రాజ్‌గఢ్: ఛత్రపతి శివాజీ 23 కోటలను మొఘలులకు వదిలేశారు, ఈ కోటను మాత్రం ఇచ్చేదే లేదన్నారు... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రాజక్తా ధులప్
- హోదా, బీబీసీ మరాఠీ
రాయ్‌గఢ్‌కు ముందుగా, పుణె జిల్లాలోని రాజ్‌గఢ్.. ఛత్రపతి శివాజీకి పెట్టనికోటలా ఉండేది. శివాజీ 25 ఏళ్లకుపైనే ఇక్కడ గడిపారు.
‘‘రాజ్‌గఢ్ కోట ఎంత ఎత్తులో ఉందో చూడండి. అన్ని కోటల కంటే ఇది గొప్పది. దీని వ్యాసం 12 క్రోసులు. ఈ కోట ఎంత దృఢమైనదో మీరు ఊహించుకోలేరు. పెద్దపెద్ద కొండలు, దట్టమైన అడవి మధ్యలో ఇది ఉంటుంది. దీన్ని దాటుకొని లోపలకు వెళ్లడం ఆషామాషీ కాదు.’’
ఔరంగజేబు దగ్గర పనిచేసిన సాకీ ముస్తయిద్ ఖాన్ రాజ్‌గఢ్ గురించి ఇలా రాసుకొచ్చారు. 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ తొలి రాజధానే రాజగఢ్.
ఒక క్రోసు అంటే 3.22 కిలోమీటర్లు. అలాంటిది 12 క్రోసులున్న రాజ్‌గఢ్‌ను వశం చేసుకోవడమంటే అంత తేలిక కాదు.
దీని గురించి పర్షియన్‌లో రాసిన తన పుస్తకం ‘మాసిరే అలాంగిరీ’లో సాకీ వివరంగా రాసుకొచ్చారు. ఔరంగజేబు దక్షిణ భారత్ దండయాత్రలో సాకీ కూడా ఆయన వెనకే వచ్చారు. ఈ కోటను చుట్టుముట్టే ప్రయత్నాల గురించి సాకీ సవిరంగా రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘శివాజీ ఈ కోటను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ఇక్కడి వరకూ రావాలంటే లోయల గుండా ఇరుకైన మార్గాల్లో ప్రయాణించాలి. అందుకే, బయటివారు ఇక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యం’’ అని సాకీ రాసుకొచ్చారు.
మహారాష్ట్రలో ఈ కోటను నిర్మించేందుకు చాలా ఏళ్లుపట్టింది. ఛత్రపతి శివాజీ జీవితంలో ఎన్నో నాటకీయమైన ఘట్టాలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. కోట చుట్టూ ప్రహరీలు ఆనాటి యుద్ధ వ్యూహాలు, వాస్తుశిల్ప కళకు అద్దంపడుతున్నాయి.
మొఘల్ చరిత్రకారుడు మహమ్మద్ షహీమ్ అలియాస్ ఖాఫీఖాన్ కూడా 1732లో రాసిన తన పుస్తకం ‘ముంత్‌ఖాబ్-అల్-లబాబ్-ఎ-మమహ్మద్‌షాహీ’లో ఈ కోట గురించి ప్రస్తావించారు.
‘‘ఒక పర్వతంపై రాజ్‌గఢ్ కోట ఉంటుంది. కాబట్టి దీన్ని అన్నివైపుల నుంచి చుట్టుముట్టడం చాలా కష్టం’’ అని ఆయన రాసుకొచ్చారు.
చరిత్రలోని ఈ ప్రస్తావనలు చూస్తుంటే మొఘల్ సైన్యానికి రాజ్‌గఢ్ కోట ఎలా చెమటలు పట్టించిందో అర్థమవుతుంది.
నేటికీ ఎవరైనా రాజ్‌గఢ్ కోటకు వెళ్లాలంటే నడుచుకుంటూ, పర్వతాలు ఎక్కుకుంటూ వెళ్లాల్సిందే.

ఫొటో సోర్స్, ARCHAEOLOGICAL SURVEY OF INDIA DEPARTMENT
రాజ్‌గఢ్ కోటను ఎలా నిర్మించారు?
పుణె జిల్లాలోని వెల్హే తాలూకాలో రాజ్‌గఢ్ కోట ఉంటుంది. రాజ్‌గఢ్‌కు రావాలంటే పుణె నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మొదటగా కోటకు దిగువ భాగంలోని గుంజ్వానే, పాలి గ్రామాలకు చేరుకోవాలి.
ఈ కోటకు రెండు మార్గాలు ఉన్నాయి. వీటిలో పాలి దర్వాజా ప్రధాన మార్గం. గుంజ్వానే పాత మార్గం.
