క్రికెట్: 1947లో భారత జట్టు మొదటి ఆస్ట్రేలియా టూర్‌కు ముందు ఏం జరిగింది, చేతి కంకణం కెప్టెన్‌ను ఎలా కాపాడింది..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గులు ఎజీకియల్
- హోదా, స్పోర్ట్స్ రైటర్
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ యాషెస్ సిరీస్ తరహా ఉత్కంఠ రేపుతోంది.
భారత్‌కు అత్యంత క్లిష్ట సమయమైన 1947-48లో ఆస్ట్రేలియాలో తొలి పర్యటన జరిగింది.
డోనల్డ్ బ్రాడ్‌మాన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టుతో తలపడేందుకు భారతజట్టు సిద్ధమవుతున్న ఆ సమయంలో.. భారత క్రికెటర్లు స్వదేశంలో గందరగోళ పరిస్థితులను, మతహింసను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
1947లో స్వాతంత్య్రానంతరం జరిగిన దేశ విభజనతో పాకిస్తాన్ ఏర్పాటైంది. కానీ, విభజన సమయంలో పెద్ద ఎత్తున హింస జరిగింది.
చరిత్రలో రక్తపాతంతో జరిగిన వలసల్లో ఇదొకటి. లక్షలాది మంది ప్రజలు సరిహద్దులు దాటారు. ఈ ఘర్షణల్లో ఒకవైపు హిందువులు, సిక్కులు, మరోవైపు ముస్లింలు ఉన్నారు.
దీనికి కొద్దినెలల ముందే 16 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును ప్రకటించారు.

'ఆల్ ఇండియా జట్టు'
అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడు ఆంథోనీ డి మెల్లో అవిభాజిత భారత్ తరఫున జట్టును ప్రకటించారు. ఈ జట్టు మొత్తం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు.
అప్పటి వరకూ 'ఆల్ ఇండియా'గా సంబోధించే భారత జట్టు 1932, 1946 మధ్య టెస్ట్ సిరీస్ కోసం మూడుసార్లు మాత్రమే అధికారికంగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ప్రతి సిరీస్‌లోనూ ఓడిపోయింది.
అయితే, 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మిత్రరాజ్యాల విజయానికి గుర్తుగా లిండ్సే హస్సెట్ నేతృత్వంలో ఆస్ట్రేలియా సర్వీసెస్ టీమ్ భారత్‌లో పర్యటించింది. ఈ మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది.
ఈ గెలుపుతో భారత క్రికెట్ జట్టుకు అధికారికంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడే సత్తా ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ అధికారులకు లిండ్సే హస్సెట్ తెలియజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రాడ్‌మన్ జట్టుతో పోటీ అనగానే..
అధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడే సత్తా భారత్‌కు ఉందని తేలాకా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డోనల్డ్ బ్రాడ్‌మన్ నేతృత్వంలోని పటిష్ఠమైన ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు తలపడనుందని తెలియడంతో భారత క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆ సమయంలోనే, ఇంగ్లండ్ సిరీస్‌లో విజయం సాధించి వచ్చిన ఆస్ట్రేలియా జట్టును 'బ్రాడ్‌మన్స్ ఇన్విన్సిబుల్స్'(బ్రాడ్‌మన్ అజేయ జట్టు)గా పిలిచేవారు.
డి మెల్లో సారథ్యంలో ఎంపికైన భారత జట్టుకు విజయ్ మర్చంట్ కెప్టెన్, ముస్తాక్ అలీ వైస్ కెప్టెన్.
ఈ ఇద్దరు ఆటగాళ్లు 1936, 1946లలో జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో రాణించి నాయకత్వ బాధ్యతలకు ఎంపికయ్యారు. జట్టులో మేటి బ్యాటర్ రుసీ మోదీ, యువ ఫాస్ట్ బౌలర్ ఫజల్ మహమూద్ కూడా ఉన్నారు.
అయితే, అనారోగ్య కారణాలతో మర్చంట్, మోదీలు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పుకున్నారు. తన అన్న మరణం కారణంగా అలీ కూడా జట్టుకి దూరమయ్యారు.
