చైనా: షీ జిన్‌పింగ్ గుప్పిట్లో సర్వాధికారాలు... ఆమోదముద్రకు సిద్ధమైన రబ్బర్ స్టాంప్ పార్లమెంట్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాలో ఈ వారాంతంలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మొదలవుతుంది. షీ జిన్‌పింగ్ అధికారానికి అది పరాకాష్ట కాబోతోంది.
కమ్యూనిస్ట్ పార్టీలో సర్వాధికారాలను జిన్‌పింగ్ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయనను ఎవరూ సవాలు చేసే అవకాశం కూడా లేదు.
దీన్ని ప్రతిబింబించేలా పార్టీ వార్షిక సమావేశం ఉండబోతోంది. సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొనే రబ్బర్ స్టాంప్ సమావేశం అది. జింగ్‌పింగ్ తన అధికారానికి తలొగ్గే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవచ్చు.
చైనా ప్రీమియర్ (ప్రధాన మంత్రి) అంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న వ్యక్తి. అధికారంలో జిన్‌పింగ్ కన్నా ఒక్క మెట్టు కిందనున్న వ్యక్తి.
ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్‌కు ఉద్వాసన తప్పదు. ఆయన స్థానంలో కచ్చితంగా లీ కియాంగ్ వస్తారు.
షీ జిన్‌పింగ్ పట్ల విధేయతలో వీరిద్దరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.
ఒక దశాబ్ద కాలంగా జిన్‌పింగ్ అవినీతి అణచివేత పేరుతో ప్రత్యర్థి వర్గాలను నరుక్కుంటూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ కోసం ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన కమిటీ ఇది. ఇప్పుడు ఇందులో అందరూ జిన్‌పింగ్ విధేయులే ఉన్నారు.
ఈ వారాంతంలో జరగబోయే సమావేశంలో వివిధ విభాగాధిపతులను, మంత్రులను ఎన్నుకుంటారు. పాత వాళ్లను తొలగించి, కొత్తవాళ్లను ఎన్నుకోబోతున్నారు. వీళ్లంతా కూడా జిన్‌పింగ్ క్యాంపు సభ్యులే అవుతారని అంచనా.
అంటే వారికి అర్హత లేదని కాదు. కానీ, జిన్‌పింగ్‌కు ఎదురు మాట్లాడే శక్తి ఉంటుందా? ఇదీ ప్రశ్న.
"ఇలా అందరు విధేయులే ఉంటే జిన్‌పింగ్‌కు పనులన్నీ సులువు అవుతాయి. కానీ మరోవైపు, తన ఆలోచనలు, తన సిద్ధాంతాలే ప్రతిధ్వనిస్తూ అక్కడే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది" అని ఒక బడా వ్యాపారవేత్త బీబీసీతో అన్నారు.
ఈ నేపథ్యంలో, కొత్తగా ఎన్నికయే ప్రతినిధులు చైనాను ఎటు తీసుకెళతారు?

ఫొటో సోర్స్, Getty Images
లీ కియాంగ్ కొత్త ప్రీమియర్ అయితే, ఆయన కెరీర్‌లో ఉల్కాలా దూసుకెళ్లినట్టే.
షాంఘై పార్టీ సెక్రటరీగా గత ఏడాది రెండు నెలల దారుణమైన లాక్‌డౌన్ నిర్వహణలో భాగం పంచుకున్నారు. అందుకే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో రెండో స్థానానికి ఎగబాకినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
లాక్‌డౌన్ విధించినందుకు కాదుగానీ, దాన్ని పేలవంగా నిర్వహించినందుకు అనేకమంది ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. బయటకు అడుగుపెట్టే వీలు లేదు. కేవలం డోర్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉంది. అందువల్ల లక్షలాది ప్రజలు సమయానికి ఆహారం, మందులు అందక ఇబ్బందిపడ్డారు.
తీవ్ర ఆహార కొరత నెలకొంది. ఆ సమయంలో చైనా ప్రజలు తమ దుస్థితిని చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు.
చివరికి, విసిగిపోయిన జనం తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి కంచెలు విరగ్గొట్టారు. సెక్యూరిటీ గార్డులతో గొడవపడ్డారు. జీరో కోవిడ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితికి కారణమైన వ్యక్తికి ప్రీమియర్ పదవి ఎలా కట్టబెడతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, గతంలో లి కియాంగ్‌కు కొంత మంచి పేరే ఉంది. పార్టీ కఠినత్వాన్ని బద్దలుగొట్టగలిగిన ధృడమైన వ్యక్తిగా వ్యాపారవేత్తలు ఆయన్ను పరిగణించేవారు.
