ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌

ఫొటో సోర్స్, KENICHI HABU / EYEEM

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు చెందిన 19 ఉత్పత్తులపై నిషేధం శుక్రవారం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. పర్యావరణవేత్తలు దీన్ని బడా కార్పొరేట్ కంపెనీల విజయంగా పిలుస్తున్నారు. వారి ప్లాస్టిక్ రాజకీయాల్లో ఇది కూడా ఒక భాగమని అంటున్నారు.

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే చైతన్యాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జూలై 3న 'ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే' పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం.

నిజంగానే, 19 ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం అన్నది బడా వ్యాపారవేత్తలు సాధించిన విజయమా?

నిజానికి, ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువుల్లో ఏవేవి నిషిద్ధ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయో చాలామంది వ్యాపారస్థులకు పూర్తిగా తెలియదు.

దిల్లీ సదర్ బజార్‌లోని హోల్‌సేల్ ప్లాస్టిక్ వ్యాపారి ఉమేశ్ అగర్వాల్ దీని గురించి మాట్లాడుతూ... ''వాట్సాప్‌ ద్వారా వచ్చిన సమాచారమే మాకు తెలుసు. ఏ వస్తువులపై నిషేధం ఉంది? వేటిపై లేదు అనే విషయంలో మాకు స్పష్టత లేదు. కొందరేమో 100 మైక్రాన్ ప్లాస్టిక్‌పై నిషేధం అంటున్నారు. మరికొందరు 80 మైక్రాన్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉందని చెబుతున్నారు'' అని ఆయన వివరించారు.

ముడిసరుకుల హోల్‌సేల్ మార్కెట్లో కొద్ది రోజుల్లోనే 'దానా' ధర కిలోకు 20 రూపాయలు తగ్గుతుందనే చర్చ జరుగుతోంది.

హోల్‌సేల్ ప్లాస్టిక్ వ్యాపారి ఉమేశ్ అగర్వాల్
ఫొటో క్యాప్షన్, హోల్‌సేల్ ప్లాస్టిక్ వ్యాపారి ఉమేశ్ అగర్వాల్

గడువు తేదీ పొడిగించలేదు

గతంలో ఎన్నోసార్లు జరిగినట్లుగానే ఈసారి కూడా ప్లాస్టిక్‌పై నిషేధం తేదీని పొడిగిస్తారని గురువారం సాయంత్రం వరకు ఇక్కడి ప్రజలు నమ్మకంగా ఉన్నారు.

కానీ, 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పిన అంశాలను ఈసారి తప్పకుండా అమలు చేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించుకున్నట్లు ఉంది.

2022 నాటికి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి వీలయ్యే ప్లాస్టిక్)'ను నిర్మూలించడం గురించి ఆ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడారు. 2020 డిసెంబర్‌లో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో కూడా ఆయన ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.

దీని తర్వాత ప్రభుత్వం, వేస్ట్ మేనేజ్‌మెంట్ నియమాలను సవరిస్తూ 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్'ను నిర్వచించింది.

ఏదైనా ఒక పని కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తూ తయారు చేసిన వస్తువులు, కేవలం ఒకేసారి మాత్రమే ఉపయోగించి ఆ తర్వాత వాటిని పడేయడమో లేదా రీసైక్లింగ్ చేయడానికో పంపిస్తుంటాం. వాటిని రెండోసారి ఉపయోగించలేం. అలాంటి వస్తువులను 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' ఉత్పత్తులుగా పరిగణిస్తాం అని పేర్కొంది.

తర్వాత దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వినియోగం, పర్యావరణానికి కలిగించే నష్టం ఆధారంగా వస్తువుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలోని 19 వస్తువులపై జూలై 1నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది.

ఇయర్ బడ్స్, బెలూన్‌ల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ఫోర్కులు, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన బ్యానర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్'' సంస్థకు చెందిన సిద్ధార్థ్ సింగ్
ఫొటో క్యాప్షన్, సిద్ధార్థ్ సింగ్

సవాళ్లు

ప్రభుత్వ ఉత్తర్వులలో ఈ వస్తువులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కేటగిరీలో చేర్చారు. వీటిని ఉపయోగించకపోయినా పర్వాలేదని, వీటిద్వారా పర్యావరణానికి అధిక నష్టం కలుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే, కమిటీ రూపొందించిన తుది జాబితాపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పర్యావరణ రంగంలో ప్రసిద్ధి చెందిన ''సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్'' సంస్థకు చెందిన సిద్ధార్థ్ సింగ్ దీని గురించి మాట్లాడారు.

