తెలిసిన ముఖాలను గుర్తుపట్టలేకపోతున్నారా? చికిత్స లేని ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా?

ముఖాలను గుర్తుపట్టడంలో సమస్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముఖాలను గుర్తుపట్టలేకపోవడాన్నిప్రాసపగ్నోజియాగా పిలుస్తారు. దీనిని ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అని కూడా అంటారు.
    • రచయిత, పాయల్ భుయాన్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

“కొన్ని నెలల క్రితం నేను ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతను నవ్వుతూ పలకరించాడు. కానీ అతనెవరో నాకు తెలియలేదు. అతడి ముఖాన్ని గుర్తుపట్టలేకపోయాను. అతనికి నా సమస్య ఏంటో చెప్పలేకపోయాను. ఎవరు నువ్వు? అని అడగాలని అనిపించింది”

బీబీసీ కరస్పాండెంట్ నటాలియా గ్యుర్రెరో తనకు పరిచయం ఉన్న ముఖాలను గుర్తుపట్టలేని సమస్య గురించి చెప్పారు.

“ఎవరైనా వచ్చి నన్ను నవ్వుతూ పలకరిస్తే, వీరికి నేను తెలుసా? ఎవరు ఈ వ్యక్తి? నాతో కలిసి ఒకే ఆఫీసులో పని చేస్తున్నారా? అన్న ప్రశ్నలు నాలో తలెత్తుతాయి. ఒకవేళ వారు కూడా నాతో కలిసి పనిచేస్తుంటే గనుక, వారిని గుర్తుపట్టకపోవడం దారుణమైన విషయం కదా” అని ఆమె అన్నారు.

prosopagnosia

ఫొటో సోర్స్, Getty images

ప్రాసపగ్నోజియా అంటే ఏమిటి?

ముఖాలను గుర్తుపట్టకపోవడం సమస్యే. ఈ సమస్యను ప్రాసపగ్నోజియాగా పిలుస్తారు. ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అని కూడా అంటారు.

ఈ సమస్య ఉన్నవారు తెలిసిన వారి ముఖాలే అయినా, రోజూ కలుస్తూనే ఉన్నా వారిని చూడగానే ఫలానా అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు.

1947లో జర్మనీకి చెందిన న్యూరాలజిస్ట్ జోచిమ్ బోడమెర్ ‘ప్రాసపగ్నోజియా’ పదాన్ని తొలిసారి ఉపయోగించారు.

యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్న సమయంలో, వారిలో ఈ సమస్య ఉన్నట్లుగా గుర్తించారు.

నోయిడాలోని మెట్రో హాస్పిటల్ & హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనియా లాల్ గుప్తా ఈ సమస్య గురించి మాట్లాడుతూ, కొన్నిసార్లు ఇది పుట్టుకతో కూడా రావొచ్చన్నారు.

“ప్రాసపగ్నోజియా రావడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు షాక్ వలన గానీ, మెదడుకి బలమైన గాయం కావడం వలన గానీ ఈ ప్రాసపగ్నోజియా బారిన పడొచ్చు” అన్నారు.

మెదడులో కుడివైపున ఉండే కింది భాగానికి రక్తప్రసరణ తగ్గినప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని, ఈ భాగం ముఖాలను గుర్తుపట్టే సామర్థ్యం కలిగి ఉంటుందని దిల్లీలోని సెయింట్ స్టీఫెన్ హాస్పిటల్‌లో సైకియాట్రీ విభాగంహెడ్ డాక్టర్ రూపాలి శివల్కర్ చెప్పారు.

“పుట్టుకతోనే ఈ సమస్య ఉన్నవారికి మెదడులోని భాగం అభివృద్ధి చెందదు. అలా కాకుండా మధ్యలో ఈ సమస్య తలెత్తిన వారికి మెదుడులో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎంఆర్ఐ పరీక్షలో మెదడులో చోటుచేసుకున్న ఈ మార్పులను గమనించొచ్చు” అన్నారు.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ తాజా నివేదిక ప్రకారం ప్రతి 33 మందిలో ఒకరు ప్రాసపగ్నోజియా వల్ల కొంతవరకైనా ఇబ్బంది పడ్డారని తేలింది. అంటే 3.08 శాతం జనాభా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ప్రముఖ ప్రిమటాలజిస్ట్ జేన్ గూడల్, హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, నటి, ట్రావెలర్ షెహనాజ్ ట్రెజరీవాలా వంటి సెలబ్రిటీలు ఈ రుగ్మతతో బాధపడుతున్నట్లుగా వెల్లడించారు.

ఈ రుగ్మతతో బాధపడుతున్నవారు భారతదేశంలో 2-3 శాతం ఉండొచ్చని డాక్టర్ రూపాలి తెలిపారు.

prosopagnosia- ప్రాసపగ్నోజియా

ఫొటో సోర్స్, Getty images

ఫొటో క్యాప్షన్, ముఖాలను పోల్చులేకపోవడంతో సమస్య

ప్రాసపగ్నోజియాలో మూడు దశలు

బీబీసీ కరస్పాండెంట్ నటాలియా తన పరిస్థితి గురించి వివరిస్తూ, “నా సమస్య మరీ తీవ్రమైనదేమీ కాదు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా సహోద్యోగులను గుర్తుపట్టగలను” అన్నారు.

వైద్యులు చెప్పిన దాని ప్రకారం ప్రాసపగ్నోజియాలో మూడు దశలు ఉన్నాయి.

