పెళ్లి చేసుకుని, కొడుకును కని ఇద్దరినీ ఢాకాలో వదిలేశారంటూ ఇండియాలో ‘భర్త’పై కేసు వేసిన బంగ్లాదేశీ మహిళ

- రచయిత, అమితాబ్ భట్టసాలీ
- హోదా, బీబీసీ బంగ్లా
బంగ్లాదేశ్ పౌరురాలు సోనియా అక్తర్ భారతదేశానికి చెందిన సౌరభ్ కాంత్ తివారీని 2021 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.
అయితే తనను, కొడుకును బంగ్లాదేశ్‌లో వదిలి తివారీ భారత్‌కు తిరిగొచ్చారని భార్యా సోనియా ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు సోనియా తన భర్త కోసం భారత పోలీసుల సహాయం కోరారు.
ఈ విషయం అటు బంగ్లాదేశ్, ఇటు భారత్‌లోనూ చర్చనీయమైంది. ప్రస్తుతం సోనియా, సౌరభ్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది.
బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో సోనియా తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు తివారీ ఆరోపిస్తున్నారు.
ఢాకాలో ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో తివారీ తనకు మాయమాటలు చెప్పి, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సోనియా అక్తర్ ఆరోపించారు.
బంగ్లాదేశ్ మహిళ ఏమంటున్నారు?
సౌరభ్ తివారీ, సోనియా జంటగా ఉన్న ఫొటోలు.. వారి బిడ్డతో ఉన్న ఫొటోలను సోనియా అక్తర్ తరఫు న్యాయవాది రేణు సింగ్ బీబీసీకి పంపారు.
దీంతో పాటు తివారీ మత మార్పిడి, పెళ్లి పత్రాలు కూడా పంపించారు.
తనకు మూడేళ్ల క్రితం సౌరభ్ కాంత్ తివారీతో వివాహమైందని సోనియా పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తెలిపారు.
తివారీని తిరిగి తీసుకెళ్లడానికి సోనియా భారత్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు.
"బంగ్లాదేశ్ జాతీయురాలలైన సోనియా ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ ప్రాంతానికి చెందిన సౌరభ్ కాంత్ తివారీని వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సౌరభ్ ఢాకా వదిలి వచ్చారని, అయితే, ఆయనకు అంతకుముందే వివాహం అయినట్లు తెలిసిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు" అని అడిషనల్ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ విలేకరులతో తెలిపారు.
సోనియా తనతోపాటు తన కుమారుడి వీసా, పాస్‌పోర్ట్, పౌరసత్వ గుర్తింపు కార్డు కాపీలను పోలీసులకు అందజేసినట్లు రాజీవ్ తెలిపారు.
పత్రాలు చూశాక బంగ్లాదేశ్‌లో ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరణ కావడంతో కేసు విచారణకు అసిస్టెంట్ కమిషనర్ (మహిళా, శిశు రక్షణ)ను నియమించారు అధికారులు.
''నేను బంగ్లాదేశీయురాలిని. మూడేళ్ల క్రితం మా పెళ్లయింది. పిల్లాడి భవిష్యత్ దృష్ట్యా నేను నా భర్తతోనే ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం ఆయన నన్ను తన ఇంటికి కూడా తీసుకెళ్లడానికి సిద్ధంగా లేడు'' అని సోనియా అక్తర్ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

'నన్ను నమ్మించారు'
సోనియా అక్తర్ లాయర్ రేణు సింగ్, సౌరభ్ కాంత్ తివారీ ఇద్దరితోనూ బీబీసీ బంగ్లా మాట్లాడింది.
తాను 2017 నుంచి ఓ విద్యుత్ కంపెనీ ఢాకా కార్యాలయంలో పనిచేశానని, ఆ సమయంలోనే సోనియాతో పరిచయం ఏర్పడిందని తివారీ బీబీసీతో తెలిపారు.
సోనియా తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని బీబీసీకి అందజేస్తానని తివారీ అన్నారు.
అయితే వాట్సాప్‌లో ఆయనకు బీబీసీ మెసేజ్‌లు పంపినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఈ సందర్భంగా సోనియా, ఆమె కుటుంబంపై తివారీ పలు ఆరోపణలు చేశారు.
'నాకు బలవంతంగా పెళ్లి చేశారు. సోనియా, ఆమె కుటుంబ సభ్యులు నా నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇంకా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు' అని ఆయన ఆరోపించారు.
"ఢాకాలో ఆమె ఏదో మార్కెటింగ్ పని కోసం నా ఆఫీసుకి వచ్చింది. అప్పుడు ఆమె అవసరం మా ఆఫీసుకు లేదు. తర్వాత ఆమె నాకు దగ్గరవుతూనే ఉన్నారు, ఫోన్‌లో నన్ను సంప్రదిస్తూనే ఉన్నారు. ఆమె మెసేజ్‌లు పంపేవారు. కాల్స్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆమె ఇంటికి రావడం, వెళ్లడం ప్రారంభించారు. ఆ తర్వాత, నన్ను బెదిరించి 2021 ఏప్రిల్ 14న పెళ్లి చేయించారు. నేను వసుంధర ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నా. నాతో పాటు సోనియా నివసించారు" అని సౌరభ్ తివారీ చెప్పారు.
