124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది

- రచయిత, అనంత్ ప్రకాశ్, డెబాలిన్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు, బాగ్‌పత్ నుంచి
మండే వేసవి కాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితేనే బయట అడుగు పెట్టేందుకు చాలామంది భయపడతారు. కానీ, అంతకు మూడింతలకు పైగా 124 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద వీళ్లు ఎలా పనిచేస్తున్నారు?
ఇటుక బట్టీలలో పనిచేసేవారి పరిస్థితి ఇది.
అంత వేడిగా ఉండే ఇటుక బట్టీల్లో పనిచేయడం ఎంత కష్టమో.. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల కళ్లలో చూస్తే అర్థమవుతుంది. వేడి వాతావరణంలో పనిచేయడంతో వీరి చేతులు 'రాళ్ల'లా మారిపోయాయి.
ఇక్కడ మామూలు రబ్బరు చెప్పులు వేసుకుంటే ఆ వేడికి కాలిపోతాయి. అందుకే, ఇటుకలను కాల్చే బొగ్గుల కొలిమి దగ్గర నడిచేందుకు ఈ కార్మికులు చెక్కలతో చేసిన చెప్పులను వేసుకుంటారు.

40 డిగ్రీల ఉష్ణోగ్రతే చాలా అధికమని పరిగణిస్తారు. అలాంటిది అంతకు మూడింతలు వేడి ఉండే ఈ బట్టీలలో నిలబడటం, పనిచేయడం, శ్వాస తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఊహించండి.
దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది కార్మికులు బతుకుదెరువు కోసం ఇలాంటి అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్నారు.
40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పనిచేసేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు.
అయితే, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా భారత్‌లో 2030 నాటికి దాదాపు 3.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి కార్మిక సంస్థ నివేదిక చెబుతోంది. వ్యవసాయ, నిర్మాణ రంగాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.

కోట్లాది మంది వ్యవసాయ కూలీలు, రోడ్ల వెంట చిరుతిళ్లు విక్రయించేవారు, పంక్చర్లు వేసేవారు, బిస్కెట్ తయారీ కర్మాగారాలు, లోహాలను కరిగించే కొలిమీలు, గనుల్లో, ఇటుక బట్టీలో పనిచేసే కార్మికులపై భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
మధ్యాహ్నం సమయంలో పనిచేయడం కష్టంగా మారుతుందని ఆ నివేదిక పేర్కొంది.
అత్యంత వేడి ప్రదేశాలలో అసంఘటిత కార్మికులు ఎలా పనిచేస్తున్నారు? వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? అన్న విషయాలను థర్మోమీటర్ సాయంతో పరిశీలించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అందుకోసం, ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్ ప్రాంతంలో ఉన్న ఓ ఇటుక బట్టీకి వెళ్లాం.

"ఇక్కడ పనిచేయడం అంత సులువు కాదు. ఏ పనీ దొరక్క.. ఇక్కడ పనిచేయక తప్పట్లేదు. రబ్బరు చెప్పులు వేసుకుంటే ఈ వేడికి కాలిపోతాయి. అందుకే, చెక్కలతో చేసిన చెప్పులను వేసుకుంటాం" అని ఆ ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికుడు రామ్ సూరత్ చెప్పారు.
ఆయన నిలబడిన చోట ఉష్ణోగ్రత 110 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంది. తర్వాత కొద్దిదూరానికి రామ్ సూరత్‌ను తీసుకెళ్లి ఆయన శరీరానికి థర్మోమీటర్ అమర్చగా, శరీర ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా చూపిస్తోంది.

శరీర ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ దాటితే ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది.
ఈ కార్మికులతో కలిసి ఇటుక బట్టీ వద్ద కొన్ని గంటలపాటు గడిపిన బీబీసీ ప్రతినిధికి శరీరమంతా కాలినట్లు మంటలు వచ్చాయి, వాంతులయ్యాయి, తలనొప్పి ప్రారంభమైంది. అంతేకాదు, అక్కడికి వెళ్లేటప్పుడు వేసుకున్న బీబీసీ ప్రెస్ షూలు కూడా ఆ వేడికి కాలిపోయాయి.
అదంతా చూశాక, వాళ్లు రోజూ అంత వేడిని ఎలా తట్టుకోగలుగుతున్నారో అర్థం కావడంలేదు.
"ఇక్కడ పనిచేయడం ప్రారంభించగానే, మూత్రనాళంలో మంట మొదలవుతుంది. ఆరు గంటలపాటు నిమిషం విరామం లేకుండా పనిచేయాల్సిందే. ఆ మంటను తగ్గించుకునేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతాం" అని రామ్ సూరత్ చెప్పారు.

ఈ కార్మికులు కాళ్లకు చెక్క చెప్పులు వేసుకుంటారు, కానీ చేతులకు కనీసం గ్లౌజులు, ముఖానికి మాస్కులు కూడా ధరించరు.
"ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా 60-70 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే ఇటుక బట్టీల కొలిమి దగ్గర పనిచేయడం అత్యంత ప్రమాదకరం" అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌లో పనిచేసే నివీత్ కుమార్ అన్నారు.
దేశ రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండే పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో ఇటుక బట్టీలు అధికంగా ఉంటాయి. దిల్లీ, నోయిడా, ఘాజియాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఇటుకలు సరఫరా అవుతుంటాయి.
అయితే, ఇక్కడ కొన్ని బట్టీలలో కార్మికులు నిర్విరామంగా పనిచేసే అవసరం లేకుండా నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇటుక బట్టీలలో జిగ్- జాగ్ టెక్నాలజీని వినియోగిస్తే కాలుష్యం కూడా తగ్గుతుందని నివీత్ కుమార్ చెబుతున్నారు.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్‌కు చెందిన 'డౌన్ టు ఎర్త్' నివేదిక ప్రకారం, 2001 నుంచి ప్రతి రోజూ 10 వేల మంది వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వ్యవసాయ కూలీలపై కూడా తీవ్రంగా పడుతోంది.
రహదారుల వెంట పంక్చర్ దుకాణాలు, చిరుతిళ్ల బండ్లు నడుపుకునేవారు కూడా ఎండల ప్రభావానికి గురవుతున్నారు. రహదారుల వెంట ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక చోట రహదారి వెంట 52 డిగ్రీల ఉష్ణోగ్రత చూపించింది.
ఇవి కూడా చదవండి:
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంపులను ఊడపీకి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- ఈ తిమింగలం రష్యా గూఢచారా
- మయన్మార్: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్
- మాస్కో విమాన ప్రమాదానికి పిడుగుపాటే కారణమా
- తుపాను సమయంలో ల్యాండింగ్ కష్టమై నదిలోకి దూసుకెళ్లిన విమానం
- ట్రంప్ - రష్యా: మొత్తం సీరియల్ 250 పదాల్లో
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









