Indo-China relations: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్‌ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?

ఇండో చైనా సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ న్యూస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు.

"దలైలామా 87వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఫోన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన దీర్ఘాయుష్షుతో పాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

దలైలామాకు మోదీ ఫోన్ చేయడం చైనాకు ముల్లు గుచ్చుకున్నట్టయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

చైనా ఏమంది?

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ కూడా దలైలామాకు అభినందనలు తెలిపారు.

మోదీ, బ్లింకన్ అభినందలు తెలుపడంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజాన్ స్పందిస్తూ, "చైనా వ్యతిరేక, వేర్పాటువాద వైఖరి ఉన్న 14వ దలైలామాను భారత్ పూర్తిగా ఆమోదించవచ్చు. కానీ, టిబెట్‌కు సంబంధించిన విషయాలలో చైనాకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. టిబెట్‌ను అడ్డం పెట్టుకుని చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆలోచించి మాట్లాడాలి, అడుగులు వేయాలి" అన్నారు.

దలైలామా

ఫొటో సోర్స్, Getty Images

చైనా వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. దలైలామాకు భారతదేశంలో గౌరవనీయ అతిథి హోదా ఉందని, ఆయన్ను ఆధ్యాత్మిక గురువుగా ఎంతో గౌరవిస్తారని,ఆయనకు అనేకమంది అనుచరులు ఉన్నారని తెలిపింది.

"పరమ పావనుడైన దలైలామాకు భారతదేశంలో అమితమైన గౌరవం ఉంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయన అనుచరులు ఆయన పుట్టినరోజును జరుపుకుంటారు. దలైలామ 87వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపడాన్ని ఈ కోణంలోనే చూడాలి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి అన్నారు.

దలైలామా 1959లో టిబెట్‌ నుంచి పారిపోయి భారతదేశానికి చేరుకున్నారు. టిబెట్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. చైనా టిబెట్‌ను తమ దేశంలో భాగంగా పరిగణిస్తుంది.

దలైలామా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో బౌద్ధ ఆశ్రమంలో జీవితం గడుపుతున్నారు.

చైనా దలైలామాకు వ్యతిరేకి. ఆయనను వేర్పాటువాదిగా చూస్తూ ఆయనతో ఎలాంటి సంబంధాలకైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భారతదేశంలో దలైలామా కార్యకలాపాలను చైనా పర్యవేక్షిస్తుంది. చైనా విదేశాంగ శాఖ గతంలో కూడా ఆయనపై వ్యాఖ్యలు చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, TWITTER/@MEAINDIA

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. చైనా వ్యాఖ్యలు

భారత్, చైనాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోతే, చైనా వ్యాఖ్యలను సాధారణంగా తీసుకోవచ్చని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా భావించలేమని విశ్లేషకులు అంటున్నారు.

"చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందనను మామూలుగా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య సమన్వయం చెదిరిపోయింది. ఈ ఉద్రిక్తతల కారణంగా భారతదేశం పట్ల చైనా విధానంలో మార్పు వచ్చింది. దలైలామాపై వ్యాఖ్యలు ఆ విధానంలో భాగమే" అని కెనడా యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో విజిటింగ్ ప్రొఫెసర్, చైనా వ్యవహారాల నిపుణురాలు స్వర్ణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

దలైలామా వ్యవహారాన్ని చైనా చాలా సున్నితంగా తీసుకుంటోంది. ఆయనపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

"టిబెట్ ప్రజలకు ఆయన గొప్ప నాయకుడు, పూజ్యుడు. వాళ్లు ఆయన్ను ఆరాధిస్తారు. ప్రధాని మోదీ దలైలామాకు జన్మదిన శుభాకాక్షలు తెలుపడం, దాని గురించి ట్వీట్ చేయడం.. చైనాకు ఇచ్చిన సందేశం. ఏ విషయాలను చైనా సున్నితంగా పరిగణిస్తుందో, వాటిని భారత్ దౌత్య పరంగా వాడుకోగలదనే సందేశం ఇచ్చింది. టిబెట్ లాంటి విషయాలను లేవనెత్తడానికి భారత్ వెనుకాడదని స్పష్టం చేసింది" అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, మహిళల గురించి దలై లామా ఏమన్నారు?

జూలైలో లేహ్‌ను సందర్శించనున్న దలైలామా

భారతదేశంలో లక్షల మంది టిబెటన్లు నివసిస్తున్నారు. 2010 నుంచి టిబెట్, చైనాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. చైనా నాయకులు భారత్ వచ్చినప్పుడల్లా, టిబెట్‌ ప్రజలతో మాట్లాడేలా ఒత్తిడి తేవాలని టిబెటన్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

"టిబెటన్లు వాళ్ల సమస్యలపై చర్చించాలనుకుంటున్నారు. కానీ, భారత్ వైఖరి చైనాతో సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. దానిని బట్టి సమస్యలను తెరపైకి తీసుకు వస్తారా, రారా అనేది తేలుతుంది. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం రెండేళ్లకు పైగా సాగుతోంది. అనేక రౌండ్ల చర్చల తర్వాత కూడా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో, చైనా పట్ల తమ విధానంలో వచ్చిన మార్పును భారత్ అన్ని అంశాల్లోనూ అనుసరిస్తోంది" అని స్వర్ణ్ సింగ్ అన్నారు.

దలైలామా

ఫొటో సోర్స్, ROLI BOOKS

ఫొటో క్యాప్షన్, దలైలామా 1959లో భారతదేశానికి వచ్చారు

దలైలామా జూలై 14-15 తేదీల్లో లేహ్‌లో పర్యటించనున్నారు. అక్కడి బౌద్ధ మఠాన్ని సందర్శిస్తారు. దలైలామా లేహ్ పర్యటన కూడా చైనాను అసౌకర్యానికి గురిచేయవచ్చు.

దలైలామా ఇలాంటి యాత్రలు చేసినప్పుడల్లా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందని స్వర్ణ్ సింగ్ అన్నారు.

"జమ్మూ కశ్మీర్ రద్దు తరువాత లేహ్-లద్దాఖ్ గురించి, సరిహద్దులకు సంబంధించి చైనా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఇటీవల జీ-20 సదస్సు సందర్భంగా, కశ్మీర్‌లో ఒక సమావేశం నిర్వహించడం పట్ల కూడా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లేహ్‌లో టిబెట్ ప్రజలు నివసిస్తున్నారు. లేహ్‌కు చైనాతో సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించినప్పుడు చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, దలైలామా లేహ్ పర్యటన చైనాను కచ్చితంగా కలవరపెడుతుంది" అని స్వర్ణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

దలైలామా లేహ్ పర్యటనపై చైనా నుంచి కచ్చితంగా ప్రతిస్పందన వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, చైనా సైన్యం టిబెట్ లోకి ప్రవేశించినప్పుడు నెహ్రూ ఏం చేశారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)