కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్‌వో ఎందుకు హెచ్చరించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూమ్మీద జరిగే అతిపెద్ద మానవాళి సమ్మేళనానికి, యాంటీ బయాటిక్స్‌కు సంబంధం ఏంటి?
నిస్సందేహంగా ఈ రెండింటికీ ఒక సంబంధం ఉంది.
భారత్‌లో కుంభమేళా జరిగే ప్రాంతాల్లోని క్లినిక్‌లు, ప్రధానంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో వచ్చే వేలాది మంది యాత్రికులకు అధిక మొత్తంలో యాంటీ బయాటిక్స్‌ను అందిస్తున్నాయి.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పరిశోధక సంస్థలు, యూనిసెఫ్, హార్వర్డ్ యూనివర్సిటీలోని ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌లు కనుగొన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనం కుంభమేళ. ఇది హిందువుల పండుగ.
యాంటీ బయాటిక్స్‌ను ఎంత ఎక్కువగా వాడితే ‘‘యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్’’ వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంటువ్యాధులను నివారించే చికిత్సలో ఉపయోగించే మందులకు బ్యాక్టీరియా నిరోధకంగా రూపాంతరం చెందినప్పుడు యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ సంభవిస్తుంది. ఈ పరిస్థితి వస్తే మందులు పనిచేయవు.
ఫలితంగా యాంటీబయాటిక్ నిరోధక ‘‘సూపర్‌బగ్ ఇన్‌ఫెక్షన్ల’’ను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది ప్రజారోగ్యానికి ఒక పెద్ద గ్లోబల్ ముప్పును కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.
ఈ నిరోధకత కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మరణాలు నమోదయ్యాయని ‘‘ద లాన్సెట్’’ అనే మెడికల్ జర్నల్ తెలిపింది.
ఈ కేసుల్లో చాలా వరకు యాంటీబయాటిక్స్ పనిచేయలేదు.
2050 నాటికి ఇలాంటి మరణాల సంఖ్య కోటికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది.
ప్రపంచంలోనే భారత్ అత్యధికంగా యాంటీబయాటిక్‌లను వినియోగిస్తోంది.
ప్రతీ ఏడాది దాదాపు 60 వేల మంది నవజాత శిశువుల మరణాలకు యాంటీబయాటిక్-రెసిస్టెన్స్ నియోనాటల్ ఇన్‌ఫెక్షన్‌లే కారణం.
కరోనా మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్స్ వాడకం తీవ్రమైందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని నాలుగు నగరాల్లో కుంభమేళా కొన్ని వారాల పాటు జరుగుతుంది.
కుంభమేళా జరిగే నగరాల ఒడ్డున ఉన్న నదుల్లో యాత్రికులు పవిత్ర స్నానాలు చేస్తారు.
2013, 2015లలో ప్రయాగ్‌రాజ్, నాసిక్ వేదికగా జరిగిన కుంభమేళా ఎడిషన్లలో 40 కంటే ఎక్కువ క్లినిక్‌లలో చికిత్స పొందిన 70 వేల మంది రోగుల డేటాను అమెరికాకు చెందిన పరిశోధకులు సేకరించారు.
ఈ రెండు పర్యాయాల్లో కలిపి కుంభమేళాలో 10 కోట్లకు పైగా యాత్రికులు పాల్గొన్నారు.
2013 ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా రోగుల్లో ఎక్కువ మంది పురుషులే. వారి మధ్యస్థ వయస్సు 46 ఏళ్లు.
వీరంతా జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కండరాల నొప్పి, డయేరియాతో బాధపడ్డారు.
క్లినిక్‌లకు వచ్చిన వారిలో మూడొంతులకు పైగా రోగులకు యాంటీబయాటిక్స్ సిఫార్సు చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 69 శాతం మంది రోగులు, ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డారు. కుంభమేళాలోని ఉచిత ప్రభుత్వ క్లినిక్‌లలో వీరు యాంటీబయాటిక్స్‌ను పొందారు.
ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు స్వభావరీత్యా ఇతరులకు సోకుతాయి కాబట్టి దీన్ని చాలా భయంకరమైన రేటుగా పరిగణించవచ్చని ఇటీవలే ప్రచురితమైన ఒక పేపర్‌లో పరిశోధకులు పేర్కొన్నారు.
ఏ అనారోగ్య కారణంతో క్లినిక్‌కు వెళ్లినా బయటకు వచ్చే ప్రతీ ముగ్గురిలో ఒకరి వద్ద యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ ముక్కు కారడం అనే సమస్యతో వెళితే ముగ్గురిలో ఇద్దరి వద్ద యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు.
