బ్రెస్ట్ కేన్సర్ వైద్యురాలికే... బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది

ఫొటో సోర్స్, ALEX KILBEE
- రచయిత, మరియం ఇస్సిందర్
- హోదా, బీబీసీ న్యూస్
"అందరు మహిళల్లాగే, నేను కూడా నా వక్షోజాలలో వస్తున్న మార్పులను చూసుకోలేదు. నాకు రొమ్ము కేన్సర్ వస్తుందని ఊహించలేకపోయాను" అని బ్రెస్ట్ కేన్సర్ వైద్యురాలు లిజ్ ఒరియార్డన్ దీనంగా చెప్పారు.
ఇంగ్లండ్‌కు చెందిన ఆమె తనకు రెండుసార్లు బ్రెస్ట్ కేన్సర్ రావడంతో తనకు ఎంతో ఇష్టమైన ఆ వైద్య వృత్తినే వదిలేశారు.
43 ఏళ్ల ఒరియార్డన్ ఇరవై ఏళ్లపాటు బ్రెస్ట్ కేన్సర్ చికిత్సలో ఎంతో నైపుణ్యం సాధించారు. మరో 20 ఏళ్లపాటు ఆ వృత్తిలో కొనసాగుతానని ఆమె ఆశించారు. కానీ, తనే ఆ కేన్సర్ మహమ్మారి బారిన పడతానని మాత్రం తాను కలలో కూడా ఊహించలేకపోయానని ఆమె అంటున్నారు.
కేన్సర్ కారణంగా 2015లో వైద్యులు ఆమె వక్షోజాలను పాక్షికంగా తొలగించారు. అయితే, 2018 మేలో ఆ కేన్సర్ మరోసారి తిరగబడింది.
రెండోసారి రేడియో థెరపీ చేయించుకోవడంతో ఆమె భుజాల్లో కదలిలు తగ్గిపోయాయి.
ఒకే శరీర భాగంలో రెండోసారి రేడియో థెరపీ చేయించుకోవాల్సి రావడం చాలా అరుదు. అలా చేస్తే భుజాల కదలికలపై ప్రభావం పడుతుందని వైద్యులు ముందే చెప్పారు. కానీ, చేయించుకోకపోతే అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, JOHN GODWIN
"2015లో తొలిసారి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ వైద్యురాలిగా పనిచేసేందుకు ఆస్పత్రికి వెళ్లాను. కానీ, మనసులో అదోలా అనిపించేది. నేనే బాధితురాలిగా మారిన తర్వాత, ఇక ఇతర రోగులకు ఎలా ధైర్యం చెప్పగలను? అనిపిస్తుండేది" అని ఆమె తెలిపారు.
అయితే, రెండోసారి కేన్సర్ చికిత్స చేయించుకున్న తర్వాత భుజాలు సరిగా పనిచేయకపోవడంతో ఆమె పూర్తిగా ఆ వృత్తిని వదిలేశారు.

ఫొటో సోర్స్, DERMOT O'RIORDAN
"ఒక వైద్య విభాగంలో స్పెషలిస్టుగా ఉండి అదే విభాగానికి సంబంధించిన రోగానికి బాధితులుగా మారేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. నా వద్దకు వైద్యం కోసం వచ్చే రోగులకు చికిత్స చేస్తూ, సలహాలు సూచనలు ఇవ్వాల్సిన నేనే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలిగా మారడం చాలా బాధ కలిగించింది. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక చాలా కుంగిపోయాను" అని ఆమె గుర్తు చేసుకున్నారు.
తనకు కేన్సర్ సోకిందన్న విషయాన్ని తొలుత తన భర్తతో చెప్పిన తర్వాత ఆమె ట్విటర్‌లో తన గురించి వివరించారు. అనేక మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. అంతేకాదు, తనలాగే వివిధ రకాల రుగ్మతల బారిన పడిన మరికొందరు వైద్యులు కూడా ఆమెకు పరిచయమయ్యారు.
"రెండోసారి కేన్సర్ వచ్చిన తర్వాత నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ఆస్పత్రి యాజమాన్యం అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, నేను చేయలేకపోయాను. ఈ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు 20 ఏళ్లు ఎంతగానో కష్టపడ్డాను. డిగ్రీలు, పీహెచ్‌డీలతో పాటు అనేక కోర్సులు చేశాను, పరీక్షలు రాశాను. నేను అత్యంత ప్రేమించే ఈ వృత్తిని, ఇక చేయలేను. నా రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నాను. కానీ, ఇతర పనులు చేయడం కష్టమవుతోంది" అని ఒరియార్డన్ చెప్పారు.

ఫొటో సోర్స్, LIZ O'RIORDAN
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇప్పుడు 'వర్కింగ్ విత్ కేన్సర్' అనే సామాజిక సంస్థతో కలిసి కేన్సర్ బాధితులు తిరిగి విధుల్లో చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- రాకెట్ దాక్షాయణి: వంట మాత్రమే కాదు.. ఉపగ్రహాలకు దారి చూపగలరు
- అమ్మాయిలకు మీసాలు, గడ్డాలు ఎందుకొస్తాయి? సంతాన లేమికి పీసీవోడీకి సంబంధం ఏమిటి?
- #UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితంలో కొంత మార్పొచ్చింది
- ఏది అశ్లీలత? ఏది లైంగిక స్వేచ్ఛ?
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌తో లాభమా? నష్టమా?
- క్యాన్సర్‌ను ‘తినేసే’లా మానవ కణాలను బలోపేతం చేయనున్న కొత్త మందు
- రొమ్ము క్యాన్సర్: ‘ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటే కీమోథెరపీ అవసరం ఉండదు’
- భూసేకరణ చట్టం: ఏ నిబంధనలను సవరిస్తున్నారు? ఎలా సవరిస్తున్నారు? ఎందుకు సవరిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









