SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏం మాట్లాడబోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉజ్బెకిస్తాన్ చారిత్రక నగరం ‘‘సమర్‌కండ్’’ వేదికగా సెప్టెంబరు 15-16 తేదీల్లో జరగబోతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సదస్సును ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇద్దరు నాయకులు కలిసి వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.
ఒకవేళ మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగితే, ఏ అంశాలపై దృష్టి సారించే అవకాశముంది?
తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లలో తమ సైన్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత, చైనా సైన్యాలు సోమవారం ప్రకటించాయి. దీంతో ఇద్దరు నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు మార్గం సుగమమైంది. హాట్‌స్ప్రింగ్స్‌తో మొదలుపెట్టి సరిహద్దుల వెంబడి చాలా ప్రాంతాల్లో మే 2020 నుంచి రెండు దేశాల సైన్యాలు ఢీఅంటేఢీ అని ఎదురుపడుతున్నాయి.
భారత్ ఆహ్వానంపై గత మార్చిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ దిల్లీలో పర్యటించారు. రెండు దేశాల సంబంధాలను గాడిన పెట్టేందుకు ఈ పర్యటన కొంతవరకు దోహదపడింది.

ఫొటో సోర్స్, AFP
‘‘ప్రతికూల సంకేతాలు ఇచ్చినట్లే’’
తాజా చర్చల్లో భారత్-చైనా సంబంధాలను మెరుగు పరచడంపై ఇద్దరు నాయకులూ దృష్టి సారించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలను వీటో అధికారాలతో చైనా తిరస్కరించింది. ప్రస్తుతం ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశముంది.
మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య భేటీ జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు దిల్లీలోని ఎఫ్‌వోఆర్‌ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని చైనా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైజల్ అహ్మద్ అన్నారు. ‘‘వారిద్దరూ రెండు, మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించొచ్చని అనిపిస్తోంది. వీటిలో మొదటది సరిహద్దు సమస్యకు వేగంగా పరిష్కారం కనుగొనడం. రెండోది కచ్చితంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం. ఇక మూడోది నాటో తరహాలో ఆసియాలోనూ ఒక భద్రతా సంస్థను తీసుకురావడం’’అని ఆయన వివరించారు.
‘‘వారు కచ్చితంగా భేటీ అవుతారనే అనిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత వారు ఇలా కలిసి వేదికను పంచుకుంటున్నారు. ఒకవేళ వారి మధ్య సమావేశం జరగకపోతే, ప్రతికూల సంకేతాలు ఇస్తున్నట్లు అవుతుంది. అసలు ద్వైపాక్షిక భేటీ లేనప్పుడు, అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఇలాంటి భేటీలు లేకపోతే ఆ సదస్సు విజయంతం అయినట్లు చెప్పుకోవడానికి కూడా వీలుండదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ద్వైపాక్షిక భేటీ ఉంటుందా? అనే విషయంలో ఇటు భారత్, అటు చైనా.. రెండు దేశాలూ స్పందించడంలేదు. అయితే, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నడుమ చాలా కాలం గడవడంతో, భేటీపై ఇద్దరు నాయకులకూ ఆసక్తి ఉండే ఉంటుందని సింగపూర్‌లోని చైనా సంతతికి చెందిన రాజకీయ విశ్లేషకుడు సన్ షీ అన్నారు. ‘‘నిజానికి వారికి ఇదొక ఒక మంచి అవకాశం. వైరస్ సోకే ముప్పు లేకపోతే, వారీ భేటీ కచ్చితంగా ఉంటుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సదస్సుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరవుతున్నారు. వీరితో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.
గత సదస్సులో ఇరాన్‌కు తాత్కాలిక ఎస్‌సీవో సభ్యత్వం వచ్చింది. దీంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రియాసీ కూడా సదస్సుకు వస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ-పుతిన్ భేటీ ఎప్పుడు?
నరేంద్ర మోదీతో వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం భేటీ కాబోతున్నారని రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిద్దరూ ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రధాన దృష్టి సారిస్తారని పేర్కొంది. గత ఆరు నెలల్లో రెండు దేశాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం 11.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంతకు ముందు ఆరు నెలలతో పోలిస్తే 120 శాతం ఎక్కువ.
ఇదివరకు రష్యా నుంచి చాలా అరుదుగా భారత్ చమురు కొనుగోలు చేసేది. ప్రస్తుతం రష్యా నుంచి చైనా తర్వాత ఎక్కువ చమురు కొంటోందని భారతే. యుక్రెయిన్ యుద్ధం వల్ల పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, ఆ ప్రభావం నుంచి రష్యా ఆర్థిక వ్యవస్థను చైనా, భారత్ రక్షిస్తున్నాయి. వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ ఆ యుద్ధంలో బహిరంగంగా రష్యాను తప్పుపట్టేందుకు చైనా, భారత్ నిరాకరించాయి.
