అఫ్గాన్ తాలిబాన్లు టొయోటా వాహనాలే ఎందుకు కోరుకుంటున్నారు?

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలీ హుసేనీ
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ మారిందన్న విషయం అధ్యక్ష భవనం, మంత్రిత్వ శాఖల కార్యాలయాలు చూస్తేనే కాదు.. అక్కడి రోడ్లపై తిరిగే వివిధ వాహనాల మోడల్స్, బ్రాండ్స్‌ని చూసినా ఇట్టే తెలిసిపోతుంది.

అఫ్గానిస్తాన్‌లో అధికార మార్పు అక్కడి సైన్యం ఉపయోగించే వాహనాలపైనా ప్రభావం చూపుతుంది.

గతంలో అఫ్గానిస్తాన్‌లో సోవియట్, అమెరికన్ సేనలతో పాటు.. అధికారం మారిన సందర్భాలలో సైన్యం వివిధ కంపెనీల నుంచి వేర్వేరు మోడళ్ల వాహనాలను ఉపయోగించింది.

ఇప్పుడు అఫ్గాన్‌లోని తాత్కాలిక తాలిబాన్ ప్రభుత్వం అమెరికన్ రేంజర్ వాహనాల స్థానంలో ఇతర కంపెనీల వాహనాలను ఉపయోగించాలనుకుంటోంది.

కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రఖ్యాత జపనీస్ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్స్‌ను సంప్రదించింది.

అఫ్గానిస్తాన్‌లో టొయోటా డీలర్‌షిప్ ‘హబీబ్ గుల్జార్ మోటార్స్’కు ఉంది. తాలిబాన్ ప్రభుత్వం వాహనాల కోసం తమను సంప్రదించిందని, కానీ ఒప్పందం కుదరలేదని హబీబ్ గుల్జార్ మోటార్స్‌ బీబీసీకి తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టొయోటా తిరస్కరణ

అఫ్గాన్ తాలిబాన్లు 2025 సెప్టెంబర్ 27న టొయోటాను సంప్రదించారని హబీబ్ గుల్జార్ మోటార్స్ డైరెక్టర్ అహ్మద్ షకీర్ అదీల్ ధ్రువీకరించారు.

అఫ్గానిస్తాన్‌లోని టొయోటా ప్రతినిధి సంస్థకు అంతర్జాతీయ సంస్థలు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, రాయబార కార్యాలయాలకు మాత్రమే కార్లు విక్రయించడానికి అనుమతి ఉందని ఆయన చెప్పారు.

తాలిబాన్ల ప్రతిపాదనకు కంపెనీ ఎలా స్పందించిందని అడిగినప్పుడు "మేం వాటిని తిరస్కరించాం" అని ఆయన అన్నారు.

తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. అమెరికన్ కంపెనీ ఫోర్డ్ తయారు చేసిన రేంజర్ వాహనాలను వేరే వాహనాలతో భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే వారు ఏ వాహనాలను కొనుగోలు చేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

తాలిబాన్లు కొనాలనుకుంటున్న వాహనాలలో టొయోటా కూడా ఒకటని తెలుస్తోంది.

అయితే ఏ మోడల్ వాహనాలు కొనాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అఫ్గానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇతర వాహనాల కొనుగోలుకు బడ్జెట్ ఆమోదించలేదు, కానీ టొయోటా హైలక్స్ మోడల్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త పోలీసు యూనిఫాం డిజైన్ చేసినట్లు చెప్పింది.

టయోటా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా కార్ల శకం ముగిసింది

రెండు దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్య దళాల మద్దతుతో అఫ్గానిస్తాన్ ప్రభుత్వాలు అమెరికాకు చెందిన రేంజర్ వాహనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో వాహనాల మరమ్మతులు, నిర్వహణ కాంట్రాక్టును అమెరికన్ కంపెనీ ఏఎమ్‌ఎస్‌కు అప్పగించారు. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు(పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు)ఈ పరిస్థితిపై మాట్లాడుతూ, రేంజర్ వాహనాలు ప్రత్యేకంగా అఫ్గాన్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారని తెలిపారు.

