రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?

ఫొటో సోర్స్, AFP/GETTY
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
తాజా లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన ఈ చారిత్రక విజయం.. కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకనుందా?
తరతరాలుగా నెహ్రూ-గాంధీ వారసుల చేతుల్లో ఉంటూ వస్తున్న ఆ పార్టీ.. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది.
రాహుల్ ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ.. అందరూ దేశ ప్రధాని పదవిని చేపట్టినవారే.
అయితే, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడిగా రాజకీయ వేదికపైకి వచ్చిన రాహుల్.. తమ పూర్వీకుల స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నడిపించలేకపోతున్నారు.
ఈసారి బీజేపీ 300 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడమే కాకుండా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ పార్లమెంటు నియోజకవర్గంలోనూ రాహుల్‌కు పరాజయం రుచి చూపించింది.
ఆ సీటు తరాల తరబడి నెహ్రూ-గాంధీ కుటుంబం చేతుల్లో ఉంది. రాహుల్ తల్లిదండ్రులు రాజీవ్, సోనియా గాంధీ గతంలో ఇక్కడ ఎన్నోసార్లు గెలిచారు. రాహుల్ కూడా గత 15 ఏళ్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించారు.
భారత రాజకీయాలకు ఉత్తర్‌ప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా భావిస్తుంటారు. ఇక్కడ గెలిచినవారే దేశాన్ని ఏలుతారన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే, 545 సీట్లున్న లోక్‌సభలో 80 స్థానాలు ఈ రాష్ట్రానివే.
ఇప్పటివరకూ దేశానికి ప్రధానిగా పనిచేసిన 14 మందిలో 8 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారే. రాహుల్ ముత్తాత, నానమ్మ, తండ్రి కూడా ఉత్తర్ ప్రదేశ్ నుంచే గెలిచారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసినే ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, EPA
అమేఠీలో ఓడినా, రాహుల్ లోక్‌సభలో కూర్చుంటారు. పోటీ చేసిన రెండో స్థానం వయనాడ్‌లో ఆయన గెలవడమే దీనికి కారణం.
ఎన్నికల్లో ఓటమి తర్వాత గురువారం సాయంత్రం రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పరాజయానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాని కూడా అన్నారు.
ఆ సమయానికి అమేఠీలో లెక్కింపు పూర్తి కాకపోయినా, ఆ స్థానంలో తన ప్రత్యర్థి స్మృతీ ఇరానీకి అభినందనలు తెలిపారు.
"ఇది ప్రజాస్వామ్యం. ప్రజల తీర్పును గౌరవిస్తాను. ఆమెకు నా అభినందనలు" అని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై, పార్టీ తదుపరి కార్యాచరణపై ఆయన మాట్లాడలేదు.
పార్టీకి సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకునే వర్కింగ్ కమిటీ సమావేశంలోనే ఈ విషయాలన్నీ చర్చిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. "మీరు డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. మరింత కష్టపడితే, వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉన్నఫళంగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు.
కానీ, ఇలాంటి పరాజయాన్ని పార్టీలో ఉన్నవారు, బయటివారు కూడా ఊహించలేదు.
ఈ ఓటమి తర్వాత, ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయం వెలవెలబోయి కనిపించింది.
"మా హామీలను ప్రజలు నమ్మట్లేదు. మా మీద వారికి అస్సలు నమ్మకం లేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ కూడా విఫలమయ్యారు. కానీ, ప్రజలు ఆయన్నే నమ్ముతున్నారు. కారణమేంటో మాకు కూడా అంతుపట్టట్లేదు" అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
ఇలాంటి నిరాశాజనకమైన ఎన్నికల ప్రదర్శన తర్వాత రాహుల్ నాయకత్వ పటిమపై సందేహాలు వ్యక్తమవ్వడం సర్వసాధారణం.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మారాలని ఇప్పటికే కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు
ఇలాంటి డిమాండ్లు గతంలోనూ వచ్చాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం రాహుల్‌ను ఇంకా సమర్థిస్తోంది.