గత ఏడాది తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో ఎస్‌సీవో సదస్సు జరిగింది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ, అఫ్గాన్‌కు అంతర్జాతీయ సాయం తదితర అంశాలపై అప్పుడు చర్చ జరిగింది.
ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ యుద్ధంతోపాటు, ప్రాంతీయ భద్రతా ముప్పులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.

ఫొటో సోర్స్, Reuters
తైవాన్ పరిస్థితి?
ప్రస్తుతం కూడా ఆందోళనకర పరిస్థితుల్లోనే ఈ సదస్సు జరుగుతోందని ఫైజల్ అహ్మద్ అన్నారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఒకవైపు, తైవాన్ విషయంలో చైనా వైఖరి మరోవైపు పరిస్థితులను ఆందోళనకరంగా మారుస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘మీరు యుక్రెయిన్ గురించి మాట్లాడేటప్పుడు.. నాటోను పక్కన పెట్టలేరు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అసలు ఎస్‌సీవోను ఏర్పాటుచేసిందే ప్రాంతీయ భద్రత కోసం. కానీ, నాటో లాంటి భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటుచేయలేకపోయారు’’అని ఆయన వ్యాఖ్యానించారు. నాటో విషయంలో అటు రష్యా, ఇటు చైనా.. అభద్రతా భావంతో ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
‘‘భారత్ కూడా నాటో విషయంలో అంత సంతృప్తిగా ఏమీలేదు. నాటోతో సమానంగా ఆసియా మొత్తానికి ఒక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఏర్పాటుచేసే సంస్థ నాటోకు ధీటుగా ఉండాలి’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, నాటో లాంటి భద్రతా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చని సన్ షీ అభిప్రాయపడ్డారు.
‘‘ఆసియాలో అలాంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటుచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడి దేశాలు చాలా భిన్నమైనవి. విలువలు, సంస్కృతి, ముప్పులు అన్నీ వేటికవే భిన్నమైనవి’’అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు నానాటికీ ఎస్‌సీవోపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరుగుతోందని రష్యాన్ సైన్స్ అకాడమీలోని ఓరియెంటల్ స్టడీస్ ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫెసర్ అలెగ్జాండర్ వోరోట్సోవ్ అన్నారు. ‘‘ఎస్‌సీవో ప్రాధాన్యం చాలా వేగంగా పెరుగుతోంది. చాలా దేశాలు ఇప్పుడు దీనిలో చేరాలని భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు నానాటికీ దారుణంగా మారుతున్నాయి. కొత్త కూటములు, కొత్త ప్రపంచ శక్తులు అవతరిస్తున్నాయి. వీటిని ఎస్‌సీవో నాయకులు కూడా అంగీకరించకతప్పదు’’అని ఆయన అన్నారు.
ఎస్‌సీవో అధ్యక్ష స్థానంలో భారత్
సమర్‌కండ్ సదస్సు తర్వాత ఎస్‌సీవో అధ్యక్ష స్థానం భారత్‌కు వస్తుంది. ఏడాదిపాటు భారత్ ఈ హోదాలో కొనసాగుతుంది. దీనిలో భాగంగానే వచ్చే ఏడాది సదస్సు భారత్‌లో నిర్వహించబోతున్నారు.
భారత్ అధ్యక్ష స్థానంలో కొనసాగేటప్పుడు చైనాతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశముందని సన్ షీ అన్నారు. ‘‘ఎస్‌సీవో ప్రాధాన్యం చైనాకు తెలుసు. ఎందుకంటే షిన్‌జియాంగ్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తీసుకుంటున్న చర్యలతో సరిహద్దుల్లో శాంతి నెలకొంటోంది. ఇది చుట్టుపక్కల దేశాల భద్రతలోనూ క్రియాశీలంగా మారుతోంది’’అని ఆయన అన్నారు.
అయితే, సమర్‌కండ్ సదస్సులో పాల్గొనే నాయకులు.. ఎస్‌సీవో కార్యకలాపాలను వేగవంతం చేయడం, ప్రాథమ్యాలను గుర్తించడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, దేశాల మధ్య సహకారం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌సీవో పరిధిని విస్తరించేందుకు వారు చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
ఎస్‌సీవో పరిధిని విస్తరించడంపై దేశాధినేతలు ప్రధానంగా దృష్టిసారిస్తరాని అలెగ్జాండర్ కూడా అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఈజిప్టు, ఖతార్, సౌదీ అరేబియాలకు సభ్యత్వం ఇవ్వడంపైనా ప్రస్తుతం చర్చ జరిగే అవకాశముంది. మరోవైపు బెలరూస్ సభ్యత్వానికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు కూడా తాజా సమావేశం అనంతరం మొదలు కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- INDvsPAK మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
- బ్రిటన్‌లో రాచరికానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’
- థాయ్‌లాండ్: రాణిలా దుస్తులు ధరించినందుకు రెండేళ్లు జైలు శిక్ష
- ఐఫోన్ 14 అమ్మకాలను నిషేధించిన బ్రెజిల్, కారణం ఏమిటంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













