‘సావిత్రి’ కోసం ఆ సీన్‌లను వందసార్లు చూశా - కీర్తి సురేష్

మహానటి

ఫొటో సోర్స్, Keerthy Suresh

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సావిత్రి ఐదు భాషల్లో నటించిన చలన చిత్ర నటి.

ఆమె ఒక నటి మాత్రమే కాదు, ఒక దర్శకురాలు, గాయని, కార్ రేసర్, ఫొటోగ్రాఫర్, ఒక మాతృమూర్తి కూడా.

ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి' సినిమా.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రిగా, నాగ చైతన్య ఏఎన్నార్‌గా, సమంత జర్నలిస్ట్ మధురవాణిగా నటిస్తున్నారు.

సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించిన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

'సినిమాలో చాలా వరకు పాత్రలు రచయిత చేతిలో జన్మించి కాగితాలపై పుడతాయి. కానీ 'మహానటి' పాత్ర జీవితపు తెరపై వెలిగిన పాత్ర. ఆ నిజ జీవిత పాత్రని పోషించడం ఒక సాహసమే.' అని కీర్తి సురేష్ తాను ఈ పాత్రని పోషించడానికి అంగీకరించే ముందు పడిన అంతర్మథనం గురించి వివరించారు.

మహానటి

ఫొటో సోర్స్, Keerthy Suresh/Mahanati

‘‘ఈ సినిమా మొత్తం ఒక అనుభవం అయితే, సావిత్రి బిడ్డకు జన్మనిచ్చే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న రోజు జరిగిన ఘటన మరిచిపోలేనిది. ఆమె కుమార్తె విజయ వచ్చి తన తల్లి తనకి జన్మనిచ్చే దృశ్యం చూసుకుని ఉద్విగ్నతకి గురై నన్ను 'నా చిన్ని తల్లి' అని పిలవడం ఒక మరిచిపోలేని అనుభూతి’’ అని కీర్తి గుర్తు చేసుకున్నారు.

'ఒక బిడ్డకి ఆనందాన్ని అందించడం కన్నా సంతోషం ఇంకేముంటుంది' అని అన్నారు.

సావిత్రికి ఇష్టమైన కార్ రేస్‌లు, క్రికెట్, స్విమ్మింగ్ తనకి కూడా ఇష్టం కావడంతో ఆ పాత్రల్లో ఒదిగిపోవడానికి చాలా సహకరించిందని చెప్పారు.

సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తనను ఈ పాత్రలో నటించమని అడిగినప్పుడు, ఒక నిర్ణయానికి వెంటనే రాలేక, ఆ పాత్రకి తగిన న్యాయం చేయగలనో లేదోనని చాలా సంశయానికి గురయ్యానని కీర్తి చెప్పారు.

ఈ పాత్ర తనని ఎలా వరించిందో వివరిస్తూ, తొడరి తమిళ సినిమాలో అమాయకత్వం ఉట్టిపడే తన నటన చూసిన అశ్విన్ సావిత్రి సినిమాలో నటించడానికి తనని సంప్రదించారని చెప్పారు.

మహానటి కథ విన్న తరవాత కాదనలేకపోయానని, నటించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆవిడ పాత్రకి నిజంగా న్యాయం చేకూర్చగలనో లేదోనని చాలా ఆలోచించాల్సి వచ్చిందని చెప్పారు.

మహానటి

ఫొటో సోర్స్, Keerthy Suresh/Mahanati

ఒక ప్రేక్షకురాలిగా సినిమా చూడటం వేరు, ఆవిడ పాత్రలో జీవించడానికి సినిమా చూడటం వేరు అని చెబుతూ.. మహానటిలో మాయాబజార్‌లోని కొన్ని సన్నివేశాలని షూట్ చేయాల్సి ఉండటంతో, ఆవిడ నటనా ప్రయాణాన్ని, ఒలికించిన భావాలని, అర్ధం చేసుకోవడానికి వందసార్లు ఆవిడ నటించిన మాయాబజార్‌లో కొన్ని సన్నివేశాలు చూడాల్సి వచ్చింది అని గుర్తు చేసుకున్నారు.

