ఒకే దేశం ఒకే ఎన్నికలు: అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం ముందున్న మార్గాలివే...

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శుక్రవారం ముంబయిలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి మూడో సమావేశం జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు అంతకుముందు రోజు కేంద్రం ప్రకటించింది. అయితే, సమావేశాల అజెండా ఏమిటో చెప్పలేదు.
కేంద్రం ప్రకటనలు, తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు అధికార పక్షం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
''దీనికి కేవలం రాజ్యాంగ సవరణ మాత్రమే కాదు, రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం'' అని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ అన్నారు.
హర్యానా, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీని రద్దు చేస్తారేమో కానీ, మిగిలిన రాష్ట్రాల్లో అలా చేయలేరని కమల్ నాథ్ తెలిపారు.
ఎన్నికలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని అడిగితే ఇప్పుడే కమిటీ వేశామని, అంత కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
‘’కమిటీ నివేదిక సిద్ధం చేస్తుంది. తర్వాత దానిపై పార్లమెంటులో చర్చ జరుగుతుంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి?
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అయితే, మళ్లీ అకస్మాత్తుగా ఈ పార్లమెంటు 'ప్రత్యేక సమావేశాలను' ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (జమిలి ఎన్నికలు) అనే అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు?
ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టవచ్చని, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలు కూడా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఇదో రకమైన 'డైవర్షన్' అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.
'బీజేపీ అసౌకర్యానికి గురవుతోంది'
"ఈ బిగ్ బ్యాంగ్ రాజకీయాలు ప్రజలను హిప్నటైజ్ చేయడానికే. అది బుల్లెట్ రైలు అయినా, పెద్ద ప్రాజెక్టుల ప్రకటన లేదా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు అయినా. ఇవి గొప్పవే కావచ్చు. కానీ వాటి లక్ష్యాలు పరిమితమే. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగాన్ని చాలా మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఇది సమాఖ్య నిర్మాణంపై దాడి, ఇది కోర్టుకు కూడా వెళ్లొచ్చు. దీని వెనుక గొప్ప ఉద్దేశమైతే నాకు కనిపించడం లేదు" అని బీబీసీతో వినోద్ శర్మ అన్నారు.
"ప్రతిపక్షం ప్రముఖంగా వార్తల్లోకి రావడం చూసి బీజేపీ అసౌకర్యానికి గురవుతోంది. అందరూ తనపై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తోంది. అందుకే ప్రత్యర్థి పార్టీలు ముంబయిలో ఉన్నప్పుడు ప్రత్యేక సెషన్ ప్రకటించారు. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే టాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత దానిపై ఎవరూ మాట్లాడలేదు. స్పీకర్ కూడా మౌనంగా ఉన్నారు'' అని అన్నారు వినోద్ శర్మ.
రాజ్యాంగ ప్రక్రియలను ప్రభుత్వం తన ఇష్టానుసారం ఉపయోగించుకుంటోందని, జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు. లేకపోతే ప్రత్యేక సమావేశపు అజెండా ఏమిటో చెప్పాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి?
జమిలి ఎన్నికలు అమలు చేయడం అంత సులువు కాదని సీనియర్ జర్నలిస్టు వినోద్ శర్మ తెలిపారు.
'రాజ్యాంగంలో అనేక సవరణలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల నుంచి సమ్మతి తీసుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలను రద్దు చేయాలి' అని అన్నారాయన.
"ఈ అంశం ఇంతకుముందూ లేవనెత్తారు. రాజ్యాంగ సవరణ ద్వాారానే ఇది సాధ్యమవుతుంది" అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ బీబీసీతో తెలిపారు.
మరోవైపు 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' సాధ్యమేనని, అన్ని అసెంబ్లీలను రద్దు చేయాల్సిన అవసరం లేదని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ అంటున్నారు.
"రాజ్యాంగాన్ని సవరించాలంటే ఉభయ సభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ప్రభుత్వానికి లోక్‌సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీకి ప్రయత్నించవచ్చు'' అని అన్నారు ప్రదీప్ సింగ్.
"14 రాష్ట్రాల ఆమోదం అవసరం. అదేం పెద్ద కష్టం కాదు. బీజేపీ దాని మిత్రపక్షాలకు 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి రెండు-మూడు రాష్ట్రాలు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి" అని ప్రదీప్ సింగ్ గుర్తుచేస్తున్నారు.
లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జమిలీ ఎన్నికలు సాధ్యమే. అయితే, రాజ్యసభకు ఇది సమస్య కావచ్చని ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.
"మరోవైపు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమే" అని ఆయన అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పరిగణనలోకి తీసుకున్నా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేస్తాయా అనే సందేహం కూడా ఉంది.
"ఇంతకుముందు ఈ విషయంలో రెండు ప్రతిపాదనలు వచ్చాయి. రెండు దశల్లో ఎన్నికలు జరపడం మొదటిది. దీనిలో భాగంగా లోక్‌సభ ఎన్నికలకు కొన్నినెలల ముందు, తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. రెండోది బీజేపీ దాని మిత్రపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలను వాటంతటవే రద్దు చేయడం. అనంతరం మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయడం. కానీ ఇందులో న్యాయపరమైన చిక్కులున్నాయి'' అని చెబుతున్నారు ప్రదీప్ సింగ్.
జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం కుదిరితే దానికి వనరులు ఏర్పాటుచేయడం సవాలుతో కూడుకున్నది. అన్నిచోట్లా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే మరిన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు అవసరం.
దేశంలోని పలు ప్రాంతాలు చాలా సున్నితంగా ఉంటాయి, ఇక్కడ అదనపు భద్రతా ఏర్పాట్లు అవసరం. ప్రభుత్వం ముందుకు వెళ్లే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.

ఫొటో సోర్స్, ANI
ఈ ఎన్నికల వల్ల ఎవరికి లాభం?
జమిలి ఎన్నికలు అనేవి ఈనాటి విషయం కాదని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ అంటున్నారు. దీని ప్రయత్నాలు 1983లోనే ప్రారంభమయ్యాయని, అయితే, ఇందిరాగాంధీ ఈ ప్రతిపాదన తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు.
నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతోంది, పార్టీ 2014 మేనిఫెస్టోలో కూడా ఈ ప్రస్తావన ఉంది.
''ఎన్నికలలో నల్లధనం పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుంది. ఎన్నికల ఖర్చుల భారం కూడా తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. పార్టీలు, అభ్యర్థులపై ఖర్చు తగ్గుతుంది'' అని ప్రదీప్ సింగ్ చెప్పారు.
''ఎన్నికల నిధులే పార్టీలకు అతిపెద్ద భారం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి, ఎందుకంటే అవి అసెంబ్లీకి, లోక్‌సభకు వేర్వేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు'' అని ఆయన తెలిపారు.
అయితే, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అంతిమంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి పెద్ద జాతీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు.
చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కష్టం కావచ్చంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా హయాంలోనే జమిలీ ఎన్నికలపై చర్చ
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్‌సభ, విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి.
1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది.
"ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశం పేర్కొంది. 2016 లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతీ ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని 2018లో లా కమిషన్ చెప్పింది. 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతిపక్షాలు బహిష్కరించాయి" అని ప్రదీప్ సింగ్ గుర్తుచేశారు.
''2022లో దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది. 2022 డిసెంబర్‌లో లా కమిషన్ అన్ని పార్టీలను సంప్రదించి, అభిప్రాయాన్ని కోరింది. వాస్తవానికి ప్రభుత్వం దీని కోసం చాలాకాలంగా సిద్ధమవుతోంది" అన్నారు ప్రదీప్ సింగ్.
జమిలి ఎన్నికలు ఏ దేశాల్లో జరుగుతున్నాయి?
సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు జరిగే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ.
బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తాయి. కానీ జనాభా పరంగా ఇవి ఇండియా కంటే చాలా చిన్న దేశాలు.
పొరుగు దేశం నేపాల్‌కు కూడా జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది. అక్కడ 2015లో కొత్త రాజ్యాంగం ఆమోదం పొందినపుడు 2017 ఆగస్టులో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- థర్మన్ షణ్ముగరత్నం: చైనీయులను వెనక్కి నెట్టి భారత సంతతి వ్యక్తి సింగపూర్ అధ్యక్షుడెలా అయ్యారు
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