బలవంతంగా మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న తర్వాత పోలీసులను లేదా ఢాకాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారా అని తివారీని బీబీసీ ప్రశ్నించింది. అంతేకాదు ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారా? అని అడిగితే.. దీనిపై ఫిర్యాదు చేసేందుకు భారత రాయబార కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడి ఒక ఫారం ఇచ్చి, స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారని తెలిపారు తివారీ.
"ఆ ఫారం నింపిన తర్వాత, సోనియా నా ఫోన్‌ను హ్యాక్ చేసి, మొత్తం విషయం తెలుసుకున్నారు. అక్కడ, కరోనా కారణంగా సరిహద్దు మూసివేశారు. నేను ఇండియాకు తిరిగి రాలేకపోయాను. అప్పుడు నా భార్య, పిల్లలు భారతదేశంలోనే ఉన్నారు. కరోనా వల్ల మా అమ్మ కూడా చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ విషయం చెప్పి కుటుంబంపై మానసిక ఒత్తిడి పెంచకూడదనుకున్నా'' అని ఆయన వివరించారు.
సోనియా కుటుంబం తన నుంచి చాలా డబ్బులు తీసుకుందని, ఇంకా భారీగా డిమాండ్ చేస్తోందని తివారీ ఆరోపించారు. ఆగస్ట్ 5న ఢాకాలో విడాకులకు అప్లై చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌరభ్ తివారీ భార్యకు ఏమీ తెలియదు
సౌరభ్ భార్య రచనా తివారీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.
తివారీ బీబీసీ బంగ్లాతో మాట్లాడుతున్నప్పుడు, రచన ఆయన సమీపంలోనే కూర్చున్నారు.
"నా భర్త ప్రతిరోజూ నాతో మాట్లాడేవారు. మొదట్లో నాకేం అర్థం కాలేదు. ఆయన రాత్రికి ఆలస్యంగా వచ్చి, ఉదయాన్నే బయలుదేరేవారు. నాకు దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు" అని రచనా తివారీ అన్నారు.
"బహుశా కరోనా సమయం కావడం.. అత్తగారి మరణం కారణంగా ఆయన (సౌరభ్) నాకీవిషయం చెప్పలేదేమో. కానీ చాలా రోజుల తర్వాత అంత పొద్దున్న ఎలా లేస్తున్నారు? ఎలా తింటున్నారు? అనే సందేహం వచ్చింది. నేను ఢాకా వెళ్లినప్పుడు నాకంతా తెలిసిపోయింది" అని రచన తెలిపారు.
'తివారీ అబద్ధం చెబుతున్నారు'
బీబీసీ బంగ్లా సోనియా అక్తర్ తరఫు న్యాయవాది రేణు సింగ్‌తో మాట్లాడింది.
తివారీ, ఆయన భార్య ఆరోపణలను న్యాయవాది ఖండించారు.
"బలవంతంగా మతం మార్పించి తనకు పెళ్లి చేశారని తివారీ చెబుతున్నారు. అలాంటప్పుడు బిడ్డ కూడా బలవంతంగా పుట్టిందా? ఇది బలవంతంగా సాధ్యమేనా? నిజానికి తివారీ మొదటి నుంచి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన మొత్తం దాచిపెట్టారు. భారత్‌లో తన తొలి భార్య చనిపోయిందని చెప్పి సోనియాను పెళ్లి చేసుకున్నారు. సోనియాతో ఒక బిడ్డకు జన్మనిచ్చారు'' అని అన్నారు.
''ఈ జంట ఫోటోలు ఉన్నాయి. ఈ చిత్రాలలో తివారీ ముఖంలో కానీ, కళ్లలో కానీ భయం కనిపించడం లేదని చూస్తేనే అర్థమవుతుంది. సంతోషకరమైన జంట చిత్రాలివి'' అని రేణుసింగ్ తెలిపారు.
సోనియా డిమాండ్ ఏమిటి?
వివాహం చేసుకునే ముందు తివారీ గురించి సోనియా ఎటువంటి ఎంక్వైరీ చేయలేదా? అని రేణుసింగ్‌ను అడిగితే..
‘‘పెళ్లయిన తర్వాత తివారీ తన ఆఫీసులోని సహోద్యోగులకు సోనియాను పరిచయం చేశారు. నిజానికి తివారీని సోనియా నమ్మింది. అయితే భార్య, ఇద్దరు పిల్లలు భారత్‌లో ఉంటున్నారనే విషయాన్ని తివారీ దాచిపెట్టారు. ఈ విషయం సోనియాకు తర్వాత తెలిసింది. తివారీ తన భారతీయ భార్యతో ఢాకాలో ఫోన్‌లో మాట్లాడుతూ సోనియాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు" అని న్యాయవాది తెలిపారు.
తివారీని తన క్లయింట్ సోనియా ఎలాంటి డబ్బు అడగలేదని, గతంలో కూడా డబ్బులు తీసుకోలేదని రేణు సింగ్ అంటున్నారు. 'ఆమె (సోనియా) డిమాండ్ ఒక్కటే తన పిల్లల బాధ్యత భర్త తీసుకోవాలి' అని ముగించారు న్యాయవాది.
ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో ముందముందు విచారణలో తేలనుంది.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జెండా కనిపించదా? ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటుతో ఆటగాళ్ల ఒలింపిక్ కలలు చెదిరిపోయాయా
- హలాల్ హాలిడేస్ అంటే ఏంటి... ముస్లింలలో వాటికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














