20 ఏళ్లనాటి హనీమూన్ హత్య కేసు: చెన్నై జంట విషయంలో ఆరోజు ఏం జరిగింది, ఆటోడ్రైవర్ ఇచ్చిన క్లూ నిందితులను ఎలా పట్టించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీథరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో భార్య సోనమ్ నిందితులరాలని పోలీసులు చెబుతున్నారు . కేరళలో కూడా 20 ఏళ్ల కిందట ఇలాంటి హనీమూన్ హత్యే జరిగింది. ఈ కేసులోనూ భార్యే నిందితురాలు. ఈ కేసు కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కుదిపేసింది. అసలు 20 ఏళ్ల కిందట ఏం జరిగింది. భార్యే దోషి అని పోలీసులు ఎలా కనిపెట్టారు?
ఎన్నో ఆశలతో మొదలైన హనీమూన్ ప్రయాణం.. కాళరాత్రిలాగా ముగిసింది. భర్త హత్యకు గురయ్యారు. భార్య ప్రస్తుతం దోషిగా జైలులో ఊచలు లెక్కపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం ఈ కేసు కేరళను కుదిపేసింది. అయితే, హనీమూన్ కోసం మున్నార్ వెళ్లిన ఈ చెన్నై జంట విషయంలో అసలేం జరిగిందో చూద్దాం..

మున్నార్‌లో విషాదం
ఆరోజు 2006 జూన్ 18.
నైరుతి రుతుపవనాలు అప్పుడప్పుడే కేరళలో విస్తరిస్తున్నాయి.
మున్నార్ పొంగమంచు కొండల మధ్యన, అందమైన కుండాలా డ్యామ్‌కు సమీపంలో శ్రీవిద్య అనే 24 ఏళ్ల యువతి ఏడుస్తూ కనిపించింది. ఇద్దరు దొంగలు తనపై, తన భర్తపై దాడి చేశారని, 25 వేల రూపాయలు దోచుకుని తన భర్తను చంపేశారని విలపించింది.
ప్రసిద్ధ పర్యటక ప్రాంతమైన మున్నార్‌లో జరిగిన ఈ హత్య కేరళను కుదిపేసింది. మున్నార్ డిప్యూటీ సూపరింటెండెంట్ కే.ఏ. మొహమ్మద్ ఫైసల్ నేతృత్వంలోని పోలీసుల బృందం వెంటనే విచారణ ప్రారంభించింది.
శ్రీవిద్యతోనే వారు తమ విచారణ మొదలుపెట్టారు.
డ్యామ్‌కు సమీపంలో తను, తన భర్త కూర్చుని ఉండగా, ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని శ్రీవిద్య పోలీసులకు చెప్పింది. భర్తను చంపేసి, తమ వస్తువులను దోచుకెళ్లినట్లు తెలిపింది. ఆమె చెప్పిన సమాచారం మేరకు దుండగుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
అప్పుడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
క్లూ ఇచ్చిన ఆటో డ్రైవర్
అన్బళగన్ అనే ఆటో డ్రైవర్ ఒక కీలకమైన ఆధారంతో పోలీసుల వద్దకు వచ్చారు. ఆరోజు ఇద్దరు వ్యక్తులను డ్యామ్ సమీపంలో దించినట్లు ఆయన చెప్పారు. అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఆ ఇద్దరి వ్యక్తులలో ఒకరు తన ఫోన్ తీసుకున్నాడని ఆటో డ్రైవర్ తెలిపారు.
ఆ తర్వాత ఆ ఫోన్‌కు ఒక అనుమానాస్పద టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. అది నేరం జరిగిన ప్రదేశాన్ని సూచించింది. ఈ ఆధారమే విచారణను ఒక మలుపు తప్పింది. ఈ హత్యకు కారణం శ్రీవిద్యే అని పోలీసులు త్వరగానే గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమ కథ ప్రాణాంతకంగా ఎలా మారింది?
