ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు కారణమేంటి, నెతన్యాహు లక్ష్యం ఏమిటి?

ఇరాన్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేసింది.
    • రచయిత, అమీర్ అజీమీ
    • హోదా, ఎడిటర్, బీబీసీ పర్షియన్

ఇరాన్‌పై దాడులకు ఆ దేశ అణు కార్యక్రమాలే కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అవి తమ దేశ మనుగడకు ముప్పు అని తెలిపారు. కానీ దీని వెనుక ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడమనే విస్తృత లక్ష్యం కూడా ఉన్నట్టుంది.

ఈ దాడుల వల్ల ఉత్పన్నమయ్యే వరుస పరిణామాలు ప్రజలలో అశాంతిని రేకెత్తించి ఇరాన్ పాలకుల పతనానికి దారితీస్తాయని ఆయన ఆశిస్తున్నారు.

శుక్రవారం (జూన్ 13) సాయంత్రం నెతన్యాహు మాట్లాడుతూ "ఇరాన్ ప్రజలు కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది, మీ గర్వించదగ్గ చరిత్రను తలుచుకొని, ఈ క్రూరమైన, కఠినమైన ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ కోసం పోరాడాలి" అని పిలుపునిచ్చారు.

ఇరాన్ ఆర్థిక దుస్థితి,భావప్రకటన స్వేచ్ఛ కొరవడటం, మహిళలు, మైనారిటీ వర్గాల హక్కులను పరిమితం చేయడంపై చాలామంది ఇరాన్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.

ఇజ్రాయెల్ దాడి ఇరాన్ నాయకత్వానికి నిజమైన ముప్పుగా పరిణమిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఐఆర్‌జీసీ సీనియర్ అధికారులు మరణించారు. అయితే, ఇజ్రాయెల్ దాడులు ఇంకా ముగియలేదు.

ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, లక్ష్యాలపై దాడి చేసినట్లు రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

నెతన్యాహు హెచ్చరిక

ఇరుదేశాలు దాడులకు దిగడంతో , పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు "మరికొన్ని దాడులు చేస్తాం" అని హెచ్చరించారు.

ఇరాన్‌లోని కొందరు నాయకులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ దాడులు ఇరాన్ ప్రభుత్వాన్ని కదిలించి, ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఇజ్రాయెల్ ఆశిస్తూ ఉండవచ్చు. నెతన్యాహు కోరుకుంటున్నది ఇదే.

కానీ ఇదొక జూదం - చాలా పెద్దది. ఎందుకంటే, అటువంటిది జరుగుతుందని స్పష్టమైన సంకేతం లేదు. నిరసనలు ప్రారంభమైనప్పటికీ, ఇదంతా ఎక్కడికి వెళుతుందో తెలియదు.

జెరూసలేం

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstoc

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్స్ ప్రయోగించింది.

మిడిల్ ఈస్ట్‌లో ప్రభావం

ఇరాన్‌లో సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వారి చేతుల్లోనే నిజమైన అధికారం ఉంది. ఇందులో ఎక్కువగా ఐఆర్‌జీసీకి చెందిన వారు, ఇతర ఎన్నిక కాని గ్రూపుల వారున్నారు. వారు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే, అది ఇప్పటికే వారి చేతుల్లో ఉంది. వారు మరింత దూకుడుగా స్పందించవచ్చు.

ప్రస్తుత సంక్షోభానికి మరొక ఫలితం ఏమిటంటే, ఇరాన్ ప్రభుత్వం కూలిపోయి, దేశాన్ని గందరగోళంలో పడేయవచ్చు. ఇరాన్‌లో దాదాపు 9 కోట్ల జనాభా ఉంది, కాబట్టి ఇక్కడి విషయాలు మిడిల్ ఈస్ట్‌ అంతటా ప్రభావాన్ని చూపవచ్చు.

ఇరాన్‌లో తిరుగుబాటు వచ్చి, కొత్త, స్నేహపూర్వక ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఇజ్రాయెల్ ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే - ఎవరు అధికారం చేపడతారు?.

ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్ ప్రతిపక్షాలు విడిపోయాయి.

2022లో "స్త్రీ జీవితం, స్వేచ్ఛ" పేరుతో సాగిన ఉద్యమంలోని నిరసనలు ఇరాన్‌ను కుదిపేశాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యతిరేక గ్రూపులను, వ్యతిరేక గళాలను ఏకం చేయడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించారు.

అయితే, వారి ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించాలి? ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధమైన వ్యవస్థ ద్వారా భర్తీ చేయాలి? అనే దానిపై వారిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

రాచరికమా?

ఇరాన్‌ను నడిపించడానికి అక్కడి కొన్ని ప్రతిపక్ష గ్రూపులను లేదా వ్యక్తులను ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలుగా చూడవచ్చు.

ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి ఇందుకు ఒక ఉదాహరణ.

1979 ఇస్లామిక్ విప్లవం సమయంలో ఆయన తండ్రి షాను అధికారం నుంచి తొలగించారు. రెజా పహ్లావి ప్రస్తుతం ఇరాన్ బయట నివసిస్తున్నారు. ఇతర దేశాల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో రెజా ఇజ్రాయెల్‌ను కూడా సందర్శించారు .

