చలికాలంలో చిన్నారులను వెచ్చగా ఉంచడం ఎలా?

ఫొటో సోర్స్, Thinkstock
భారత దేశంలో ఇది చలికాలం. ఉత్తరాది రాష్ట్రాల్ని చలిగాలులు చుట్టేశాయి. దక్షిణాదిలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది.
బ్రిటన్‌లోనూ అనేక ప్రాంతాలలో చలిగాలులు పెరిగాయి. ఆ దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడానికి అనేకమంది నిపుణులు సలహాలు సూచనలు ఇస్తున్నారు.
పసిబిడ్డలకు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి?
ఐదేళ్ల లోపు చిన్నారులకు చలి వాతావరణం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చిన్నారులు, పిల్లలను వెచ్చగా ఉంచేందుకు అనేక లేయర్ల దుస్తులు వెయ్యాలని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ తమ దేశంలోని పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
రాత్రి పూట వారికి తేలిగ్గా ఉండే దుప్పట్లను కప్పాలి. ముఖ్యంగా, రాత్రి పూట పిల్లల గది వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ల గదిలో ఉష్ణోగ్రత 16-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే చాలు. ఉష్ణోగ్రత ఎక్కువైతే అది పిల్లల ప్రాణానికే ముప్పుగా మారవచ్చు.
పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు వారి తల వెచ్చగా ఉండేలా చూడాలి. వాళ్ల శరీరంలో నుంచి వేడి బయటకు పోకుండా చేతులకు గ్లవ్స్ తొడగాలి.
కారులో ప్రయాణించేటప్పుడు మందంగా ఉండే ఉన్ని దుస్తులు, కోటు వెయ్యాలి.
అవసరమైతే, పిల్లల్ని కారులో సౌకర్యవంతంగా కూర్చోబెట్టిన తర్వాత, వారికి ఒక దుప్పటి కప్పాలి. కారులోకి వచ్చిన తర్వాత వారికి వేసిన అదనపు దుస్తుల్ని తొలగించాలి.


ఫొటో సోర్స్, Getty Images
చలికాలంలో పెంపుడు జంతువుల సంరక్షణ ఎలా?
మనుషుల్లాగే, జంతువులకు కూడా చలిగాలుల వల్ల హైపోథెర్మియా సోకే ప్రమాదం ఉంది.
చలికాలంలో కుక్కలు, పిల్లులకు మందపాటి దుప్పట్లను కప్పడం అవసరమని బ్రిటన్‌కు చెందిన వెటర్నరీ చారిటీ సంస్థ పీడీఎస్ఏ సూచిస్తోంది. గదిలోకి వచ్చే చల్లటి గాలుల నుంచి పెద్ద కుక్కలకు రక్షణ కల్పించేందుకు ఎత్తైన మంచాలు ఉత్తమం. అలాగే పిల్లులు కూడా ఎత్తుగా ఉండే ప్రాంతంలో ఉండటానికే ఇష్టపడతాయి.
పెంపుడు జంతువులు బయట ఎక్కువ సమయం గడిపే పరిస్థితి లేకుంటే ఇంట్లోనైనా ఎక్కువ సేపు ఆడించడం వల్ల అవి ఉత్సాహంగా ఉంటాయని, ఇందుకోసం ఇండోర్ టాయ్స్ సాయం తీసుకోవచ్చని వెటర్నరీ చారిటీ సంస్థ సూచించింది.
పిల్లుల్ని రాత్రి పూట ఇంట్లోనే ఉంచేందుకు వాటిని ఒక ట్రేలో ఉంచడం మంచిదని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం కూడా కుందేళ్లు, గినీ పిగ్స్ లాంటి బయట ఉన్న పెంపుడు జంతువుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వాటికి వేడిగా ఉండేందుకు అవి పడుకునేచోట లావుగా ఉండే దుప్పట్లు వెయ్యడం మంచిది. అవకాశం ఉంటే వాటిని కూడా ఇంట్లోకి తీసుకు రావడం లేదా వాటికి ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చెయ్యడం మంచిది.
వాటిని లోపల ఉంచినప్పుడు, అవి లోపల స్వేచ్చగా తిరిగేంత స్థలం ఉండేలా చూసుకోవాలి.
చలి వాతావరణంలో నా కుక్కతో బయట తిరగవచ్చా?
వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కుక్కలకు వాకింగ్ అవసరం. వాటి శరీరం మీద ఉన్న బొచ్చు వాటిని వేడిగా ఉంచుతుంది.
జబ్బు పడిన లేదా పెద్ద కుక్కలకు తేలికైన ఉన్ని దుస్తుల్ని వెయ్యడం మంచిదని ఆర్ఎస్‌పీసీఏ సూచిస్తోంది.
పెంపుడు జంతువులు మంచు లేదా ఐస్‌లో తిరిగినప్పుడు వాటి కాళ్లను పరిశీలించాలి. రాళ్లు లేదా ఉప్పులాంటివి వాటి పాదాల్లో చర్మానికి నష్టం కలిగిస్తాయని పీడీఎస్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
దుస్తుల్ని చౌకగా ఎలా వేడి చేసుకోవచ్చు?
బ్రిటన్‌లాంటి దేశాల్లో శీతాకాలంలో దుస్తుల్ని రేడియేటర్ల మీద వేడి చేసుకోవడం సర్వ సాధారణం.
అయితే దీనివల్ల ఇంట్లో ఉపయోగించని ప్రాంతాలు కూడా వేడిగా మారే అవకాశం ఉంది. దీంతో ఇంట్లో తడి పెరిగి చెమ్మగా మారొచ్చు.
మరో ప్రత్యామ్నాయం ఏంటంటే గాలి నుంచి తేమను తొలగించే పరికరాన్ని ఉపయోగించడం. కొంతమంది దగ్గర లాండ్రీ సౌకర్యం ఉంటుంది. దీన్ని కొన్ని గంటలపాటు నడపడం వల్ల తడి దుస్తుల్ని పొడిగా మార్చవచ్చు.
రూమ్ హీటర్లను పెట్టడం కన్నా గాలిలో తేమను పీల్చుకునే మెషీన్ ఉపయోగించడం చాలా చౌకని కొందరు నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కారు మీద పడిన మంచును తొలగించడానికి ఉత్తమ పద్దతి ఏంటి ?
పశ్చిమ దేశాల్లో డ్రైవర్లకు నిద్ర లేచిన తర్వాత కార్ల మీద ఉన్న మంచును తొలగించడం పెద్ద పని.
మంచును తొలగించేందుకు వేడి నీళ్లను ఉపయోగించవద్దని మోటారిస్టుల్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీళ్ల వల్ల అద్దాలకు పగుళ్లు ఏర్పడవచ్చని, కాసేపటి తర్వాత ఆ నీరు కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు.
దానికి బదులుగా ఇంజన్ ఆన్ చెయ్యడం ఉత్తమ విధానం. ఇంజన్ ఆన్ చెయ్యడానికి ముందు వైపర్లు ఆపి ఉన్నాయో లేదో చూసుకోవాలి. కారు అద్దాలకు వేడి గాలి తగిలేలా చూడాలి.
కారు వెనుక ఉన్న అద్దం దగ్గర హీటర్‌ను ఆన్ చేసి ఎయిర్ కండినషర్ వెయ్యవచ్చు. ఆ సమయంలో విండో అద్దాలకు పొగమంచు అంటకుండా చూసుకోవాలి.
చివరిగా వాహనం మీద మంచు మిగిలితే దాన్ని స్క్రేపర్, మంచును తొలగించే లిక్విడ్ ఉపయోగించడానికి బదులు మెత్తటి బ్రష్‌తో దానిని తొలగించాలి.

