యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంజలి దాస్
- హోదా, బీబీసీ కోసం
మన కడుపులో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు ఉండడంతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మనకు మేలు చేసేవే. ఎలాగంటే, పాలను పెరుగులా మార్చే బ్యాక్టీరియా తరహాలో కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవ శరీరానికి ఉపయోగపడతాయి.
మన శరీరంలో కోట్లాది బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి లేకుంటే మానవ మనుగడ కష్టమవుతుంది. అవి పేగుల్లో ఎక్కువగా ఉంటాయి.
అలాగే, జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంపై భారీగా ప్రభావం చూపుతుంది.
జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇవి సాయపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే యాంటీబయాటిక్స్ వేసుకోవచ్చుగా అనే మాటలు మనం వింటూ ఉంటాం.
వ్యాధికారకాలపై ఈ యాంటీబయాటిక్స్ గత 80 ఏళ్లుగా విజయవంతంగా పోరాడుతున్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య, అలాగే వ్యాధి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది.
ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి మనుషులను రక్షిస్తున్న ఔషధం. అందువల్ల యాంటీబయాటిక్స్‌ను సూక్ష్మజీవులను నిరోధించే యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లుగా పిలుస్తారు.
అయితే, యాంటీబయాటిక్స్ పేగుల్లోని సూక్ష్మజీవులకు అతిపెద్ద ముప్పు అని నిపుణులు చెబుతున్నారు.
''ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. అప్పుడు ఒక్కసారి తీసుకునే ఒక కోర్సు యాంటీబయాటిక్స్ కూడా వాటి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా పేగులోని సూక్ష్మజీవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది సుమారు ఏడాది పాటు సూక్ష్మజీవులకు ఇబ్బందికరంగా మారుతుంది'' అని అమెరికన్ సొసైటీకి చెందిన మైక్రోబయాలజీ జర్నల్ ''యాంబయో''లో ప్రచురితమైంది.
నేషనల్ అకడమిక్స్ ఆఫ్ సైన్స్ సైంటిఫిక్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రం ప్రకారం, 2000 నుంచి 2015 మధ్య కాలంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో యాంటీబయాటిక్స్‌ను వాడాలని సూచించడం 65 శాతం పెరిగింది.
ఆరోగ్యం కాపాడుకునేందుకు యాంటీబయాటిక్స్‌పై ఆధారపడడం పెరుగుతుండడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.
యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే అతిపెద్ద సమస్యలు రెండు.
1.పేగులోని సూక్ష్మజీవులకి నష్టం కలిగించడం.
2.యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి బ్యాక్టీరియాలో పెరగడం.
యాంటీబయాటిక్స్‌కి నిరోధకత పెరగడం వల్ల అమెరికాలోని ఆస్పత్రులలో చికిత్స కూడా ప్రభావితమవుతోందని మెడికల్ న్యూస్ టుడే కథనం తెలిపింది.
ఈ ఔషధాలకు నిరోధకత పెరగడం వల్ల కలిగే ప్రమాదాలను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) గుర్తించింది. వాటిని వెరీ ఇంపార్టెంట్, సీరియస్, వర్రీయింగ్ అనే మూడు కేటగిరీలుగా విభజించింది.
అంతేకాకుండా, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. యాంటీబయాటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు కూడా వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Getty Images
హైడోస్‌తో కడుపులో భరించలేని నొప్పి
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి చెందిన జాన్వీ శుక్లా ఇలా యాంటిబయాటిక్స్ కారణంగా ఇబ్బందులు పడినవారిలో ఒకరు. ఈ మందులు ఆమె ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆమె చాలా కాలం పాటు హై డోస్ (ఎక్కువ మోతాదు)లో యాంటీబయటిక్స్ తీసుకున్నారు.
''ఈ ఏడాది ఫిబ్రవరిలో నా రెండు మోకాలిచిప్పల రీప్లేస్‌మెంట్ జరిగింది. అది పెద్ద ఆపరేషన్ కావడంతో చాలా కాలం మందులు వేసుకోవాల్సి వచ్చింది. యాంటీబయాటిక్స్ కూడా వేసుకున్నా. ఎనిమిది, పది రోజుల వరకూ అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కడుపులో భరించలేనంత నొప్పి. ఆ నొప్పి వల్ల మోకాలి ఆపరేషన్ నొప్పులు కూడా మర్చిపోయా'' అని ఆమె చెప్పారు.
''కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడ్డా. మొదట్లో నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. కడుపులో తిమ్మిరిగా, భరించలేనంత నొప్పి వచ్చేది.''