ఈ వాహనాలలోని చాలా భాగాలను థాయిలాండ్‌లో తయారు చేసి, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌కు తీసుకువచ్చారని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో సైనిక వాహనాలకు మరమ్మతులు నిర్వహించే ఒక కంపెనీ 2017, 2021 మధ్య 1,30,000 కంటే ఎక్కువ సైనిక, పోలీసు వాహనాలను రిపేర్ చేసిందని తెలిపింది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అమెరికా ప్రభుత్వం అఫ్గాన్ సైన్యానికి ఆర్థిక సహాయం అందించింది.

అమెరికాకు చెందిన ఏఎమ్‌ఎస్ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ, అఫ్గానిస్తాన్ స్థానిక ప్రజలు ఈ వాహనాలను మరమ్మతులు చేసేవారని, కానీ ఇప్పుడు వారిలో చాలామంది ఈ దేశం విడిచి వెళ్లిపోయారని చెప్పారు.

విడిభాగాలు దొరకడం కష్టంగా మారడం, అందుబాటులో ఉన్న విడిభాగాలు చాలా ఖరీదు కావడంతో తాలిబాన్లు అమెరికన్ వాహనాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షల కింద ఉంది, కాబట్టి అది ఫోర్డ్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పారు.

టొయోటా నిరాకరించిన తర్వాత, తాలిబాన్ల ప్రత్యామ్నాయ వాహనాలపై స్పష్టత లేదు. అయితే వారు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పెద్ద సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలను అఫ్గానిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది. వాటిలో ఎక్కువగా టొయోటా వాహనాలే ఉంటాయి. కొంతకాలం ఉపయోగించిన ఈ వాహనాలు దుబయి, ఇరాన్ నుంచి దిగుమతి అవుతాయి.

టొయోటా తన హైలక్స్, ల్యాండ్ క్రూయిజర్‌ మోడల్స్‌ను గల్ఫ్, యూరోపియన్ దేశాల కోసం మూడు వేరియంట్లలో అందిస్తోంది.

కాందహార్
ఫొటో క్యాప్షన్, కాందహార్‌లోని ఓ కార్ షోరూమ్ బయట ఉన్న టొయోటా వాహనాలు

ముల్లా ఒమర్, మోటార్ సైకిల్

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తన 'ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్' పుస్తకంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను వివరించారు.

"డిసెంబర్ 2001 మొదటి వారంలో, ముల్లా మొహమ్మద్ ఒమర్ ఓటమిని అంగీకరించి, హోండా మోటార్ సైకిల్‌పై తప్పించుకున్నాడు. జపాన్ ప్రధాన మంత్రి నన్ను ముల్లా ఒమర్ ఎక్కడ అని అడిగినప్పుడు, అతను హోండా మోటార్ సైకిల్‌పై తప్పించుకున్నాడని నేను చెప్పాను" అని ఆయన రాశారు.

"ముల్లా ఒమర్ తన గడ్డం గాలికి ఎగిరిపోతూ హోండాను నడిపితే, అది హోండాకు ఉత్తమ ప్రకటన అవుతుందని అన్నాను" అని పేర్కొన్నారు.

అఫ్గాన్ తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ మోటార్ సైకిల్ పై తప్పించుకున్నారా లేదా కారులో తప్పించుకున్నారా అనేది కచ్చితంగా తెలియదు. కానీ రెండు సందర్భాల్లోనూ జపనీస్ కంపెనీ వాహనం పేరే ప్రస్తావనకు వచ్చింది.

అక్టోబర్‌ 2012లో, జాబుల్ ప్రావిన్స్‌లోని శిథిలాల నుంచి ఒక టొయోటా కారును స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. 2002లో అమెరికా అఫ్గానిస్తాన్‌పై దాడి చేసిన తర్వాత ముల్లా ఒమర్ కాందహార్‌ను విడిచిపెట్టి వెళ్లడానికి ఈ వాహనమే ఉపయోగించినట్లు తాలిబాన్లు పేర్కొన్నారు.

పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ అఫ్గానిస్తాన్ పాలనలో, సైన్యం రష్యన్ తయారీ వాహనాలను ఉపయోగించేది.

అఫ్గాన్‌లో సైనిక పరికరాలు, విదేశీ సహాయం

అర్థ శతాబ్దానికి పైగా, అఫ్గానిస్తాన్‌లో సైన్యం ఉపయోగించే వాహనాలు, పరికరాలు ఆ దేశ రాజకీయ పరిస్థితి, విదేశాలతో సంబంధం కలిగి ఉన్నాయి.

1978 నుంచి 1992 వరకు, సోవియట్ అనుకూల ప్రభుత్వాలు కాబుల్‌ను పాలించినప్పుడు, రష్యన్ తయారీ కమాజ్ ట్రక్కులు, ఇతర సైనిక పరికరాలు సోవియట్ యూనియన్, అఫ్గానిస్తాన్ మధ్య సైనిక సంబంధాలను ప్రతిబింబించాయి.

అనంతరం జపాన్ తయారీ వాహనాలను ఉపయోగించారు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన సమయంలో టొయోటా వాహనాలను విస్తృతంగా ఉపయోగించారు.

సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత, అమెరికా దళాలు అఫ్గానిస్తాన్‌పై దాడి చేసి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించినప్పుడు, అఫ్గానిస్తాన్‌లో పాశ్చాత్య దేశాల ఉనికిని.. ముఖ్యంగా అమెరికాను, అక్కడ ఉన్న అమెరికన్ వాహనాలను బట్టి సులభంగా అంచనా వేయవచ్చు.

ఆ కాలంలో, అఫ్గాన్ సైన్యం అనేక మోడళ్ల వాహనాలను ఉపయోగించింది. రెండు దశాబ్దాలుగా అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపయోగించే అతి ముఖ్యమైన వాహనం.. అమెరికన్ కంపెనీ ఫోర్డ్ తయారు చేసిన రేంజర్.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ దళాలు అమెరికన్ వాహనాలను ఉపయోగించగా, తాలిబాన్లు ఇప్పుడు హోండా మోటార్ సైకిళ్లు, టొయోటా తయారు చేసిన ఫీల్డర్ వాహనాలపై ప్రయాణిస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్

ఫొటో సోర్స్, IS/File

ఫొటో క్యాప్షన్, ఈ ఫోటో ఇస్లామిక్ స్టేట్ ప్రచారానికి సంబంధించిన వీడియో నుంచి తీసుకున్నది. (ఫైల్ ఫోటో)

జపాన్ వాహనాలే ఎందుకు?

9/11 దాడుల తర్వాత రెండు నెలలకు, అమెరికన్ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్... టీవీ ఫుటేజీలో తాలిబాన్లు ల్యాండ్ క్రూయిజర్ నడుపుతున్నట్లు కనిపించిందని నివేదించింది.

ఆ తరువాత టొయోటా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో టొయోటా.. ‘గత అయిదేళ్లలో అఫ్గానిస్తాన్ చట్టబద్ధంగా ఒకే ఒక ల్యాండ్ క్రూయిజర్‌ను దిగుమతి చేసుకుంది’ అని స్పష్టం చేసింది.

"అఫ్గానిస్తాన్‌లోని టొయోటా ఉత్పత్తులను పొరుగు దేశాల నుంచి అనధికారిక మార్గాల ద్వారా దిగుమతి చేసుకున్నారు" అని కంపెనీ తెలిపింది.

టొయోటా తన వాహనాలను తాలిబన్, అల్-ఖైదాలతో ముడిపెట్టడాన్ని ఇష్టపడలేదు. అందుకే, ఇప్పుడు తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పటికీ, ఆ కంపెనీ వారికి వాహనాలను విక్రయించడానికి నిరాకరించింది.

టొయోటా కంపెనీ.. అఫ్గానిస్తాన్‌లో తమకు ప్రతినిధులు లేరని, అక్కడికి వాహనాలను ఎగుమతి చేయడంలేదని చెబుతోంది.

