ఆంధ్రప్రదేశ్: బాలుడి శవాన్ని తల్లిదండ్రులు 8 కిలోమీటర్లు ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చింది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంత్యక్రియల కోసం 16 నెలల బాలుడి మృతదేహాన్ని తల్లి, తండ్రి, తాత ఒకరి తర్వాత ఒకరు 8 కిలోమీటర్లు కొండపైకి కాలినడకన మోసుకుని వెళ్లారు.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చినకోనల గ్రామంలో జరిగింది.
బాలుడు గుంటూరులో అనారోగ్యంతో చనిపోయాడు.
‘‘ఏడాదిన్నర బాబు శవాన్ని పట్టుకుని మూడు గంటలపాటు కొండ ఎక్కుతూ ఉంటే గుండెలు అలసిపోయాయి. అడుగు పడేది కాదు. బాధ తట్టుకోలేకపోయాం. ఈ కష్టం మరెవరకీ రాకూడదు. ఏ చిన్న పనికైనా కొండ ఎక్కడం, దిగడంతోనే మా జీవితాలు గడిచిపోతున్నాయి’’ అని మృతిచెందిన బాలుడి తాత లచ్చయ్య బీబీసీతో అన్నారు.
మృతదేహాన్ని పట్టుకుని కొండ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కుటుంబం ఏం చెబుతోంది? అధికారులు ఏమంటున్నారు?

అసలేం జరిగింది?
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ చినకోనల గ్రామానికి చెందిన సారా కొత్తయ్య, ఆయన భార్య సీత గుంటూరు జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నారు.
వీరి 16 నెలల బాబు ఈశ్వర్ ఏప్రిల్ 6న అనారోగ్యం పాలయ్యాడు. బాలుడిని గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజుల చికిత్స తర్వాత ఆ బాబు చనిపోయాడు.
బాలుడిని స్వగ్రామానికి తరలించేందుకు ఏప్రిల్ 9న ఇటుక బట్టీ యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటు చేసింది.
సాయంత్రం బయల్దేరిన అంబులెన్స్ తెల్లవారుజాము రెండు గంటలకు విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామానికి చేరుకుంది.
‘‘అక్కడి నుంచి అంబులెన్స్ చినకోనల గ్రామానికి వెళ్లదని, రోడ్డు లేకపోవడంతో ఇంతకు మించి రాలేనని అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు. మమ్మల్ని అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు’’ అని కొత్తయ్య బీబీసీతో చెప్పారు.
బాలుడి తల్లిదండ్రులతో పాటు తాత లచ్చయ్య, మరికొందరు తెల్లవారుజామున 5 గంటలకు కాస్త వెలుతురు వచ్చిన తర్వాత బాలుడి శవాన్ని భుజంపై వేసుకొని కొండ ఎక్కడం మొదలుపెట్టారు.
ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉదయం 8 గంటలకు చినకోనల గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
8 కిలోమీటర్లు బాలుడి మృతదేహాన్ని భుజాన వేసుకొని ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది.
“మూములుగా మేం ఈ కొండని గంటలో ఎక్కేస్తాం. కానీ, ఒకరి తర్వాత ఒకరు మృతదేహాన్ని మోసుకుంటూ ఎక్కాం. దాంతో మూడు గంటలు పట్టింది. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు” అని బాబు తండ్రి కొత్తయ్య బీబీసీతో అన్నారు.

మాకు కొండతోనే కష్టం: సీతమ్మ
చినకోనల గ్రామానికి వెళ్లాలంటే విజయనగరం జిల్లా మెంటాడ వచ్చి, అక్కడ నుంచి వనిజ గ్రామానికి వెళ్లాలి. ఆ తర్వాత నిటారుగా ఉన్న కొండ ఎక్కుతూ 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చినకోనల, బురుగు గ్రామాలు వస్తాయి.
ఈ రెండు గ్రామాల్లో 45 కుటుంబాలు, 200 మంది వరకు జనాభా ఉన్నారు. వీరి ప్రధాన ఆదాయ వనరు చింతపండు, జీడి పళ్ల అమ్మకాలు.
ఇంతకు మించిన పని ఇక్కడ దొరక్కపోవడంతో విశాఖ, విజయనగరం, విజయవాడ, అటు ఒడిశాలోని సరిహద్దు జిల్లాల్లో వివిధ పనులకు వెళ్తుంటారు. కొత్తయ్య కుటుంబం కూడా గుంటూరులోని ఇటుకబట్టీ పనులకు వలస వెళ్లింది.
