‘భారత్ ప్రాధాన్యాలకు పరీక్షగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన’.. నిపుణులేమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికితా యాదవ్, అభిషేక్ డే
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెసెట్)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన షెడ్యూల్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు ఉన్నాయి.
మోదీ పర్యటన షెడ్యూల్‌లో పాలస్తీనా నాయకులతో ఎలాంటి భేటీలు లేవు.
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి.
ఈ నేపథ్యంలో రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ఈ పర్యటన లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలను బ్యాలన్స్ చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.
ఈ తరుణంలో, మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారతదేశ విదేశాంగ విధానానికి ఒక పరీక్షగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
భారత్-ఇజ్రాయెల్ సంబంధాలలో 2017లో మోదీ తొలిసారి పర్యటన కీలక మలుపుగా పరిగణిస్తున్నారు. ఆ పర్యటనతో మోదీ.. ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నిలిచారు.
ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయి.
ఇజ్రాయెల్ నుంచి అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి.
మోదీ సందర్శించడం ఒక చారిత్రాత్మక పర్యటనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు.
''ఇజ్రాయెల్, భారత్ మధ్య ఉన్న బంధం రెండు ప్రపంచ స్థాయి దేశాల మధ్య ఏర్పడిన ఒక శక్తిమంతమైన కూటమి. నూతన ఆవిష్కరణలు, భద్రత, ఉమ్మడి వ్యూహాత్మక దార్శనికతలో మేము భాగస్వాములం. స్థిరత్వం, పురోగతికి కట్టుబడి ఉన్న దేశాల కూటమిని మేము సమష్టిగా నిర్మిస్తున్నాం'' అని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో రాశారు.
దీనిపై మోదీ స్పందిస్తూ, ''నమ్మకం, నూతన ఆవిష్కరణలు, శాంతి, పురోగతి పట్ల ఉమ్మడి నిబద్ధతతో నిర్మితమైన ఇజ్రాయెల్‌తో కూడిన ఈ శాశ్వత స్నేహానికి భారతదేశం ఎంతో విలువనిస్తుంది'' అని పేర్కొన్నారు.
''ఇజ్రాయెల్‌తో ఉన్న భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని చాటిచెప్పాలని కోరుకుంటోంది, అదే సమయంలో మిడిల్ఈస్ట్‌లో తన ప్రాధాన్యాలను సమతుల్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది'' అని విదేశీ వ్యవహారాల నిపుణుడు హర్ష్ వి పంత్ అన్నారు.

ఫొటో సోర్స్, Amir Ohana/X
హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్‌కు తన సంఘీభావం ప్రకటించింది. అదే సమయంలో, గాజాలో పౌరుల మరణాల పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ, 'ద్వి-దేశ పరిష్కారానికి' తన మద్దతును మరోసారి పునరుద్ఘాటించింది.
అయితే, ప్రాంతీయ ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో మోదీ పర్యటన జరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరికలు, ఏదైనా చిన్న ఘర్షణ అయినా అది చివరకు ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చనే భయాందోళనలు ఇక్కడ ప్రధానాంశంగా ఉన్నాయి.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా గత కొన్ని వారాలుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తన సైనిక ఉనికిని బలపరుస్తోంది. ఇది దశాబ్ద కాలంలోనే అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక మోహరింపులలో ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధానం...
మోదీ పర్యటన ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపైనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ప్రాంతీయ ఉద్రికత్తలపై జరిగే ఏవైనా చర్చలు దాదాపు 'రహస్యంగా' జరిగే అవకాశం ఉంది.
ఎందుకంటే, ఇరాన్‌తో, మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలతో కూడా భారత్ బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది.
''పాలస్తీనాను 1988లోనే భారతదేశం గుర్తించింది. రాజకీయంగా చేయాల్సింది చాలావరకూ ఇప్పటికే జరిగింది. భారతదేశం తన చిరకాల విదేశాంగ విధానం ప్రకారం, ఏ ప్రాంతంలోని వివాదాలను ఆ ప్రాంతంలోని దేశాలే పరిష్కరించుకోవాలి'' అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ మిడిల్ ఈస్ట్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కబీర్ తనేజా అన్నారు.
''తన సొంత విషయాల్లో ఇతర దేశాల జోక్యాన్ని భారతదేశం ఎలాగైతే కోరుకోదో, అదే సూత్రాన్ని మిడిల్ ఈస్ట్ దేశాల విషయంలోనూ వర్తింపజేస్తుంది'' అని చెప్పారు.
మోదీ పర్యటనపై భిన్నాభిప్రాయాలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బెన్-గురియన్ విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్ పార్లమెంటు (నెసెట్) భవనాన్ని భారత జాతీయ పతాకంలోని రంగుల విద్యుద్దీపాలతో త్రివర్ణశోభితంగా అలంకరించారు.
ఈ చిత్రాలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐజాక్ అమిత్‌ను పార్లమెంట్‌లో మోదీ పాల్గొనే ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించకపోతే, నెసెట్‌లో మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు హెచ్చరించాయి.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ఇటు భారతదేశంలో కూడా ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
పాలస్తానా ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరాం రమేష్ విమర్శించారు.
ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, భారత్ దీర్ఘకాలిక వ్యూహాత్మక సమీకరణాలను మోదీ పర్యటన ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోదీ పర్యటన ప్రధానంగా ద్వైపాక్షిక అవసరాల ఆధారంగానే సాగుతోందని తనేజా చెప్పారు.
కనెక్టవిటీ, ఇంధన భద్రతతో కూడిన భారతదేశపు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్‌లో ప్రాంతీయ స్థిరత్వం అనేది అత్యంత కీలకమని ఆయన అన్నారు.
ఒకవైపు భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను మోదీ ప్రశంస్తూనే, మరోవైపు ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శించే దేశాలతో భారతదేశానికి ఉన్న చిరకాల సంబంధాలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














