ఎవరెస్టుపై బారులు తీరుతున్న పర్వతారోహకులు.. పెరుగుతున్న మరణాలు

ఫొటో సోర్స్, AFP/ PROJECT POSSIBLE
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసోపేతమైన పని. ఏటా వందల మంది ప్రయత్నిస్తే అతికొద్ది మంది మాత్రమే ఆ శిఖరం పై వరకూ చేరుకోగలుగుతారు. అయితే, కొందరు పర్వతారోహకులు మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (8,848 మీటర్లు) ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ పర్వతంపై మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏడుగురు పర్వతారోహకులు మరణించారు.
బుధవారం నాడు (మే 22) పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా తీసిన ఫొటో చూస్తే ఎవరెస్టు పర్వతంపై ఎంత రద్దీ ఉందో... అక్కడ వారు ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది.
ఎవరెస్టును అధిరోహించేందుకు బుధవారం ఒకేసారి వందలమంది ఎగబడ్డారు. దాదాపు 320 మంది క్యూలో ఉన్నారని నిర్మల్ తెలిపారు. దాంతో, చాలామంది కొన్ని గంటలపాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. శిఖరం మీదికి చేరుకునేందుకు ఆలస్యమైంది.

ఫొటో సోర్స్, AFP
ఈ వారం రోజుల్లో ఎవరెస్టు మీద చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు, ఒక నేపాలీ, ఒక ఆస్ట్రేలియా, ఒక అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శుక్రవారం ఉదయం ఐర్లాండ్‌కు చెందిన పర్వతారోహకుడు కెవిన్ హైనెస్ (56) చనిపోయారు. ఎవరెస్టు పర్వతం దిగుతుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ సీజన్‌లో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది.
శనివారం బ్రిటన్‌కు చెందిన రోబిన్ హాయ్‌నెస్ ఫిషర్ (44) కూడా మరణించారు.

ఫొటో సోర్స్, WWW.RALFDUJMOVITS.DE
ఎందుకు చనిపోతున్నారు?
"ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్ని సీజన్లలో మాత్రమే అనుమతిస్తారు. అందులోనూ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయి. వాతావరణం అనుకూలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మంది పర్వతం మీదికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు రద్దీ భారీగా పెరిగిపోతుంది" అని 'సెవెన్ సమ్మిట్స్ ట్రెక్స్' సంస్థ ఛైర్మన్ మింగ్మా షెప్రా వివరించారు.
ఈ క్యూ కారణంగా ఒక్కోసారి గంటన్నర పాటు ముందుకు కదల్లేని పరిస్థితి ఉంటుందని మింగ్మా చెప్పారు.
పొడవాటి క్యూలు చాలా ప్రమాదకరమని 1992లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన దుజ్మోవిట్స్ అంటున్నారు.
"క్యూలో వేచిచూడాల్సి రావడంతో వెంట తీసుకెళ్లే సిలిండర్‌లో ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో, చాలామందికి తిరిగి పర్వతం కిందికి వచ్చే వరకు ఆక్సిజన్ చాలక మధ్యలోనే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంటుంది" అని దుజ్మోవిట్స్ అంటున్నారు.
"1992లో నేను ఎవరెస్టును అధిరోహించినప్పుడు పర్వతం కిందికి దిగుతుండగా ఆక్సిజన్ అయిపోయింది. ఒక్కసారిగా నన్ను ఎవరో గట్టి కర్రతో కొట్టినట్లు అనిపించింది. ఇక అక్కడి నుంచి కదల్లేనేమో అని అనుకున్నాను. కానీ, అదృష్టం కొద్ది కాస్త కోలుకుని క్షేమంగా కిందికి దిగాను" అని దుజ్మోవిట్స్ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు గతంలో కంటే చాలా కఠినంగా ఉన్నాయి.
ఏటా ఎవరెస్టును అధిరోహించేందుకు వెళ్లేవారి సంఖ్యతో పాటు, మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో, ఏటా పరిమితి మేరకే పర్వతారోహకులను అనుమతించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతేడాది 807 మంది ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో 381 మంది పర్వతారోహకులకు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు నేపాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు ఒక్కొక్కరి నుంచి 7 లక్షల 63 వేలు వసూలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మం గారి కాలజ్ఞానం: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు...
- మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు
- నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్‌ల ‘వ్యక్తి పూజ రాజకీయాలు’
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమూ కోల్పోయిన పవన్ కల్యాణ్
- ‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