ఫొటో సోర్స్, AFP/GETTY
రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించినట్లు వార్తలు వచ్చాయి. ఆ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించినట్లు, దీనిపై మరోమారు చర్చించాలని నిర్ణయించినట్లు కూడా వార్తలను బట్టి తెలుస్తోంది.
ఈ వార్తలపై పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ బీబీసీతో మాట్లాడారు.
"కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మాకు ఎలాంటి సందేహాలూ లేవు. ఒకవేళ రాహుల్ గాంధీ రాజీనామా ఇస్తే, మేము దాన్ని స్వీకరించం" అని ఆయన అన్నారు.
తాజా పరాజయానికి పార్టీ నాయకత్వం కారణం కాదని మణిశంకర్ అభిప్రాయపడ్డారు.
"సంస్థాగతంగా పార్టీలో లోపాలు ఉన్నాయి. పార్టీ ర్యాంకుల్లో గొడవలు ఉన్నాయి. మేము ప్రచారంలోకి దిగడం కూడా బాగా ఆలస్యమైంది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో కూటమికి వెళ్లడం కూడా చాలా పెద్ద తప్పిదం" అని లఖ్‌నవూలోని స్థానిక కాంగ్రెస్ నాయకుడు బ్రిజేంద్ర కుమార్ సింగ్ అన్నారు.
తమకు ప్రధాని అడ్డంకి మాత్రం 'బ్రాండ్ మోదీ'నే అని చాలా మంది కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్‌కు ఇలాంటి పరిస్థితి రావడం ఇది మొదటి సారేమీ కాదు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువగా 44 సీట్లు సాధించింది.
ఆ తర్వాత జరిగిన వివిధ శాసన సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసింది.
ప్రతిభతో కాకుండా, కుటుంబ నేపథ్యం కారణంగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నాయకుడిగా మారారని ప్రధాని మోదీ చాలా సార్లు విమర్శలు చేశారు.
కానీ, గత రెండేళ్లలో రాహుల్ నిలదొక్కుకున్నారు.
ఆయన సోషల్ మీడియా ప్రచారం మెరుగైంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు, నిరుద్యోగం, సమాజంలో అసహనం, ఆర్థికవ్యవస్థ మందగమనం వంటి విషయాలపై ఆయన సమర్థంగా వాణిని వినిపించగలిగారు.
రఫేల్ ఒప్పందంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఫొటో సోర్స్, Reuters
గత డిసెంబర్‌లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, పార్టీని రాహుల్ తిరిగి పోటీలోకి తీసుకువచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఫిబ్రవరిలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ కు మళ్లీ అవకాశం వస్తుందేమోనని నిపుణులు ఊహించారు.
తమ పార్టీ మేనిఫెస్టోలోని పథకాలు, హామీలు ప్రజలకు చాలా ఉపయోగపడేవేనని, కానీ తాము ఊహించినట్లుగా ప్రజల నుంచి మద్దతు పొందలేకమాయమని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత వీరేంద్ర మదన్ అన్నారు.
"ఓటమికి మా పార్టీ నాయకత్వాన్ని బాధ్యులను చేయడం సమంజసం కాదు. రాహుల్ గాంధీ ఒక్కరే ఓడిపోలేదు. ఎంతో మంది పెద్ద నాయకులూ ఓటమిపాలయ్యారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి. గెలుపోటములు సర్వసాధారణం. 1984 లో బీజేపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు వారి స్థానం ఏంటీ? మేమూ అలాగే, మళ్ళీ పైకి వస్తాం" అని మదన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- పయ్యావుల కేశవ్ గెలిస్తే ఏపీలో టీడీపీ ఓడిపోతుందనే ప్రచారంలో నిజమెంత? 1994లో ఏమైంది?
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- ‘ఈ ప్రజా తీర్పుకు ఏకైక కారణం.. నరేంద్ర మోదీ’: అభిప్రాయం
- ఎడిటర్స్ కామెంట్: ‘విజన్’పై 'విశ్వసనీయత' విజయం
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- 'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- నిద్రలో వచ్చే కలలు ఎందుకు గుర్తుండవు? గుర్తుండాలంటే ఏం చేయాలి...
- పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ
- పాకిస్తాన్ గగనతలంపై నిషేధంతో భారత విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