"ఆయన చురుకైన వ్యక్తి. మంచి నిర్వాహకుడు కూడా. కానీ, జిన్‌పింగ్ పట్ల విధేయత వల్లే ఆయనకు ప్రీమియర్ పదవి దక్కబోతోంది. జిన్‌పింగ్ ఆయన్ను కిందకు దూకమంటే, 'ఎంత ఎత్తు నుంచి దూకాలి?' అని లి కియాంగ్ అడుగుతారు. అలాంటి విధేయత ఉంది" అని చైనాలోని యూరోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జోర్గ్ వుట్కే అన్నారు. వుట్కే 1990ల నుంచీ చైనాలో వ్యాపారం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలోని అగ్రనేతలతో ఆయనకు దీర్ఘకాల పరిచయం ఉంది.
జీరో కోవిడ్ ప్రతికూల ప్రభావం ఇప్పటికీ వ్యాపారవేత్తలపై, సాధారణ కొనుగోలుదారులపై పడుతోందని వుట్కే అన్నారు.
"ప్రజలు ఖర్చు విషయంలో చాలా భయపడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి జంకుతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో అతిజాగ్రత్త పాటిస్తున్నారు" అని చెప్పారు.
ఈ ప్రతికూల ప్రభావం షాంఘైపై ఎక్కువ పడింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో వెనుకబడింది.
అయితే, ఇది కేవలం లి కియాంగ్ తప్పిదం కాదని వుట్కే అభిప్రాయపడ్డారు. మరికొందరు వ్యాపారవేత్తలు కూడా అందుకు అంగీకరిస్తున్నారు.
టెస్లా కంపెనీని షాఘైకి తీసుకొచ్చిన ఘనత లి కియాంగ్‌దే. అమెరికా వెలుపల టెస్లా మొదటి ఫ్యాక్టరీ ఇదే. చైనా భాగస్వామితో జట్టుకట్టాల్సిన అవసరం లేకుండా, సొంత వెంచర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం టెస్లాకి లభించింది.
2019లో చైనా ఫ్రీ ట్రేడ్ జోన్ గురించి ఢంకా భజాయిస్తూ, అంతర్జాతీయ పోటీని అహ్వానిస్తున్నామని, ఇది చైనా ప్రపంచీకరణలో మమైకం కావడానికి చైనాకు సహాయపడుతుందని లి కియాంగ్ అన్నారు.
కొంతమంది లి కియాంగ్‌ను ఉదారవాదిగా, నియమాలను వంచగల వ్యక్తిగా చూస్తారు.
అయితే, ఇప్పుడు అలా ఉంటారా అన్నది సందేహమే. చేయవలసింది చేస్తారా లేక జిన్‌పింగ్ నీడలో ఉంటారా అన్నది చూడాలి.
లి కియాంగ్ 2016లో జియాంగ్సు ప్రావిన్స్‌కు పార్టీ సెక్రెటరీ అయ్యారు. తూర్పున ఉన్న జియాంగ్సు ధనిక ప్రాంతం. టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమై అక్కడ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురావడంపై చర్చించారు.
కానీ, ఆ రోజులు వేరు. ఇటీవల సంవత్సరాలలో, టెక్ కంపెనీలు శక్తిమంతంగా మారాయని భావించిన జిన్‌పింగ్ వాటిని నియంత్రించాలని ఆదేశించారు. ఈ టెక్ కంపెనీల అధిపతులు "అదృశ్యం కావడం" ఈమధ్య సాధారణమైపోయింది. అలా అయితేనే, వారిని పార్టీ క్రమశిక్షణ తనిఖీ అధికారులు ప్రశ్నించవచ్చు. తాజాగా కోటీశ్వరుడైన బ్యాంకర్, కీలకమైన టెక్ డీల్స్ నెరపిన వ్యక్తి బావో ఫాన్ అదృశ్యమవడం అక్కడ కలకలం రేపింది.
లి కియాంగ్ గతంలో అయితే ఇలాంటి విషయాలను ప్రోత్సహించి ఉండరు. కానీ, కియాంగ్, జిన్‌పింగ్‌ల స్నేహం ఇప్పటిది కాదు. దాన్ని దాటి కియాంగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది సందేహమే.