ఆ తర్వాత ఆమె డాక్టర్‌ను సంప్రదించడంతో ఆమెకు రాసిచ్చిన యాంటీబయాటిక్స్ డోస్ తగ్గించారు. ఆ తర్వాత తన సమస్య కొంత వరకూ తగ్గిందని జాన్వీ శుక్లా చెప్పారు.
''యాంటీబయాటిక్స్ డోస్ తగ్గించిన తర్వాత కడుపునొప్పి కొంచెం తగ్గింది. దాని వల్ల దాదాపు నెలరోజులు చాలా బాధపడ్డా'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పేగులోని సూక్ష్మజీవులపై ప్రభావం
''అవి వాడకపోతే కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్‌ను వాడాలి'' అని డాక్టర్ పి.ఘోష్ చెప్పారు.
''యాంటీబయాటిక్స్ లేకుండా చికిత్స అందించలేం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, వాటిని ప్రతిసారీ వాడాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు.
పేగులో ఎన్నిరకాల సూక్ష్మజీవులు ఉంటే శరీరానికి అంత మంచిదని కూడా వారు చెబుతున్నారు.
''యాంటీబయాటిక్స్ ఒక్క కోర్సు వాడినా నిరోధకత పెరిగేందుకు కారణమవుతుంది. అలాగే, మీ పేగుల్లోని సూక్ష్మజీవుల ఉనికిని కూడా ప్రభావితం చేస్తుంది. యాంటీబయాటిక్స్ వ్యాధి కారక బ్యాక్టీరియాతో పాటు మేలు చేసే బ్యాక్టీరియా పై కూడా దాడి చేస్తాయి.’’ అని డాక్టర్ ఘోష్ వివరించారు.
నిజానికి, పేగులోని అన్ని రకాల బ్యాక్టీరియాలపై యాంటీబయాటిక్స్ ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
''అన్ని రకాల సూక్ష్మజీవులూ నాశనమవుతాయి. యాంటీబయాటిక్స్ చేసే పనే అది'' అని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో జీనోమిక్ మెడిసిన్ విభాగం లేబొరేటరీ ప్రొఫెసర్ గౌతమ్ దంతాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదడుతో పేగు కనెక్షన్
నోటి నుంచి మొదలై మలద్వారం వరకూ వెళ్లే పొడవైన గొట్టం లాంటి నిర్మాణమే పేగు . అందులో బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా, ఇతర పరాన్నజీవులు ఉంటాయి. దీన్నే మైక్రోబయోమ్ అంటారు.
‘‘పేగు, మెదడుతో అనుసంధానమై ఉంటుంది. పేగులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మెదడుకు సంకేతాలు వెళ్తాయి. అలాగే, మెదడులో ఏదైనా సమస్యలో ఉంటే పేగుకి సంకేతాలు వస్తాయి. ఇవి రెండూ అనుసంధానమై ఉండడం వల్లే ఇలా జరుగుతుంది'' అని నిపుణులు చెబుతున్నారు.
కడుపులో ఏదైనా సమస్య వస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
- పని మీద తరచుగా పరధ్యానం.
- జ్ఞాపక శక్తి తగ్గిపోవడం.
- ఆందోళనకి గురవడం వంటివి.
అలాగే, చర్మం, జీవ ప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థ, రక్తంలో షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు పేగు సమస్యలపై ప్రభావం చూపుతాయి.
''యాంటీ బయాటిక్స్‌పై ఆధారపడకపోవడమే ఉత్తమం. వ్యాధులను నయం చేసుకునే శక్తి స్వతహాగా మన శరీరానికి ఉంటుంది. ఆహారం, ద్రవ పదార్థాల ద్వారా మన శరీర పరిస్థితులను సరిచేసుకోవచ్చు. మనం చేయగలం. అందువల్ల మన ఆహారపు అలవాట్లలో మొదటి నుంచీ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది'' అని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన కన్సల్టెంట్ సర్జన్ జేమ్స్ కిన్రోస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆటో-బ్రూవరీ సిండ్రోమ్: కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే వింత సమస్య, కొందరు తాగకుండానే తూగుతారు..దీనికి కారణం ఏంటి?
- Cough-syrup scandal: ఆ దగ్గు మందు హరియాణా నుంచి గాంబియా వరకూ ఎలా వెళ్లింది?
- ఆరోగ్యం: యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియాతో దేశంలో కొత్త సంక్షోభం
- Dolo-650 ఎలా పుట్టింది? 30 ఏళ్ల నుంచి ఉన్నా ఇప్పుడే ఎందుకింత పాపులర్ అయింది?
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














