వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

వివాహం అందించే భద్రత, సమాజపు ఆమోదం, పురోగతి, స్థిరత్వం వంటివి లివ్-ఇన్ రిలేషన్ షిప్ (సహజీవనం) ఎప్పటికీ అందించలేదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక కేసులో వ్యాఖ్యానించింది.

భారత్‌లో సహజీవనంపై చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి మద్దతు తెలిపే వ్యక్తులు ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుగా చెబుతూ సమర్థించుకుంటున్నారు.

వ్యతిరేకించే వారు సామాజిక విలువలు, భారతీయ సంస్కృతితో ముడిపెడుతూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదే సమయంలో సహజీవనంలో ఉన్న స్త్రీలను సమాజం భిన్న కోణంలో చూస్తోంది.

సహజీవనంపై పార్లమెంట్ ఎలాంటి చట్టాన్ని రూపొందించనప్పటికీ న్యాయస్థానాలు తన తీర్పుల ద్వారా అటువంటి సంబంధాల చట్టపరమైన స్థితిని గుర్తుచేస్తున్నాయి.

అయితే, ఈ కేసులలో దేశంలోని పలు కోర్టులు విభిన్న స్టాండ్‌లు తీసుకోవడం గమనార్హం.

సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది?

ఈ దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేసే పని వ్యవస్థీకృతంగా జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ వ్యాఖ్యానించారు.

సమాజాన్ని అస్థిరపరుస్తూ, దేశ ప్రగతికి ఆటంకం కలిగించే ధోరణిని ప్రదర్శిస్తున్న సినిమాలు, టీవీ సీరియల్స్ వివాహ వ్యవస్థను నాశనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

వివాహ సంబంధంలో భాగస్వాముల మధ్య గొడవలను ఎత్తిచూపుతూ, సహజీవనాన్ని ఒక ప్రోగ్రెస్సివ్ సొసైటీకి నిదర్శంగా చూపుతున్నారని, దానివల్ల యువత అటువైపు ఆకర్షితమవుతోందని కోర్టు పేర్కొంది.

అయితే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో వివాహ వ్యవస్థను కాపాడటం పెద్ద సమస్యగా మారినట్లే, భారత్‌లో వివాహ వ్యవస్థ పూర్తిగా నిరుపయోగంగా మారినప్పుడు మాత్రమే సహజీవనం అన్నది సరైనదిగా పరిగణిస్తారని కోర్టు అభిప్రాయపడింది.

''కుటుంబంలో సత్సంబంధాలు లేకుంటే దేశ ప్రగతికి సహకరించలేరు. ఒక దేశం సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఆ దేశంలోని మధ్యతరగతి, దాని నైతికతపై ఆధారపడి ఉంటుంది'' అని కోర్టు తెలిపింది.

కోర్టులు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేసింది?

పెళ్లిచేసుకుంటానని తనతో ఏడాదిపాటు తన పార్ట్‌నర్ సహజీవనం చేశాడని, అనంతరం పట్టించుకోవడం లేదని ఓ మహిళ అలహాబాద్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాను గర్భం దాల్చడంతో అబార్షన్‌కు తన పార్ట్‌నర్ మందులు ఇచ్చారని, అయితే, వివాహం గురించి అడిగితే నిరాకరించాడని మహిళ పిటిషన్‌లో పేర్కొంది.

ఈ కేసులో నిందితుడికి బెయిల్ లభించినప్పటికీ 'లివ్ ఇన్ రిలేషన్ షిప్' విషయంలో కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది.

"సహజీవనం యువతను ఆకర్షిస్తుంది, కానీ కాలం గడిచేకొద్దీ మధ్యతరగతి నియమాలు, సామాజిక నైతికత వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

తమ బంధానికి ఆమోదం లేకపోవడం వల్ల సాధారణ సామాజిక జీవితాన్ని గడపలేమని అలాంటి జంటలు తరువాత తెలుసుకుంటాయి.

అంతేకాదు విడిపోయిన తర్వాత ఈ సమాజాన్ని మహిళ ఎదుర్కోవడం కష్టమవుతుందని కూడా కోర్టు పేర్కొంది. మధ్యతరగతి సమాజం ఈ స్త్రీని మరోలా చూస్తుందని తెలిపింది.

"సహజీవనం తర్వాత స్త్రీ జీవితంలోఅసభ్యకరమైన వ్యాఖ్యల నుంచి సామాజిక బహిష్కరణ వరకు అనేక విషయాలు భాగంగా మారతాయి. ఆ తర్వాత ఆమె ఈ సహజీవనాన్ని వివాహంగా మార్చుకోవాలని భావిస్తుంది. తద్వారా సామాజిక ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తుంది.'' అని కోర్టు తెలిపింది.

రంజనా కుమారి

ఫొటో సోర్స్, RANJANA KUMARI FB

ఫొటో క్యాప్షన్, రంజనా కుమారి

పురుషులకు ఇబ్బంది ఉండదు, మహిళలకే..

ఒక పురుషుడు సహజీవనానికి లేదా పెళ్లికి యువతిని వెతకడంతో పెద్దగా ఇబ్బంది పడడని, కానీ, యువతికి పురుషుడిని వెతకడం కష్టమని అలహాబాద్‌లో హైకోర్టు వ్యాఖ్యానించింది.

అయితే శతాబ్దాలుగా సహజీవనం సమాజంలో భాగమైందని, అలాంటి సంబంధాలకు చోటు ఉందనీ నిపుణులు అంటున్నారు.

