మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
వేసవి వచ్చిందంటే మామిడి పళ్లకు మంచి డిమాండ్. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, ఆల్ఫోన్సా, గోవా, కీసర, లంగ్డా, సఫేదా, మల్‌గోబా వంటి వందకుపైగా వెరైటీలు మార్కెట్‌లో కనిపిస్తూ వినియోగదారులకు నోరూరిస్తుంటాయి.
ఆరోగ్యానికీ మామిడి చాలా మంచి చేస్తుంది. పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు, వివిధ విటమన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు వాటిలో పుష్కలంగా లభిస్తాయి.
అయితే, ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఈ మామిడిపళ్లే ఇప్పుడు ఆందోళనకూ కారణమవుతున్నాయి.
అవి త్వరగా పండేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాపారులు కార్బైడ్ వంటి రసాయనాలను విరివిగా వాడుతున్నారు.
ఇలాంటి పళ్లను ఆరగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పళ్లను సహజ పద్ధతుల్లో మగ్గబెట్టకుండా, కార్బైడ్ సహా వివిధ కెమికల్స్‌ను వినియోగిస్తున్న తీరు ప్రమాదకరంగా మారిందని వైద్యురాలు హిమబిందు అభిప్రాయపడ్డారు.
''యువతలో గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతుండడానికి ఇదీ ఓ కారణం. ఇలాంటి రసాయన పద్ధతులను వాడేవారిని నియంత్రించకపోతే పెను ముప్పు తప్పదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
సహజ పద్ధతుల్లో మగ్గపెట్టిన పళ్లు అందంగా ఉండవని, రసాయనాలు వాడితేనే అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయని నూజీవీడుకు చెందిన రైతు నరసింహారావు అన్నారు.
''సంప్రదాయంగా గడ్డిలో ముగ్గేసిన పండుకు అంతగా రంగు రాదు. కార్బైడ్ వాడినవాటికే డిమాండ్ ఉంటోంది. దీంతో మాకు కూడా రసాయనాల వినియోగం తప్పడం లేదు'' అని చెప్పారు.
వేసవిలో మామిడి పళ్లు తినకుండా ఉండలేమని.. అయితే, వాటిని మగ్గబెట్టేందుకు వ్యాపారులు రసాయనాలు వాడుతుండటం తమను కలవరపెడుతోందని బేతాళ వెంకటేశ్వర రావు అనే వినియోగదారుడు బీబీసీతో అన్నారు.

కార్బైడ్ వాడిన పళ్లపై మరకలు కనిపిస్తాయని, కాయను కోసినప్పుడు లోపల కండ తెల్లగా ఉంటుందని ఉద్యానవన శాఖ అసిస్టెండ్ డైరెక్టర్ దేవానంద కుమార్ అన్నారు.
ఇలాంటి రసాయనాలు వినియోగిస్తున్నవారి గురించి తెలిసినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









