‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’

లోరెనా

ఫొటో సోర్స్, TANIA ACERO AND JUAN CAMILO DÍAZ

లోరెనా బెల్ట్రాన్ తన ఇరవయ్యో ఏట అంటే 2014లో తన వక్షోజాల సైజుని తగ్గించుకోవడానికి చికిత్స చేయించుకున్నారు. అయితే, ఈ చికిత్సలో ఆమె వక్షోజాలు దెబ్బతిన్నాయి.

ఒక ఏడాది తరువాత దీనిని సరిచేసేందుకు తిరిగి అదే డాక్టర్ చేసిన ప్రయత్నం పరిస్థితిని మరింత దిగజార్చింది.

‘‘సమస్యేమీ లేదు. చనుమొన పడిపోయినా.. తొడభాగం నుంచి చర్మం తీసి గ్రాఫ్టింగ్ ద్వారా (అంటుకట్టినట్టుగా) సరిచేస్తాను. దానిపై ఒక టాటూ వేస్తాను. రెండో చనుమొనతో సమానంగా ఉండేలా చేస్తాను’’ అని నిర్లిప్తంగా డాక్టర్ చెప్పడం తనకు వింతగా అనిపించిందని కొలంబియాకు చెందిన లోరెనా చెప్పారు.

భరించలేని నొప్పిని అనుభవిస్తూ, ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆమె జర్నలిస్టుగా తన పనిపై శ్రద్ధపెట్టారు.

ఆమె ఈ డాక్టర్‌పై చేసిన పరిశోధనలో కొలంబియాలో అనేకమంది బాధితులకు కారణమైన నకిలీ డిగ్రీల భాగోతమూ బయటపడింది.

ఆ తరువాత ఏడేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు లోరెనాకు 28 ఏళ్ళు. ఎట్టకేలకు తాను న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ముందడుగు అనదగ్గ వార్తను ఆమె విన్నారు.

లోరెనాకు వైద్యం చేసిన ఫ్రాన్సిస్కో సేల్స్ పుక్కినీతో పాటు మరో ఆరుగురికి కూడా వైద్యం చేసేందుకు కావాల్సిన విద్యార్హతలు లేవంటూ న్యాయస్థానం ఏడేళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించింది.

నిందితుల తరపున వాదించిన జైమ్ గ్రానడోస్ ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని చెప్పారు.

ఈ కేసు గురించి తెలుసుకోవడానికి లోరెనాతో బీబీసీ మాట్లాడింది.

‘డాక్టరే కానీ, ప్లాస్టిక్ సర్జన్ కాదు’

యూనివర్సిటీలో ఉన్న ఓ స్నేహితురాలి సలహాతో లోరెనా గైనకాలజిస్ట్ ఫ్రాన్సిస్కో సేల్స్ పుక్కిని దగ్గరకు వచ్చారు.

ఈయన ఆఫీసు బొగాటాలోని సంపన్న ప్రాంతంలో ఉంది. ఫ్రాన్సిస్కో‌కు ప్లాస్టిక్ సర్జరీలో డిప్లమా ఉందని అక్కడే లోరెనాకు తెలిసింది.

సేల్స్ పుక్కిని నమ్మదగినట్టుగా కనిపించడంతో లోరెనా లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అది బాగానే జరిగింది. దాంతో ఆమె తన వక్షోజాల సైజును కూడా సరి చేసుకోవాలని భావించారు.

‘‘నేను చాలా లావుగా ఉన్నాను. నా పిరుదులు, వక్షోజాలు పెద్దవిగా కనిపిస్తున్నాయి. లైపోసక్షన్‌తో నా పొత్తి కడుపు నుంచి కొవ్వును తీసివేశాక, నా వక్షోజాలు కిందకు జారిపోయాయి’’ అని లోరెనా చెప్పారు.

ఆ తరువాత కొంతకాలం ఆమె నడుమునొప్పితో బాధపడ్డారు.

ఆ స్థితిలో డాక్టర్ సేల్స్ పుక్కిని ఆమెకు వక్షోజాల సైజు తగ్గించుకోవడమే అందుకు పరిష్కారమని సూచించారు.

"నేను ఆ క్షణంలో ఆయనను నమ్మాను. ఎందుకంటే తెల్లకోటులో ఆయన అర్హుడైన సర్జన్‌గా కనిపించారు.