దీంతో కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్ , వైస్ కెప్టెన్‌గా విజయ్ హజారేలు ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/GETTY IMAGES
కెప్టెన్ అమర్‌నాథ్‌ను కాపాడిన కంకణం..
దేశ విభజనతో చెలరేగిన హింస కారణంగా అమర్‌నాథ్ ఆస్ట్రేలియా పర్యటన దాదాపు ఆగిపోయినంత పనైంది. ఆయన కుమారుడు రాజేందర్ అమర్‌నాథ్ 2004లో విడుదల చేసిన బయోగ్రఫీ ప్రకారం.. పంజాబ్‌లోని పటియాలాలో ఒక గుంపు నుంచి లాలా అమర్‌నాథ్ తృటిలో తప్పించుకున్నారు. లాహోర్‌లోని తన ఇంటిని, ఎన్నో అద్బుతమైన కళాఖండాలను కూడా ఆయన శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది.
దిల్లీ రైలు ప్రయాణంలోనూ ఆయన ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
పంజాబ్‌లోని ఒక స్టేషన్‌లో అమర్‌నాథ్‌ను గుర్తించిన ఒక పోలీసు అధికారి సిక్కులు, హిందువులు ఎక్కువగా ధరించే ఒక కంకణం ఇచ్చారు. ఆ కంకణం ధరించడంతో తమ వర్గానికి చెందినవాడేనని భావించిన అల్లరిమూకల గుంపు ఆయన్ను వదిలేసింది.
మరోవైపు, పేస్ బౌలర్ మహమూద్ రైలులో అల్లరిమూకల బారినపడ్డారు.
ఆగస్ట్ 15న స్వాతంత్య్రం వస్తుందని అప్పటికి తెలియదు, కానీ అదే రోజు నుంచి భారత జట్టుకు పుణె(అప్పట్లో పూనా)లో రెండు వారాల శిక్షణా శిబిరం ఉంది.

ఫొటో సోర్స్, Gulu Ezekiel
లాహోర్‌లో రక్తపాతం చూసి..
బయట ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ, మహమూద్ ఎలాగో పూనా శిక్షణా శిబిరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన లాహోర్ వెళ్లే క్రమంలో బొంబాయి(ఇప్పుడు ముంబయి) వెళ్లారు. ఆ సమయంలో రైలులో తనను ఇద్దరు వ్యక్తులు బెదిరించారని, అప్పుడు భారత మాజీ కెప్టెన్ సీకే నాయుడు జోక్యం చేసుకుని తన చేతిలో ఉన్న బ్యాటుతో వారిని హెచ్చరించి పంపించేశారని 2003లో విడుదల చేసిన తన ఆత్మకథలో మహమూద్ రాశారు.
మహమూద్ లాహోర్ వెళ్లేప్పటికి అక్కడ కర్ఫ్యూ అమల్లో ఉంది. లాహోర్ చేరిన తర్వాత అక్కడి రక్తపాతాన్ని చూసి మహమూద్ భయపడిపోయారు. ఇక పాకిస్తాన్‌లోనే ఉండాలని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ జట్టు సభ్యుడయ్యారు. 1952-1953లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేశారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టులోని మరో ఇద్దరు ఆటగాళ్లు గుల్ మొహమ్మద్, అమీర్ ఎలాహి కూడా ఆ తర్వాత పాకిస్తాన్ జట్టులో చోటు దక్కించుకుని, భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడారు.
ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, భారత జట్టు మొదటి ఆస్ట్రేలియా పర్యటన జరిగింది. అయితే, నలుగురు కీలక ఆటగాళ్లు లేకపోవడంతో బలహీనంగా మారిన భారత జట్టు 4-0 తేడాతో ఆస్ట్రేలియాకు సిరీస్‌ను కోల్పోయింది.
ఇప్పుడు ఈ రెండు దేశాలు రెండేళ్లకోసారి తలపడుతున్నాయి. ఇక్కడ అద్భుతమైన విషయమేంటంటే, స్వదేశంలో ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నా 1947 - 48లో తొలి పర్యటన జరగడం.
గులు ఎజీకియల్ ఆటలపై 17 పుస్తకాలు రాశారు. ఆయన తాజా పుస్తకం 'సలీం దురానీ: ది ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














