హర్షిత బ్రెల్లా: ఈ అమ్మాయిని లండన్‌లో ఎవరు చంపారు? భర్తే హంతకుడా

హర్షిత బ్రెల్లా

ఫొటో సోర్స్, Family

ఫొటో క్యాప్షన్, భర్తతో కలిసి యూకే వెళ్లిన హర్షిత బ్రెల్లా గతవారం చనిపోయారు.
    • రచయిత, సమీరా హుస్సేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీకి చెందిన హర్షిత బ్రెల్లా అనే మహిళ తూర్పు లండన్‌లో హత్యకు గురయ్యారు. కారులో ఆమె శవమై కనిపించారని అక్కడి పోలీసులు తెలిపారు.

హర్షిత తల్లి సుదేష్ కుమారి బీబీసీతో మాట్లాడుతూ.. ‘నా కూతురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆమె సోదరి సోనియా దబాస్ కూడా బీబీసీతో మాట్లాడారు. పంకజ్ లాంబాతో వివాహం నిశ్చయించుకున్న తర్వాత ఏప్రిల్‌లో యూకే వెళ్లేందుకు హర్షిత 'చాలా ఉత్సాహంగా ఉన్నారు' అని సోనియా తెలిపారు.

హర్షిత(24)ను హత్య చేసి ఆమె మృతదేహాన్ని తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించారని నార్తాంప్టన్‌షైర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

తర్వాత నిందితుడు దేశం విడిచి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

"నా అల్లుడిని చట్టం ముందు నిలబెట్టాలి, నా కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని హర్షిత తండ్రి సత్బీర్ బ్రెల్లా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హర్షిత కుటుంబం
ఫొటో క్యాప్షన్, హర్షిత బ్రెల్లా తల్లి సుదేష్ కుమారి (ఎడమ), సోదరి సోనియా దబాస్ (కుడి)

'చాలా సింపుల్‌గా ఉండేది'

తన కూతురు చాలా సింపుల్‌గా ఉండేదని, బాధ్యతతో వ్యవహరించేదని సత్బీర్ తెలిపారు. హర్షిత టీచర్‌ కావాలనుకున్నారని, తన చదువుపైనే దృష్టి సారించడంతో పాటు దిల్లీలో ఉండగా ఇంట్లో పిల్లలకు ట్యూషన్‌ చెప్పేదని ఆయన చెప్పారు.

హర్షితతో బంధం విడదీయరానిదని ఆమె సోదరి అన్నారు.

"ఆమె నాలో భాగం, నేను ఆమెలో ఒక భాగం. తను లేకుండా ఏం చేయలేననిపిస్తోంది" అని సోనియా చెప్పారు.

"మేం రోజంతా మాట్లాడుకునేవాళ్లం. తను ఫోన్‌లో నా పేరుని 'హార్ట్‌బీట్' అని సేవ్ చేసింది. అది మా బంధాన్ని చూపుతుంది" అని అన్నారు.

నవంబర్ 10న చివరిసారిగా హర్షితతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి భోజనం వండుకున్నానని, పంకజ్ ఇంటికి వచ్చే వరకు వేచి చూస్తానని హర్షిత చెప్పారని సోనియా తెలిపారు.

తన సోదరి ఫోన్ రెండు రోజులు స్విచ్ ఆఫ్ వచ్చిందని సోనియా తెలిపారు. దీంతో జరగరానిది ఏదో జరిగిందని అనుమానించిన కుటుంబీకులు, ఫిర్యాదు చేయవలసిందిగా తెలిసినవారిని కోరారు.

ఈ నెల 13న హర్షిత విషయంలో ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేయగా ఆమె మృతదేహం లభ్యమైందని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని వారు తెలిపారు.

పంకజ్ లాాంబా

ఫొటో సోర్స్, Northamptonshire Police

ఫొటో క్యాప్షన్, పంకజ్ లాంబా లండన్‌లో చదువుకుంటున్నారని హర్షిత సోదరి సోనియా చెప్పారు.

