తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు

ఫొటో సోర్స్, fb/TDP
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు నేలపైనే కాదు, భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎంతో ప్రత్యేకం. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకీ లేని ఎన్నో ప్రత్యేకతలు తెలుగుదేశం సొంతం.
ఆ పార్టీ 37 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. కానీ, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గతంలో ఎన్నడూ చూడనంతగా దెబ్బతింది.

ఫొటో సోర్స్, Tdp/fb
ఆత్మగౌరవ నినాదంతో...
తెలుగు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అవమానిస్తోందని... నందమూరి తారక రామారావు (ఎన్టీయార్) 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చైతన్య రథం ఎక్కి 'తెలుగువారి ఆత్మగౌరవం' పేరుతో రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించారు.
బీసీలకు, యువతకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీని నిలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ స్థాయిలో...
జాతీయ స్థాయిలో లోక్‌సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలవడంతో లోక్‌సభలో ప్రతిపక్షంగా నిలబడింది. (అధికారిక ప్రతిపక్షం కాదు) కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ తరువాత 1989 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టీడీపీ పరిమితం అయిపోయింది.
టీడీపీ మొదటి నుంచీ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. 1989లో నేషనల్ ఫ్రంట్ తరపున వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, 1996లో యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, తరువాత ఎన్డీఏలో కీలక పాత్ర పోషించింది.
తాజాగా తన చిరకాల ప్రత్యర్థి, ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. తెలుగుదేశం పుట్టింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, ఆ పార్టీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోని ఏకైక పార్టీ అని ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకున్న తెలుగుదేశం నాయకులు, తరువాత.. "తెలుగుదేశం పుట్టింది రాష్ట్రాలపై దిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా, అప్పట్లో ఆ పని కాంగ్రెస్ చేసింది కాబట్టి వారికి వ్యతిరేకంగా, ఇప్పుడు పెత్తనం బీజేపీది కాబట్టి వారికి వ్యతిరేకంగా తమ పోరాటం" అంటూ వివరణ ఇచ్చుకున్నారు.
ఈసారి కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకపోతే గతంలోలాగానే కేంద్రంలో చక్రం తిప్పాలని తెలుగుదేశం నేతలు భావించారు. ఏ నాయకుడూ తిరగనంతగా పశ్చిమ బంగా, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, ముంబైలలో అనేకసార్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించారు. కానీ, ఫలితాలు తారుమారయ్యాయి.
కేంద్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు నేలపై...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీయార్ మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రెండుసార్లు, పదవి మార్పిడి ద్వారా ఒకసారి మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
294 స్థానాలున్న ఉమ్మడి ఏపీలో మూడుసార్లు 200కి పైగా స్థానాలు గెలుచుకున్న ఘనత తెలుగుదేశం సొంతం. 1985లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటును కూడా సమర్థంగా తిప్పికొట్టగలిగింది.
1995లో చంద్రబాబు నాయకత్వంలో పార్టీలో తిరుగుబాటు జరిగింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్‌ను ఆ పార్టీ నుంచి బయటకు పంపారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కోసం కూడా గొడవ జరిగింది.
చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకే సైకిల్ గుర్తు కేటాయిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. "ఎన్టీయార్‌లో నైతిక విలువలు శూన్యం" అంటూ అప్పట్లో ఇండియా టుడే వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఆరోపించారు. కానీ, ఆ తరువాత "ఎన్టీయార్ దైవాంశ సంభూతుడు" అంటూ ఆయనే వివిధ బహిరంగ సభల్లో స్తుతించారు. ఎన్టీయార్ పేరిట అనేక పథకాలూ ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, Tdp/fb
చంద్రబాబు నేతృత్వంలో...
చంద్రబాబు హయాంలో తెలుగుదేశం కొత్తగా ఎదిగింది. దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీల్లో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతీదీ పక్కాగా ఉంటుంది, పక్కాగా చేస్తుంది ఆ పార్టీ.
ఎన్నికల నిర్వహణలో ధన బలం పెరగడానికి టీడీపీ కారణమనే విమర్శలు కూడా ఆ పార్టీ తరచూ ఎదుర్కొంటుంది. చంద్రబాబు హయాంలో బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్ అనే పదం చాలా పేరు సంపాదించింది.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికలకూ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి పొత్తులేకుండా పోటీ చేసింది ఈసారి ఎన్నికల్లోనే.
తెలుగుదేశానికి మొదటి భారీ ఓటమి 2004లో వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 47 సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభంజనంలో కేవలం 23 స్థానాలకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.
2014లో రాష్ట్ర విభజన కూడా తెలుగుదేశానికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ తనవైపుకు లాక్కున్నారు కేసీఆర్. నాయకులే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో టీఆర్ఎస్ వైపు వెళ్ళారు.
ఉమ్మడి ఏపీలోని పార్టీని, కేవలం ఆంధ్రా పార్టీగా చూపించడంలో కేసీఆర్ సఫలం అయ్యారు. తెలుగుదేశం తమను తాము జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది. కానీ 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీ హోదా కూడా కోల్పోయింది.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తన పాత వైభవం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు వయసుతో సంబంధం లేకుండా కష్టపడటానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు.
కుమారుడు లోకేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న చంద్రబాబు కల తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. లోకేశ్ అసలు వ్యక్తిత్త్వం ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం ఇమేజ్ క్రియేట్ కాలేదు.
ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ పాత వైభవాన్ని సంపాదించడానికి ఏం చేస్తుంది? ఎవరి నాయకత్వంలో ముందుకు వెళుతుంది అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









