‘‘వీల్‌చైర్‌కే పరిమితమయ్యాననే జాలితో సెక్స్ ఆఫర్ చేశారు’’

ఫొటో సోర్స్, BBC News
- రచయిత, జెమ్మా డాన్‌స్టాన్
- హోదా, బీబీసీ వేల్స్
వీల్‌చైర్‌కే పరిమితం అయ్యావు కదా సెక్స్ చేయగలవా అని ఓ వ్యక్తి అడిగినప్పుడు హోలీ వయస్సు 16 ఏళ్లు. ఆ తరువాత కూడా ఆమెకు ఇలాంటివే అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. నువ్వు రఫ్ సెక్స్ చేయగలవా, అలా సెక్స్ చేసేటప్పుడు వీల్ చైర్ అవసరమా లాంటి ప్రశ్నలను ఆమె ఎదుర్కొన్నారు.
‘‘జనం నాకేదో మేలు చేస్తున్నామని, ఇంకా చెప్పాలంటే నా కోసం త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవారు. కానీ వాళ్ల మాటలకు నేనెప్పుడూ ఆశ్చర్యపోలేదు, బాధపడలేదు’’. అంటారు హోలీ.
ఇప్పుడు హోలీ వయస్సు 26 ఏళ్లు. ఆమెకు క్రానిక్ పెయిన్, హైపర్ మొబిలిటీ సిండ్రోమ్ ఉన్నాయి.
డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన మూసధోరణులను సవాలు చేస్తూ మాట్లాడిన కొంతమంది వికలాంగ మహిళల్లో హోలీ కూడా ఒకరు.
వికలాంగులకు కూడా రిలేషన్‌షిప్ సంతోషకరంగా ఉండటం చాలా ముఖ్యమని హోలీ గ్రేడర్ అన్నారు.
హోలీ భర్త పేరు జేమ్స్. టీనేజర్‌గా ఉన్నప్పుడే జేమ్స్‌తో ఆమె డేటింగ్ మొదలుపెట్టారు. వారిద్దరి బంధానికి తొమ్మిదేళ్లు.
ఈ ఏడాది మొదట్లో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

‘అందరికీ అదే సందేహం’
‘‘మీడియాలో తరచుగా వికలాంగులు దుర్భరంగా బతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. మేం కేవలం కన్నీటి కథల్లోనే ఉంటాం’’ అని ఆమె అన్నారు.
జేమ్స్ తనకెప్పుడూ మద్దతుగా నిలిచాడని, ఇతరులు మాత్రం తన పట్ల మూసధోరణిని ప్రదర్శరిస్తుంటారని హోలీ చెప్పారు.
‘‘నా ఆరోగ్యం మరింత పాడైతే అతను నన్ను వదిలేస్తాడని అందరూ నాతో చెప్పేవారు. అతనికి భారంగా మారతానని లేకపోతే నన్ను చూసుకోవడం అతనికి చాలా కష్టమవుతుందని అనేవారు’’ అని హోలీ గుర్తు చేసుకున్నారు.
స్కూల్లో తన గురించి కొన్ని ఊహాగానాలు వచ్చేవని, వాటి గురించి కొంతమంది తనను అడిగేవారని హోలీ చెప్పారు.
‘‘వీల్ చైర్ వాడే వ్యక్తులను చూడగానే అందరికీ ఆ వ్యక్తి సెక్స్‌లో పాల్గొనగలరా? అనే సందేహం వస్తుంది. నాతోపాటు చదువుకునే కొందరు అబ్బాయిలు నన్ను కొన్ని అనుచిత ప్రశ్నలు, వ్యక్తిగత విషయాలు అడిగేవారు. నీతో కేవలం వీల్‌చైర్‌లోనే సెక్స్ చేయాలా? నీతో రఫ్ సెక్స్ చేయడం సాధ్యమవుతుందా? వంటి ప్రశ్నల్ని ఎదుర్కొన్నాను’’ అని హోలీ తెలిపారు.
కొందరు తనకు సోషల్ మీడియాలో సెక్స్ గురించి మెస్సేజ్‌లు చేసేవారని, తాము ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు తనకుఏదో మేలు చేసినట్టుగా భావించేవారని హోలీ చెప్పారు.
మీడియాలో వికలాంగులకు సంబంధించి సానుకూల కథనాలను చూడాలని హోలీ కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, RAM Photography & Film
‘చూపు లేదు కదా, ఎలా సెక్స్ చేస్తారు?’
కేర్ఫిలీకి చెందిన నికోలా థామస్ వయస్సు 38 ఏళ్లు. ఆమె అంధురాలు.
ప్రజలు తనను అడిగే అత్యంత సాధారణ ప్రశ్నల్లో ‘మీరెలా సెక్స్ చేస్తారు?’ అనే ప్రశ్న ఉంటుందని ఆమె చెప్పారు.
ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తుందని, అది చాలా వ్యక్తిగత, అనుచితమైన ప్రశ్న అని ఆమె అన్నారు.
నికోలాకు న్యూరోమైలైటిస్ ఆప్టికా అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది. ఆమె ఒక కన్నుకు పదిహేనేళ్ల క్రితం, మరో కన్నుకు అయిదేళ్ల క్రితం చూపు పోయింది.
‘‘చాలామంది అంధత్వంలోని అడ్డంకులను చూస్తారు. నేను అలాంటి అడ్డంకులను అధిగమించే వ్యక్తిని’’ అని నికోలా అన్నారు.
సెయిలింగ్, ప్యాడిల్‌బోర్డింగ్, ట్రావెలింగ్ ఆమె హాబీలు.

