ముర్రా జాతి గేదెలపై 100 పెడితే 200 ఆదాయం, నాటు గేదెలకూ వీటికీ తేడా ఏంటి?

పాడి పరిశ్రమ
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

పశుపోషణకు తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఆదాయం పొందాలని ప్రతి పాడి రైతు కల. ముర్రా జాతి గేదెల రూపంలో ఇప్పుడు వారి కలలు నిజం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు చెందిన కొందరు పాడి రైతులు ముర్రా జాతి గేదెల పెంపకంతో వారి కలలను నిజం చేసుకుంటున్నారు.

ముర్రా జాతి గేదెల ద్వారా స్థిరమైన ఆదాయం పొందడంతోపాటు ఎంతో మంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

ఏపీ పశు సంవర్థక శాఖ కూడా రాష్ట్రంలో ముర్రా జాతి గేదెల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టింది. వివిధ పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు పాడి రైతులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తోంది.

రాష్ట్రంలోని పాడి రైతులకు ఆదాయ మార్గంగా మారిన ముర్రా జాతి గేదెల ప్రత్యేకత ఏంటి? హరియాణా నుంచి వచ్చిన ముర్రా జాతి గేదెలకు ఎందుకంత ప్రాధాన్యం? వాటి పోషణకు ఎంత ఖర్చు అవుతుంది? పాల దిగుబడి ఎలా ఉంటోంది?

పాడి పరిశ్రమ

1970లలో హరియాణా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..

ముర్రా జాతి గేదెలు 1970లలో హరియాణా నుంచి ఆంధ్రకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆ తర్వాత కృత్రిమ గర్భదారణ ద్వారా రాష్ట్రంలో ఆ జాతి గేదెల సంతతిని క్రమంగా పెంచామని నెల్లూరు పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య వివరించారు.

''ముర్రా జాతి గేదెలను 1970ల నాటి నుంచి కృత్రిమ గర్భదారణ ద్వారా అభివృద్ధి చేశారు. హరియాణా నుంచి ముర్రా జాతి దున్నపోతులను తీసుకొచ్చి, వాటి వీర్యాన్ని నిల్వ చేసి గతంలో లిక్విడ్ నైట్రోజన్‌లో ఉంచేవాళ్లం. తర్వాత అతిశీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతున్నాం. నాటు పశువులు ఎదకు వచ్చిన లక్షణాలు గమనించి ఆ వీర్యాన్ని ఉపయోగించి వాటికి కృత్రిమ గర్భధారణ చేయించేవాళ్లం.''

ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి ఇచ్చే గేదెల జాతి ఇదేనని అధికారులు చెబుతున్నారు.

నాటు గేదెల కంటే ఇది పాడి రైతులకు రెట్టింపు లాభాలను అందిస్తోందని సోమయ్య చెప్పారు. మిగతా గేదెల్లా కాకుండా ముర్రా జాతి గేదెలు ఎంత మేత తిన్నా, దాన్ని మొత్తం పాలుగా మార్చుకునే సామర్థ్యం ఉందన్నారు.

‘‘రైతులు ఒక నాటు గేదెకు వంద రూపాయలు ఖర్చు పెడితే రూ.110 ఆదాయం మాత్రమే వస్తుంది. అదే ముర్రా జాతి గేదెపై వంద రూపాయలు పెట్టుబడి పెడితే రూ.200 ఆదాయం వస్తుంది. తర్వాత ఈ సంతతి కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.

ఈ జాతి గేదెల పెంపకంలో వాటి పోషణ కోసం పెట్టే ఖర్చు కూడా తక్కువే. తాము తీసుకున్న ఆహారాన్ని పాల రూపంలో మార్చుకునే సామర్థ్యాలు మిగతా జాతి కంటే కూడా ముర్రా జాతి గేదెలకు ఎక్కువ. అందుకే ఇవి ఎంత ఎక్కువ మేత తింటే ఆ ఆహారాన్ని అంత ఎక్కువగా పాలుగా మార్చుకుంటాయి’’ అని ఆయన చెప్పారు.

పాడి పరిశ్రమ

వంపు తిరిగిన కొమ్ములు

ముర్రా అంటే మెలికలు తిరిగి ఉండడం అని అర్థం. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. అందుకే వీటిని ముర్రా జాతి అంటారు.

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ పశువుల మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది.

ముర్రా జాతి గేదెల శరీరం కూడా వీ ఆకారంలో ఉంటుంది. ముర్రా జాతి పశువుల ముందు భాగం సన్నగాను వెనుక భాగం లావుగానూ ఉంటుంది. అలా ఉండడం ద్వారా అవి తక్కువ ఆహారం తీసుకుంటూ, ఎక్కువ పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చర్మం పలుచగా ఉంటుంది. తోక కూడా నల్లగా ఉండటం ముర్రాజాతి లక్షణం. కొన్ని పశువులకి తెల్లకుచ్చు కూడా ఉంటుంది.