ఆ తరువాత ఆమె రెండో సర్జరీ అనే అగ్నిపరీక్షను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సర్జరీతో ఆమె వక్షోజాల ఆకారం మారిపోయింది.

వక్షోజాలపై ఏర్పడిన పుండ్లు బాధిస్తున్నాయి. ఒక చనుమొనైతే కుట్లు ఊడి కిందపడిపోయేలా ఉండింది. దాదాపు ఏడాది తరువాత ఆమె కొంత కోలుకున్నారు. కానీ, చూడటానికి వికారంగా కనిపిస్తున్నాననే భావన మిగిలిపోయింది.

సేల్స్ పుక్కిని ఈ సమస్యను పరిష్కరించడానికి చేసిన మూడో సర్జరీ ఆమె పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. అప్పుడు ఆమె మరో నిపుణుడిని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు.

‘‘నేను గుర్తింపు పొందిన ఇద్దరు సర్జన్లను కలిశాను. వారు తాము అటువంటి చికిత్సలు చేయమని చెప్పారు. డాక్టర్ హ్యూగో కోర్ట్స్ వద్దకు వెళ్ళమని సిఫార్సు చేశారు’’

లోరెనాను పరిస్థితిని చూసిన కోర్ట్స్ ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమెకు డాక్టర్ పుక్కిని తెలుసు. ‘‘గైనకాలజిస్ట్ నీకు ఎందుకు ఇలాంటి సర్జరీ చేశారు’’ అని కోర్ట్స్ అడిగారు.

"ఆయన గైనకాలజిస్టే కాదు, ప్లాస్టిక్ సర్జన్ కూడా, ఆయనకు రెండింటిలోనూ నైపుణ్యం ఉందని ఓ జర్నలిస్టుగా నేను తెలుసుకున్నాను" అని లోరెనా చెప్పారు.

అప్పుడు కోర్ట్స్, "ఆయన ప్లాస్టిక్ సర్జన్ కాదు. ఓ జర్నలిస్టుగా నువ్వు ఈ విషయాన్ని శోధించాలి" అని అన్నారు.

తొలి రెండు శస్త్రచికిత్సల తర్వాత 2016లో తీసిన ఫోటో

ఫొటో సోర్స్, THE VIEWER

ఫొటో క్యాప్షన్, తొలి రెండు శస్త్రచికిత్సల తర్వాత 2016లో తీసిన ఫోటో
2017లో తీసిన ఫోటో

ఫొటో సోర్స్, THE VIEWER

మెడికల్ కోర్సులు లేని యూనివర్సిటీ

సేల్స్ పుక్కిని ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీని 2014లో కొలంబియా విద్యాశాఖ గుర్తించిన రియో డి జనీరోలోని వీగా డి అల్మెయిడా యూనివర్సిటీ నుంచి పొంది ఉండవచ్చని లోరెనా అన్నారు. తన పరిశోధనకు రియోలో సహకరించే వారెవరైనా ఉన్నారా అని ఆమె తన సహచరిని అడిగారు.

ఆమె అక్కడి వెళ్ళి, ‘లోర్.. ఆ యూనివర్సిటీకి అసలు మెడికల్ స్కూలే లేదు’ అని చెప్పారు.

దాంతో, లోరెనా ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశోధించడం ప్రారంభించారు.

పరిస్థితి దారుణంగా ఉందని ఆమెకు అర్థమైపోయింది. మెడికల్ స్కూలే లేని యూనివర్సిటీ ప్లాస్టిక్ సర్జరీ డిప్లొమా ఎలా ఇస్తుంది?

లోరెనాతోపాటు మరో కొలంబియన్ జర్నలిస్టు జోహానా ఫ్యూంటెస్ కూడా ఈ పరిశోధనలో చేయి కలిపారు.

కొలంబియన్ విద్యాశాఖ అధికారిక సమాచారం కోసం ప్రయత్నించారు. వీగా డి అల్మెయిడా యూనివర్సిటీ నుంచి డిగ్రీలను పొందిన ఇతర డాక్టర్లు ఎవరనే సమాచారాన్ని అడిగారు.

2016లో 34 మంది డాక్టర్లకు ఆ బ్రెజిల్ యూనివర్సిటీ డిప్లొమా సర్టిఫికేట్లు ఇచ్చినట్లు నోటిసియాస్ యునో మీడియా రిపోర్ట్ చేసింది. కానీ, ఆ యూనివర్సిటీ అధికారులు అక్కడ మెడిసిన్‌లో ఆ విభాగానికి అధ్యాపకులు లేరని, అసలు ఆ కోర్సులే లేవని యూనివర్సిటీ డైరెక్టర్లు చెప్పారు.

