పాకిస్తాన్, తాలిబాన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరిగితే భారత్‌కు మంచిది కాదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్‌కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
పాకిస్తాన్, అఫ్గాన్ తాలిబాన్ల మధ్య మరోసారి హింసాత్మక ఘర్షణ చెలరేగడంతో ఈ ఉద్రిక్తతలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ నడుస్తోంది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అఫ్గాన్ తాలిబాన్లపై "బహిరంగ యుద్ధం" ప్రకటించారు.
"మా సహనం నశించింది" అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అప్గాన్ తాలిబాన్లను హెచ్చరించారు. ఇప్పుడు ''యుద్ధం అందరికీ తెలిసే జరుగుతుందని'' అన్నారు.
పాకిస్తాన్ దాడులకు తాము ప్రతిస్పందించామని అఫ్గాన్ తాలిబాన్ ప్రతినిధి 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేసి, ఆ తర్వాత తొలగించారు.
"మాపై దాడి జరిగితే, మేం ప్రతిస్పందిస్తాం. కానీ మేమిప్పుడు పోరాటం ప్రారంభించం" అని తాలిబాన్ సైనిక ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
పాకిస్తాన్ ప్రభుత్వ మిలిటరీ ఆపరేషన్స్‌లో ఇప్పటివరకు 133 మంది అఫ్గాన్ తాలిబాన్లు మరణించారని, 200 మంది గాయపడ్డారని పాకిస్తాన్ చెప్పినట్టు బీబీసీ ఉర్దూ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతుందా?
భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఎలాంటి సరిహద్దూ లేదు. తాలిబాన్ ప్రభుత్వంతో బలమైన దౌత్య సంబంధాలు లేవు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో.. పాకిస్తాన్, అఫ్గాన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరిగితే దాని ప్రభావం ఏంటి?
యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని, ఇతర దేశాలు ఈ ప్రాంతంలో జోక్యం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని దక్షిణాసియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ధనంజయ్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు.
"పాకిస్తాన్‌కు ఇబ్బందులు ఎదురైతే భారత్ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే, పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటుంది. అయితే, తాలిబాన్లు దీనిపై ఎలా స్పందిస్తారో మనం చూడాలి" అని ఆయన అన్నారు.
"పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అఫ్గానిస్తాన్‌లో వివిధ సంస్థలు పుట్టుకొస్తే, అది భవిష్యత్తులో భారత్‌కు మంచిది కాదు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) లేదా బలూచ్ విషయంలో కూడా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలి. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా తెలివిగా వ్యవహరించాలి" అని ధనంజయ్ త్రిపాఠీ అన్నారు.
గత ఏడాది అక్టోబర్ 7, 8 తేదీల మధ్య రాత్రి నిఘా సమాచారం మేరకు ఒరక్‌జాయ్‌లో ఆపరేషన్ నిర్వహించినట్టు పాకిస్తాన్ సైన్యం ప్రకటించడంతో ఇరుపక్షాల మధ్య తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో 19 మంది మిలిటెంట్లను హతమార్చినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)పై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ చాలా ఏళ్లుగా అఫ్గాన్ తాలిబాన్లను డిమాండ్ చేస్తోంది.
పాకిస్తాన్ సైనికులు, పౌరులపై టీటీపీకి చెందినవారు దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో అఫ్గాన్ జాతీయులు పాల్గొన్నారని కూడా ఆరోపించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వైఖరి ఎలా ఉండవచ్చు?
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గత ఏడాది అక్టోబర్‌లో ఆరు రోజులు భారత్‌లో పర్యటించారు. 2021 ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ అధికారపగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రి భారత్‌లో చేసిన మొదటి అధికారిక పర్యటన ఇది.
ముత్తాకీ భారత పర్యటన సమయంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వివాదం చెలరేగింది. ఒకదానికొకటి నష్టం కలిగించినట్లు రెండు దేశాలూ చెప్పాయి.
ముత్తాకీ భారత పర్యటన పాకిస్తాన్‌ను అసంతృప్తికి గురిచేసిందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఇటీవల పెద్దసంఖ్యలో అఫ్గాన్ శరణార్థులను బహిష్కరించింది.
"ఇరాన్, అఫ్గాన్ మధ్య సరిహద్దు దృష్ట్యా ఇలాంటి వివాదం భారత్, ఇరాన్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది" అని మిడిల్ ఈస్ట్ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ శుభదా చౌధురి అంటున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాలేనందున ఈ వివాదం ఎక్కువ కాలం ఉండదని ఆమె భావిస్తున్నారు.
" ఏ దేశమూ భారత్‌కు మిత్రదేశం కాదు, కాబట్టి ఈ వివాదం కొనసాగాలని కోరుకుంటుంది. దీనివల్ల భారత్‌కు కలిగే ప్రయోజనమేంటంటే, శత్రుదేశాల్లో ఒకటి మరో పోరాటంలో మునిగివుండడం" అని విదేశాంగ నిపుణులు కమర్ ఆగా అభిప్రాయపడ్డారు.
"ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే భారత్‌తో పాటు ఇరాన్‌పై కూడా ప్రభావం పడుతుంది. ఇరాన్‌కు కూడా ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు ఉన్నాయి. గతంలో మాదిరిగా పోరాటం ఎక్కువ కాలం కొనసాగితే అఫ్గాన్ శరణార్థులు మరోసారి భారత్ లేదా ఇరాన్‌కు వెళ్లాలని కోరుకుంటారు."
అయితే, "చైనా, పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా ఈ వివాదం పెరగాలని కోరుకోవు. ఎందుకంటే అవి పాకిస్తాన్‌తో తమ సంబంధాలను పునర్నిర్మించుకుంటున్నాయి" అని ఆయన అంటున్నారు.
తాలిబాన్ ప్రభుత్వంతో భారత్‌కు దౌత్య సంబంధాలు లేవని, కానీ అఫ్గానిస్తాన్ ప్రజలతో భారత్ ప్రజలకు సంబంధాలున్నాయని, భారత్ ఎల్లప్పుడూ వారితో ఉంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, అఫ్గాన్ మధ్య సంబంధాలు
తాలిబాన్ పాలనకు ముందు భారత్, అఫ్గాన్ మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి.
వాస్తవానికి, దౌత్యపరంగా భారత్‌కు అఫ్గానిస్తాన్ ఎప్పుడూ ముఖ్యమైనది. ముఖ్యంగా, పాకిస్తాన్‌తో భారత్ సంబంధాలు నిరంతరం ఉద్రిక్తతతో ఉంటున్నాయి. ఇది భారత్‌కు అఫ్గాన్‌తో సంబంధాల విషయంలో ప్రాధాన్యాన్ని పెంచుతుంది.
"తాలిబాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్‌కు మధ్య వివాదం చాలాకాలం పాటు కొనసాగితే, అది అఫ్గానిస్తాన్‌ను అనేక ముక్కలుగా విభజించడానికి దారితీయవచ్చు. దీనికి గట్టి అవకాశం ఉంది" అని కమర్ ఆగా అంటున్నారు.
"ఇది భారత్‌కు మంచిది కాదు. ఎందుకంటే, అనేక గ్రూపుల ఆవిర్భావంతో, వాటిలో కొన్ని భారత్‌కు వ్యతిరేకంగా మారొచ్చు. ఇది ప్రాంతీయంగా భారత్‌కు మంచిది కాదు. ఇది మొత్తం ప్రాంతంలో అస్థిరతకు కూడా దారితీస్తుంది" అని ఆయన అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