ముర్రా జాతి గేదెలు దేశ విదేశాల్లో అందమైన గేదెలుగా గుర్తింపు తెచ్చుకున్నాయని సోమయ్య అన్నారు. ముర్రా జాతి గేదెలను ఎంచుకునేటప్పుడు ఏయే లక్షణాలు చూడాలో ఆయన వివరించారు.

‘‘పాలు పితికే రొమ్ములను గమనించినా, ముందు రొమ్ములు కొంత పొట్టిగా, వెనుక రొమ్ములు పొడవుగా ఉండడం అనేది ముర్రా జాతిలో మరో మంచి లక్షణం. ముర్రా జాతి పశువులైనా, వేరే ఏ జాతి పశువు అయినా దాని జీవితకాలం 20 సంవత్సరాలు ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా జాతి గేదెలు ఎదకు వస్తాయి’’ అని ఆయన చెప్పారు.

పాడి పరిశ్రమ

రైతుకు లాభదాయకం

ప్రతి ఏటా గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం అని ఈ రంగంలో నిపుణుల మాట.

ముర్రా జాతి గేదెలు ఈనిన తర్వాత మూడు నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో ఉండే గొప్ప లక్షణం అంటున్నారు సోమయ్య.

‘‘ఈనిన తరువాత మూడు నెలలు అంటే 90 రోజులకు ఎదకి రావడం ఈ జాతిలోని గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.''

దేశంలో గేదె జాతుల్లో అతి పెద్దదైన జాఫర్ బాడీ కూడా ఉంది. వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువ. కానీ, జాఫర్ బాడీ గేదెల పాల ఉత్పత్తి ఎక్కువ కాబట్టి కొందరు దానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దానికి పెట్టే ఖర్చుతో రైతులు రెండు ముర్రా జాతి గేదెలను పెంచుకోవచ్చు.

పాల దిగుబడి పెంచడంతో పాటు నాటు పశువుల్లో తలెత్తే గర్భకోశ వ్యాధుల నివారణకు కూడా ముర్రా జాతి గేదెలు పరిష్కారంగా నిలిచాయని సోమయ్య అన్నారు.

రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అధికారులు, రైతు భరోసా కేంద్రాలు, పశువుల ఆస్పత్రుల్లో కూడా ముర్రా జాతి గేదెల పెంపకంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పాడి పరిశ్రమ

ఆ జిల్లాల్లో భారీగా పెరిగిన ముర్రా జాతి పశువుల సంఖ్య

‘‘స్థానిక మేలు జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తే, వాటి ద్వారా మేలు జాతి పశువులు ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మేలు జాతి ఉత్పత్తి చేయడం, రెండోది పాల ఉత్పత్తి పెంచుకోవడం. వీటితోపాటు గేదెల్లో గర్భకోశ వ్యాధులు కూడా నివారించేందుకు ఈ ముర్రా జాతిని ఎంచుకున్నాం.

వాటి వీర్యాన్ని తీసుకొచ్చి వీటిని అభివృద్ధి చేశాం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా జిల్లాల్లో డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ ఏజెన్సీలలో ముర్రా జాతి దున్నల వీర్యకణాలని నిల్వ ఉంచుతున్నాం. తర్వాత అన్ని కేంద్రాలకు అందించి ముర్రా జాతిని అభివృద్ధి చేస్తున్నాం’’ అని సోమయ్య వివరించారు.

రాష్ట్రంలో గతంలో ఉన్న నాటు గేదెలకు ముర్రా వీర్యం ఎక్కించడం ద్వారా అవి దాదాపు 70 శాతం ముర్రా లక్షణాలు కలిగిన గ్రేట్ ముర్రా రూపంలోకి మారుతాయని అధికారులు చెబుతున్నారు.

కొన్ని మెట్ట ప్రాంతంలో నాటు పశువులు ఇప్పటికీ ఉన్నప్పటికీ, కోస్తాలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకూ ముర్రా జాతి పశువుల సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు.

పేయ దూడల ప్రత్యేక పథకం

పుర్ర(మగ) దూడల వల్ల రైతుకు పెద్దగా ఆదాయం ఉండదు కాబట్టి రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా కేవలం పేయ దూడలను మాత్రమే పుట్టిస్తున్నారు.

2022 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఈ పథకం అందుబాటులోకి తెచ్చిందని సోమయ్య వివరించారు.