చివరికి, డాక్టర్లు చెప్పిందేమిటంటే, తాము చేస్తున్న పనికీ చదువుకీ సంబంధం లేదని.

జర్నలిస్టుల దృష్టిని ఆకర్షించిన మరో వాస్తవం ఏమిటంటే, ఆ యూనివర్సిటీకి అనుమతులు 12 రోజుల రికార్డు సమయంలో వచ్చాయి. సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల సమయం పడుతుంది.

ప్రజల్లో అవగాహన కోసమే ఫిర్యాదు

లోరెనా మొదట్లో తన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలా వద్దా అని సంశయించారు. చివరికి, పంచుకోవడమే మంచిదని భావించారు.

“ఈ విషయాన్ని ఎలాగైనా సరే జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నాను. ఆ డాక్టర్ చేసిన తప్పేంటో చెప్పాలనుకున్నాను. ఇలా చేయడం వల్ల నాకు రక్షణ లభించింది.”

లోరెనా తన కథను చెబుతూ జాతీయ మీడియాలో కనిపించారు. ఈ వ్యవహారంపై ఆమె ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్‌లో “సేఫ్ సర్జరీ నౌ(# CirugíaSeguraYA)” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం మొదలు పెట్టారు.

"నాకు అప్పటికే ట్విట్టర్‌లో ( ప్రస్తుతం ఎక్స్) గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. సమస్యను ప్రస్తావించడానికి ప్రజలను ఏకం చెయ్యడానికి ఇదే మంచి మార్గం అనుకున్నాను. నేను కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటున్న పేషెంట్‌ను. అంతేకాదు, నాకు తెలిసిన విషయాలన్ని విస్తృతంగా ప్రచారం చేయగల జర్నలిస్టును’’ అని ఆమె చెప్పారు.

పొలిటికల్ జర్నలిస్టుగా ఆమె ఉన్నత స్థాయి వ్యక్తులను కలవగలరు. ఆ రోజున ఆమె ఆరోగ్య శాఖ మంత్రిని కూడా నేరుగా కలవగల స్థితిలో ఉన్నారు.

“చాలా మంది మహిళలకు లేని ప్రత్యేక గుర్తింపు, అవకాశాలు నాకు ఉన్నాయని తెలుసు. అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. దీని వల్ల నాకు ఏదైనా జరగవచ్చు. అయినా సరే నేను మాట్లాడాలి. నాకు ఏం జరిగినా నేను చింతించదలచుకోలేదు” అని చెప్పారు.

ఆమె శరీరం మీద ఉన్న మచ్చలను ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకున్నారు. లోరెనా ఫోటోలను కొలంబియన్ పత్రిక ఎల్ ఎక్స్‌పెక్టాడొర్‌లో ప్రచురించారు.

“నా ఫోటోలు కవర్ పేజీ మీద ప్రచురించారు. నేను ఒంటరిగా లేను. మేము ఎనిమిది మహిళలం ఉన్నాం. మా శరీరాలకు జరిగిన నష్టాన్ని ప్రదర్శించదలచుకున్నాం. అందుకోసం అర్ధనగ్నంగా ఫోటోలకు ఒప్పుకున్నాం” అని చెప్పారు.

వర్చ్యువల్ క్యాంపెయిన్‌కు సిద్ధమైన లోరెనా

ఫొటో సోర్స్, MAURICIO ALVARADO

న్యాయ ప్రక్రియ

లోరెనా, మరి కొంతమంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో పత్రికలు, విచారణ సంస్థలు దర్యాప్తు చేశాయి. అనుమానాస్పదంగా ఉన్న 42 మంది వైద్యుల సర్టిఫికేట్లను ప్రాసిక్యూటర్ కార్యాలయం స్వాధీనం చేసుకుంది.

ఆ 42 మందిలో కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. అందులో మొదట ఆరుగురిపైన కేసు పెట్టారు. వారిలో సేల్స్ పుక్కిని, ఆయన సోదరుడు కార్లోస్ ఇలియాస్ కూడా ఉన్నారు.

2017 అక్టోబర్‌లో ఈ డాక్టర్ల మీద అభియోగాలు నమోదు చేయడం మొదలైన తర్వాత ఆరేళ్లకు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి తీర్పు వచ్చింది.