అందరికి తెలిసిన సావిత్రి ముగ్ధ మనోహరమైన మోముతో సింగిల్ టేక్‌లో అభినయం పలికించగల సహజ నటి. తాను కోపం వస్తే ఎలా పళ్ళు కొరుక్కుంటారు, చేతుల కదలికలు ఎలా మారతాయి అనేది సావిత్రి కుమార్తె వివరించి చెప్పడం తనకు నటించడానికి తోడ్పడిందని చెప్పారు.

సావిత్రి నటిగా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తిగా, తల్లిగా, భార్యగా, ప్రేమికురాలిగా ఆవిడని దగ్గరగా చూసిన వ్యక్తులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ మరో కోణాన్ని అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోయడం అంత సులువైన పనేమీ కాదని కీర్తి వివరించారు.

సుమారు 10 నెలల పాటు సాగిన ఈ షూటింగ్ పాలకొల్లు, హైదరాబాద్, చెన్నై, మైసూరు, దిల్లీలో జరిగింది.

మహానటి

ఫొటో సోర్స్, Keerthy Suresh/Mahanati

ఈ తరం అమ్మాయిగా సావిత్రి నటన గురించి ఎంత తెలుసు? ఆమె సినిమాలు ఎప్పుడైనా చూసారా? అని అడిగినప్పుడు, తానూ సినిమా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినందున తన తల్లిదండ్రులైన సురేష్, మేనకలు సావిత్రి సినిమాలు చూపించేవారని చెప్పారు.

తనకి సావిత్రి ఏమీ కొత్త కాదని ఆమె సినిమాలు చూస్తూనే పెరిగానని అన్నారు.

ఈ సినిమా మిగిలిన సినిమాల తరహాలో తెరకెక్కించిన ఒక కథ కాదు. మనసుతో అనుభూతి చెంది నటించిన ఒక అనుభవం అని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన నట చరిత్రలో ఒక మరుపులేని అనుభూతిగా మిగిలిపోతుందని ఆనందపడ్డారు.

మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించడం తనకి ఎంతో గర్వకారణంగా ఉందని, ఇది సంతోషం, కష్టంతో కూడుకున్న ఒక నిర్వచనానికి అందని అనుభూతని అన్నారు.

సావిత్రితో పాటు మహానటిలో నటించినందుకు నన్ను కూడా రేపటి తరం గుర్తు చేసుకుంటే అది ఆనందించే విషయమే అని సంబరపడ్డారు.

సావిత్రి జీవితమే ఒక ప్రయాణం అంటూ, అందులోంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అని ఆ పాత్రల్లో నటిస్తున్నపుడు, బాధ, సంతోషం కలగలిపి తనని చుట్టుముట్టేవని, ఈ అనుభవం జీవితంలో తనకి ఎపుడైనా సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో నేర్పిందని అన్నారు.

మహానటి

ఫొటో సోర్స్, Keerthy Suresh/FB

కీర్తి తల్లి మేనక కూడా తమిళ నటి, నిర్మాత కూడా. సావిత్రి హావభావాలు, రూపురేఖలు గురించి చాలా సలహాలు ఇచ్చి వెన్నంటి నిలిచారని తన తల్లి, కుటుంబ సభ్యులు ఇచ్చిన మద్దతుని కీర్తి గుర్తు చేసుకున్నారు.

ప్రోస్తేటిక్ మేక్అప్ వాడకంతో సావిత్రికి దగ్గరగా తనని చూపించేందుకు చేసిన ప్రయత్నానికి ప్రతిరోజూ కనీసం నాలుగు గంటలు పట్టేదని చెబుతూ ఈ సినిమాకి తానూ 120 పైగా కాస్ట్యూమ్స్ వాడినట్లు తెలిపారు.

టెక్నికల్ రంగంలో ప్రతిభ కలిగిన చాలా మంది మహిళలు ఉన్నారని, అటువంటి వారంతా సినిమా రంగంలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది మహిళలు ఈ రంగంలో ఉంటే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)