విశాఖ మేయర్ చాంబర్‌కు 100 మీ. దూరంలోని ‘బస్ బే’ ప్రారంభానికి ముందే ఎందుకు కూలిపోయింది?

కూలిన బస్ బే
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ తెలుగు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రూ. 4.62 కోట్లతో నిర్మిస్తున్న ‘మోడ్రన్ బస్ బే’లలో (బస్ స్టాప్) ఒకటి ఆదివారం ఉదయం కూలిపోయింది.

ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ బస్ బే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి.. అందులోని మేయర్, కమిషనర్ చాంబర్‌‌లకు దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఉంది.

విశాఖ నగర సుందరీకరణకు చేపడుతున్న చర్యలలో భాగంగా వీటిని నిర్మిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు.

నగరంలో మొత్తం రూ. 4.62 కోట్ల వ్యయంతో 20 బస్ బేలను జీవీఎంసీ నిర్మిస్తోంది.

వీటి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా పట్టించుకోకుండా అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నగరంలోని వైఎస్సార్ సెంట్రల్‌ పార్క్‌కు ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆనుకుని రెండు బస్ బేలు నిర్మిస్తున్నారు.

ఉత్తరం వైపు బస్ బే నిర్మాణం పూర్తవగా.. దక్షిణం వైపు ఉన్నది 90 శాతం పూర్తయింది.

జీవీఎంసీ నిర్మిస్తున్న 20 బస్ బేలలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మిస్తున్న దక్షిణ బస్ బే పెద్దదని చెప్తున్నారు.

దీన్ని అధికారికంగా ప్రారంభించడానికి ముందే కూలిపోయింది.

దక్షిణం వైపు ఈ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఉదయం ప్రయాణికులు ఎవరు లేరు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూలిపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.

ఆ పక్కనే వైఎస్సార్ సెంట్రల్ పార్కుకు వచ్చిన వారు కూడా భయంతో పరుగులు తీశారు.

ఆదివారం కాకపోయి ఉంటే తగరపువలస, భీమిలి వైపు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, కూలి పనులకు వెళ్లేవారు ఆ బస్ స్టాప్ వద్ద పెద్ద సంఖ్యలో ఉంటారు.

బస్సులలో భీమిలి, తరగపువలస వెళ్లాలంటే ప్రయాణికులెవరైనా నగరంలోని ఈ బస్ స్టాప్‌కి రావాల్సిందే. అందుకే దీన్ని భీమిలి బస్ స్టాప్ అని కూడా అంటారు.

ఈ బస్ స్టాపు స్థానంలోనే రూ. 20 లక్షలతో ఆధునిక హంగులతో ‘బస్ బే’ పేరుతో అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక్కడ ప్రయాణికులు కూర్చునేందుకు గ్రానైట్‌ పలకలతో అరుగులు ఏర్పాటు చేశారు.

అలాగే బస్‌ బే ముందు భాగం పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోటోతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల పథకాలతో తయారు చేసిన లోగో డిజైన్‌ చేసిన బోర్డు కూడా అమర్చారు.

కుప్పకూలిన బస్ బేలో గ్రానైట్ పలకలు కింద పడి పగిలిపోయాయి.

మూడు నాలుగు రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో, ఇది కూలిపోయింది.

Bus Bay

‘ఒక్కసారిగా కూలిపోయింది, భయంతో పరుగులు తీశాం’

ఆర్టీసీ బస్ స్టాండ్‌కు సమీపంలో ఇది ఉండడం.. ఇక్కడ వరుసగా బస్ షెల్టర్లు ఉండటంతో.. వ్యాపార అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ బస్ బేకు రెండు వైపులా టిఫిన్ దుకాణాలు ఎక్కువగానే ఉంటాయి.

ఇదే తొలి స్టాప్ కావడంతో ఇక్కడకు వచ్చే ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ బస్ స్టాపులలోనే కూర్చుని టీ, కాఫీలు తాగుతుంటారు.

అయితే బస్ బే కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

“రోజూ మా అమ్మాయిని కాలేజ్ బస్ ఎక్కించి, నేను టిఫిన్ తీసుకుని, టీ తాగి వెళ్తాను. ఆదివారం కావడంతో రాలేదు. ఇవాళ (సోమవారం) బస్ బే పరిస్థితి చూస్తే నాకు భయమేసింది” అని పోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే శ్రీరంగనాథరావు బీబీసీతో అన్నారు.

“పెద్ద శబ్దం వచ్చింది, నేను రోజు వాకింగ్ వచ్చి, స్నేహితులతో కాసేపు మాట్లాడుకుని వెళ్తాను. ఆదివారం కావడంతో కాస్త ఎక్కువ సేపు పార్కు బయటే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో ఒక్కసారి ఈ బస్ బే కూలిపోయింది. భయంతో పరుగులు తీశాం” అని పార్కు‌కు వాకింగ్‌కు వచ్చిన బ్యాంక్ ఉద్యోగి ఆనంద్ కుమార్ బీబీసీతో చెప్పారు.

