టీమిండియా జెర్సీ, చేతిలో బ్యాట్‌తో డిశ్చార్జ్ అయిన కాంబ్లీకి అసలు సమస్య ఏంటి? ఎందుకు ఆస్పత్రి పాలయ్యారు?

వినోద్ కాంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి నుంచి బుధవారం (జనవరి 1 న) డిశ్చార్జ్ అయ్యారు.

మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో గత నెల 21న ఠాణె లోని ఓ ఆస్పత్రిలో చేరారు కాంబ్లీ. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆయన మెదడులో రక్తం గడ్డలు కట్టినట్టు తేలింది.

‘‘చికిత్స అనంతరం కోలుకున్న కాంబ్లీ టీమిండియా జెర్సీలో ఆస్పత్రి నుంచి బయటికొచ్చారు. అక్కడ వెయిట్ చేస్తున్న మీడియాకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన కాంబ్లీ ఆల్కహాల్‌కు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవి మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు’’ అని హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో తెలిపింది.

కాంబ్లీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆకృతి ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించిన డాక్టర్ వివేక్ ద్వివేది చెప్పారు. అయినప్పటికీ కాంబ్లీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లే ముందు కాంబ్లీ టీమిండియా జెర్సీ ధరించి బ్యాట్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ కాంబ్లీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా కొన్నిరోజుల కిందట వైరల్ అయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సచిన్, వినోద్ కాంబ్లీలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సచిన్, వినోద్ కాంబ్లీలు చిన్ననాటి స్నేహితులు.

కాంబ్లీకి కపిల్ దేవ్ వీడియో కాల్

కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వీడియో కాల్ చేశారని ఓ కథనంలో ఎన్డీటీవీ తెలిపింది. కాంబ్లీ ఆరోగ్యం ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకున్నారు.

''నిన్ను చూడడానికి వస్తాను. ఇప్పుడు బాగున్నావు. గడ్డానికి రంగు వేసుకున్నావు. తొందరపడొద్దు. ఇంకొన్నిరోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే, అక్కడే ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. పూర్తిగా తగ్గిన తర్వాతే ఆస్పత్రి నుంచి రా. నువ్వు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను నిన్ను చూడడానికి వస్తాను'' అని కపిల్ దేవ్ వినోద్ కాంబ్లీతో చెప్పారని ఆ కథనంలో ఉంది.

తమ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ఆవిష్కరణలో పాల్గొనే సమయంలో సచిన్ తో కలిసి వినోద్ కాంబ్లీ గత నెలలో బయట కనిపించినప్పుడు ఆయన ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తంచేశారు.

గడచిన కొన్నేళ్లగా కాంబ్లీకి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సచిన్ చేసిన ఆర్థిక సాయంతో 2013లో ఆయన రెండు హార్ట్ సర్జరీలు చేయించుకున్నారు.

వినోద్ కాంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images and ANI

కాంబ్లీకి అసలేమైంది?

కాంబ్లీ ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయన ఆరోగ్యంపై డాక్టర్ వివేక్ మాట్లాడారు. "కాంబ్లీ డిసెంబర్ 21న సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. ఆయన కండరాల తిమ్మిరితో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేర్చినపుడు ఆయనకు తీవ్రమైన జ్వరం ఉంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు" అని తెలిపారు.

కాంబ్లీకి ఆస్పత్రిలో పరీక్షలు చేయగా మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించామని వివేక్ అన్నారు. అలాగే శరీరంలో సోడియం, పొటాషియం లేకపోవడంతో కండరాలు బిగుసుకుపోయాయని చెప్పారు.

"బ్రెయిన్ స్కాన్‌ చేయగా కాంబ్లీకి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించాం. అందుకే ఆయనకు ఇటీవల స్ట్రోక్ వచ్చింది. బీపీ తగ్గడంతో ఐసీయూలో చేర్చారు" అని తెలిపారు.

వినోద్ కాంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వినోద్ కాంబ్లీ ఎడమచేతి వాటం బ్యాటర్.

చివరి మ్యాచ్..

వినోద్ కాంబ్లీ ఎడమచేతి వాటం బ్యాటర్. ఆయన తన చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 2000 అక్టోబర్ 29న ఆడారు. షార్జా వేదికగా శ్రీలంకతో ఆ మ్యాచ్ జరిగింది. అప్పట్లో సౌరవ్ గంగూలీ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో భారత జట్టు విమర్శలను ఎదుర్కొంది.

శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. భారత జట్టు 54 పరుగులకే ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో వినోద్ కాంబ్లీ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగతా బ్యాటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. సచిన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ వంటి బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. భారత జట్టులో రాబిన్ సింగ్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

అయితే, అప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తొమ్మిదిసార్లు పునరాగమనం చేసిన వినోద్ కాంబ్లీకి అదే చివరి మ్యాచ్‌గా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)