"ఇది మా ఉత్పత్తుల గురించి విచారకర ప్రకటన" అని న్యూయార్క్‌లోని టొయోటా ప్రతినిధి వాడే హోయ్ట్ అన్నారు, "కానీ తాలిబాన్లు ఇతర కస్టమర్ల మాదిరిగానే నమ్మకమైన, మన్నికైన ఉత్పత్తుల కోసం చూస్తున్నారని కూడా దీనిద్వారా తెలుస్తోంది" అని చెప్పారు.

‘ఇస్లామిక్ స్టేట్’గా పేర్కొనే గ్రూప్‌కు సంబంధించిన ప్రచార వీడియోలను చూసినట్లయితే, వారు టొయోటా హైలక్స్ మోడళ్లను నడుపుతున్నట్లు కనిపిస్తుంది.

2014 అక్టోబర్‌లో, ఇస్లామిక్ స్టేట్ సిరియా, ఇరాక్‌లలో బలంగా ఉన్నప్పుడు, అనేక వీడియోలలో ల్యాండ్ క్రూయిజర్‌లు, హైలక్స్‌లను ఉపయోగించడం కనిపించింది.

ఫోర్డ్ రేంజర్‌

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2009 ఏప్రిల్‌లో ఫోర్డ్ రేంజర్‌లో ప్రయాణించిన అఫ్గాన్ సివిల్ ఆర్డర్ పోలీసులు (ఫైల్ ఫోటో)

టొయోటా యుద్ధం

టొయోటా ఇంటర్నెట్‌లో "యుద్ధ ప్రాంతాలలో టొయోటా వాహనాల వినియోగంపై నివేదికలు" అనే ప్రత్యేక పేజీని అందుబాటులో ఉంచింది.

"మేం పనిచేసే ప్రతి దేశంలోని చట్టాలను మేం పాటిస్తాం. కంపెనీకి తెలియకుండా, అనుమతి లేకుండా సైనిక ఉపయోగం కోసం వాహనాలను విక్రయించడాన్ని నిషేధించాం" అని ఆ పేజీలో టొయోటా పేర్కొంది.

సాయుధ గ్రూపులు ఉపయోగించే వాహనాలను అనధికారిక మార్గాలు లేదా సెకండ్ హ్యాండ్ వాహనాలుగా అక్రమంగా రవాణా చేస్తున్నారని టొయోటా తెలిపింది.

టొయోటా సిరియాకు కార్లను రవాణా చేయదని, లిబియా, ఇరాక్‌లలో తన ఉత్పత్తులను గుర్తింపుకలిగిన వినియోగదారులకు మాత్రమే సరఫరా చేస్తుందని స్పష్టం చేసింది.

ఇది టొయోటాకు చాలా పెద్ద సమస్యగా మారింది. కొన్ని దేశాలలో.. టొయోటా వాహనాలు కొనుగోలు చేసిన కస్టమర్లు వాటిని ఏడాది లోపు వేరే ఎవరికీ అమ్మకూడదని షరతు విధించింది.

శక్తిమంతమైన ఇంజిన్లు.. కొండలు, ఎడారి ప్రాంతాలలో, అలాగే కఠినమైన రోడ్లపై ప్రయాణించగల సామర్థ్యం, తక్కువ ఇంధన వినియోగం, విడిభాగాల సులభంగా లభ్యమవడం, వివిధ రకాల ఆయుధాలు తరలించే అవకాశం ఉండడం వంటివి తీవ్రవాదులు టొయోటా వాహనాలను ఉపయోగించేలా చేశాయని చెప్తారు.

1977లో చాద్, లిబియా మధ్య జరిగిన యుద్ధాన్ని 'టొయోటా యుద్ధం' అని పిలుస్తారు.

ఆ సమయంలో టొయోటా పికప్ ట్రక్కులు (ముఖ్యంగా హైలక్స్, ల్యాండ్ క్రూయిజర్) విస్తృతంగా ఉపయోగించిన ఆ యుద్ధాన్ని 'టొయోటా యుద్ధం' అని కూడా పిలుస్తారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)