టీడీపీ నేతల ఆందోళన

సోషల్ మీడియాలో ట్రోలింగ్

బస్ బే కూలిందనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

సీపీఎం, జనసేన, టీడీపీ నాయకులు బస్ బే వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

కాంట్రాక్టర్ల కోసమే నగర సుందరీకరణ పేరుతో ఈ బస్ బేలను నిర్మిస్తున్నారంటూ వారు ఆరోపించారు.

“కార్పొరేషన్ లో రూ. 50 లక్షల దాటిన పనులు చేయాలంటే ఆ పనులు వివరాలను కౌన్సిల్‌లో పెట్టి చర్చించి, ఆమోదం పొందాలి. కానీ రూ. 4.62 కోట్లతో చేపట్టిన ఈ బస్ బే పనులను ఎలాంటి చర్చ లేకుండా నేరుగా చేపట్టారు. ఇదంతా కాంట్రాక్టర్లను పెంచి పోషించడం కోసమే” అని జనసేన పార్టీకి చెందిన జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ ఆరోపించారు.

“రూ.20 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఖర్చవుతుందని లెక్కలు చెప్తూ అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. వీటికి రూ. 10 లక్షలు కూడా ఖర్చు కాదు’’ అని సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు ఆరోపించారు.

అవినీతి ఆరోపణలను పాలక పక్షం తోసిపుచ్చుతోంది.

‘‘ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షిణ వైపు బస్ బే వెల్డింగ్ పనులు ఇంకా చేయాల్సి ఉండగా, నగరంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. అప్పటికే వెల్డింగ్ పనులు చేసేందుకు వర్కర్స్ అక్కడికి ఎక్కడం, కొన్ని మిషన్లు పెట్టడం.. అదే సమయంలో వర్షం కురవడంతో రేకులపై నీరు నిలిచిపోయింది. ఆ బరువుకు బస్ బే కాస్త ఒరిగింది. అది ఉదయానికి క్రమంగా ఎక్కువగా ఒరిగింది. పనుల నాణ్యతలో ఎటువంటి లోపం లేదు. ఇప్పటికే నగరంలో 17 బస్ బేలను ప్రారంభించాం” అని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ‘బీబీసీ’తో చెప్పారు.

కూలిన బస్ బే

బస్ బేల నిర్మాణంపై విచారణ జరపాలి: విపక్షాలు

‘‘ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షిణం వైపు బస్ బే కూలిపోవడంతో మిగతా వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కౌన్సిల్ లో చర్చించకుండానే ఈ బస్ బేల నిర్మాణాలని చేపట్టడం చూస్తుంటే అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది’’ అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు.

“సీఎం బంధువుకు బస్ బేల నిర్మాణాలను అప్పగించారు. ఒక్కో బస్ బేకు రూ. 5 నుంచి 10 లక్షల వరకే అవుతుంది. అటువంటిది రూ. 20 లక్షల నుంచి 40 లక్షల వరకు లెక్కలు చెప్తున్నారు. మొత్తం బస్ బేల నిర్మాణ పనుల అప్పగింత, ఆ పనుల నాణ్యతపై విచారణ జరపాలి” అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, సీపీఎం కార్పొరేటర్ బి. గంగారావు డిమాండ్ చేశారు.

మేయర్ వెంకట హరి కుమారి
ఫొటో క్యాప్షన్, మేయర్ వెంకట హరి కుమారి

నిర్మాణ పనుల్లో భాగంగా వర్కర్స్ బస్ బే పైకి ఎక్కడం వలన, ఇతర మిషన్లు అక్కడ పెట్టడం వలన బరువుకి ఒరిగిపోయిందే తప్ప కూలలేదని జీవీఎంసీ ఇంజినీరింగ్ ఉద్యోగులు అంటున్నారు.

“నాణ్యత పరమైన జాగ్రత్తలు అన్ని తీసుకున్నాం. అనుకోని విధంగా ఒక్క బస్ బే ఒరిగిపోతే, అది కూలిపోయిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారు. విపక్షాలు ఆరోపణలకు కౌన్సిల్ సమావేశంలోనే సమాధానం చెప్తాం. ఒరిగిపోయిన బస్ బేల నాణ్యతపై థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తాం. నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఇద్దరు జీవీఎంసీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసు ఇచ్చాం” అని మేయర్ వెంకట హరి కుమారి బీబీసీతో అన్నారు.

మరమ్మతులు

మరమ్మతులు

నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, అక్కయ్యపాలెం, మురళీనగర్, ఎయిర్ పోర్ట్, ఏయూ తదితర ప్రాంతాల్లో మొత్తం 20 బస్ బేలు నిర్మిస్తున్నారు.

కూలిపోయిన బస్ బే వద్ద మరమ్మతులు సోమవారం ప్రారంభించారు.

కూలిన బస్ బేను తిరిగి నిర్మించేందుకు చేపడుతున్న పనులతో మళ్లీ అదనపు ఖర్చు అవుతుందని, ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముని జీవీఎంసీ నిర్లక్ష్యంతో దుబారా చేయడమే కాకుండా, నాణ్యతలేని పనులు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతుందని టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.

కూలిపోయిన ఆర్టీసీ దక్షిణ బస్ బే సమీపంలోనే ఉన్న ఆర్టీసీ ఉత్తర బస్ బేను నాలుగు రోజుల కిందటే మేయర్ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)