బంగ్లాదేశ్: రోహింజ్యా శిబిరాల్లో మంటలు... ఆశ్రయం కోల్పోయిన వేలమంది శరణార్థులు

ఫొటో సోర్స్, Reuters
బంగ్లాదేశ్‌లో ఆగ్నేయం వైపున్న రోహింజ్యా శరణార్థుల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
రద్దీగా ఉండే కాక్స్ బజార్ శిబిరంలో ఆదివారం మంటలు చెలరేగాయి. సుమారు 2,000 ఆవాసాలను చుట్టుముట్టాయి.
ఇక్కడ నివసిస్తున్నవారిలో అధికులు పొరుగు దేశమైన మియన్మార్ నుంచి పారిపోయి వచ్చినవారే. సుమారు 12,000 మంది తమ నివాసాలను కోల్పోయారని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికి మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
మంటలు అంటుకోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోయినట్టుగా సమాచారం రాలేదు.
స్థానిక సమయం మధ్యహ్నం 2.45 గంటల ప్రాంతంలో నిప్పంటుకుంది. రెప్ప పాటు కాలంలో వెదురు, టార్పాలిన్‌తో కట్టిన ఇళ్లు, గుడారాలకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
"సుమారు 2,000 గుడారాలు కాలిపోయాయి. దాదాపు 12,000 మంది మియన్మార్ శరణార్థులు నిరాశ్రయులయ్యారు" అని బంగ్లాదేశ్ రెఫ్యూజీ కమిషనర్ మిజానూర్ రెహ్మాన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
మూడు గంటల్లో మంటలను చల్లార్చారు. కానీ, శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన 35 మసీదులు, 21 విద్యా కేంద్రాలు దగ్ధమైపోయాయని ఆయన చెప్పారు.
శరణార్థుల శిబిరాలకు "భారీ నష్టం" వాటిల్లిందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీస్కు చెందిన హృషికేశ్ హరిచందన్ బీబీసీతో చెప్పారు.
నీటి కేంద్రాలు, వైద్య కేంద్రాలు వంటి ప్రాథమిక సేవలు కూడా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు.
"మా ఇల్లు కాలిపోయింది. నా దుకాణం కూడా నాశనమైపోయింది. మొత్తం బూడిదైపోయింది. నాకేం మిగల్లేదు" అని మమున్ జోహార్ (30) ఏఎఫ్‌పీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
బంగ్లాదేశ్, మియన్మార్ సరిహద్దుల్లో పది లక్షలకు పైగా రోహింజ్యా శరణార్థులు నివసిస్తున్నారు. వారి కోసం అక్కడ అనేక శిబిరాలు ఉన్నాయి.
వాటిల్లో క్యాంప్ 11 శిబిరానికి మంటలు అంటుకున్నాయి. ఆ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగ మేఘాలు కమ్ముకోవడం కనిపించింది.
ఈ శిబిరాలు కిక్కిరిసిపోయి, అధ్వానంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉంది.
బంగ్లాదేశ్ రక్షణ శాఖ గత నెల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 2021 జనవరి నుంచి 2022 డిసెంబర్ మధ్య, రోహింజ్యా శిబిరాల్లో 222 అగ్నిప్రమాదాలు జరిగాయి. వాటిలో 60 దహనకాండలు కూడా ఉన్నాయి.
2021 మార్చిలో ఒక శిబిరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందులో 15 మంది చనిపోయారు. సుమారు 50,000 మంది నిరాశ్రయులయ్యారు.
ప్రపంచంలోనే, రోహింజ్యా శరణార్థులకు చెందిన అతిపెద్ద శిబిరాలు ఇవే. మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టున్నాక, రోహింజ్యా మైనారిటీలపై ఉక్కు పాదం మోపింది. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి లక్షలాది రోహింజ్యాలు అక్కడి నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చి చేరారు.
రోహింజ్యాలు ముస్లింలు. వీరు అధికంగా బుద్ధిస్ట్ మియన్మార్ ప్రాంతానికి చెందినవారు. అక్కడ వారు తరతరాలుగా హింసను ఎదుర్కొంటున్నారు.
2017లో రోహింజ్యా తిరుగుబాటుదారులు పోలీస్ స్టేషన్లపై దాడికి దిగినప్పుడు, మియన్మార్ మిలటరీ వారిపై క్రూరంగా ప్రతీకారం తీర్చుకుంది. దాంతో, అదే ఏడాది ఆగస్టులో పెద్ద సంఖ్యలో రోహింజ్యాలు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చైనా: షీ జిన్‌పింగ్ గుప్పిట్లో సర్వాధికారాలు... ఆమోదముద్రకు సిద్ధమైన రబ్బర్ స్టాంప్ పార్లమెంట్
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
- అదానీ కంపెనీలలో భారీగా డబ్బులు గుమ్మరిస్తున్న జీక్యూజీ చైర్మన్ రాజీవ్ జైన్ ఎవరు... అమెరికాలో ఆయన కంపెనీ ఏం చేస్తోంది?
- డబ్ల్యూపీఎల్: ముంబయి ఇండియన్స్ ఘన విజయం, 143 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి
- రష్యా- 'ఆకలితో అలమటిస్తున్న ప్రజలారా రండి... పోరాడదాం' అంటూ స్టాలిన్-ను ఎదిరించిన ముగ్గురు టీనేజర్ల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