ఫొటో సోర్స్, Getty Images
హీటర్లు, ఎలక్ట్రిక్ బ్లాంకెట్లను ఎలా వాడాలి?
సెంట్రల్ హీటింగ్‌కు బదులుగా అనేక మంది చిన్న హీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే వాటిని జాగ్రత్తగా వాడకుంటే అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.
హీటర్‌ను నేల ఫ్లాట్‌గా ఉన్న చోట పెట్టాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఫస్ట్ చారిటీ మేనేజర్లు, ఫైర్ ఫైటర్లు సూచిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల అది కింద పడకుండా ఉంటుందని చెబుతున్నారు.
మండే గుణం ఉన్న వస్తువులకు హీటర్ కనీసం మూడు అడుగుల దూరంలో ఉండాలి. దానికి ఎదురుగా కర్టెన్లు, దుస్తులు, దుప్పట్లు లాంటివి ఉంచకూడదు.
తడిసిన బట్టల్ని పొడిగా మార్చుకునేందుకు హీటర్లను ఉపయోగించరాదు. ఒక వేళ ఉపయోగించినా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. హీటర్ల మీద పెట్టి అలా వదిలెయ్యకూడదు.
హీటర్ల ప్లగ్గుల్ని ఎక్స్‌టెన్షన్ బాక్సుల్లో పెట్టడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు లేదా దుస్తుల్ని ఎక్కువ సేపు కనెక్ట్ చేసి ఉంచడం ప్రమాదకరం, అందుకే వాటిని సమయానుకూలంగా ఆపేసేందుకు టైమర్ ఫంక్షన్ ఉపయోగించాలి.
ఎలక్ట్రిక్ బ్లాంకెట్లలో వైర్లు బయటకు కనిపిస్తుంటే వాటిని వాడకూడదు. వైర్లు బయటకు వచ్చినప్పుడు ఒకదానికొకటి తగిలితే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది.
గ్యాస్ హీటర్లను ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీరు అదే రూమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ అలారమ్‌ను కూడా ఉంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
శీతాకాలపు వ్యాధుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు?
ఫ్లూ, ఫ్లూ సంబంధిత వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి శీతాకాలంలో సహజంగా వస్తుంటాయి.
నోరో వైరస్, వింటర్ ఒమిటింగ్ బగ్ లాంటివి పెరిగే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంది.
బయట చలిగా ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ కాలం ఇంట్లోనే గడుపుతారు. అందువల్ల వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ.
ఉదాహరణకు, దగ్గు, జలుబు లాంటివి కిటికీలు, తలుపులు మూసి ఉన్న గదుల్లో త్వరగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతాయి.
అందువల్ల దగ్గినా, తుమ్మినా చేతులు అడ్డు పెట్టుకోవడం, తర్వాత వాటిని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడంలాంటివి చేయాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