కొంతమంది ఇరానియన్లు రెజాకు మద్దతు ఇస్తున్నప్పటికీ, అది ఇరాన్ ప్రభుత్వంలో త్వరగా మార్పు తీసుకురావడానికి తగినంత బలంగా ఉందో లేదో స్పష్టంగా లేదు.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌ను నడిపించడానికి అక్కడి కొన్ని ప్రతిపక్ష గ్రూపులను లేదా వ్యక్తులను ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయాలుగా చూడవచ్చు.

బహిష్కరణకు గురై, ప్రవాసంలో ఉంటున్న ముజాహిదీన్-ఇ ఖల్క్ (ఎంఈకే) అనే ఒక ప్రతిపక్ష గ్రూపు కూడా ఉంది. వారు ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని దించాలని కోరుకుంటున్నారు కానీ, రాచరిక పాలనను వ్యతిరేకిస్తున్నారు.

ఎంఈకే ఒక వామపక్ష ముస్లిం గ్రూపుగా ప్రారంభమైంది, ఇరాన్ మాజీ రాజు (షా)ను తీవ్రంగా వ్యతిరేకించింది.1979 విప్లవం తర్వాత ఈ గ్రూపు ఇరాక్‌కు వెళ్లింది, 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ పక్షాన నిలిచింది. ఈ నిర్ణయం వల్ల చాలామంది ఇరానియన్లు ఎంఈకే గ్రూపును వ్యతిరేకించారు.

ఎంఈకే ఇప్పటికీ చురుకుగా ఉంది. అమెరికాలో ముఖ్యంగా డోనల్డ్ ట్రంప్‌కు దగ్గరగా ఉన్న కొందరితో స్నేహం ఉంది. ట్రంప్ మొదటి పదవీకాలంలో మైక్ పాంపియో, జాన్ బోల్టన్, రూడీ గియులియాని వంటి సీనియర్ యూఎస్ అధికారులు ఎంఈకే కార్యక్రమాలలో ప్రసంగించారు.

అయితే, ఈ గ్రూపుకు ఇప్పుడు వైట్‌హౌస్‌లో తక్కువ ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది.

కొన్నిపార్టీలు లౌకిక ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుండగా, మరికొన్ని పార్లమెంటరీ రాచరికానికి మద్దతు ఇస్తున్నాయి.

ఇక, జూన్ 13 దాడులపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. గత సంవత్సరం కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరాటం జరిగింది. దాన్ని ప్రభుత్వాన్ని దించడానికి ఒక అవకాశంగా ఇరానియన్లు భావించినట్లు బలమైన సంకేతాలు కనిపించలేదు.

అయితే, శుక్రవారం దాడులు చాలా వినాశకరంగా ఉన్నాయి, కాబట్టి ఈసారి పరిస్థితి భిన్నంగా మారవచ్చు.

నెతన్యాహు, ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ (ఫైల్)

ఇస్లామిక్ రిపబ్లిక్ 'అంతిమ పోరాటం'

ఇరాన్ ఇప్పుడు ఏం సాధించడానికి ప్రయత్నిస్తోంది?

ఇజ్రాయెల్‌లోని అనేక లక్ష్యాలను ఇరాన్ ఛేదించినప్పటికీ, దానికి అంత మంచి అవకాశాలు ఉన్నట్లు అనిపించడం లేదు.

అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించి, ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించడం ఇరాన్‌కు సురక్షితమైన మార్గం అని కొంతమంది భావిస్తున్నారు.

కానీ, ఇరాన్ నాయకులకు ఇది ఇబ్బందికరం. ఎందుకంటే, ట్రంప్ డిమాండ్ మేరకు చర్చలకు వస్తే, వారు ఓటమిని అంగీకరించినట్లేనని అనుకుంటారు.

ఇరాన్‌కు ఉన్న మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా దానిపై దాడి చేస్తూ ఉండటం. ప్రస్తుతం వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నది ఇదే అనిపిస్తోంది.

ప్రతీకారం తీర్చుకుంటామని తమ మద్దతుదారులకు ఇరాన్ నాయకులు హామీ ఇచ్చారు. అలాగే కొనసాగిస్తే, ఇజ్రాయెల్ ప్రతిస్పందన దాడులకు దిగవచ్చు.

ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ గతంలో కూడా బెదిరించింది. కానీ, అదంత సులభం కాదు, అలా చేస్తే అమెరికాను నేరుగా ఈ వివాదంలోకి లాగినట్లవుతుంది, ఈ పరిణామం తలెత్తకుండా ఇరాన్ నిజంగా నివారించాలనుకుంటోంది.

ఈ ప్రత్యామ్నాలు ఏవీ సులభం కాదు, ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కష్టం. పరిస్థితులు ఇప్పటికీ అనిశ్చితంగానే ఉన్నాయి. స్పష్టంగా కనిపించే వరకు పూర్తి ప్రభావం తెలియదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)