‘‘ఏ చిన్నపనికి వెళ్లాలన్నా, రావాలన్నా ఈ కొండ ఎక్కి దిగడం తప్పనిసరి. మా జీవితంలో ఎక్కువ సమయం ఈ కొండపై రాకపోకలకే గడిచిపోతుంది. అధికారులకు ఎన్నిసార్లు రోడ్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా సమాధానం రాలేదు. మా బిడ్డ శవాన్ని పట్టుకుని ఈ కొండ ఎక్కాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బాలుడి తల్లి సీతమ్మ అన్నారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత అనంతగిరి రెవెన్యూ ఇన్సెస్పెక్టర్ (ఆర్ఐ) శంకరరావు చినకోనలకు వచ్చి, బాధిత కుటుంబం, గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
2022 ఆగస్ట్‌లో చినకోనల గ్రామం పక్కనే ఉన్న బురుగు గ్రామంలో దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేదని బీబీసీ కథనాన్ని ప్రసారం చేసింది.
వెంటనే అధికారులు వచ్చి వివరాలు సేకరించి, త్వరలోనే ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ బురుగు, చినకోనల గ్రామాలు చీకట్లోనే ఉన్నాయి.
నడిరోడ్డుపై ప్రసవం
ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే అంబులెన్స్ వెళ్లే దారి లేక మార్గం మధ్యంలోనే గర్భణీకి ప్రసవం జరిగింది.
పెద్దకోట పంచాయతీ చీడివలస గ్రామానికి చెందిన గర్బిణీ వసంతకు ఏప్రిల్ 7న తెల్లవారుజాము 5 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె భర్త భాస్కరరావు 108కి ఫోన్ చేశారు.
ఉదయం 7 గంటలకు వచ్చిన అంబులెన్స్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఒక కిలోమీటరు దూరంలోనే ఆగిపోయింది.
దీంతో వసంత భర్త, కొందరు స్థానిక మహిళల సహకారంతో అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో ప్రసవం జరిగింది.
వెంటనే అంబులెన్స్ సిబ్బంది వైద్య సహాయం చేసి హుకుంపేట ప్రాథమిక ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతుండటంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గిరిజన సబ్ ప్లాన్ నిధులను తమ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి వాడితే ఈ దుస్ధితి రాదని గిరిజన సంఘాలు అంటున్నాయి.
“ఉపాధి హామీ పథకం ద్వారా మిషన్ కనెక్ట్ ప్రోగ్రాంలో రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టినట్టు రికార్డు చూపిస్తున్నారు. నిజానికి గిరిజన గ్రామాల్లో రోడ్డు పనులు చేసినట్లు చూపించి, బిల్లులను కాంట్రాక్టులు, అధికారులు కుమ్మక్కై పంచుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రొక్లైన్లతో రోడ్లను సరి చేసి, రోడ్డు పనులు పూర్తైనట్లు రికార్డులలో చూపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు” అని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ప్రతినిధి కె. గోవిందరావు బీబీసీతో చెప్పారు.

వలసలు పోతున్న గిరిజనులు
గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలి.
ఆ పనుల్లోనే రోడ్లు, కల్వర్టులు వంటివి నిర్మించాలి. కానీ అధికారులు ఏ విధమైన పనులు చేయకుండా, పేపర్లపై పనులు పూర్తైయినట్లు రాసేసి, బిల్లులు క్యాష్ చేసుకుంటున్నారు.
దీంతో గిరిజన కుటుంబాలు ఉపాధి వెతుక్కుంటూ వలసలు పోతున్నాయని గిరిజన సంఘాలు చెప్తున్నాయి.
