ఆంధ్రప్రదేశ్: సామర్లకోటలో భారీ పేలుడు, '15 మందికి పైగా మృతి'

బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది.

ఈ పేలుడులో 15 మందికిపైగా చనిపోయినట్టు సమాచారం అందుతోందని ఏపీ హోంమంత్రి అనిత బీబీసీతో చెప్పారు.

పేలుడు శబ్దం నాలుగు కిలోమేటర్ల మేర వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

గోదావరి కెనాల్ పక్కనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానికులు మీడియాతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో ప్రమాదం జరిగింది.

ఒక్కసారిగా పేలుడు జరగడంతో భారీయెత్తున మంటలు ఎగసిపడ్డాయని, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు.

పేలుడు శబ్దం తీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఈ ప్రమాదంలో 18 మంది మరణించారని, మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చెప్పినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ తెలిపింది.

ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని హోంమంత్రి అనిత చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

బాణసంచా తయారీ, అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, Kakinada DpRO

బాధితులకు అండగా ఉంటాం: సీఎం, డిప్యూటీ సీఎం

కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడానని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించాలని మంత్రులు, సీనియర్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఘటనాస్థలిలో కొనసాగుతున్న రక్షణ, సహాయక చర్యల పరిస్థితేంటనే విషయాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపినట్టు ఏపీ సీఎంవో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ పేలుడులో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

సామర్లకోటలో భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలిచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)