కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

కుప్పం
ఫొటో క్యాప్షన్, సీఎం జగన్ నీటిని విడుదల చేసిన రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన గేటు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాల విడుదల వివాదాస్పదమైంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుప్పం కాలువకు నీళ్లు వదిలారు. అయితే ‘‘అదంతా డ్రామా. ప్రారంభం కోసం కాలువకు గేట్లు పెట్టి, ఆ తరువాత వాటిని తీసేశారు. కుప్పానికి నీళ్లు రాలేదు’’ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

మార్చి 26న ఆ ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు, ‘‘కాలువకు నీరే రాలేదు. మట్టిపెళ్లలు కూడా తడవలేదు. ఇదంతా సెట్టింగ్’’ అంటూ విమర్శించారు.

కుప్పం నియోజకవర్గానికి నిజంగా నీళ్లొచ్చాయా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ కుప్పం ప్రాంతంలో పర్యటించింది. స్థానిక రైతులతో మాట్లాడింది. బీబీసీ పరిశీలనలో ఏం తేలిందంటే..

కుప్పం
ఫొటో క్యాప్షన్, వర్ధికుప్పం వద్ద కాలువలో నీటి జాడ

వర్ధికుప్పం దగ్గర కాలువ ఎలా ఉందంటే..

కుప్పం నియోజకర్గానికి నీళ్లు వదలిన ప్రాంతంలో మార్చి 16న బీబీసీ పర్యటించింది.

కుప్పం నియోజకవర్గంలోకి కృష్ణా జలాలు ప్రవేశించే రామకుప్పం మండలం వర్ధికుప్పం దగ్గర కాలువను బీబీసీ పరిశీలించింది. కానీ, అక్కడ కాలువ ఖాళీగా కనిపించింది. అక్కడక్కడా నీళ్లు పారిన జాడలు కనిపించాయి. ఆ తర్వాత వర్దికుప్పానికి సమీపంలోని రాజుపేట ప్రాంతానికి బీబీసీ వెళ్లింది.

ఇక్కడే ముఖ్యమంత్రి కృష్ణా జలాలను విడుదల చేశారు. గేటు ఎత్తిన ప్రదేశంలో ప్రస్తుతం ఇసుక మేట వేసి ఉంది. నీళ్లు మాత్రం కనిపించలేదు.

కుప్పం కాలువ ద్వారా చెరువులకు నీళ్లు వదిలామని అధికారులు చెప్పారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న మిట్టపల్లి దగ్గర ఉన్న మద్దిగుంట చెరువులో దాదాపు 75 శాతం నీళ్లు ఉన్నాయి.

ముఖ్యమంత్రి ప్రారంభించిన తరువాత నాలుగు రోజులు మాత్రమే నీళ్లు వచ్చాయని అక్కడి రైతులు చెప్పారు.

‘‘ముఖ్యమంత్రి వచ్చిన ముందురోజు నీళ్లు వదిలారు. మూడు రోజులు నీళ్లు వచ్చాయి. మద్దికుంటకు వదిలిన తర్వాత ఆపేశారు. ఇదంతా హడావుడిగా చేసినట్లు ఉన్నారు’’ అని మిట్టపల్లికి చెందిన కేశవరెడ్డి అనే రైతు బీబీసీకి చెప్పారు.

నీళ్లు ఇచ్చామని చెబుతున్న అత్తికుప్పం సమీపంలోని వెరసి చెరువులో నీళ్లు కనిపించాయి. కానీ, అధికారులు చెబుతున్నట్లు అది పూర్తిగా నిండలేదు. అయితే, నీళ్లు రావడంపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, మద్దిగుంట చెరువులో నీళ్లు

'మా బోరు కూడా పికప్ అయ్యింది'

‘‘నీళ్లు ఇంతవరకు వస్తాయని మేం కలలో కూడా అనుకోలేదు. నీళ్లు వదలడం వల్ల మా బోర్లు కూడా పికప్ అయ్యాయి. చెరువు పక్కనే మాకు బోరు ఉంది. అది ఈ ఎండల కాలం ఆగిపోయేది. అయితే చెరువులోకి నీళ్లు రావడం వల్ల అది కాస్త పికప్ అయ్యింది’’ అని అత్తికుప్పానికి చెందిన రైతు వెంకటరాముడు బీబీసీతో చెప్పారు.

కుప్పం నియోజకవర్గంలోని వెంకటేశపురం దగ్గరున్న చిట్టివానికుంటను కూడా కృష్ణా జలాలతో నింపారు. మొత్తంమీద మద్దిగుంట, అత్తికుప్పం, చిట్టివానికుంటలకు మినహా మిగిలిన చెరువులకు నీళ్లు వచ్చినట్లుగా కనిపించలేదు. ఇక కుప్పం నియోజకవర్గంలో చివరి చెరువుగా చెబుతున్న పరమ సముద్రానికి కృష్ణా జలాలు రాలేదని అక్కడి రైతులు తెలిపారు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, వెంకటరాముడు, స్థానిక రైతు

‘‘హాంద్రీనీవా కాలువకు అనుసంధానంగా ఉన్న 110 చెరువుల్లోకి నీళ్లు రావాలనేది కుప్పం ప్రజల ఆకాంక్ష. దానివల్ల సాగునీరు, తాగునీటితోపాటు కుప్పానికి ప్రధానమైన పాడి పరిశ్రమకు కూడా నీరు అందుతుంది. చివరి చెరువు పరమ సముద్రం దగ్గర నీళ్లు విడుదల చేస్తారని ముందుగా తెలిసింది.