“ఐటీడీఏలు ఎటువంటి ఉపాధి పనులు కల్పించకుండా, వారి జీవనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉపాధికి వెళ్తున్న గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, పనులకు తీసుకెళ్లిన యాజమాన్యాలు కూడా వారి కుటుంబాల పట్ల కనికరం చూపడం లేదు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఇళ్లకు చేర్చే ప్రయత్నాలు కూడా చేయలేకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భంలోనైనా ఐటీడీఏలు సరైన విధంగా స్పందించి గిరిజనులకు ఉపాధి కల్పించడం, గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం చేయాలి” అని గిరిజన సంఘం ప్రతినిధి కె. గోవిందరావు అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తప్పు అంబులెన్స్ డ్రైవర్‌దే: ఐటీడీఏ పీవో
చినకోనల గ్రామానికి కొండెక్కి బాలుడి మృతదేహాన్ని మోసుకెళ్లిన సంఘటనపై పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ బీబీసీతో మాట్లాడారు. ఈ ఘటనలో తప్పంతా అంబులెన్స్ డ్రైవర్‌దే అని అన్నారు.
“కాశీపట్నం నుంచి చినకోనల గ్రామానికి గ్రావెల్ రోడ్డు ఉంది. అయితే రోడ్డు ఉన్న వైపు కాకుండా విజయనగరం జిల్లాలోని మెంటాడ మార్గంలో అంబులెన్స్ తీసుకుని వెళ్లడంతోనే ఈ సమస్య వచ్చింది. దాంతో, ఆ గిరిజన కుటుంబం బాలుడి మృతదేహంతో 8 కిలోమీటర్లు కొండ ఎక్కాల్సి వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఎందుకు మరో మార్గంలో తీసుకుని వెళ్లాడనే విషయంపై డీఎం అండ్ హెచ్ఓని వివరణ కోరాం” అని అభిషేక్ బీబీసీకి చెప్పారు.
‘‘అలాగే మిషన్ కనెక్ట్ పాడేరు కింద ఐటీడీఏ పాడేరు పరిధిలోని అన్ని గ్రామాలకు రోడ్లు కనెక్ట్ చేస్తున్నాం. గత మూడేళ్లుగా పాడేరు, అరకు ఏజెన్సీ పరిధిలో రూ. 274 కోట్లతో చాలా గ్రామాలకు రోడ్లు వేశాం. ఇంకా మూరుమూలనున్న కొన్ని గ్రామాలకు రోడ్లు వేయాల్సి ఉంది. ఒకదాని తర్వత ఒకటి నిధులు లభ్యత బట్టి రోడ్లు వేస్తున్నాం’’ అని అభిషేక్ తెలిపారు.

రోడ్డు ఉన్నా మృతదేహంతో కొండెక్కారా?
ఐటీడీఏ పీవో అభిషేక్ చెప్పిన దానిని బీబీసీ పరిశీలించింది. చినకోనల గ్రామానికి విజయనగరం జిల్లాలోని కాశీపట్నం నుంచి రోడ్డు మార్గం ఉంది. కాకపోతే ఈ మార్గం ఉన్నట్లు స్థానికులకు తప్పితే, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తెలియదు.
కానీ చినకోనల, బూరుగు గ్రామాల గిరిజనులు ఈ రోడ్డు మార్గాన్ని వినియోగించరు. ఎందుకంటే ఈ మార్గం ద్వారా తమ పనుల కోసం కాశీపట్నం వెళ్లాలంటే 23 కిలోమీటర్లు, అక్కడ నుంచి వైద్యం వంటి ఇతర అవసరాల కోసం వెళ్లాలంటే మరో 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. మొత్తం 53 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది.
అందుకే గిరిజనులు చినకోనల నుంచి 8 కిలోమీటర్ల కాలి నడకతో చేరుకునే కొండ దిగువన ఉన్న వనిజ గ్రామానికి వెళ్లి, అక్కడ నుంచి రోజువారి అవసరాలైన సంతలు, వైద్యం, ఇతర పనులకు వెళ్తుంటారు.
అందుకే తమ అవసరాలకు దగ్గరగా ఉన్న వనిజ కొండపై నుంచి రోడ్డు కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నామని చినకోనల గిరిజనులు అంటున్నారు.
తమ కుమారుడు చనిపోయినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ మెంటాడ మండలం వనిజ మార్గంలో తీసుకుని వచ్చి వదిలేశారని, కాశీపట్నం వైపు నుంచి తీసుకుని రాలేదని చెప్పారు.
అటువైపు తీసుకుని వెళ్లమని తాము అడిగితే తనకు ఇక్కడే దింపాలని పైస్థాయి అధికారులు చెప్పినట్లు అంబులెన్స్ డ్రైవర్ తెలిపారని కొత్తయ్య బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది, మున్ముందు ఏం జరగబోతోంది?
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