శ్రీవిద్య చెన్నై పమ్మాళ్ శంకర్‌నగర్‌లో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె మెడికల్ ట్రాన్స్‌స్కిప్టర్‌గా పనిచేసేవారు. అనకాపుత్తూర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తితో శ్రీవిద్య ప్రేమలోపడ్డారు.
అయితే ఈ సంబంధాన్ని శ్రీవిద్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈమేరకు వారు చెన్నైలోని ఓ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల అనంతరామన్‌తో వివాహం కుదిర్చారు. 2006 జూన్ 7న వారి పెళ్లి జరిగింది.
తరువాత ఈ జంట హనీమూన్ కోసం గురువయూర్, మున్నార్‌ను ప్లాన్ చేసుకున్నారు. తమను కేరళ అంతా తిప్పేందుకు శామ్ విన్సెంట్ అనే డ్రైవర్‌నూ నియమించుకున్నారు. రైలులో ఈ జంట త్రిస్సూర్‌కు చేరుకున్నాక, డ్రైవర్ శామ్ వారిని గురువాయూర్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మున్నార్ వెళ్లారు. వారు చాలా సంతోషంగా ప్రయాణమంతా నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
కుండాలా డ్యామ్‌కు ఎకో పాయింట్ వద్ద ఈ జంటను దించాక, కారు పార్కు చేసి శామ్ నిద్రలోకి జారుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీవిద్య అరుపులకు ఉలిక్కిపడి లేచారు శామ్. ఎవరో తమపై దాడి చేశారని, తన భర్త చనిపోయారని ఆమె గట్టిగట్టిగా ఏడుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు శామ్.
పోలీసులు తొలుత శ్రీవిద్య చెప్పిన కథను నమ్మారు. కానీ, ఆటో డ్రైవర్ అన్బళగన్ ఇచ్చిన ఆధారం ఆనంద్, ఆయనకు సహకరించిన అంబురాజ్‌ను పట్టించింది. వీరిద్దరూ మున్నార్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మరో ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు అప్పగించారు.
శ్రీవిద్య, ఆనంద్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని విచారణలో తెలిసింది. 2004 నుంచి తాము కాంటాక్ట్‌లో లేమని శ్రీవిద్య చెప్పినప్పటికీ, పోలీసులకు దొరికిన ఆధారం ఈ నేరంలో మరో కోణాన్ని తెలియజేసింది. ఆనంద్ వద్ద దొరికిన స్లిప్‌లో శ్రీవిద్య రాసిన హనీమూన్ ప్రయాణ వివరాలు ఉన్నాయి.
హత్యకు ముందు ఎన్నోసార్లు ఆనంద్‌కు ఆమె కాల్ చేసినట్లు ఫోన్ రికార్డుల్లో తేలింది.
నిజం ఎప్పటికైనా నిరూపితమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయం దక్కింది
శ్రీవిద్య, ఆనంద్, అంబురాజ్‌లను అరెస్ట్ చేసి, దేవికులమ్ జైలుకు పంపారు. ఈ కేసులో ఆనంద్ ప్రధాన నిందితుడు కాగా, అంబురాజ్ రెండు, శ్రీవిద్య మూడో నిందితులుగా ఉన్నారు.
అయితే కోర్టు విచారణలో ఈ ముగ్గురు తమ ప్రమేయాన్ని అంగీకరించలేదు. కానీ, శ్రీవిద్య, ఆనంద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు వారి తలరాతను నిర్ణయించాయి. కోర్టు 2007 సెప్టెంబర్‌లో ఆనంద్, శ్రీవిద్యలకు రెట్టింపు జీవిత ఖైదు, జరిమానా, అంబురాజ్‌కు జీవిత ఖైదు విధించింది.
ఆ తర్వాత వారు కేరళ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ,అప్పీల్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ 2019 ఫిబ్రవరి 15న అప్పీల్‌ను తిరస్కరించింది.
(ఈ కథనంలోని వివరాలు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాసినవి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














