రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌తో లాభమా? నష్టమా?

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని కొందరు డాక్టర్లు చెప్తున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోని వాళ్లు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇటీవల బ్రిటన్‌లో ఒక కంప్యూటర్ లోపం కారణంగా 4,50,000 మంది మహిళలకు సాధారణ స్క్రీనింగ్ టెస్ట్‌కి ఆహ్వానం అందలేదు.
ఈ నేపథ్యంలో మహిళలను ‘‘భయభ్రాంతులకు’’ గురిచేయకూడదంటూ 15 మంది వైద్య నిపుణుల బృందం 'ద టైమ్స్' మేగజీన్‌కు లేఖ రాశారు.
అయితే ఈ స్ర్రీనింగ్ ప్రోగ్రామ్ వల్ల రొమ్ము క్యాన్సర్‌ను సత్వరమే గుర్తించేందుకు ‘‘ఉత్తమ అవకాశం’’ ఉంటుందని బ్రెస్ట్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి.
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో 70నుంచి 79ఏళ్ల వయసున్న మహిళలు గడ్డ లేదా ఇతర లక్షణాలు వేటినైనా గుర్తించినట్లయితేనే ఆ టెస్ట్‌కు వెళ్లాలని వైద్యులు తాము రాసిన లేఖలో సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్క్రీనింగ్ వల్ల సత్ఫలితాలు లేవు’
‘‘రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ మేలు కన్నా ఎక్కువగా హాని చేస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయంగా నెమ్మదిగా గుర్తిస్తున్నారు’’ అని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
‘‘చాలా మంది మహిళలు, డాక్టర్లు ఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను వదిలేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల సత్ఫలితాలు ఏమీ లేవు’’ అని వ్యాఖ్యానించారు.
"రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల రక్షించామని చెప్తున్న ప్రాణాల సంఖ్య కన్నా అలా గుర్తించి చికిత్సలు చేయటం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది" అని వారు చెప్పారు.
అలాగే అత్యంత ప్రమాదకరమైన, ముదిరిపోయిన క్యాన్సర్లను ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా నిరోధించలేమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో లండన్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ సుసాన్ బ్యూలీ, యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ ఎమిరైటస్ మైఖేల్ బామ్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘స్క్రీనింగ్ అనవసరమనటానికి ఎంత ధైర్యం?’’
అయితే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించిన ప్రతి 200 మందిలో ఒకరిని ఈ ప్రోగ్రామ్ రక్షిస్తోందని, బ్రిటన్‌లో ఏటా 1,300 మంది ప్రాణాలను నిలుపుతోందని ఆ దేశ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) పేర్కొంది.
స్క్రీనింగ్ నిర్వహించిన ప్రతి 200 మందిలో సగటున ముగ్గురికి ప్రాణాంతకం కాని క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. అంటే ఏటా 4,000 మందికి అనవసరమైన క్యాన్సర్ చికిత్స చేస్తున్నారు.
ఎడిన్‌బర్గ్‌కు చెందిన రిటైర్డ్ నర్స్ మాగీ వైట్ (61) గత ఏడాది రొటీన్‌గా మామోగ్రామ్ టెస్ట్ చేయించుకున్నపుడు ఆమెకు మొదటి దశ క్యాన్సర్ ఉందని గుర్తించారు.
‘‘క్యాన్సర్ లింప్ నోడ్స్‌కు వ్యాపించకపోవటం అదృష్టం’’ అని ఆమె చెప్పారు. ఆమెకు ల్యూపెక్టమీ, రేడియోథెరపీ చికిత్సలు విజయవంతమయ్యాయి.
‘‘మరో మూడేళ్లు గడిచి ఉంటే.. ఏం జరిగేదో నాకు తెలియదు’’ అన్నారామె.
‘‘స్క్రీనింగ్ మంచిది కాదని చెప్పటానికి వాళ్లకెంత ధైర్యం? నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అదే కారణం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నాణేనికి రెండు వైపులు...’
క్యాన్సర్‌ను ఆరంభ దశలో గుర్తించటానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ‘మంచి అవకాశం’ అందిస్తుందని బ్రెస్ట్ క్యాన్సర్ నౌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫియోనా హాజెల్ పేర్కొన్నారు.
ఈ వాదనతో బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్మా పెనెరీ కూడా ఏకీభవిస్తారు. అయితే ‘‘నాణేనికి రెండు వైపులు ఉంటాయి. కాపాడిన ప్రతి ప్రాణానికీ.. ముగ్గురు మహిళలకు అనవసర చికిత్స చేస్తున్నట్లు అంచనా’’ అని చెప్పారు.
అర్హులైన ప్రతి మహిళకూ స్క్రీనింగ్ నిర్వహించటం, దానివల్ల ప్రయోజనాలు, ప్రమాదాల గురించి వివరించటం, తద్వారా వారు నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించటం చాలా కీలకమని డాక్టర్ ఎమ్మా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్క్రీనింగ్ ఒక్కటే మార్గం కాదు...’
‘‘స్క్రీనింగ్ వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలూ ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ చేయించుకోకపోవటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే అవకాశాన్ని కొంతమంది మహిళలు కోల్పోయి ఉండొచ్చు. అదేసమయంలో ఈ స్క్రీనింగ్ చేయించుకోకపోవటం వల్ల తమకు అవసరంలేని చికిత్స చేయించుకోకుండా ఉండే మహిళలూ ఉంటారు’’ అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రతినిధి సారా హియామ్ అభిప్రాయపడ్డారు.
‘‘రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 72శాతం కేసులు మహిళలు సొంతంగా గడ్డలను గుర్తించటం ద్వారానో, ఇతర లక్షణాలను గుర్తించటం ద్వారానో బయటపడ్డాయి. కాబట్టి ఏదైనా తేడా ఉందా అనేది తెలుసుకోవటానికి స్క్రీనింగ్ ఒక్కటే మార్గం కాదు’’ అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









