ఇరాన్‌పై భారీ యుద్ధ చర్యలు మొదలయ్యాయన్న ట్రంప్.. స్వేచ్ఛకు సమయం ఆసన్నమైందంటూ ఇరానీయులకు పిలుపు

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌పై అమెరికా ''భారీ యుద్ధ చర్యలు'' ప్రారంభించినట్లు చెప్పారు డోనల్డ్ ట్రంప్. అమెరికా లక్ష్యంగా ఇరాన్ ‘రక్తపాతం, సామూహిక హత్యలు కొనసాగిస్తోందని’ ట్రంప్ ఆరోపించారు.
తెహ్రాన్‌లో దాడుల వీడియోను సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందకూడదని ట్రంప్ అన్నారు.
అందుకే ఆపరేషన్ 'మిడ్‌నైట్ హామర్' ద్వారా ఇరాన్ అణుకేంద్రాలు ఫర్డౌ, నటాంజ్, ఇస్ఫఫహాన్‌పై దాడులు చేసినట్లు తెలిపారు.
అణుకార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఇరాన్ తిరస్కరించిందని ట్రంప్ ఆరోపించారు.


ఫొటో సోర్స్, Getty Images
‘ఒప్పందమే కుదుర్చుకోవాలనుకున్నాం..కానీ’
దీర్ఘశ్రేణి క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేస్తోందని, ఇది యూరప్, ఇతర దేశాల్లోని అమెరికా బలగాలకు ముప్పుగా మారొచ్చని అన్నారు. అవి త్వరలోనే అమెరికా భూభాగాన్నీ చేరగలవని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ క్షిపణి పరిశ్రమను, నౌకాదళాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు.
47 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం 'డెత్ టు అమెరికా'(అమెరికాకు చావు) నినాదం చేస్తోందని ట్రంప్ అన్నారు..
''ఒప్పందం కోసం మేం మళ్లీ మళ్లీ ప్రయత్నించాం. మేం వారి క్షిపణులను, క్షిపణి పరిశ్రమను నాశనం చేస్తాం. పూర్తిగా ధ్వంసం చేస్తాం'' అని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌పై దాడి చేయాలా లేదా అనేదానిపై ‘తుది నిర్ణయం’ తీసుకోలేదని ట్రంప్ శుక్రవారం (ఫిబ్రవరి 27)అన్నారు. అయితే, అణుకార్యక్రమంపై చర్చల విషయంలో ఇరాన్ వైఖరి తనకు ‘నచ్చలేదని’ ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి’
ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ''స్వేచ్ఛకు సమయం ఆసన్నమైంది, మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి" అని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
అంతకుముందు విడుదల చేసిన వీడియోలో ఇరాన్‌పై తాము చేస్తున్న దాడులను ఉపయోగించుకుని దేశంలోని మతపరమైన పాలనా వ్యవస్థను కూల్చివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
''మేం దాడులు చేయడం ఆపేసిన వెంటనే మీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం మీదవుతుంది. ఇది మీకు లభించిన ఒకే ఒక అవకాశం కావొచ్చు''అని ఆయన ప్రకటించారు.
ఆయుధాలు వదిలేయాలని ఇరాన్ భద్రతాదళాలకు కూడా ట్రంప్ పిలుపునిచ్చారు. 'ఆయుధాలు వదిలేస్తే క్షమాభిక్ష కల్పిస్తామని, లేదంటే కచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాల్సిఉంటుందని' హెచ్చరించారు.
జనవరి ప్రారంభంలో ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు జరిగాయి. ఇరాన్ భద్రతా బలగాలు ఆందోళనలను అణచివేస్తున్న సమయంలో ఇరాన్‌పై బాండు దాడులు చేస్తామని, అణిచివేతకు బాధ్యులైన వారు''భారీ మూల్యం చెల్లించాల్సిఉంటుంది'' అని ట్రంప్ హెచ్చరించారు.
నిరసనకారులకు సాయం అందబోతోందని కూడా అన్నారు.
కానీ, కొద్దిరోజుల తర్వాత ''హత్యలు ఆగాయి'' అని ఇరాన్ ప్రభుత్వ నుంచి హామీ అందిందని ట్రంప్ చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ అంతటా ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ ఏజెన్సీ నెట్‌బ్లాక్స్ ఈ విషయాన్ని తెలిపింది.
ఇరాన్‌లో ఇంటర్నెట్ ఆగిపోవడం ఇదే తొలిసారి కాదు.
గత నెలలో ఇరాన్‌లో భారీ ఆందోళనలు చెలరేగినప్పుడు కూడా దేశం మొత్తం ఇంటర్నెట్‌ను పూర్తిస్థాయిలో నిలిపివేశారు.

అమెరికా నేవీ 5వ ఫ్లీట్ సర్వీస్ సెంటర్‌పై క్షిపణి దాడి
బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ సర్వీస్ సెంటర్‌పై క్షిపణి దాడి జరిగినట్టు బహ్రెయిన్‌లోని నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ చెప్పినట్టు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ(బీఎన్ఏ)తెలిపింది.
అమెరికన్ నేవీకి చెందిన 'యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్త్ ఫ్లీట్' ప్రధాన కార్యాలయం బహ్రెయిన్‌లో ఉంది. గల్ఫ్, ఎర్రసముద్రం, అరేబియా సముద్రం, హిందూమహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు ఈ ఫ్లీట్ పరిధిలో ఉంటాయి.
బహ్రెయిన్‌లో పేలుడు దృశ్యాలు కనిపించాయి.
అంతకుముందు అత్యసవర సైరన్లు మోగిస్తున్నామని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, దగ్గరిలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుతూ బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ వరుసగా 'ఎక్స్'లో హెచ్చరికలు చేసింది.
బహ్రెయిన్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బహ్రెయిన్‌లోని అమెరికా కార్యాలయం దాడికి ముందే హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