భారత్‌లో ఔట్‌పేషెంట్లలో 39 -66 శాతం మందికి యాంటీబయాటిక్స్ సిఫార్సు చేస్తున్నట్లు మునుపటి గణాంకాలు సూచిస్తున్నాయి.
తీవ్ర రద్దీగా ఉండే కుంభమేళ క్లినిక్‌లలోని వైద్యులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని పరిశోధకులు చెప్పారు.
రోగుల సంఖ్య భారీగా ఉండటం, సమయాభావం, సమగ్ర రోగ నిర్ధారణ పరీక్షల సమాచారం లేకపోవడం వంటివి వైద్యులు ఎదుర్కొన్న సవాళ్లు.
ప్రతీ క్లినిక్‌కు రోజూ వందలాది మంది రోగులు వస్తారు. వైద్యులు, రోగుల మధ్య సంబంధాలు సరిగా ఉండవు. ప్రతీ రోగికి వైద్యుడు సగటున మూడు నిమిషాల కంటే తక్కువ సమయమే వెచ్చించేవారు. ‘‘రోగిని పూర్తిగా పరీక్షించకుండానే తరచుగా యాంటీబయాటిక్స్ సిఫార్సు చేశారు. యాంటీబయాటిక్స్ మోతాదు ఎక్కువగా కనిపించింది’’ అని పరిశోధకులు అన్నారు.
అధికారిక ప్రోటోకాల్ ప్రకారం, యాంటీబయాటిక్స్ మూడు రోజులు వాడిన తర్వాత మళ్లీ వైద్యున్ని సంప్రదించాలి. కానీ, కుంభమేళాకు వచ్చిన యాత్రికులు ఒక రోజులోనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయేవారు కాబట్టి అధికారిక ప్రోటోకాల్ ఆచరణ జరుగనట్లుగా పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, EPA
రాబోయే మేళాల్లో, యాత్రల్లో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్లను తగ్గించడానికి పరిశోధకులు అనేక చర్యలను సిఫార్సు చేశారు.
మేళాల్లోని క్లినిక్‌లకు వచ్చే వారిలో చాలామందికి ఫిజీషియన్ అవసరం ఉండదని, వారికి మెడికల్ విద్యార్థులు లేదా కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల సహాయంతో చికిత్స అందించాలని సూచించారు. ఒక వైద్యుని వద్దకు వెళ్లే రోగుల సంఖ్యను తగ్గించడం వల్ల అలసటకు గురికాకుండా ఉండొచ్చని అన్నారు.
క్లినిక్‌లలో రోగ నిర్ధారణకు అవసరమైన ప్రయోగశాల, రేడియాలజీ సర్వీసులను మెరుగుపరచాలి. సరైన రోగనిర్ధారణ లేకపోవడం వల్లే రోగులకు యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేస్తున్నారని వారు నమ్ముతున్నారు.
2013 ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో క్లౌడ్ ఆధారిత వ్యాధి నిఘా వ్యవస్థను వాడారు.
2015 నాసిక్ కుంభమేళాలో డిజిటల్ ట్యాబ్లెట్లను ఉపయోగించారు.
2025 ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఫంక్షనల్ డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పునాది వేయగలరని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఎమర్జెన్సీ మెడిసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సచిత్ బల్సారీ అన్నారు.
డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల క్లినికల్, లాబోరేటరీ-డ్రగ్స్ వినియోగం, మురుగునీటి డేటా ఆధారంగా నగరంలోని వ్యాధులను గుర్తించవచ్చు.
భారత్‌లో యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేయడంపై నిబంధనలకు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పని చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద మానవాళి సమ్మేళనంగా పరిగణించే కుంభమేళా మంచి ప్రారంభ వేదిక అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఇండియా కాదు, భారత్? - ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరిట జీ-20 ఆహ్వానాలు పంపారంటూ కాంగ్రెస్, ఆప్ విమర్శలు
- భూమి, చంద్రుడు తల్లీబిడ్డలా? లేక తోబుట్టువులా? చంద్రుడి జన్మ రహస్యం ఏమిటి?
- ముర్రా జాతి గేదెలపై 100 పెడితే 200 ఆదాయం, నాటు గేదెలకూ వీటికీ తేడా ఏంటి?
- టీచర్స్ డే- సర్వేపల్లి రాధాకృష్ణన్: ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి..
- సనాతన ధర్మం: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం... బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














