విశాఖపట్నం ఎంపీగా స్థానికేతరులే ఎందుకు గెలుస్తున్నారు?

విశాఖపట్నం
ఫొటో క్యాప్షన్, పురంధేశ్వరీ, ఎంవీవీ సత్యనారాయణ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఎంవీవీ సత్యనారాయణ, కంభంపాటి హరిబాబు, దగ్గుపాటి పురందేశ్వరి... వీళ్లంతా విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచినవారు.

కానీ, వీరిలో ఏ ఒక్కరూ విశాఖపట్నానికి చెందినవారు కాదు. సుమారు 35 ఏళ్లుగా విశాఖపట్నం నుంచి నాన్ లోకల్ అభ్యర్థులే గెలుస్తున్నారు.

రాజకీయ పార్టీలు స్థానిక నేతలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం ఒక ట్రెండుగా కనిపిస్తోంది.

విశాఖపట్నంలో స్థానికుల నేతల హవా ఎందుకు తగ్గింది? నాన్ లోకల్ లీడర్లు ఎందుకు గెలుస్తున్నారు?

ద్రోణం రాజు సత్యనారాయణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ద్రోణంరాజు సత్యనారాయణ

తొలినాళ్లలో స్థానికులే

తొలినాళ్లలో అయిదుగురు స్థానిక నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విశాఖ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రమంగా స్థానికేతరులు రావడం మొదలైంది.

చివరకు విశాఖ ఎంపీ సీటు అంటేనే అది స్థానికేతరుల కోసం పొలిటికల్ పార్టీలు రిజర్వు చేసిన సీటులా మారిపోయిందని శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. లీలా వరప్రసాద్ అన్నారు.

“రాజకీయాల్లోకి తొలి రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధులు, అభ్యుదయవాదులు, పోరాట యోధులు వచ్చేవారు. విశాఖ పార్లమెంట్ సీటు విషయంలో కూడా అదే జరిగింది.

అందుకే అప్పట్లో పార్టీలతో సంబంధం లేకుడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగి విజయాలు సాధించారు.

అలా విజయాలు సాధించిన వారిలో లంక సుందరం, గాము మల్లుదొర, పీజీజీ రాజు, తెన్నేటి విశ్వనాథం, ద్రోణంరాజు సత్యనారాయణ, కొమ్మూరి అప్పలస్వామి, భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఉన్నారు.

1952-1984 వరకు దాదాపు స్థానికులే విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగారు” అని బీబీసీతో డాక్టర్ లీలా వర ప్రసాద్ చెప్పారు.

ఒకప్పుడు విజయనగరం, అనకాపల్లి, అరకు ఏజెన్సీలు కూడా విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేవి. తర్వాత అనకాపల్లి, విజయనగరం, అరకు లోక్‌సభ స్థానాలుగా మారాయి. ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో జిల్లాలోని 6 నియోజకవర్గాలతో పాటు విజయనగరంలోని ఎస్. కోట నియోజకవర్గం కూడా ఉంది.

1989 నుంచి మారిన కథ

విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో 1984 వరకు స్థానికులే ఎన్నికల బరిలోకి దిగగా, తర్వాత నాన్ లోకల్స్‌ హవా ప్రారంభమైందని డాక్టర్ జి. లీలా వరప్రసాద్ అన్నారు.

‘‘విశాఖకి వ్యాపారం కోసం వచ్చిన అనేక మంది 1980ల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ల వ్యాపార అవసరాలకు రాజకీయాలను వాడుకున్నారనేది వివాదం లేని అంశం. అదే సమయంలో రాజకీయాల్లోకి విపరీతంగా డబ్బు రావడం మొదలైంది.

దాంతో పార్టీలు కూడా డబ్బు ఖర్చుపెట్టగలిగే వారికే సీట్లు ఇవ్వడం ప్రారంభించాయి. 1989 నుంచి ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా స్థానికేతరులకే టిక్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి.

1989లో తొలిసారి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్థానికేతరుడు ఏవీవీఎస్ మూర్తి, టీడీపీ తరపున పోటీ చేశారు.

ఆయన మీద నాన్ లోకల్ అయిన ఉమా గజపతిరాజు గెలిచారు. 1991లో ఉమా గజపతిరాజు మీద ఏంవీవీఎస్ మూర్తి గెలిచారు. అలా నాన్ లోకల్స్ హవా ప్రారంభమైంది’’ అని ఆయన వివరించారు.

డాక్టర్ లీలా వరప్రసాద్
ఫొటో క్యాప్షన్, బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. లీలా వరప్రసాద్

బాపట్లలో గెలిచిన పురంధేశ్వరి విశాఖకు ఎందుకు వచ్చారు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్థన రెడ్డి కూడా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈయనది నెల్లూరు జిల్లా.

2004లో విశాఖ నుంచి ఏంవీవీఎస్ మూర్తి మీద గెలిచి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు.

ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరి 2004లో బాపట్ల లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో బాపట్లను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009లో ఆమె విశాఖ నుంచి పోటీ చేశారు.

2009 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన పల్లా శ్రీనివాసరావుపై విజయం సాధించారు.

2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును బీజేపీ సొంతం చేసుకుంది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన హరిబాబుది ప్రకాశం జిల్లా. ఆయనకు పోటీగా నిలబడింది వైఎస్ విజయమ్మ. ఆమెది రాయలసీమ.

2019లో టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ పై వైసీపీ నుంచి పోటీ చేసిన స్థానికేతరుడు ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన విశాఖ ఎంపీగా కొనసాగుతున్నారు.

