ఆరోగ్యవంతమైన ఆహారం: ఈ ‘సూపర్ ఫుడ్స్’ మనకు చాలా చౌకగా దొరుకుతాయి.. తింటున్నారా? లేదా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, పౌలా మెక్‌గ్రాత్
- హోదా, హెల్త్ చెక్, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ, సమస్త జీవానికి ఆధారమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అంటున్నారు పరిశోధకులు.
మనిషి శరీరంతోపాటు పర్యావరణానికి మేలు చేసే 50 రకాల ఆహారాల జాబితాను 'సూపర్ ఫుడ్స్' పేరుతో వారు ఆవిష్కరించారు.
ఆహార తయారీ సంస్థ నార్, వరల్డ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)- యూకే సంస్థ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొన్ని ఆహారపదార్థాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపైన, భూమి ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది.
కేవలం మూడు ధాన్యాలు(బియ్యం, మొక్కజొన్న, గోధుమ) మొత్తం మానవుల ఆహారంలో 60 శాతం కేలరీలకు కారణమవుతున్నాయి.
అయితే, ప్రజలకు తగినంత శక్తి అందుతోంది కానీ, ఇలా తక్కువ ఆహారపదార్థాలపై ఆధారపడటం వల్ల ప్రజలకు కావల్సినంతగా మినరల్స్, విటమిన్లు అందట్లేదు.
ఇంధనం, వాహనాల విషయాల్లో మనం అనుసరిస్తున్న పద్ధతులే పర్యావరణానికి హాని చేస్తున్నాయని చాలా మంది భావిస్తుంటారని.. కానీ, పర్యావరణంపై అత్యంత ప్రభావం చూపేది మన ఆహార విధానమేనని ఈ నివేదికలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్-యూకేకు చెందిన డాక్టర్ టోనీ జునిపర్ అభిప్రాయపడ్డారు.
ఆహారంలో భిన్నమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల వనరుల వినియోగంలోనూ సుస్థిరత వస్తుందని, వన్యప్రాణులకు మేలు కలుగుతుందని 'క్రాప్స్ ఫర్ ద ఫ్యూచర్' పరిశోధనా సలహాదారు పీటర్ గ్రెగరీ అన్నారు.

ఈ 'సూపర్ ఫుడ్స్' జాబితాలో రకరకాల ఆకులు, దుంపలు, వేళ్లకు శాస్త్రవేత్తలు చోటిచ్చారు.
అయితే, ఇందులో భారతీయులకు చిరకాల పరిచయమున్న ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి.
వాటిలో కొన్ని..
మునగాకు
మునక్కాయలే కాదు మునగ ఆకుల్లోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్య విధానాల్లో మునగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కలోని ఎన్నో భాగాలను భారత్‌తోపాటు ఆసియా వ్యాప్తంగా సంప్రదాయ ఔషధాలుగా వినియోగిస్తున్నారు. మునగ ఆకుల్లో ఏ, బీ, సీ విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి.
అనపకాయ
పంటకూ పంటకూ మధ్య కలుపు నివారణ కోసం పరిరక్షణ పంటగా అనపకాయ వేస్తుంటారు. ఎలాంటి నేలలోనైనా, వాతవరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది. లేతగా ఉన్నప్పుడు లోపలుండే గింజలనే కాకుండా మొత్తం కాయనూ తినొచ్చు. ప్రొటీన్, పీచు పదార్థం పాళ్లు సమృద్ధిగా ఉంటాయి.

బొబ్బర్లు (అలసంద)
బొబ్బర్లలో చాలా రకాలు ఉన్నాయి. మంచి పోషక విలువలు కలిగి ఉండటంతోపాటు రుచిగానూ ఉంటాయి. ఫోలేట్, మెగ్నీషియం సహా ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. నైట్రోజెన్‌ను అమ్మోనియాగా మార్చి పర్యావరణానికి మేలు చేస్తాయి.
మైసూర్ పప్పు
మాంసంతో పోలిస్తే మైసూర్ పప్పును ఉత్పత్తి చేయడంలో వెలువడే కర్బన ఉద్గారాలు 43 రెట్లు తక్కువ. ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. వండటం తేలికే. 15 నుంచి 20 నిమిషాల్లో ఉడికిపోతుంది.
పెసర్లు
బి విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. నైట్రోజెన్‌ను అమ్మోనియాగా మార్చేందుకు సాయపడతాయి. పెసర పంట ఎండ, కరవు పరిస్థితులను తట్టుకుంటుంది.
సోయా చిక్కుడు
ప్రతి వంద గ్రాముల సోయా చిక్కుడులో దాదాపు 38 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. గుడ్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. విటమిన్ 'కే', 'బీ' లతోపాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి పోషకాలన్నీ ఉంటాయి. సోయాలో ఇన్ని విలువలున్నా, నాలుగింట మూడొంతులు పశువులకు మేతగానే వినియోగిస్తున్నారు.