తొలుత ప్రాసపగ్నోజియాకు ఆటిజంతో సంబంధం ఉందని అనుకున్నారని, చాలా పరిశోధనల తర్వాత ఇవి రెండూ వేర్వేరు పరిస్థితులని గుర్తించారని డాక్టర్ రూపాలి తెలిపారు.

అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలాజికల్ డిసార్డర్స్ అండ్ స్ట్రోక్ వివరాల ప్రకారం.. ముఖాలను గుర్తించడంలో ఇబ్బంది పడటం ప్రాసపగ్నోజియా ప్రధాన లక్షణం.

ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ముఖాలను పోల్చుకోవడం కష్టతరంగా అనిపిస్తుంది.

ఇవే కాక ప్రాసపగ్నోజియాను తెలుసుకునేందుకు మరో కొన్ని ముఖ్య లక్షణాలున్నాయి.

  • ముఖాలను గుర్తుపట్టలేకపోవడం
  • ముఖాలను పోల్చుకోవడంలో సమస్య
  • తమ ముఖాలను కూడా గుర్తుపట్టకపోవడం

ఇవే కాకుండా మరికొంత మంది ముఖంలోని భావాలను గుర్తించలేరు. సినిమాలు, టీవీల్లో వచ్చే పాత్రలను గుర్తించలేరు.

ప్రాసపగ్నోజియా

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, రోజువారీ జీవితంపై ప్రాసపగ్నోజియా ప్రభావం చూపిస్తుంది.

సామాజిక జీవితంపై ప్రభావం

మనం ఉంటున్న సమాజంలో ముఖాలను చూసి నవ్వుతూ పలకరించుకోవడం ముఖ్యం. తెలిసిన వ్యక్తి పలకరించినా సరే, తెలీనట్లు, పలకరించకుండా వెళ్లిపోతే ఎలా ఉంటుంది?

నటాలియా తనకున్న సమస్య వలన ముఖాలను గుర్తుపట్టలేకపోతుంటారు. దీని వలన కొన్నిసార్లు తాను అహంభావినని కొంత మంది వ్యక్తులు భావిస్తారని ఆమె అన్నారు.

“ఓసారి న్యూయార్క్‌లో ఒక పెద్ద డ్రగ్ స్మగ్లర్ గురించిన వార్తను రిపోర్ట్ చేస్తున్న సమయంలో తోటి జర్నలిస్టులతో కలిసి పని చేశాను. నాకు రోజూ వారి ముఖాలను పోల్చుకోవడం కొత్తే. ఓరోజు ముగ్గురు జర్నలిస్టులు అక్కడే కూర్చుని ఉన్నారు. వారిని పోల్చుకోలేకపోయాను. ముగ్గురూ ఒకేలా అనిపించారు. వారిని కలిసి నా సమస్య గురించి చెప్పడం ఇష్టంలేక, దూరంగానే ఉన్నాను” అని ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు నటాలియా.

“ఈ ఫేస్ బ్లైండ్‌నెస్ సమస్య ఆ వ్యక్తి సామాజిక జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేక, సోషల్ యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌కు దారి తీయొచ్చు” అని డాక్టర్ రూపాలి తెలిపారు.

ప్రాసపగ్నోజియాకు చికిత్స లేదని డాక్టర్ సోనియా అన్నారు. ఈ సమస్యతో బాధపడే వారికి వ్యక్తులను గుర్తుపట్టేందుకు ఇతర మార్గాల గురించి వివరించి, ఆ దిశగా సాయం చేయొచ్చని అన్నారు.

“ఏ కారణం చేత పేషెంట్‌కు ప్రాసపగ్నోజియా రుగ్మత వచ్చిందో తెలుసుకోవడం ముఖ్యం. ఒకవేళ షాక్ లేదా గాయాల వలన ప్రాసపగ్నోజియా బారిన పడితే అందుకు సంబంధించి, చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది” అని అన్నారు.

ఈ రుగ్మత ఉన్నవారు ఏం చేయాలి?

ప్రాసపగ్నోజియా రుగ్మతను నయం చేయడానికి చికిత్స లేదు. అయితే ఈ సమస్యతో బాధపడేవారి జీవితాన్ని సాఫీగా సాగించేలా చేయొచ్చు.

ఇందుకోసం డాక్టర్ రూపాలి కొన్ని సలహాలు ఇచ్చారు.

  • మీరు కలుసుకునే వారికి ముందుగానే మీ సమస్య గురించి చెప్పడం
  • వ్యక్తులను వారి గొంతు, బాడీ లాంగ్వేజ్ ఆధారంగా గుర్తుపెట్టుకోవడం
  • ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారినే పరిచయం చేసుకోవాలని అడగడం

నటాలియా మాట్లాడుతూ- "వ్యక్తులను మర్చిపోవడం బాధాకరమైన విషయం. నేను కలిసిన వారు బాధపడటం నాకు నచ్చదు. కానీ ఈ రుగ్మత రోజువారి జీవితాన్ని కష్టతరంగా మారుస్తుంది. మన సమస్య తెలీక ఎదుటివారు మనల్ని అపార్థం చేసుకుంటారు. అందుకే మన సమస్య గురించి చెప్పడం ముఖ్యం. నేనైతే అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ, కలిసిన ప్రతిసారి ‘మీరు ఎవరు’ అని అడగటానికి ఏమాత్రం సంకోచించను” అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)