''ఈ జాబితాలో ప్లాస్టిక్ స్ట్రా కూడా ఉంది. దీని ఉపయోగ సూచికను 16గా నిర్ధారించారు. పర్యావరణంపై అది చూపించే ప్రతికూల ప్రభావం 87 అని చెప్పారు. కానీ, ఈ కమిటీ సిగరెట్ ఫిల్టర్‌ను లెక్కలోకి తీసుకోలేదు. దాని ఉపయోగం, పర్యావరణ నష్టం సూచికలు వరుసగా 20, 93గా గుర్తించారు'' అని అన్నారు.

సిగరెట్ ఫిల్టర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని అడగగా ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు. 'వీటినే ప్లాస్టిక్ రాజకీయాలు అంటారు'' అని చెప్పారు.

ముందుగా తయారు చేసిన జాబితాలో 65 నుంచి 70 వరకు వస్తువులు ఉన్నాయని ప్లాస్టిక్ పరిశ్రమ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.

''ఎక్కడినుంచి మొదలుపెట్టినా ఈ నిషేధాన్ని స్వాగతించాలి. అయితే, ప్రస్తుతం నిషేధం విధించిన వస్తువులన్నీ చిన్న తరహా పరిశ్రమలతో సంబంధం ఉన్నవి'' అని సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.

ప్లాస్టిక్ హానికరమైతే, పెద్ద కంపెనీలు తయారు చేసే వస్తువులపై నిషేధాన్ని ఎందుకు అమలు చేయట్లేదు. కేవలం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారులనే ఎందుకు ఎప్పుడూ లక్ష్యంగా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

పాలిథీన్ బ్యాగులు

ఫొటో సోర్స్, ANI

పెద్ద కంపెనీలను ఎందుకు వదిలేశారు?

బహదూర్‌గఢ్ రోడ్‌లోని ప్లాస్టిక్ డీలర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ విపిన్ తనేజా మాట్లాడుతూ... ''పెట్రోలియం-పెట్రోకెమికల్స్ ఉన్నంత కాలం ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్లిక్‌తో ముడిసరుకులు తయారు చేయడంలో ప్రభుత్వ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్‌తో పాటు ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్, మిట్టల్ తదితర కంపనీలు భాగమయ్యాయి'' అని అన్నారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ ప్రకారం, భారతదేశంలో గత అయిదేళ్లలో ప్లాస్టిక్ వాడకం రెట్టింపు అయింది. 2020లో దేశంలో దాదాపు 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.

చైనా, అమెరికా, ఇండోనేసియా, జపాన్ తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యధికం.

ప్లాస్టిక్‌పై నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్రాలు, దేశ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ఈ పనిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు, వాటి వ్యర్థాలు పర్యావరణానికి అత్యధిక నష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.

వీడియో క్యాప్షన్, తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

''ఈరోజు మనం ప్లాస్టిక్‌ను తింటున్నాం. పీల్చుతున్నాం. తాగుతున్నాం. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి పది వేల అడిటీవ్‌ల (సంకలిత పదార్థాలు)ను ఉపయోగిస్తారు. వీటిలోని దాదాపు రెండున్నర వేల పదార్థాలతో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటి వాడకాన్ని నిలిపేయాలని ఐక్యరాజ్యసమితి కూడా అంగీకరించింది'' అని సిద్ధార్థ్ సింగ్ చెప్పారు.

ముంబయికి చెందిన జయేష్ రాంభియా మాట్లాడుతూ, ''మద్యం, సిగరెట్‌ల వాడకం వల్ల సంవత్సరం పొడవునా లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు. కానీ, ఎవరూ వాటిని నిషేధించలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రంలోకి చేరుతున్నాయి. వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది'' అని అన్నారు.

జయేష్ రాంభియాకు ప్లాస్టిక్ పరిశ్రమతో అనుబంధం ఉంది.

"ప్లాస్టిక్ పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరం కాదు. దీనివల్లే చెట్ల నరికివేత తగ్గింది. మళ్లీ పేపర్ వాడకం పెరగడంతో చెట్ల నరికివేత మళ్లీ మొదలవుతుంది'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఏసీల కరెంటు బిల్లు తగ్గించేందుకు 8 మార్గాలు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)