Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఆస్తుల విలువ ఎంత? ఆయన దగ్గర ఎన్ని కార్లున్నాయి?

ఫొటో సోర్స్, EKNATH SHINDE OFFICE
- రచయిత, దీపాలీ జగ్‌తప్
- హోదా, బీబీసీ మరాఠీ
‘‘నాకొక చిన్న మనవడు ఉన్నాడు. వాడితోనే నాకు కాలక్షేపం అవుతుంది. నా ఆస్తి కూడా వాడే’’అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఇటీవల అసెంబ్లీలో చెప్పారు.
ఇంతకీ ఏక్‌నాథ్‌కు ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి? ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఏం చెప్పారు?
2004 నుంచి కోపారీ-పఛ్‌పాఖ్‌డీ నియోజకవర్గం నుంచి ఏక్‌నాథ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం 35ఏళ్లకుపైనే ఉంది.
2019లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలను ఏక్‌నాథ్ వెల్లడించారు.
మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో ఏక్‌నాథ్ అఫిడవిట్ అందుబాటులో ఉంది. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన చరాస్తుల విలువ 97 లక్షల 14 వేల రూపాయలు.
మరోవైపు రూ.కోటి 27 లక్షల స్థిరస్తులను కొనుగోలు చేశానని, 2019లో దాని మార్కెట్ విలువ రూ.4 కోట్ల 47 లక్షలని చెప్పారు.
ఈ స్థిర, చరాస్తులకు అదనంగా ఐదు కోట్ల 44 లక్షల రుపాయల ఇతర ఆస్తులను తాను సంపాదించినట్లు ఏక్‌నాథ్ పేర్కొన్నారు. మరోవైపు మూడు కోట్ల 20 లక్షల 64 వేల రూపాయల అప్పులు కూడా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నట్లు చెప్పారు.
నగదు రూపంలో 2 లక్షల 64 వేలు ఉన్నట్లు ఏక్‌నాథ్ 2019లో వెల్లడించారు.

బంగారం, కార్లు..
శిందే కుటుంబం దగ్గర 46 లక్షల 55 వేల రూపాయల విలువైన ఏడు వాహనాలు ఉన్నాయి. రూ.96,720 విలువైన అర్మాడా, రూ.లక్ష 33 వేల విలువైన స్కార్పియో, రూ.లక్ష 89 వేల విలువైన బొలెరో ఏక్‌నాథ్ దగ్గర ఉన్నాయి.
ఆయన భార్య లత దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. 27 లక్షల 31 వేల విలువైన ఇన్నోవా, 8 లక్షల 41 వేల విలువైన స్కార్పియో, రూ.6 లక్షల 42 వేల విలువైన ఇన్నోవా, రూ.21 వేల విలువైన టెంపో ఆమె దగ్గర ఉన్నాయి.
ఏక్‌నాథ్ శిందే తన పేరు మీద ఒక రివాల్వర్, ఒక పిస్టల్ తీసుకున్నారు. రివాల్వర్ విలువ రూ.2.5 లక్షలు. పిస్టల్ విలువ కూడా రూ.2.5 లక్షలు.
ఏక్‌నాథ్ దంపతుల దగ్గర 25 లక్షల 87 వేల రూపాయల విలువైన బంగారం ఉంది. ఏక్‌నాథ్ దగ్గర 11 తులాల విలువైన బంగారం ఉండగా.. లత దగ్గర 57 తులాల బంగారముంది.
మహాబలేశ్వర్ సతారాలో రూ.4 కోట్ల 47 లక్షల విలువైన రెండు ఇళ్లు, వ్యవసాయ భూమి ఏక్‌నాథ్ పేరిట ఉన్నాయి.
తనకు ఆదాయం ఎలా వస్తోందో కూడా అఫిడవిట్‌లో ఏక్‌నాథ్ పేర్కొన్నారు. తన పేరిట శివమ్ ఎంటర్‌ప్రెజెస్ సంస్థ ఉందని, తన భార్య పేరిట శిందే కన్స్‌ట్రక్షన్ సంస్థ ఉందని వివరించారు.
లతా శిందే పేరిట కోటి 13 లక్షల విలువైన చరస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు రూ.కోటి 23 లక్షల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, EKNATH SHINDE/FACEBOOK
18 పెండింగ్ కేసులు..
ఏక్‌నాథ్‌పై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆక్రమణలు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు.
రాజకీయాల్లోకి రాకముందు శిందే ఆటోరిక్షా నడిపేవారు. 18ఏళ్ల వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవి వరకు చేరుకోగలిగారు.
ఠానేకు చెందిన శివసేన నాయకుడు ఆనంద్ దిఘేను తన రాజకీయ గురువుగా ఏక్‌నాథ్ భావించేవారు. 1997లో ఠానే మున్సిపల్ కార్పొరేషన్‌కు పోటీచేసేందుకు ఏక్‌నాథ్‌కు ఆయన అవకాశం కల్పించారు.

ఫొటో సోర్స్, EKNATH SHINDE/FACEBOOK
గత కొన్ని దశాబ్దాలుగా శివసేనలో శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా ఏక్‌నాథ్ ఎదిగారు. ఆయన కుమారుడు శ్రీకాంత్.. కల్యాణ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
తొలి ప్రయత్నంలోనే ఏక్‌నాథ్ ఠానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచారు. అక్కడ శివసేన సభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2004లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. అక్కడా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
వరుసగా నాలుగుసార్లు పఛ్‌పాఖ్‌డీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు.
2015 నుంచి 2019 మధ్య ప్రజా పనుల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు.

ఫొటో సోర్స్, ANI
ఉద్ధవ్ ఠాక్రే ఆస్తుల విలువ ఎంత?
ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏక్‌నాథ్ ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు. అయితే, ఆస్తుల విషయంలో ఉద్ధవ్ ఠాక్రేతో ఏక్‌నాథ్‌కు ఎలాంటి పోలికా లేదు.
మొత్తంగా రూ.24 కోట్ల 14 లక్షలు విలువైన చరాస్తులు తన పేరిట ఉన్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు స్థిరాస్తులు కూడా రూ.52.54 కోట్లు ఉన్నట్లు ఉద్ధవ్ వెల్లడించారు.
రాయ్‌గఢ్ జిల్లాలో 1986 నుంచి 1988 మధ్య రూ.95,000 వేలతో 5 ప్లాట్లు ఉద్ధవ్ కొనుగోలు చేశారు. ఆయన ఫార్మ్ హౌస్ విలువ రూ.5 కోట్లు.
అహ్మద్‌నగర్, మాహిమ్‌లలో రూ.4కోట్ల 20 లక్షల విలువైన ప్లాట్లు ఉద్ధవ్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.13 కోట్ల 64 లక్షలు.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














