాటికి ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు.

“అప్పట్లో దేశంలో అన్ని ప్రాంతాలకు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే పరిస్థితి లేదు. దాంతో ప్రభుత్వం పరంగా మల్లుదొర ప్రజల కోసం పనులు పెద్దగా చేయలేకపోయారు” అని కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.

మల్లుదొర వారసుల కోసం ఇళ్ల నిర్మాణం
ఫొటో క్యాప్షన్, మల్లుదొర కుటుంబీకుల కోసం ఇళ్ల నిర్మాణం

మల్లుదొర వారసుల కోసం ఇళ్ల నిర్మాణం

మల్లుదొర నివాసమున్న లంక వీధిలోకి ప్రవేశిస్తుండగా... నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ తరహా భవనాలు కనిపిస్తాయి. ఇవి కొన్ని క్షత్రియ సంఘాలు మల్లుదొర కుటుంబీకుల కోసం నిర్మిస్తున్నవని గాం రాజుబాబు చెప్పారు.

రాజుబాబు మల్లుదొర మని మునవడు. ఇంటి నిర్మాణ పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

“మా ముత్తాత విశాఖకి తొలి ఎంపీ అని చెప్పుకుంటున్నాం. కానీ మాకు తినడానికి కూడా తిండి లేదు. పనస పళ్లు పండించుకోవడం, మాకు కావలసినవి మేం పండిచుకుని తినడమే మా జీవితం. మాకు వేరే ఆధారం లేదు. కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వంతోపాటు భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లాం. ఆ తర్వాత కొందరు ప్రైవేటు వ్యక్తులు, క్షత్రియ సంఘాలకు చెందిన వారు గంటందొర, మల్లుదొర వారసులుగా ఉన్న మా 11 కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నారు” అని రాజుబాబు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)