విమానం నిండా కొత్త నోట్ల కట్టలు.. రోడ్డు మీద వాహనాలను ఢీకొంటూ కూలిపోయింది.. 11 మంది మృతి.. ఒక్క నోటు తీసినా, చలామణీ చేసినా నేరమే

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, జారోస్లావ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 2 నిమిషాలు
డబ్బులను తరలిస్తున్న బొలీవియా వాయుసేనకు చెందిన కార్గో విమానం పశ్చిమ నగరమైన 'ఎల్ ఆల్టో'లో కుప్పకూలిందని, ఘటనలో 11 మంది మరణించారని మీడియా కథనాలు వస్తున్నాయి.
శుక్రవారం శాంటా క్రజ్ నగరం నుంచి బయలుదేరిన ఈ విమానం, ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుండగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:20 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ తెలిపింది.
రన్‌వేపై నుంచి విమానం పక్కకు జారి, సమీపంలోని మోటార్ వేపై ఉన్న వాహనాలను ఢీకొట్టినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఘటన తర్వాత విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

'డబ్బులు తీసుకోవద్దు'
ప్రమాదానికి గురైన విమానం తమ 'సీ-130 హెర్క్యులస్' అని, అది బొలీవియా సెంట్రల్ బ్యాంక్ కోసం కరెన్సీ నోట్లను రవాణా చేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
అయితే, మరణించిన వారి సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆ కరెన్సీ నోట్లు ఇంకా అధికారికంగా చలామణిలోకి రాలేదని, వాటిని సేకరించడం లేదా ఉపయోగించడం నేరమని రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
"ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావొద్దని, అధికారులను తమ పని చేసుకోనివ్వాలని కోరుతున్నాం" అని తెలిపింది.
మీడియా రిపోర్టుల ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో కరెన్సీ నోట్లను తీసుకునేందుకు జనం చేరుకున్నారు. ఘటనా స్థలానికి సంబంధించిన దృశ్యాలలో విమానం నేలపై పడి ఉండటంతో పాటు, తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలు కూడా కనిపించాయి.
"విమానం కూలుతున్న సమయంలో నా సోదరి కారులోనే ఉంది. విమానం టైరు ఆమె కారుపై పడింది. దీంతో, నా సోదరి తలకి గాయమైంది, ఆమెను ఆసుపత్రికి తరలించాం" అని ఒక వ్యక్తి రాయిటర్స్ వార్తాసంస్థతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