లి కియాంగ్ జియాంగ్సు ముందు జెజియాంగ్‌లో పనిచేసేవారు. అప్పట్లో అక్కడ షి జిన్‌పింగ్ పార్టీ చీఫ్‌గా ఉండేవారు. లి కియాంగ్ ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మారిన తరువాత, ఇద్దరూ తమ పైఅధికారులను మెప్పించేందుకు రాత్రివరకు పనిచేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత ప్రీమియర్ లి కెకియాంగ్‌తో జిన్‌పింగ్‌కు ఇలాంటి స్నేహం లేదు. వీరిద్దరూ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఒక రకంగా అప్పట్లో లి కెకియాంగ్ జిన్‌పింగ్‌కు ప్రత్యర్థి అని చెప్పాలి. ఒక సమయంలో కెకియాంగ్‌ను చైనా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా కూడా పరిగణించారు. జిన్‌పింగ్‌కు బదులు కెకియాంగ్ అధ్యక్షుడైతే చైనా మరోలా ఉండేదేమో.
పెకింగ్ యూనివర్సిటీలో పట్టా పొందిన లి కెకియాంగ్ మంచి ఆర్థికవేత్త. చైనాలో సాంస్కృతిక విప్లవం తరువాత, లి కెకియాంగ్ కమ్యూనిస్ట్ యూత్ లీగ్ నుంచి పార్టీలో ఒక్కో పదవిని అధిరోహిస్తూ పైకి ఎదిగారు.
అధ్యక్ష పదవి చేజారిపోయిన తరువాత, ఆయన్ను ప్రీమియర్‌గా ఎన్నుకున్నారు. చైనాలో వీధి వ్యాపారులను మళ్లీ అనుమతిస్తే ఆర్థికవ్యవస్థ జీవం పోసుకుంటుందని, ఉల్లాసకరమైన వాతావరణం నెలకొల్పవచ్చని లి కెకియాంగ్ భావించారు. ఆ మేరకు ఆదేశలు జారీ చేశారు. కానీ, అవి ఫలించలేదు. వీధి వ్యాపారులను పోలీసులు మళ్లీ తరిమికొట్టారు.
లి కెకియాంగ్‌కు మాజీ అధ్యక్షుడు హు జింటావోతో దగ్గర సంబంధాలు ఉన్నట్టు భావిస్తారు.
చైనాను బలమైన ఆర్థిక పథంలో నడిపిన వ్యక్తిగా లి కెకియాంగ్ గుర్తుండిపోతారు. కానీ, ఆయన పదవి ముగిసే సమయానికి జీరో కోవిడ్ విధానం దెబ్బకొట్టింది.
పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఆంక్షలు ఆర్థిక వృద్ధిని దెబ్బతీయకుండా చూసుకోవాలని కెకియాంగ్ అధికారులకు పిలుపునిచ్చారు.
కానీ, కెకియాంగ్ సూచనలు, జిన్‌పింగ్ జీరో కోవిడ్ పాలసీకి మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులకు వేరే దారి లేకపోయింది.
షీ జిన్‌పింగ్‌కు ఎదురే లేదు. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో అంతా తన విధేయులే ఉండబోతున్నారు.
ఒకే ఒక్క ముప్పు ఏమిటంటే, సామాన ప్రజల్లో జిన్‌పింగ్ ప్రతిష్ట దెబ్బతింది. జీరో కోవిడ్ విధానం, నిరసనలు, రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, టెక్ కంపెనీల అణచివేత, సర్వీస్ రంగానికి కలిగిన తీవ్ర నష్టం.. ఇవన్నీ జిన్‌పింగ్ ప్రతిష్టను దెబ్బతీశాయి.
"మావో ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగారు. ఎందుకంటే అప్పట్లో ప్రజల వద్ద కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ, ఇప్పుడు జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని మధ్య తరగతి తల్లిదండ్రులు ఆందోళనచెందడం ప్రారంభమైంది" అన్నారు వుట్కే.
అందుకే ఈసారి కమ్యునిస్ట్ పార్టీ సమావేశంపై ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఎవరికి ఎలాంటి పదవులు దక్కుతాయన్నదానిపై చైనా ఎటువైపు వెళుతుందో కొంత ఊహించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- నగరాలలో మహిళలు గుమ్మం దాటి బయటకు రావడం బాగా తగ్గిందా... ఎందుకిలా-
- గుజరాత్- కూనో అడవుల్లోకి సింహాలు వస్తాయని ఆదివాసీలను ఖాళీ చేయించారు... సింహాలూ రాలేదు, గిరిజనులకు పరిహారమూ అందలేదు
- ఇరాన్-లో స్కూల్ విద్యార్థినుల మీద విషవాయువు దాడులు ఎందుకు పెరుగుతున్నాయి-
- పాల కోసం వెళుతుండగా డైనోసార్ల కాలంనాటి తుమ్మెద కనిపించింది...-
- ‘‘గత ప్రభుత్వంలా ఒప్పందాలకే పరిమితం కాదు, అమలు చేసి చూపిస్తాం’’ - గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-లో ఏపీ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