కానీ, ముఖ్యమంత్రి రాజుపేట దగ్గర నీరు విడుదల చేశారు. పరమ సముద్రం వరకు నీళ్లు రాలేదు. రామకుప్పం మండలం ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు మూడు చెరువులకు నీళ్లు నింపారు. ఆ తరువాత నీళ్లు ఆగిపోయాయి’’ అని కుప్పం ప్రజావేదికకు చెందిన సామాజిక కార్యకర్త మునిరాజు బాబు బీబీసీతో చెప్పారు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, నీటిజాడ కనిపించని కుప్పం కాలువ

నీళ్లు ఎందుకు ఆగిపోయాయి?

శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని హంద్రీనీవా ద్వారా కుప్పానికి తరలించాలి. అయితే, ప్రస్తుతం అక్కడ నీళ్లు లేవు. అయినా కూడా అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీళ్లనే వైఎస్ జగన్ విడుదల చేశారు.

నీటి లభ్యత లేకపోవడం వల్లే నీళ్లు ఇవ్వలేకపోయామని హంద్రీనీవా కుప్పం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేశ్‌ బాబు బీబీసీతో చెప్పారు.

‘‘వర్షాభావ పరిస్థితులతో నీళ్లు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకుంటూ మూడు చెరువులను నింపాం. కుప్పం చివరి వరకూ నీళ్లను ఇవ్వాల్సి ఉంది. కానీ, నీళ్లు లేకపోవడంతో మూడు చెరువులకే ఇచ్చాం. కాలువలకు లైనింగ్ చేయకపోవడం వల్ల విడుదల చేసిన నీళ్లలో 60, 70 శాతం మాత్రమే వచ్చాయి. లైనింగ్ పూర్తయితే వంద శాతం జలాలు వస్తాయి’’ అని రమేశ్ బాబు అన్నారు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, మునిరాజు బాబు, సామాజిక కార్యకర్త

ఏడాదిలో రెండు, రెండున్నర నెలల పాటు నీళ్లు విడుదల చేస్తారని ఆయన తెలిపారు.

‘‘అందుబాటులో ఉన్న జలాల ఆధారంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు నీటి కేటాయింపులకు ఒక చార్ట్ ఫిక్స్ చేస్తారు. దాని ప్రకారం ఏయే ప్రాంతాలకు ఎంత మొత్తంలో జలాలు విడుదల చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే నీటి విడుదల ఉంటుంది. హంద్రీనీవా ఆయకట్టు కింద ఆరు లక్షల ఎకరాలు ఉంది. గత సంవత్సరం 40 టీఎంసీల నీళ్లు విడుదల చేశాం. ఈ సంవత్సరం తక్కువ విడుదల చేశాం. 40 టీఎంసీల నీళ్లు వచ్చుంటే కుప్పానికి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి ఉండేవి. నీళ్లు తగ్గాయి కాబట్టి అవి ఇక్కడ వరకే వచ్చాయి.’’ అని రమేశ్ బాబు వివరించారు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, మద్దిగుంట చెరువు

కుప్పం బ్రాంచ్ కెనాల్... 110 చెరువులు

కుప్పం నియోజకవర్గానికి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయించారు. కుప్పం సమీపంలోని పాలారు నది వద్ద ప్రాజెక్టు నిర్మించి నీటిని తీసుకువస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు నిజరూపం దాల్చలేదు.

హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కుప్పానికి నీళ్లు తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి నీళ్లను 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీని సామర్థ్యం 1.9 టీఎంసీలు. దానికి కొనసాగింపుగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మొదలవుతుంది. దానికి 22 కిలోమీటర్ల దూరంలో చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంటుంది. దాని సామర్థ్యం 1.6 టీఎంసీలు.

కుప్పం
ఫొటో క్యాప్షన్, అత్తికుప్పం చెరువు

పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80వ కిలోమీటర్ వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. కుప్పం బ్రాంచ్ కాలువ పొడవు సుమారు 143.90 కిలోమీటర్లు.

నియోజకవర్గంలోకి రామకుప్పం మండలం వర్ధికుప్పం దగ్గర మొదలయ్యే కుప్పం కాలువ, పరమ సముద్రం వద్ద ముగుస్తుంది. మొత్తం 3 లిఫ్టులు ఈ కాలువ మీద ఉన్నాయి. మెత్తం 27 లిప్టుల ద్వారా సుమారు 720 మీటర్ల ఎత్తులో ఉన్న కుప్పానికి నీళ్లు వస్తున్నాయని ఇంజినీర్ రమేశ్ బాబు తెలిపారు.

హంద్రీనీవా ఫేజ్-2లో భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ కింద 110 చెరువులను నింపుతారు. ఈ చెరువుల కింద 6,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. కుప్పం, పలమనేరు నియోజకర్గాల్లోని 8 మండలాలకు చెందిన 4.02 లక్షల మందికి తాగు నీటిని ఇస్తారు.

2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు అనుమతులిచ్చారు. ఏడాదిలోపే పనులను పూర్తి చేసి నీళ్లు ఇస్తామని నాడు ప్రభుత్వం చెప్పినా కాలువ మాత్రం పూర్తి కాలేదు. కాలువ పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. మొత్తం మీద ఈ కాలువ నిర్మాణానికి సుమారు రూ.560 కోట్లు ఖర్చు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)