‘‘ముర్రా జాతి పశువుల అభివృద్ధి రాష్ట్రంలో బాగా ఉంది. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి ముర్రా జాతిలో ప్రత్యేకంగా పేయ దూడల్ని మాత్రమే ఉత్పత్తి చేసే రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ప్రవేశపెట్టాం. దీని ధర కేవలం రూ.500. ఈ పథకం ద్వారా రైతులు తీసుకువచ్చే గేదెలకు రెండుసార్లు ఇంజక్షన్ చేస్తాం.

అప్పటికీ గేదె చూలుకు రాకపోతే రైతుకు 500 రూపాయలను రీఫండ్ చేస్తున్నాం. పాడి రైతుల గేదెలకు కచ్చితంగా చూలు నిలిచేలా చేయడానికే మేం అలా చేస్తున్నాం’’ అని సోమయ్య వివరించారు.

పాడి పరిశ్రమ

రేటూ ఎక్కువే, పాల దిగుబడీ ఎక్కువే

పాలు బాగా ఇస్తాయి కాబట్టే ముర్రా జాతి గేదెలను పెంచుతున్నామని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన పాడి రైతు శివప్రసాద్ రెడ్డి చెప్పారు.

‘‘ఒక్కో గేదె లక్ష రూపాయల వరకూ ఉంటుంది. మనం దాణా వేసేదాన్ని బట్టి మనకు పాల ఉత్పత్తి ఉంటుంది. అదే నాటు బర్రె అయితే మనం ఎంత మేపినా అవి రెండు మూడు లీటర్ల పాలు ఇస్తాయి. కానీ, ముర్రా జాతి గేదెకు ఎంత దాణా పెడితే అన్ని పాలు ఇస్తాయి. అందులోనూ మేలు జాతి గేదెలు ఎంచుకుంటే చర్మం పల్చగా నల్లగా బాగుంటుంది.’’

‘‘మా పొలంలో రెండెకరాల్లో గడ్డి వేసుకున్నాం. ఆ గడ్డిని సాయంత్రం కోసుకొచ్చి వాటిని మేపుకుంటూ పాల ఉత్పత్తిని పెంచుకుంటున్నాం.. వీటికి మినప్పొట్టు, తౌడు, బీరుపొట్టు, సజ్జ అన్నము ఉడకబెట్టి వేస్తాం. ఎదకు వస్తే అరుస్తూ ఉంటుంది. కొన్ని మూగ ఎదకు వస్తాయి. అవి అప్పుడు వైట్‌గా తీగ వేస్తాయి. అప్పుడు దున్నపోతు దగ్గరకు తీసుకెళ్లడం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లి దానికి ఇంజక్షన్ చేయించడం చేస్తాం. అది చూలుకు వచ్చిన తర్వాత కూడా రెండు, మూడు నెలలు పాలిస్తుంది. ఇవి కనిష్ఠంగా ఏడు నెలలు బాగా పాలు ఇస్తాయి’’ అని శివప్రసాద్ రెడ్డి చెప్పారు.

సొంతంగా చేసుకునే పాడి రైతులకు ముర్రా గేదెలు చాలా లాభాలు ఆర్జించి పెడతాయన్నారు శివప్రసాద్ రెడ్డి. పది బర్రెలు పెట్టుకుంటే, వాటి ఖర్చులు పోను ఒక కుటుంబం దర్జాగా బతకవచ్చన్నారు.

“అన్నింటికీ మనుషులను పెట్టి, వాళ్లపైనే ఆధారపడితే కొంత మాత్రమే మిగులుతుంది. పది బర్రెలు అంటే రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వాటికి నెలకు ఇంచుమించు రూ.50 వేల పైనే ఖర్చు అవుతుంది. అది పోను నెలకు మరో రూ.50 వేల వరకూ మిగులుతుంది'' అని ఆయన అన్నారు.

నాటు బర్రెలు తక్కువ పాలిస్తాయని, తమకు ఉన్న పది ముర్రా గేదెల నుంచి రోజుకు 70 లీటర్ల పాలు వస్తాయని నెల్లూరు జిల్లా కోవూరు వాసి అయిన సుజా కూడా చెప్పారు.

''నాటువైతే రోజుకి ఐదు లీటర్లు ఇస్తాయి. ముర్రా జాతి గేదెలు రోజుకి 15 లీటర్ల పాలిస్తాయి. పాలవాళ్లు వచ్చి పిండుకుని పోతారు. మాకు 50 రూపాయలు ఇస్తారు లీటర్‌కి. మాకు రోజూ 70 లీటర్ల వరకూ వస్తాయి'' అని సుజా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)