దిగువ నుంచి మొదట పద్మావతి బురుజు (పద్మావతి మాచీ) అనే పర్వత ప్రాంతానికి చేరుకోవడానికి రెండున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
రాజ్‌గఢ్ ప్రత్యేకత ఆ నిర్మాణంలోనే ఉంది. గుర్రం పాద ముద్ర ఆకారంలో ఈ కోట కనిపిస్తుంది. పద్మావతి బురుజుపై మధ్యయుగం నాటి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. దీనిలో ఆనాటి శిల్పకళ ఉట్టిపడుతుంది. ఇక్కడి నుంచి రాజ్‌గఢ్ చేరుకునేందు సువెలా, సంజీవని బురుజులను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.
రాజ్‌గఢ్ కోటను ఒక్క రోజులో చూడటం కష్టం. కనీసంలో కనీసం రెండు రోజులు, గరిష్ఠంగా ఎనిమిది రోజులు ఈ కోటను చూసేందుకు పడతాయి.
కోటతోపాటు ఈ మూడు బురుజులు ఛత్రపతి శివాజీకి ఎలా పెట్టనికోటలా ఉండేవో ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

విలువైన సంపద
ఈ కోటకు సంబంధించిన చరిత్ర శివాజీ కాలం కంటే ముందే మొదలవుతుంది. బహమనీ పాలనా కాలంలో దీన్ని మురుముదేవ్ లేదా ముంబదేవ్‌గా పిలిచేవారు. కొన్ని ఆధారాల్లో దీన్ని బిరందేవ్ పర్వతం అని కూడా ప్రస్తావించారు.
బహమనీల కాలం తర్వాత ఈ కోట నిజాంషాహీల చేతుల్లో వచ్చింది. ఆ తర్వాత శివాజీ దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని మరింత పటిష్ఠం చేశారు. దీనికి రాజ్‌గఢ్ అనే పేరును శివాజీనే పెట్టారు. తనది స్వతంత్ర రాజ్యమని ప్రత్యర్థులకు చాటిచెప్పేందుకే ఆయన ఈ పేరును ఎంచుకున్నారు. ఈ కోటలో దేవనాగరీ లిపీలో సొంత నాణేలను కూడా శివాజీ ముద్రించారు.
శివాజీ ఈ కోటను ఎంచుకోవడానికి ప్రధాన కారణం మావల్ ప్రావిన్స్‌లో దీని ప్రత్యేక స్థానమే. పుణెకు పశ్చిమాన ఈ ప్రాంతం అప్పట్లో రాజకీయ కేంద్రం. తూర్పు వైపు దక్కన్ పీఠభూమి, పశ్చిమాన కొంకణ్ తీరం రాజ్‌గఢ్‌ను ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా మార్చాయి.
గుంజన్ మావల్ లోయలో పద్మవతి బురుజుపై నిలబడి చూస్తే కనుచూపు మేరలో తోర్నా, సింహగఢ్, పురందర్ కోటలు కనిపిస్తాయి. ఇవన్నీ మావల్ ప్రావిన్స్‌లో చాలా ముఖ్యమైన కోటలు.

ఫొటో సోర్స్, Getty Images
తోర్నా కోటలో పనులు జరుగుతున్నప్పుడే అక్కడి విలువైన సంపదను రాజ్‌గఢ్ నిర్మాణం కోసం తరలించినట్లు చరిత్ర చెబుతోంది.
1642 నుంచి 1662 వరకూ అంటే 20 ఏళ్లపాటు ఈ కోట నిర్మాణం జరిగిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. రాజ్‌గఢ్‌లో పాత కోటలను కూల్చేటప్పుడు దొరికిన డబ్బు, ఇతర సంపదను కూడా కొత్త కోట నిర్మాణంలో ఉపయోగించారని చరిత్రకారులు అప్పా ప్రణబ్ చెప్పారు.
తోర్నా నుంచి రాజ్‌గఢ్‌కు శివాజీ ఎప్పుడు వెళ్లారో చెప్పే స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే, ఆనాటి లేఖల ద్వారా ఈ కాలంపై కొన్ని అంచనాలు ఉన్నాయి.
1652లో శివాజీ మహారాజ్ కొన్ని భూములకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని లేఖలు కూడా లభ్యమయ్యాయి. బహుశా అప్పుడే ఆయన రాజ్‌గఢ్‌కు మారి ఉండొచ్చు.