1989 నుంచి జరిగిన అన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీ స్థానానికి స్థానికేతరులే ఎన్నికయ్యారు. పైగా వీరి చేతిలో ఓడిపోయింది కూడా స్థానికేతరులే.

ఒకరిద్దరూ స్థానికులు పోటీ చేసినా వారు గెలువలేకపోయారు. దీన్ని బట్టి విశాఖ పార్లమెంట్ స్థానం స్థానికేతరులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే అభిప్రాయం కలుగుతోందని డాక్టర్ లీలా ప్రసాద్ అన్నారు.

తెన్నేటి విశ్వనాథం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెన్నేటి విశ్వనాథం

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో...

‘‘విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1960లో మొదలైనా 1962 తర్వాతే దాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఆ నిర్మాణ పనులను చేజిక్కించుకున్న అనేక మంది కాంట్రాక్టర్లు, వ్యాపారులు విశాఖకు వచ్చారు.

స్టీల్ ప్లాంట్ రాకతో వివిధ పరిశ్రమల్లో కూడా కాంట్రాక్ట్ పనులు పెరిగాయి. అలాంటి పనులు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన వారు ఆర్థికంగా స్థిరపడి ఇక్కడి రాజకీయాలపై కన్నేశారు.

పార్టీలు కూడా వారిని ఆదరించడం ప్రారంభించాయి. అందుకే 1985 తర్వాతే విశాఖ రాజకీయాల్లో స్థానికేతరుల ప్రభావం ఎక్కువగా కనిపించింది’’ అని రాజకీయ విశ్లేషకులు ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

వ్యాపారం కోసం వచ్చి రాజకీయాలు చేసిన వారు విశాఖ అభివృద్ధిని పట్టించుకోలేదు. అలా కాకుండా పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉన్న స్థానికేతరులు కొంత విశాఖ అభివృద్ధికి కృషి చేశారని యుగంధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

“గోల్డ్ స్పాట్ అనే శీతల పానీయం పరిశ్రమను ఏర్పాటు చేసి ‘‘గోల్డ్ స్పాట్ మూర్తి’’గా పేరు పొందిన ఏంవీవీఎస్ మూర్తి, స్టీల్ ప్టాంట్ కాంట్రాక్టులు చేసిన టి. సుబ్బిరామిరెడ్డి, ప్రస్తుతం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వంటి వారు తమ వ్యాపారాల అభివృద్ధికే రాజకీయాలను వాడుకున్నారు.

అంతేగానీ, విశాఖకి ఏమీ చేయలేదు. కానీ పురంధేశ్వరి, నేదురుమల్లి జనార్థన రెడ్డి, కంభంపాటి హరిబాబు వంటి వారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు. ఎంపీలుగా నగరాభివృద్ధిలో కాస్త చొరవ చూపారు. ప్రాజెక్టులు, రైల్వే లైన్లు తీసుకురావడంలో కొన్ని విజయాలు సాధించారు’’ అని ఆయన అన్నారు.

రానున్న ఎన్నికల్లో కూడా స్థానికేతరులే బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఎంవీవీ సత్యనారాయణ
ఫొటో క్యాప్షన్, ఎంవీవీ సత్యనారాయణ

స్థానిక నాయకులను ఎందుకు ఆదరించట్లేదు?

విశాఖపట్నంలో ఎక్కడా ‘స్థానిక’ అనే ఫీలింగ్ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్, నేవీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి.

వీటిలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వారంతా ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడిపోయారు.

దేశ రాజకీయాలను గమనిస్తూ పార్టీలనే చూస్తారు తప్పా అభ్యర్థి ఎవరు బరిలో ఉన్నారనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. నిజానికి గతంలో చాలా మందికి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం కూడా తెలిసేది కాదు.

దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీని చూసి ఓటు వేసేవారు. ఇప్పటికీ ఎంపీ ఎన్నికల విషయంలో అదే కొనసాగుతోందని బీబీసీతో స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగి ఎస్. శ్రీనివాసరావు అన్నారు.

భాట్టం శ్రీరామమూర్తి
ఫొటో క్యాప్షన్, భాట్టం శ్రీరామమూర్తి

‘‘రాజకీయాల్లో గెలుపోటములు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

డబ్బులున్న స్థానికేతరులు విశాఖ నుంచి పోటీ చేసి గెలిచి చూపిస్తున్నారు. స్థానిక నాయకులు కూడా వారికే జై కొడుతున్నారు. స్థానికులు కార్పోరేటర్ల స్థాయి వరకు వెళ్లగలుగుతున్నారు. పై స్థాయికి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.

ప్రయత్నం చేసిన వారికి విజయం దక్కడం లేదు’’ అని యుగంధర్ రెడ్డి చెప్పారు.

స్థానికేతరులే విశాఖ ఎంపీ సీటును పదే పదే కైవసం చేసుకుంటే స్థానిక ప్రజలకు, విశాఖపట్నం అభివృద్ధికి నష్టం కలుగుతుందని డాక్టర్ లీలా వరప్రసాద్ అన్నారు.

‘‘స్థానికేతరులకు ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ మాత్రం మమకారం ఉండదు. గెలిస్తే రాజకీయాలు, వ్యాపారాలు చేసుకుంటారు. గెలవకపోతే వ్యాపారాలు చూసుకుంటారు. కానీ, తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు’’ అని డాక్టర్ లీలా వరప్రసాద్ అన్నారు.

వరుసగా రెండు, మూడు సార్లు స్థానికులను గెలిపిస్తే అప్పుడు పార్టీలు కూడా స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తాయి. లేదంటే విశాఖ ఎంపీ సీటు విజయమనేది డబ్బున్న స్థానికేతరులకు కేక్ వాక్ అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)