కోర్టు వ్యాఖ్యలు సహజీవన సంబంధాలకు విరుద్ధమని, మహిళల పట్ల వివక్ష చూపడమేనని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి అంటున్నారు.

పెళ్లి సామాజిక, కుటుంబ గుర్తింపును ఇస్తాయనే మనస్తత్వం భారతీయ సమాజంలో ఇప్పటికీ కొనసాగుతోందని ఆమె అన్నారు.

తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన వివాహాన్ని నిలబెట్టుకోవడానికి స్త్రీ అన్ని ప్రయత్నాలు చేస్తుందనేది ప్రబలంగా ఉన్న నమ్మకమని రంజనా కుమారి చెప్పారు.

''సహజీవనంలో స్త్రీకి తన భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. ఆమె సొంత నిబంధనలపై స్వేచ్ఛగా జీవించగలదు. కానీ వివాహంలో ఆమె దోపిడీకి గురవుతూనే ఉంటుంది'' అని ఆమె అంటున్నారు.

సమాజం సహజీవనాన్ని అంగీకరించడానికి సమయం పడుతుందని ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు.

అయితే, భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ఇందులో స్వేచ్ఛ, జీవించే హక్కు, ఒకరి భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉన్నాయి. అలాంటప్పుడు స్త్రీ తన హక్కులను ఎలా వదులుకుంటుంది? అనేది వారు వేస్తున్న ప్రశ్న.

గత ఎనిమిదేళ్లుగా పుణెలో రైట్ టు లవ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు అభిజీత్.

“ఒక స్త్రీ పెళ్లికి ముందు అబ్బాయితో కలిసి జీవించి, ఆ తర్వాత అదే భాగస్వామిని వివాహం చేసుకోవాలనుకుంటే అది ఆమె ఇష్టం. ఆ బంధం నుంచి బయటికి రావచ్చు లేదా కొనసాగించవచ్చు'' అన్నారు అభిజీత్.

అభిజీత్
ఫొటో క్యాప్షన్, అభిజీత్

సహజీవనంలో మహిళకు హక్కులుంటాయా?

కొద్ది నెలల క్రితం శ్రద్ధా వాల్కర్, అఫ్తాబ్ కేసు మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సహజీవనం గురించి చర్చ ప్రారంభించేలా చేసింది.

అయితే, పెళ్లిలో మహిళకు లభించే భద్రత లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో దొరకదని చెప్పడం సరికాదంటున్నారు అభిజీత్.

"వివాహ బంధంలో ఏం జరగాలో అదే సహజీవనంలో కూడా జరుగుతుంది. అలాంటపుడు వివాహంలో ఎక్కువ భద్రత ఉందని చెప్పడం తప్పు, ఎందుకంటే ఇది ఒక్కో వ్యక్తి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది'' అన్నారాయన.

PWDV చట్టం-2005 విషయంలో లివ్-ఇన్ రిలేషన్షిప్ గురించి 2013లో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గృహ హింస గురించి ఆ చట్టం సెక్షన్ 2(ఎఫ్)లో నిర్వచించారు.

"భారతదేశంలో లివ్-ఇన్ సంబంధాలు చట్టబద్ధమే. 2005 చట్టం ప్రకారం, ఇలాంటి సంబంధాలలో వివాహం మాదిరిగా కొంత స్థిరత్వం ఉండాలి. వివాహిత స్త్రీకి లభించే హక్కులు ఈ సంబంధాలలోని స్త్రీలకూ ఇచ్చారు'' అని న్యాయవాది సోనాలి కద్వాసరా తెలిపారు.

"లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మహిళలకు శారీరక, మానసిక లేదా ఆర్థిక వేధింపులు ఏవైనా ఉంటే చట్ట ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. ఆమె ఫోటోలు, వీడియోలు లీక్ అయితే ఐటీ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయవచ్చు'' అని అన్నారు సోనాలి.

అఫ్తాబ్, శ్రద్ధా వాల్కర్

ఫొటో సోర్స్, ANI

వివాహం వేరు, సహజీవనం వేరు

న్యాయస్థానాలు తీవ్ర ఒత్తిడిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్ధమవుతోందని ధనక్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఆసిఫ్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు.

అయితే, లివ్ ఇన్ రిలేషన్ షిప్‌కు తాను వ్యతిరేకం కాదని విశ్వహిందూ పరిషత్ నేత వినోద్ బన్సాల్ అన్నారు. కాకపోతే, వివాహంలో మహిళలకు లభించే హక్కులు సహజీవనంలో ఉన్న స్త్రీకి లభించవని ఆయన చెప్పారు.

‘‘అటువంటి సంబంధం ఎంతవరకు కొనసాగగలదు అన్నది కూడా ఆలోచించాలి. సహజీవనాన్ని వివాహంగా పరిగణించలేం. ఎందుకంటే వివాహం గురించి చట్టంలో ఉంది' అని వినోద్ బన్సల్ అన్నారు.

సహజీవనం విషయంలో సమాజం రెండు వర్గాలుగా చీలిపోయిందని, ఇందులో ఇరువర్గాలకు తమ అభిప్రాయాలు, వాదనలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇలాంటి రిలేషన్ షిప్స్‌లో ఉన్న యువత ఇప్పటికీ తమ గురించి బహిరంగంగా మాట్లాడకపోవడం కూడా వాస్తవం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)