ఫొటో సోర్స్, JB VLOGS
ఒప్పందం జరిగింది, కానీ
ఔరంగజేబు ఆదేశాలపై షాహిస్తా ఖాన్ 1600లలో మార్వాల్ కోటలపై దండెత్తాడు. షాహిస్తా ఖాన్ రాజ్‌గఢ్ చుట్టుపక్కల గ్రామాలన్నీ ధ్వంసం చేశాడు. కానీ, రాజ్‌గఢ్‌ను మాత్రం వశపరుచుకోవడానికి ప్రయత్నించలేదు. దీనికి మూడేళ్ల తర్వాత లాల్‌మహల్‌పై దాడి ద్వారా అతడికి శివాజీ గుణపాఠం చెప్పాడు.
అయితే, 1665లో మొఘల్ సైన్యంతో యుద్ధం వల్ల కోట పరిపాలనపై చాలా ప్రభావం పడింది.
దీనిపై చరిత్రకారుడు పీఎన్ దేశ్‌పాండే స్పందిస్తూ.. ‘‘మీర్జా రాజా జైసింగ్ ఒకేసారి అన్ని కోటలపైనా దాడి అనే వ్యూహాన్ని అనుసరించాడు. దీనిలో భాగంగానే ఒకేసరి రోహిదా, రాజ్‌గఢ్ కోటలపైకి సైన్యాన్ని పంపించాడు. రాజ్‌గఢ్‌కు సమీపంలో చాలా గ్రామాలను వీరు ధ్వంసం చేశారు. 1665 ఏప్రిల్ 30న మొఘల్ సైన్యం రాజ్‌గఢ్ కోటను స్వాధీనం చేసుకునేందుకు వచ్చింది. కానీ, అది అంత తేలిక కాదని వారికి అర్థమైంది’’ అని చెప్పారు.
అయితే, 1665 జూన్‌లో మొఘల్ సైన్యంతో పోరాటంలో ఓటమికి శివాజీ అంగీకరించారు. ఆ తర్వాత జైసింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా 23 కోటలను శివాజీ వదిలిపెట్టారు. కానీ, 12 కోటలను మాత్రం తన దగ్గరే ఉంచుకున్నారు. వీటిలో రాజ్‌గఢ్, తోర్నా కోటలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, JB VLOGS
కీలక ఘట్టాలకు వేదిక
చరిత్రలో కీలక ఘట్టాలకు రాజ్‌గఢ్ కోట వేదికైంది. ఆగ్రా నుంచి ఛత్రపతి శివాజీ, రాజే శంబాజీలు తప్పిచుకోవడం, అఫ్జల్ ఖాన్‌ను చంపడం, సింహగఢ్ విజయం లాంటి ఘట్టాలకు రాజ్‌గఢ్‌తో సంబంధముంది.
‘‘ఛత్రపతి రాజారామ్ మహారాజ్ కూడా రాజ్‌గఢ్‌లో జన్మించాడు. అందుకే అతడికి రాజారామ్ అనే పేరు పెట్టారు’’ అని ప్రొఫెసర్ ఎన్. దేశ్‌పాండే తన పుస్తకంలో రాశారు.
పద్మావతి బురుజు నుంచి
రాజ్‌గఢ్ కోటతోపాటు చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లోని పాత భవనాల శిథిలాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. దివాన్-ఏక్-ఆమ్, సదర్, మోరోపంత్ పింగిలే సోనోపంత్ డబీర్ లాంటి అధికారుల నివాసాలు ఇప్పటికీ పద్మావతి బురుజులో కనిపిస్తాయి.
పద్మావతి ఆలయం కూడా ఎంతో బావుంటుంది. తర్వాత కాలంలో దీనికి కొన్ని మెరుగులు దిద్దారు. శివాజీ మొదటి భార్య సాయిబాయి సమాధి కూడా ఇక్కడకు సమీపంలోనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్‌గఢ్ కోటకు వచ్చే విద్వాంసులకు పద్మావతి దేవాలయం ఆశ్రయం ఇచ్చేది. ఇక్కడకు సమీపంలోనే పద్మావతి చెరువు కూడా ఉంది.
కోటపై పడే వర్షపు నీటిని చెరువులో నిల్వచేసేలా ఆకాలంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించడానికి చోర్దిండ్యా లేదా చోర్ దర్వాజాగా పిలిచే మరో ద్వారం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఆకాలంలో మురుగునీటి వ్యవస్థ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, JB VLOGS
‘సువేలా’ ప్రత్యేకం..
పద్మావతి బురుజు తర్వాత సువేలా బురుజును నిర్మించారు. దీనిపై నీళ్ల ట్యాంకు, కోట భవనాలు, ర్యాంప్‌లు కనిపిస్తాయి.
ఇక్కడ నిర్మించిన గుంజ్వానే ద్వారం హేమాడ్‌పంత్ శైలిలో కనిపిస్తుంది. భిన్న పాలనా కాలల శిల్పాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు.