ఏప్రిల్‌లో యూకే పయనం

హర్షిత, పంకజ్ లాంబాల వివాహం 2023 ఆగస్టులో చట్టబద్ధంగా జరిగిందని సోనియా తెలిపారు.

2024 మార్చి 22న ఇద్దరికీ సంప్రదాయ పద్దతిలో వేడుక చేశారు, ఏప్రిల్ 30న దంపతులు యూకే వెళ్లారు. అక్కడ నార్తాంప్టన్‌షైర్‌లోని కార్బీకి వెళ్లి స్థిరపడ్డారు.

పంకజ్ లండన్‌లో చదువుకుంటున్నారని, హర్షిత ఒక గోదాంలో పనిచేసేవారని సోనియా తెలిపారు.

హర్షిత ఇండియాలో టీచర్‌గా ఉండాలని కోరుకున్నారని ఆమె సోదరి అన్నారు.

లండన్‌లో తన సోదరి జీవితం సంతోషంగా సాగలేదని ఆమె అన్నారు.

హర్షిత బ్రెల్లా

ఫొటో సోర్స్, family

ఫొటో క్యాప్షన్, హర్షితకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, యూకేకి వెళ్లిన తర్వాత, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేయలేదని సోదరి సోనియా చెప్పారు.

‘భర్త కొడుతున్నట్లు చెప్పేవారు’

"భర్త కారణంగా తను చాలా ఇబ్బందులు పడింది. ఆయనను వదిలేసి ఇండియా తిరిగి వచ్చేయమని కూడా చెప్పాను" అని సోనియా గుర్తుచేసుకున్నారు. హర్షితను ఆయన నుంచి దూరంగా ఉంచాలనుకున్నామని ఆమె తెలిపారు.

హర్షితకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, అయితే యూకేకి వెళ్లిన తర్వాత, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేయలేదన్నారు. ఎందుకు పోస్టులు పెట్టడం లేదని అడిగినప్పుడు, అలా చేయనివ్వడం లేదని చెప్పినట్లు సోనియా తెలిపారు.

"ప్రతిదానికీ నియమాలు పెట్టారు. మేకప్, మంచి దుస్తులు వేసుకోవడానికి కూడా అనుమతి లేదు" అని ఆమె తెలిపారు.

సమయానికి ఆహారం వండకుండా, తల్లితో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్లు హర్షితపై భర్త ఫిర్యాదు చేసినట్లు ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు.

ఇంటి నుంచి పారిపోయినట్లు హర్షిత ఆగస్టులో తన తండ్రికి ఫోన్ చేసి చెప్పారని సోనియా తెలిపారు.

"పంకజ్ తనను కొడుతున్నారని, తప్పించుకున్నానని హర్షిత చెప్పింది. ఆమె వీధిలోకి పరుగెత్తినా పంకజ్ వెంటాడి మరీ కొట్టినట్లు చెప్పింది. స్థానిక వ్యక్తి చూసి ఏం జరుగుతుందని అడగడంతో పంకజ్ ఆగిపోయారని.. వెంటనే హర్షిత తనకు తెలిసిన వారికి ఫోన్ చేయగా, వారు ఆమెను తీసుకెళ్లడానికి వచ్చారు" అని సోనియా వివరించారు.

సెప్టెంబరు ప్రారంభంలో ఆమెకు గృహ హింస రక్షణ ఆర్డర్ లభించింది, ఇది 28 రోజుల పాటు కొనసాగింది. హర్షిత మరణానికి ముందు ఈ ఆర్డర్ అమల్లో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. గతంలో హర్షిత సమస్యను డీల్ చేసినందున ఈ కేసును ఇండిపెండెంట్ ఆఫీస్ ఫర్ పోలీస్ కాండక్ట్‌కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

హర్షిత మృతదేహం భారత్‌కు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె తండ్రి బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)