ఆరుగురు డాక్టర్లను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జడ్జి చెప్పారు. అయితే, ఓ విషయం స్పష్టం చేశారు. ఈ కేసులో పోర్చుగీస్‌లో ఉన్న పత్రాలు స్పానిష్‌లో ఉండి ఉంటే పాత చట్టం ప్రకారం వారిని దోషులుగా ప్రకటించి శిక్ష వేసేందుకు వెనుకాడనని అన్నారు.

ఒక చిన్న తప్పిదం వల్ల ఆయన వారిని నిర్దోషులుగా ప్రకటించాల్సి వచ్చింది.

“ఆ రోజు నేనెంత ఏడ్చానో నాకే తెలియదు. ఏదో ఒక చిన్న తప్పు వల్ల వాళ్లు చేసిన ఘోరం నేరం కాకుండా పోతుందా? పత్రాలను సరైన సమయంలో ఇవ్వనందుకు వాళ్లను వదిలేస్తారా అని అనుకున్నాను”

ఊహించినట్లుగానే ఈ తీర్పు మీద ప్రాసిక్యూటర్ కార్యాలయం అప్పీలుకు వెళ్లింది.

విద్యా శాఖ కూడా అప్పీలుకు వెళ్లడంతో కేసుపై మరోసారి విచారణ మొదలైంది. వాళ్లకు 7 ఏళ్ల శిక్ష విధిస్తూ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 25న తీర్పు చెప్పారు.

“ వైద్య పరంగా మోసం చెయ్యడం, ప్రైవేట్ డాక్యుమెంట్లను తప్పుగా సమర్పించడం వంటి నేరాల్లో వారు దోషులని కోర్టు తేల్చింది. అక్టోబర్ నాలుగున వారికి శిక్ష పడినట్లు బహిరంగంగా ప్రకటించారు” అని లోరెనా చెప్పారు.

అయితే, కింది కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చెయ్యడంతో వారికి ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది తనకు తెలియకపోయినా.. అక్కడ కూడా ఆ ఆరుగురు డాక్టర్లకు శిక్ష పడుతుందని ఆమె ఆశతో ఉన్నారు.

నష్టానికి పరిహారం ఎలా?

నష్ట పరిహారం కోసం లోరెనా 2017లోనే సేల్స్ పుక్కిని మీద సివిల్ దావా వేశారు. పై కోర్టులో అందులో గెలిచారు.

“నాకు, నా కుటుంబానికి 86 మిలియన్ పెసోలు(సుమారు 20 వేల అమెరికా డాలర్లు) చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఇప్పటి వరకూ నాకు ఒక్క పెసో కూడా అందలేదు”. అని లోరెనా చెప్పారు.

అన్ని రకాలుగా నష్టపోయి న్యాయపరంగా పోరాటం చేయడం చాలా కష్టంగా ఉందని లోరెనా అన్నారు.

“విచారణ సమయంలో సేల్స్ పుక్కిని వాదన విన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడేందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. కానీ ఆ సమయంలో అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది.” అని అన్నారు.

ఏడేళ్లుగా లోరెనా మానసికంగా అంతులేని ఆవేదన అనుభవించారు. దీని నుంచి బయటపడేందుకు ఆమె సైక్రియాటిస్టుని కలిశారు.

నిరాశ, ఆందోళన, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం లాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు వైద్యుడి పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో డిప్రెషన్ తగ్గడానికి కొన్ని మందులు వాడారు.

మానసిక సమస్యలకు తోడు బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. సేల్స్ పుక్కిని లాయర్ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించారని లోరెనా చెప్పారు.

ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు ఆ ఆరుగురు వైద్యులకు శిక్ష పడిన తర్వాత కాస్త ఉపశమనం దొరికిందన్నారు. “కోర్టు తీర్పు విన్న తర్వాత నేను సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్లకు జైలు శిక్ష పడిందని కాదు. నాకు జరిగినట్లు మరొకరికి జరగదనే భావన నాకు ఆనందాన్ని కలిగించింది.”

“నాకు జైల్లో ఉన్న ఆ డాక్టర్లను చూడాలని లేదు. నన్ను మానసికంగా, శారీరంగా వేధించిన ఆ డాక్టర్లు ఇప్పుడు జైలులో ఉన్నారు. వాళ్లు మళ్లీ ఆపరేషన్లు చెయ్యకూడదన్నదే నా కోరిక’’ అని లోరెనా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)