ఇంకాస్త ముందుకు వెళ్లే ‘బ్యాటిల్ టవర్’ కనిపిస్తుంది. సైన్యానికి సహాయం అందించేందుకు ఈ టవర్ ఉపయోగపడుతుంది. ఇక్కడి నీళ్ల ట్యాంకులు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ జీవించేవారికి ఏడాది పొడవునా నీరు అందించేందుకు వీటిని నిర్మించారు.
సువేలా బురుజు దగ్గర ఒక పెద్ద రాయికి గాలి వల్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని నేధాగా పిలుస్తారు. ఇక్కడకు ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. పేష్వా కాలం నాటి గణేశ్ విగ్రం, శాంతాజీ సిలింబాకర్ స్మారకం కూడా ఇక్కడ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, JB VLOGS
ఎత్తైన మైదానంలో బలమైన కోట
నిటారుకుగా ఉండే కొండపై కోట దగ్గరకు చేరుకునే మార్గం చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ ఒకవైపు రాతిమెట్లు కనిపిస్తాయి.
పైకి వెళ్లేందుకు రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే, కోట ద్వారం కనిపిస్తుంది. అది ఇప్పటికీ అలానే ఉంది.
కోటపైకి శుత్రువులు రాకుండా చూసేందుకు దీన్ని మరింత పటిష్ఠం చేశారు. ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ నీటిని నిల్వ చేయడానికి రాళ్ల మధ్య నెలవంక ఆకారంలో కొలనులు ఏర్పాటుచేశారు.
కోటపై ప్రస్తుతమున్న చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైనున్న నాలుగు ప్రధాన భవంతుల్లో ఒక దాంట్లో శివాజీ ఉండేవారిని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
సంజీవనీ బురుజు ప్రత్యేకత
సంజీవనీ బురుజును చివరగా నిర్మించారు. ఇక్కడ కాలి నడకన వెళ్లేందుకు ఒక మార్గం కనిపిస్తుంది. ఇక్కడున్న 19 టవర్లలో తొమ్మిది టవర్లు మట్టితో నిర్మించారు.
అలూ దర్వాజా మీదుగా సంజీవని బురుజుకు వెళ్లినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని ఎందుకు వదిలిపెట్టారు?
అప్పట్లో సూరత్‌ను దోచుకోవడం, ఆంగ్లో-డచ్ సేనల దురాక్రమణ, మొఘల్ సైన్యంతో ఘర్షణ లాంటి వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నడుమే రాయగఢ్‌ను రాజధానిగా మార్చాలని శివాజీ భావించినట్లు అప్పా ప్రణబ్ చెప్పారు.
‘‘రాజ్యాన్ని సుస్థిరం చేయాలంటే మరో పెట్టని కోట ఆనాడు అవసరమైంది. పైగా రాయ్‌గఢ్ వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఆహారానికి కూడా కొదువ ఉండదు’’ అని ఆయన వివరించారు.
‘‘రాయ్‌గఢ్‌ను రాజధానిగా ప్రకటించడంతో ఈశాన్య సహ్యాద్రిలోని ఘాట్‌లు వీరి నియంత్రణలోకి వచ్చాయి. ఈ మార్గం గుండా సాగే వాణిజ్యానికి రాయ్‌గఢ్ ఒక చెక్‌పోస్టులా ఉండేది. ఇక్కడ విధించే సుంకాల వల్ల రాజ్యానికి మేలు జరిగింది’’ అని ఆయన తెలిపారు.
పైగా రాయ్‌గఢ్ కోటకు మారడంతో చుట్టుపక్కల ప్రాంతంలోని చిన్నచిన్న రాజులు కూడా మహారాజుకు దగ్గరగా ఉండేవారు.
అయితే, ఆ తర్వాత రాజధాని కానప్పటికీ రాజ్‌గఢ్ ప్రాధాన్యం తగ్గలేదు. అయితే, 1689లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ హత్య తర్వాత మొఘల్ పాలకులు రాజ్‌గఢ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, దీన్ని మళ్లీ పొందేందుకు మరాఠాలు చాలా ప్రయత్నించారు.
1703లో ఈ ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. అయితే, మళ్లీ ఏడాది కాలంలోనే ఈ కోట ఔరంగజేబు చేతిలోకి వెళ్లింది. అప్పుడు దీనికి నవిషాగఢ్ అనే పేరు పెట్టారు.
ఆ తర్వాత కొన్నేళ్లకు జౌరంగజేబు మరణం తర్వాత మరాఠా, మొఘల్ వివాదం ముగిసింది. దీంతో పేష్వాల నియంత్రణలోకి రాజ్‌గఢ్ మళ్లీ వచ్చింది. అయితే, అప్పటికీ ఈ కోట ప్రాధాన్యం తగ్గిపోయింది.
ఇవి కూడా చదవండి:
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