నాగ జెముడు
ఎడారి మొక్క నాగ జెముడులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. పశువుల మేతకు ప్రత్యామ్నాయంగానూ దీన్ని వినియోగించవచ్చు.
తోటకూర
నీటి లభ్యత తక్కువగా ఉన్నా పెరుగుతుంది. ఆకులతోపాటు విత్తనాల్లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. పీచు పదార్థాలు, మెగ్నీషియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి.
రాగులు
రాగులకు సహజంగానే కీటక నిరోధక శక్తి ఎక్కువ. పురుగు మందులపై పెద్దగా ఆధారపడవు. పీచు పదార్థాలు, విటమిన్ బీ1, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. రాగులను జావలా, పిండిగా మార్చుకుని వివిధ పదార్థాలలా చేసుకుని తినొచ్చు.
గుమ్మడి పూలు
గుమ్మడి పూలు, ఆకులు కూడా తినదగ్గవే. వాటిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. వీటి విలువ ఎవరికీ తెలియకపోవడంతో చాలా వరకూ వృథా అయిపోతున్నాయి. భారత్ లాంటి పొడిబారిన నేలలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. పూలలోని మధ్య భాగం తీసిపడేసి, మిగతాది ఆహార పదార్థాల్లో వినియోగించుకోవచ్చు. విటమిన్ 'సీ'తో పాటు వివిధ పోషకాలు ఇందులో ఉంటాయి.

బెండకాయలు
వేడిని, కరవును బాగా తట్టుకునే మొక్కల్లో బెండ కూడా ఒకటి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, బెటా కారోటెన్, షియాక్షంతీన్, లూటెన్ వంటి పోషకాలు ఉంటాయి. వేపుళ్లు, పులుసు పెట్టుకొని తినొచ్చు.
బీట్‌రూట్ ఆకులు
బీట్‌రూట్ ఆకుల్లో మెగ్నీషియం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. దాదాపు సగం మంది ప్రజలు రోజూ అసవరమైనంత మెగ్నీషియం తీసుకోరని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఐరన్‌తో పాటు కంటిచూపునకు మంచిదైన లూటెన్ కూడా వీటిలో ఉంటుంది.
పాలకూర
పాలకూరలో ఏ, బీ, సీ, కే విటిమన్లు, ఐరన్, ఫైటో న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో ఏడాదంతా సాగు చేయొచ్చు. పాలకూర త్వరగా పెరుగుతుంది.
అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)
లెనిన్ వస్త్రాల తయారీలో ఉపయోగపడే అవిసె గింజలు ఆహారంగానూ మంచి పాత్ర పోషిస్తాయి. చాలా పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్ అనే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం ఉండటం మూలాన శరీరానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

జనపనార విత్తనాలు
ఒకప్పుడు భారత్, చైనా ప్రజల ఆహారంలో జనపనార విత్తనాలకూ స్థానం ఉండేది. గంజాయి కుటుంబానికి చెందిన మొక్కలైనప్పటికీ మత్తుకు కారణమయ్యే పదార్థాలు వీటిలో ఉండవు. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 30 గ్రాముల విత్తనాలు తీసుకుంటే ఒక గ్రామ్ పీచు పదార్థాలు, తొమ్మిది గ్రాముల ప్రోటీన్లు శరీరంలోకి చేరతాయి.
నువ్వులు
కాపర్, మెగ్నీషియం నువ్వుల్లో మెండుగా ఉంటాయి. పచ్చిగానైనా, వేయించైనా వీటిని తినొచ్చు. నువ్వుల నూనె ద్వారానూ పోషకాలు లభిస్తాయి.
మొలకెత్తిన శెనగలు
ఒక కప్పు మొలకెత్తిన శెనగలు తీసుకుంటే దాదాపు 10 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. వీటిని తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. ఎనిమిది గంటలపాటు నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టాలి. తిరిగి మళ్లీ నానబెట్టాలి. మొలకలు అనుకున్నంత పొడవు వచ్చేవరకూ దీన్ని కొనసాగించాలి. అయితే, ఇవి బ్యాక్టీరియా బారిన పడే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త అవసరం.
తామర వేళ్లు
తామర చెట్టు వేళ్లను తినొచ్చు. చాలా మంది వీటికి ఔషధ గుణాలుంటాయని నమ్ముతారు. విటమిన్ సీ52 వీటిలో బాగా ఎక్కువగా ఉంటుంది.
చిలగడదుంప (కందగడ్డ)
ఉడకబెట్టుకుని తినొచ్చు. ఏ, సీ, ఈ విటమిన్లు, మాంగనీస్ తదితర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
చిక్కుడు
ప్రొటీన్, పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటుంది. మాంసానికి ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చు.

ఈ కథనానికి ఆధారం ఆహార ఉత్పత్తి సంస్థ నార్, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ యూకే సంయుక్తంగా రూపొందించిన ఫ్యూచర్ 50 నివేదిక.

ఇవి కూడా చదవండి:
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- E69: ఈ హైవే ఎక్కితే ప్రపంచం అంచులకు వెళ్తాం
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- ప్రపంచ ఆకలి తీర్చే గోదుమ ‘జన్యుపటం‘
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