ఫొటో సోర్స్, Nicola Thomas
నికోలాకు బాయ్‌ఫ్రెండ్ ఉండేవారు. ఆమెకు చూపు పోయిన తర్వాత వారు విడిపోయారు.
‘‘నన్ను భారంగా భావించాడు. ఆమెకు జీవితాంతం సంరక్షకునిగా ఉండలేవని అందరూ అనేవారు. కానీ, నాకు ఒక సంరక్షకుడు అవసరం లేదు. అయినా ఇప్పుడు నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకు కూడా దృష్టి లోపం ఉంది. మేం ఇద్దరం అంధులం అయినప్పటికీ నగరంలో మాకు నచ్చిన చోటుకు వెళుతుంటాం. మమ్మల్ని ఏదీ ఆపలేదు’’ అని నికోలా చెప్పారు.
డేటింగ్ కోసం సోషల్ మీడియాలో తనకు సందేశాలు వస్తుంటాయని, తానొక అంధురాలినని చెప్పినప్పుడు వారు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని నికోలా తెలిపారు.
‘‘నాకేదో మేలు చేస్తున్నట్లుగా వారు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తనతో నా మనసు చివుక్కుమంటుంది. ఇలాంటి మూస పద్ధతులు అంతం కావాలి. నాది సంతోషకరమైన జీవితం’’ అని నికోలా చెప్పారు.
అందరిలాగే వికలాంగులకు కూడా మంచి రిలేషన్‌షిప్‌లో ఉండే, లైంగిక గుర్తింపును అన్వేషించే హక్కు ఉందని కాట్ వాట్కిన్స్ అన్నారు.
వేల్స్‌లో వికలాంగులు రాజకీయాలలో పాల్గొనడానికి కృషి చేస్తున్న సంస్థలో ఆమె పనిచేస్తున్నారు.
‘‘సెక్స్, రిలేషన్‌షిప్ విషయానికొచ్చేసరికి వికలాంగులను విడిగా ఎందుకు చూస్తారు?’’ అని ఆమె ప్రశ్నించారు.
వికలాంగులైన మహిళలకు ప్రజలు ఇచ్చే మెస్సేజ్‌లకు సంబంధించిన ఉదాహరణలు వినడం అత్యంత విచారకరంగా ఉంటుందని చెప్పారు.
‘‘మీరు మీతో సౌకర్యవంతంగా ఉండాలి. మీ శరీరాన్ని అర్ధం చేసుకోవాలి. మీ శరీరాన్ని మీరు ప్రేమించాలి’’ అంటారు ఆమె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














